దుర్వాసుడు ఒకసారి పితృలోకానికి వెళ్లాడు. శరీరం నిండా విభూతిని అలంకరించుకుని, రుద్రాక్షమాలలు ధరించి, ‘శివా! శంకరా! పరమేశ్వరా! జగన్మాతా! జగదంబికా!’ అంటూ పార్వతీ పరమేశ్వరులను స్మరిస్తూ అడుగుపెట్టిన దుర్వాసుడిని కవ్యవాలాదులైన పితృదేవతలు ఎదురేగి స్వాగతించారు. దుర్వాసుడిని వారు ఉన్నతాసనంపై కూర్చుండబెట్టి, అతిథి మర్యాదలు చేశారు. కుశల ప్రశ్నలు వేశారు. కబుర్లతో వారు కాలక్షేపం చేస్తుండగా, ఎక్కడి నుంచో ఆర్తనాదాలు, హాహాకారాలు వినిపించసాగాయి.
ఆ ఆర్తనాదాలకు, హాహాకారాలకు దుర్వాసుడు కలత చెందాడు. ‘హృదయవిదారకంగా ఉన్న ఈ రోదనలు, హాహాకారాలు ఎక్కడివి?’ అని అడిగాడు.
‘మునీశ్వరా! ఇక్కడికి సమీపంలోనే యమలోకం ఉంది. అక్కడ పాపులను శిక్షించడానికి యమధర్మరాజు ఉన్నాడు. అతడి అధీనంలో వేలాదిగా యమదూతలు ఉన్నారు. యమలోకంలో ఎనభైఆరు నరకకూపాలు ఉన్నాయి. వాటిలో భయంకరమైనది కుంభీపాక కూపం. మహాపాపులను తెచ్చి, అందులో పడవేసి, వారిని యమదూతలు ఘోరంగా శిక్షిస్తుంటారు. వారి శిక్షల యాతనను వర్ణించడం అసాధ్యం. శిక్షలు అనుభవిస్తున్న పాపుల ఆర్తనాదాలు, రోదనలు ఇక్కడి వరకు వినిపిస్తూ ఉంటాయి. దైవనింద, గురునింద, పరపీడన, నారీపీడన, మాతృ పితృనింద, మిత్రద్రోహం, స్వామిద్రోహం వంటి మహాపాపాలు చేసి వచ్చిన వారికి శిక్షలు అత్యంత దారుణంగా ఉంటాయి. శిక్షల బాధ తాళలేక ఆ పాపులు చేసే ఆర్తనాదాలు మేము రోజూ వింటూనే ఉంటాం. వారి ఆర్తనాదాలు వింటే చాలు ఎవరికైనా వైరాగ్యం పుడుతుంది’ అని చెప్పారు.
నరకం నుంచి వినిపించే పాపుల ఆర్తనాదాలు వింటూ దుర్వాసుడు పితృలోకంలో ఉండలేకపోయాడు. చటుక్కున లేచి, వడివడిగా అడుగులు వేస్తూ నరకం వైపు బయలుదేరాడు. కొద్దిసేపటికే అతడు నరకానికి చేరుకున్నాడు. పెద్దపెట్టున ఆర్తనాదాలు వినిపిస్తున్న కుంభీపాక కూపం వద్దకు వెళ్లాడు. గట్టున నిలబడి లోనికి చూశాడు. అప్పటి వరకు మిన్నుముట్టిన ఆర్తనాదాలు ఆగిపోయి, కేరింతలు మొదలయ్యాయి. కుంభీపాక కూపంలో ఉన్న పాపులు ఉల్లాసంగా, ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఆనంద కేళీ విలాసాలు సాగిస్తూ కనిపించారు. యమలోకం గురించి పితృలోకంలో తాను విన్నదొకటి, తాను స్వయంగా చూస్తున్నది వేరొకటిగా ఉండటంతో దుర్వాసుడు ఆశ్చర్యపోయాడు.
దుర్వాసుడు మాత్రమే కాదు, పాపులకు శిక్షలు అమలు చేస్తున్న యమదూతలు కూడా ఈ ఆకస్మిక పరిణామానికి నివ్వెరపోయారు. కఠిన శిక్షలకు యాతనలు అనుభవిస్తూ హాహాకారాలు చేయవలసిన పాపులందరూ కేరింతలు కొడుతూ ఆనందకేళీ నృత్యాలు చేస్తుండటం వారిని అయోమయంలో పడేసింది. కుంభీపాకంలోని మహాపాపులందరూ స్వర్గసౌఖ్యాలు అనుభవిస్తున్నంత ఆనందంగా ఉండటం విడ్డూరంగా తోచింది. ఎంతగా తరచి చూసినా ఈ పరిస్థితికి కారణమేమిటో కనిపించలేదు. ఇదేదో మాయలా ఉందని తలచి యమదూతలు హుటాహుటిన యమధర్మరాజు వద్దకు వెళ్లారు. ‘స్వామీ! కుంభీపాకంలోని మహాపాపులందరూ స్వర్గసౌఖ్యాలు అనుభవిస్తున్నంత ఆనందంగా ఉన్నారు. కొద్దినిమిషాల కిందటి వరకు హాహాకారాలు చేసిన వారే ఇప్పుడు ఉల్లాసంగా కేరింతలు కొడుతున్నారు.
దీనికి కారణమేమిటో మాకు ఏమాత్రం అంతుచిక్కకుంది. మీరే ఒకసారి స్వయంగా వచ్చి పరిశీలించండి’ అని చెప్పారు.యమదూతల మాటలకు యమధర్మరాజు ఉలిక్కిపడ్డాడు. కుంభీపాకంలో ఏం జరుగుతోందో చూడటానికి వెంటనే మహిష వాహనాన్ని అధిరోహించాడు. ఎందుకైనా మంచిదని ఇంద్రుడు సహా ఇతర దిక్పాలకులకు, బ్రహ్మ విష్ణువులకు కబురు పెట్టాడు.యముడు, ఇంద్రాది దిక్పాలకులు, బ్రహ్మ విష్ణువులు దాదాపు ఒకేసారి కుంభీపాక కూపం వద్దకు చేరుకున్నారు. లోపల ఉన్న పాపులు ఆనంద పరవశులై కేరింతలు కొడుతున్న దృశ్యాన్ని కళ్లారా చూశారు. ఇది నరకకూపం కాదు, పాపుల కోసం ఏర్పాటు చేసిన భోగకూపంలా ఉందని వారంతా నివ్వెరపోయారు.
ఈ విడ్డూరానికి కారణమేమిటో వారెవరికీ అంతుచిక్కలేదు.బ్రహ్మ విష్ణువులు ఇంద్ర యమధర్మరాజులతో తర్జనభర్జనలు జరిపారు. ఎంతగా ఆలోచించినా ఈ వింతకు కారణమేమిటో వారికి తోచలేదు. పరమశివుడిని అడిగితే దీనికి కారణమేమిటో చెప్పగలడని వారంతా ఏకగ్రీవంగా అనుకున్నారు. దిక్పాలకులను, ఇంద్రుడిని, యముడిని వెంటబెట్టుకుని బ్రహ్మ విష్ణువులు నేరుగా కైలాసానికి వెళ్లారు. వారంతా శివుడికి నమస్కరించారు. యమలోకపు వింతను వివరించారు. ‘మహేశ్వరా! ఎంతగా ఆలోచించినా ఈ వింతకు కారణమేమిటో మాకు తోచకున్నది. నువ్వు సర్వజ్ఞుడివి. దీనికి కారణమేమిటో నువ్వే చెప్పాలి’ అన్నాడు విష్ణువు.
‘మహావిష్ణూ! ఇందులో వింతా లేదు, విడ్డూరమూ లేదు. ఇదంతా విభూతి మహిమ. కుంభీపాకం వద్దకు దుర్వాసుడు వచ్చాడు కదా! నా భక్తుడైన దుర్వాసుడు విభూతిని ధరించాడు. కుంభీపాకం వద్ద అతడు నిలిచి, తలవంచి లోనికి చూశాడు. అప్పుడు అతడి నుంచి విభూతి రేణువులు రాలి ఆ పాపుల మీద పడ్డాయి. అవి పడిన వెంటనే పాపుల యాతనలు మటుమాయమైపోయాయి. కుంభీపాక కూపం స్వర్గతుల్యంగా మారింది. ఇకపై అది పితృలోక వాసులకు పవిత్ర తీర్థమవుతుంది. అందులో స్నానమాచరించిన పితృదేవతలు సుఖపడతారు.
అక్కడ ఆలయం నిర్మించి, మా దంపతులను ప్రతిష్ఠించండి. ప్రీతీశ్వరి, ప్రీతీశ్వరులుగా అందులో కొలువుదీరుతాం. పితృలోక వాసుల పూజలు అందుకుంటాం. ముల్లోకాలలోనూ ఉన్న తీర్థాలన్నింటిలోనూ ఇదే పవిత్ర తీర్థమవుతుంది’ అని ప్రకటించాడు శంకరుడు. దేవతలందరూ శివుడి వద్ద సెలవు పుచ్చుకుని బయలుదేరారు. పరమశివుడు చెప్పినట్లుగానే కుంభీపాకం వద్ద తీర్థాన్ని, ఆలయాన్ని నిర్మించారు. అప్పటి వరకు కుంభీపాకంలో ఉన్నవారంతా దివ్యవిమానాల్లో కైలాసానికి చేరుకున్నారు.
∙సాంఖ్యాయన


