
బృహస్పతి నుంచి లౌకిక శాస్త్రాల ఘనతను సోదాహరణంగా తెలుసుకున్నాడు ఇంద్రుడు. మోక్షసాధనకు బ్రహ్మవిద్య ఉండగా, మరి మంత్ర తంత్రశాస్త్రాలు ఎందుకు ఉన్నాయి? వాటి వల్ల ప్రయోజనం ఏముంది? అనే సందేహం కలిగింది అతడికి. అదే సందేహాన్ని దేవగురువు వద్ద బయటపెట్టాడు.‘ఆచార్యా! మోక్షసాధనకు బ్రహ్మవిద్య ఒక్కటి సరిపోతుంది కదా? మరి అలాంటప్పుడు మంత్ర తంత్రశాస్త్రాలు ఎందుకు పుట్టుకొచ్చాయి? వాటి వల్ల సాధించే ప్రయోజనం ఏముంటుంది? ఈ మంత్ర తంత్ర విద్యలు క్షుద్రప్రయోజనాల కోసం దుర్వినియోగానికి లోనయ్యే అవకాశాలు ఎక్కువ కదా? వీటి వెనుకనున్న మర్మమేమిటి?’ బృహస్పతిని అడిగాడు ఇంద్రుడు. ‘శచీపతీ! మంత్ర తంత్రశాస్త్రాల ప్రయోజనం ఏమిటనేగా నీ సందేహం? నీకు బాగా అర్థం కావడానికి ఒక కథ చెబుతాను, శ్రద్ధగా విను’ అంటూ బృహస్పతి ఆ కథను ఇలా చెప్పసాగాడు.
‘పూర్వం విశాలనగరంలో వేదశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సకల శాస్త్రకోవిదుడు, తత్త్వజ్ఞుడు. అంతేకాదు, బహిరంతరేంద్రియ నిగ్రహం గలవాడు, ధర్మపరాయణుడు. వైదిక కర్మలను తు.చ. తప్పక పాటించేవాడు. గృహస్థాశ్రమ జీవనం సాగిస్తూ, అతిథి అభ్యాగతులను ఆదరించేవాడు. కొన్నాళ్లకు వేదశర్మకు ఒక కొడుకు కలిగాడు. అతడికి సుశీలుడు అని నామకరణం చేశాడు. సుశీలుడి పురాకృత పాపకర్మల ఫలితంగా పుట్టినప్పటి నుంచి ఆ బాలుడిని ఏడుగురు బ్రహ్మరాక్షసులు ఆవహించారు. ఆ ఏడుగురు బ్రహ్మరాక్షసులు పరస్పరం కలహించుకుంటూ, ఒకరినొకరు వధించుకునేందుకు నిరంతరం ప్రయత్నాలు చేసేవారు. వారి ప్రభావానికి సుశీలుడు విలవిలలాడుతూ రోదించేవాడు.
ఒక్కోసారి రాక్షసుల ప్రభావంతో అతడికి ఉన్మాదం ప్రకోపించి, ఊరకే నవ్వుతూ నృత్యం చేసేవాడు. ఒక్కోసారి అకస్మాత్తుగా మూర్ఛపోయేవాడు. ఎదుగుతున్న కొద్ది సుశీలుడి చేష్టలు కొంత వింతగాను, మరింత విపరీతంగాను ఉండేవి. ఒక్కోసారి అతడు తినడం మొదలుపెడితే, ఇది తినదగినది, ఇది తినదగినది కాదు అనే విచక్షణ లేకుండా అమితంగా తినేవాడు. ఒక్కోసారి రోజుల తరబడి పస్తులుండేవాడు. కొడుకు తీరు చూస్తూ, వేదశర్మ దంపతులు ఆవేదన చెందేవారు. తన కొడుకును ఏ దయ్యాలో భూతాలో పట్టుకుని ఉంటాయని భావించిన వేదశర్మ, వాటిని వదిలించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. హోమాలు, నోములు, తీర్థయాత్రలు వంటివి ఎన్ని చేసినా, ప్రయోజనం లేకపోయింది. ఇంట్లో కొడుకు వల్ల తీరని ఇబ్బంది ఉన్నా, వేదశర్మ ఎన్నడూ తన గార్హస్థ్య ధర్మాన్ని మానుకోలేదు. ప్రతిరోజూ అతిథిపూజ చేసిన తర్వాతే తాను భుజించేవాడు.
ఒకనాడు వేదశర్మ వైశ్వదేవం ముగించుకుని, అతిథి ఎవరైనా రాకపోతారా అని గుమ్మం వద్ద ఎదురుచూస్తూ ఉన్నాడు. ఇంతలోగా ఇంటి ముందుకు ఒక భిక్షువు వచ్చాడు. ఒళ్లంతా మట్టికొట్టుకుని ఉన్నాడు. చీలికలైన దుస్తులతో, దుర్గంధమయంగా ఉన్నాడు. అతడి శరీరం మీద ఈగలు ముసురుతూ ఉన్నాయి. ‘అభ్యాగతః స్వయం విష్ణుః’ అనే ఆర్యోక్తి ప్రకారం వేదశర్మ అతడిని సాదరంగా ఆహ్వానించాడు. అర్ఘ్యపాద్యాలు ఇచ్చి, ఇంటి లోపలికి తీసుకుపోయి, భోజనం పెట్టించాడు. అతిథి భోజనం తర్వాత వేదశర్మ తాను కూడా ప్రసాదం స్వీకరించి వచ్చి, భిక్షువుకు వింజామర వీచసాగాడు. ఈ అతిథి సాక్షాత్తు దత్తాత్రేయుడే కావచ్చు అనే ఆలోచన వేదశర్మ మనసులో మెదిలింది. దత్తాత్రేయుడు ఈ నగరంలోనే సంచరిస్తూ, ఇళ్లకు వెళ్లి భిక్ష స్వీకరిస్తున్నట్లు కొద్దిరోజుల కిందటే విన్నాడతను. ఈయనే గనుక దత్తాత్రేయుడు అయినట్లయితే తన జన్మ ధన్యమైనట్లేనని భావించాడు.
అంతలోనే ఆ భిక్షువు లేచి, ‘ఇక బయలుదేరుతాను’ అంటూ బయటకు నడిచాడు. వేదశర్మ అతడి వెంటపడ్డాడు. భిక్షువు పొమ్మంటున్నా వినిపించుకోకుండా, అతడినే అనుసరించసాగాడు. వేదశర్మ ఎంత చెప్పినా వినకుండా తన వెంటే వస్తుండటంతో విసుగెత్తిన భిక్షువు అతడి మీదకు చేతికందిన రాయి, కట్టె వంటివి విసరసాగాడు. వాటి దెబ్బలకు నెత్తురోడుతున్నా లెక్కచేయకుండా, వేదశర్మ అతడి వెంటే ముందుకు నడవసాగాడు. కొంత దూరం వెళ్లాక దారిలో ఒక గాడిద కళేబరం కనిపించింది. భిక్షువు ఆ గాడిద శరీరం నుంచి ఇంత మాంసం ముద్దను పెకలించి, ‘ఇంద తిను’ అని వేదశర్మ చేతుల్లో పెట్టాడు. వేదశర్మ దానిని ప్రసాదంలా భక్తిగా దోసిట్లో పట్టుకుని, అతడి వెంట నడవసాగాడు. వేదశర్మను చేరువకు రానిచ్చి, భిక్షువు అతడిని కాలితో చాచిపెట్టి తన్నాడు. వేదశర్మ ఆ తాపును తట్టుకుని నిలబడ్డాడు. ఈలోగా భిక్షువు పరుగులాంటి నడకతో ముందుకు సాగి, ఒక కొండ గుహలోకి దూరాడు. వేదశర్మ కూడా ఆ కొండ గుహలోకి వెళ్లాడు.
‘ఏమయ్యా నువ్వు! తిట్టినా కొట్టినా వదలకుండా నా వెంటపడ్డావు?’ అడిగాడు భిక్షువు.వేదశర్మ భోరున విలపిస్తూ అతడి పాదాలపై పడ్డాడు. తన కొడుకు దురవస్థను చెప్పి, అతడి దుఃఖాన్ని తొలగించమని అభ్యర్థించాడు. భిక్షువు ప్రసన్నుడయ్యాడు. ఏడు మంత్రాలను బీజాక్షర సహితంగా వేదశర్మకు ఉపదేశించాడు.‘నీ కొడుకును ఏడుగురు బ్రహ్మరాక్షసులు పట్టి పీడిస్తున్నారు. వారిని ఒక్కొక్కరినే వదలగొట్టాలి. రోజుకొక మంత్రాన్ని జపించు. మంత్రోదకాన్ని నీ బిడ్డ మీద చిలకరించు. అలాగని, ఒకేసారి ఏడుగురు రాక్షసులను వదలగొట్టడం ఏ మంత్రానికీ సాధ్యం కాదు. అందుకని ఆ బ్రహ్మరాక్షసులను ఒకరి తర్వాత ఒకరుగా మాత్రమే వదలగొట్టాలి. ఏడుగురు బ్రహ్మరాక్షసులూ వారం రోజుల్లోనే నీ బిడ్డను విడిచి వెళ్లిపోతారు. ఆ తర్వాత నీ బిడ్డ నీ అంతటి కర్మిష్ఠి అవుతాడు’ అని చెప్పాడు.
వేదశర్మ భిక్షువుకు పదే పదే నమస్కారాలు చేస్తూ, అక్కడి నుంచి ఇంటిముఖం పట్టాడు.ఇందాక గాడిద కళేబరం పడి ఉన్న చోట ఒక రక్తచందన వృక్షం ఉంది. తన చేతిలో భిక్షువు పెట్టిన మాంసం ముద్ద రక్తచందన పుష్పమైంది.ఇంటికి వెళ్లిన బ్రాహ్మణుడు భిక్షువు చెప్పిన ప్రకారమే రోజుకొక మంత్రాన్ని జపించి, ఏడుగురు రాక్షసులను ఒక్కొక్కరినే తన బిడ్డ నుంచి వెళ్లగొట్టాడు. ఆ తర్వాత సుశీలుడు సాధారణ స్థితికి వచ్చాడు.విన్నావు కదా దేవేంద్రా! మంత్ర తంత్రశాస్త్రాలు కేవలం క్షుద్రప్రయోజనాలకే కాదు, పరంపరాగతంగా అవి ముక్తిసాధనాలు కూడా కాగలవు’ అని ముగించాడు బృహస్పతి.
∙సాంఖ్యాయన