
∙విఎస్ సాయిబాబా
అతనొక మధ్యతరగతి యువకుడు. బంధువుల ఇళ్లకు, ఇతర కార్యక్రమాలకు వెళ్లినపుడు వృద్ధులు, ఆస్తి ఉన్నా పట్టెడన్నం పెట్టే దిక్కులేని, కుటుంబసభ్యులు పట్టించుకోని అభాగ్యులు ఆకలితో అలమటిస్తున్న వైనం అతడిని ఎంతగానో బా«ధించింది. అలాంటి అభాగ్యుల కోసం తన వంతుగా ఏదైనా చేయాలని సంకల్పించుకున్నాడతను. అతడే మళ్ల తులసీరామ్ (రాంబాబు). అతడి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలంలోని పంజా వేమవరం.
రాంబాబు ఆగర్భ శ్రీమంతుడేమీ కాదు. నాలుగెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చే సాదాసీదా యువరైతు. ఉన్న భూమిలోనే కొంత విస్తీర్ణంలో రొయ్యల సాగు చేపట్టి ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. క్రమంగా రియల్ ఎస్టేట్, రైస్‌మిల్లుల వ్యాపారాల్లోకి ప్రవేశించి, ఆర్థికంగా మరింత పుంజుకున్నారు. తులసీ కన్వెన్షన్ పేరుతో కల్యాణమండపం నిర్మించారు.
ఆర్థికంగా బలపడటంతో అన్నార్తులు, అభాగ్యులైన వృద్ధుల కోసం ఏదైనా చేయాలనుకున్న సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి కార్యాచరణకు దిగారు. భార్య, కుమారుడు, కుమార్తె కూడా తన సంకల్పానికి ప్రోత్సాహం ఇవ్వడంతో 2019 అక్టోబర్ నుంచి ఇంటింటికీ భోజనం క్యారియర్స్ పంపడం ప్రారంభించారు.
18 గ్రామాల్లోని 160 మందికి
వీరవాసరంలో తాను నిర్మించిన తులసీ కల్యాణ మండపంలోనే ప్రతి రోజు ఉదయం వంట తయారు చేసి పంజా వేమవరం పరిసర గ్రామాలైన చింతలకోటిగరువు, తోకలపూడి, తోలేరు, రాయకుదురు, కొణితివాడ, జొన్నలగరువు, నవుడూరు, అండలూరు, ఉత్తరపాలెం, బలుసుగొయ్యపాలెం తదితర 18 గ్రామాల్లోని 160 మందికి ప్రతిరోజూ ఇంటి వద్దకే భోజనం క్యారియర్స్ పంపడం మొదలుపెట్టారు.
వివక్షకు తావు లేకుండా...
కులమత ఆర్థిక తారతమ్యాలకు తావులేకుండా, వయోభేదం లేకుండా కడుపునిండా భోజనానికి నోచుకోని వారిని ఎంపిక చేసుకుని, వారికి ప్రతిరోజూ భోజనం క్యారియర్లు పంపుతున్నారు. ఆస్తిపాస్తులు, కుటుంబ సభ్యులు ఉండి, తల్లిదండ్రులను పట్టించుకోని కొందరికి రాంబాబు పంపే క్యారియర్ ఒక చెంపదెబ్బ! తమ తల్లిదండ్రులకు రాంబాంబు క్యారియర్ పంపడంతో, పరువుపోతుందని భయపడిన పిల్లలు తల్లిదండ్రులను శ్రద్ధగా చూసుకోవడం మొదలుపెట్టిన సంఘటనలు అనేకం!
విరాళాలు నిరాకరిస్తూ..
ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలకే వంట తయారుచేసి క్యారియర్స్‌లో సర్ది, అన్నార్తుల ఇంటికి ఒక ఆటో బయలుదేరుతుంది. సుమారు ఉదయం 11 గంటల లోపుగానే రాంబాబు పంపించే భోజనం క్యారియర్ 160 మందికి చేరిపోతుంది. రోజూ ఒకే రకమైన వంటకం కాకుండా; ప్రతి సోమ, గురు, శనివారం రోజుల్లో పప్పు, మంగళ, శుక్రవారాలు కూరగాయలు, బు«ధ, ఆదివారాలు చేపలు లేదా మాంసం లేదా రొయ్యల కూరతో భోజనం కార్యియర్స్ సిద్ధం చేస్తారు. వారం రోజులపాటు రసం, మజ్జిగపులుసు, సాంబారు ఏదో ఒకటి తప్పనిసరి. మాంసాహారం తినని వారికి శాకాహార భోజనమే పంపిస్తారు.
వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా, వీరందరికీ క్రమం తప్పకుండా ప్రతిరోజూ భోజనం క్యారియర్లు వేళకు అందుతాయి. ఈ పని సజావుగా సాగడానికి ఆరుగురు పనిమనుషులను నియమించుకున్నారు. ఎప్పుడైనా వంటమనిషి రాకుంటే, రాంబాబే స్వయంగా వంట చేస్తారు. కుటుంబ సభ్యులు అతనికి సహకరిస్తారు. ఈ మహత్కార్యంలో తామూ భాగస్వాములం అవుతామని కొందరు విరాళాలు ఇస్తామంటూ ముందుకు వచ్చినా, రాంబాబు సున్నితంగా తిరస్కరిస్తారు. తన తదనంతరం కూడా ఈ కార్యక్రమాన్ని తన కుటుంబ సభ్యులు నిరంతరాయంగా కొనసాగించేందుకు వీలుగా తానే ఒక శాశ్వత నిధిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు రాంబాబు చెబుతున్నారు.
అన్నం పెట్టి ఆదుకుంటున్నారు
గత రెండేళ్లుగా రాంబాబు పెట్టే భోజనంతోనే బతుకుతున్నాను. నన్ను చూసుకునేవారు ఎవరూ లేరు. గ్రామస్థులు చెప్పిన మాటతో భోజనం క్యారియర్ పంపిస్తున్నారు. భోజనం చాలా బాగుంటుంది.
వరహాలు,
జొన్నలపాలెం, వీరవాసరం మండలం.
రాంబాబే దిక్కు
నా భార్య చనిపోయింది. ఇద్దరు పిల్లలు ఉన్నా, వారు నన్ను పట్టించుకోరు. నాకు తిండిపెట్టే దిక్కులేని సమయంలో రాంబాబే నాకు దిక్కయ్యారు. ప్రతిరోజూ ఆయన పంపే భోజనం తింటున్నాను.
వెంకటేశ్వరరావు, కొణితివాడ, వీరవాసరం మండలం.
పదికాలాలు క్షేమంగా ఉండాలి
రాంబాబు పంపించే భోజనం చాలా బాగుంటుంది. ప్రతిరోజూ ఒకే రకమైన భోజనం కాకుండా, పండుగ రోజుల్లో మరింత ప్రత్యేంగా భోజనం అందించడం చాలా సంతోషం. అడగకుండానే అన్నంపెట్టే రాంబాబులాంటి వ్యక్తి పదికాలాలపాటు క్షేమంగా ఉండాలి.
అప్పారావు, కొణితివాడ.
కడుపు నింపడంలోనే సంతృప్తి
సంపాదించిన దానిలో కొంతమొత్తంతో కొందరి ఆకలి తీర్చడం కన్నా సంతృప్తి మరొకటి లేదు. ఈ పని తలపెట్టినప్పుడు ఎంతో ఆలోచించాను. నా కుటుంబ సభ్యులు అండగా నిలవడంతో ముందడుగు వేశాను. ‘కోవిడ్’ సమయంలో రెండు మూడు నెలలు మినహా ప్రారంభించిన నాటి నుంచి నిరంతరాయంగా ఈ భోజనం క్యారియర్ల పంపిణీ కొనసాగుతోంది. ఇన్నాళ్లుగా భోజనాలు పంపుతున్నా, రాంబాబు అనే పేరు తప్ప నేనెవరో క్యారియర్లు అందుకుంటున్న చాలామందికి ప్రత్యక్షంగా తెలియదు.
మళ్ల తులసీరామ్(రాంబాబు), నిర్వాహకుడు, పంజా వేమవరం.