
‘ఈ భూమికి, అమెజాన్ వర్షారణ్యాలు ఊపిరితిత్తుల వంటివి. అవి నాశనం అవ్వడం మొదలైతే ప్రపంచమే ప్రమాదంలో పడుతుంది’ అని పర్యావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే ఎన్నోసార్లు హెచ్చరించారు. నిజానికి అమెజాన్ వర్షారణ్యాలు ప్రపంచ వాతావరణాన్ని నియంత్రించడంలో, జీవవైవిధ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, అడవుల నరికివేత, అక్రమ గనుల తవ్వకాలు, వ్యవసాయ విస్తరణ, పట్టణీకరణ వంటి ఎన్నో కారణాలతో ఈ అటవీ ప్రాంతాలు వేగంగా అంతరించిపోతూ వస్తున్నాయి. దీని ఫలితంగా వాతావరణ మార్పులు, జీవజాతులు అంతరించిపోవడం వంటి తీవ్ర పరిణామాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెజాన్ ఆదిమవాసీ బృందం– ఈ వర్షారణ్యాల సంరక్షణ కోసం బ్రిటన్ లో పర్యటించారు.
ఈ బృందంలో ‘ఆషానింకా’ జాతి ప్రతినిధి ఒకోషో, అలెగ్జాండ్రినా పియాకోతో పాటు ‘గువారానీ’ అనే మరో ఆదిమజాతి ప్రతినిధి ‘జులియానా కెరెక్సు మిరిమ్’ ప్రత్యేకంగా నిలిచారు. ఈ పర్యటనలో అషానింకా, గువారానీ కమ్యూనిటీల ప్రతినిధులు– బ్రిటన్ కి చెందిన వుడ్‌లాండ్ ట్రస్ట్ సిబ్బందిని కలిశారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని డెవాన్ లో డార్ట్ వ్యాలీలోని అరుదైన అటవీ ప్రాంత పునరుద్ధరణకు నిధులు సమకూర్చడానికి, వుడ్‌లాండ్ ట్రస్ట్‌కి మద్దతు పలికారు. ఆదిమ బృందంతో వుడ్‌లాండ్ సిబ్బంది కలిసి డార్ట్ వ్యాలీలోని బక్‌లండ్ వుడ్‌లోని 247 ఎకరాల పునరుద్ధరణకు 28 లక్షల పౌండ్లు (రూ.32.19 కోట్లు) అవసరమనే విజ్ఞప్తిని గట్టిగా వినిపించారు. ఈ క్రమంలోనే ఆదిమవాసులు– తమ అమెజాన్ వర్షారణ్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను, రాబోయే ప్రమాదాలను ప్రపంచానికి వినిపించే ప్రయత్నిస్తున్నారు.
దానిలో భాగంగా ఈ బృందం–బ్రిటన్ లోని పర్యావరణ సంస్థల ప్రతినిధులు ఎందరినో కలిశారు. వర్షారణ్యాల సంరక్షణకు అంతర్జాతీయ మద్దతును కూడగట్టుకోవడమే తమ లక్ష్యమని ప్రకటించారు. అందులో భాగంగా పలువురు పర్యావరణ అధికారులతో పాటు ఎందరో శాస్త్రవేత్తలను కూడా కలుసుకుని అమెజాన్ అడవుల పునరుద్ధరణ జరగకుంటే రాబోయే సమస్య తీవ్రతను చర్చించారు. అమెజాన్ ఆదిమ బృందం చేపట్టిన ఈ ఖండాంతర పర్యటన యావత్ ప్రపంచాన్ని కదిలిస్తోంది. వర్షారణ్యాలను రక్షించాలన్న ఆశే, తమ ప్రధాన ఉద్దేశమని వారు వెల్లడించారు. వర్షారణ్యాలు నాశనం కావడంతో ఏర్పడుతున్న పలు సమస్యల గురించి ఈ బృందం హెచ్చరించింది.
అషానింకాకు చెందిన నాయకురాలు అలెగ్జాండ్రినా పియాకో మాట్లాడుతూ– ‘భూమిని, అడవులను పునరుద్ధరించడం అనేది ప్రకృతితో ప్రజల సంబంధాలను పునరుద్ధరించడంతో పాటు జరగాలి’ అని నొక్కి చెప్పారు. ఆ లోతైన సంబంధం లేకుంటే, ఏ పర్యావరణ ఉద్యమం కూడా విజయవంతం కాదని ఆమె హెచ్చరించారు.వుడ్‌లాండ్ ట్రస్ట్‌కి సంబంధించిన రెయిన్ ఫారెస్ట్ రికవరీ ప్రాజెక్ట్ ఆఫీసర్ సామ్ మానింగ్ ఈ ఆదిమవాసులు బ్రిటన్‌ను సందర్శించి తనను కలిసిన రోజు గురించి చెబుతూ, ‘ఒక అటవీ సంరక్షణాధికారిగా, ఈ రోజు నా జీవితంలో అత్యంత భావోద్వేగంతో కూడిన రోజులలో ఒకటి. గువారానీ, అషానింకాల జ్ఞానం నన్ను చాలా కదిలించింది. వారితో చర్చ చాలా స్ఫూర్తిదాయకమైనది’ అని తెలిపారు
.‘అమెజాన్ అడవులు ప్రమాదంలో పడటం అంటే ప్రపంచం ప్రమాదంలో పడటమే! ప్రకృతిని పునరుద్ధరించడం అంత సులభం కాదు. ఇది తొలి అడుగు, అలాగే మేలి అడుగు. ఇది సమష్టి పోరాటం. అందుకే ప్రపంచదేశాల మద్దతుని కోరుతున్నాం’ అని ఈ ఆదిమ బృందం ప్రపంచానికి పిలుపునిచ్చింది.ఈ పర్యటన ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు, వర్షారణ్యాల పునరుద్ధరణకు ఎంత ప్రాధాన్యం ఉందో తెలియజేస్తుంది. ఇలాంటి అంతర్జాతీయ పర్యటనలు, చర్చలు, చర్యలు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఇప్పటికే ఈ అమెజాన్ స్థానికులు, నాయకులు వర్షారణ్యాల సంరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో, అంతర్జాతీయ వేదికల్లో తమ వాదనను వినిపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే!