ఈ వారం కథ: పరదేశి | This week's story of funday | Sakshi
Sakshi News home page

ఈ వారం కథ: పరదేశి

Jul 27 2025 5:58 AM | Updated on Jul 27 2025 7:26 AM

This week's story of funday

ఎప్పుడూ అతని గదిలో నుండి నాకు ‘ఆజారే...’ అంటూ లత మధురగానం వినిపిస్తూ ఉంటుంది. ‘మధుమతి’ చిత్రంలోని పాటలన్నీ అదేపనిగా వస్తూ ఉంటాయి. అతనికా పాటలు అంత ఇష్టమైతే కావచ్చు కాని, ఎప్పుడూ అవే పాటలు వింటూ ఉండటం నాకెంతో ఆశ్చర్యంగా ఉంటుంది. మరో పాట విని ఎరుగను. అతని దగ్గర వున్నది అదొక్కటే క్యాసెట్‌ కాబోలు!ఉదయం ఏడు గంటలకు వెళ్ళిపోతాడు హడావుడిగా.మళ్ళా రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో వస్తాడు. ‘మధుమతి’ పాటలు వినిపించాయంటే, అతను వచ్చినట్లే!సుమారు ఓ అరగంట  వరకూ ఆ చిత్రంలోని పాటలు వినిపిస్తుంటాయి. అవి వినడం నాకూ అలవాటయిపోయింది.ఓ రోజు ఉదయం అతను వెళ్లే టైమ్‌కి నేను మా గుమ్మంలో నిలబడ్డాను. 

సైకిల్‌ మీద వెళుతున్నాడు. ఇరవై ఐదేళ్లు వుంటాయేమో?బక్కపలచగా, తెల్లగా వున్నాడు. ఊరు చివర ఏదో ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడట!మా ఇంటి పక్క పోర్షన్‌లో రిటైర్డ్‌ మాస్టారు వుంటారు. అందులో ఒక గది ఆ అబ్బాయికి అద్దెకు ఇచ్చారు. అది మా వంటింటికి, పెరటి ఖాళీ స్థలానికి దగ్గరగా ఉంటుంది. మధ్యలో ప్రహరీ గోడ ఉన్నప్పటికీ అతని గది కిటికీలు కనిపిస్తూ ఉంటాయి.
ఇంటర్లో ఫెయిల్‌ అయిన సబ్జెక్ట్‌కి ప్రిపేర్‌ అవుతుండేదాన్ని. రోజంతా ఇంట్లో ఉండటం బోర్‌గా ఫీల్‌ అవుతున్న సమయంలో ఆ ఎదురింటి అబ్బాయిని గమనిస్తూ వుండటం నిజానికి మంచి కాలక్షేపం !మా ఇంట్లో నాన్నగారు రిటైర్‌ అయి మూడేళ్లు కావస్తోంది. అన్నయ్య పేపర్‌ మిల్స్‌లో పని చేస్తాడు. అక్క పెళ్లికి రెడీగా ఉంది.కాస్త నల్లగా, సన్నగా ఉండటం వల్లనేమో? అక్కని చూడటానికి వచ్చిన వాళ్ళు ఓకే అనడం లేదు. 

రెండో పిల్ల అయితే సరే అన్నారు ఒకరు. ‘పెద్ద అమ్మాయికి కాకుండా రెండో అమ్మాయికి చెయ్యం’ అని ఇంట్లోవాళ్లు గట్టిగా చెప్పడమే కాకుండా, అప్పటి నుంచి పెళ్లి చూపులకు ఎవరైనా వస్తే, నన్ను కనబడనీయకుండా దాచేసేవాళ్ళు.ఆ విధంగా ఒకరోజు సాయంకాలం నేను మా డాబా మెట్ల మీద కూర్చోవలసి వచ్చింది. చీకటి కూడా పడింది. పెళ్లి చూపుల కార్యక్రమం ఇంకా అయినట్లు లేదు. ఒక్కర్తినే ఏమీ తోచక అలా ఆలోచిస్తూ కూర్చున్నాను.ఇంతలో పక్కింటి రూమ్‌లో లైటు వెలిగింది.అతను తొందరగా వచ్చినట్లు వున్నాడు. కిటికీ తలుపు తెరిచాడు.టేప్‌ రికార్డర్‌ ఆన్‌ చేశాడు.‘ఆజారే పరదేశీ...’ లత తీయని గొంతు వినిపిస్తోంది.చీకటిలో డాబా మీద ఉన్న నేను అతనికి కనబడే అవకాశం లేదు. అతను మాత్రం కాస్తంత మాసిన బనీను, లుంగీతో స్పష్టంగా కనిపిస్తున్నాడు.

గది మూల కిరోసిన్‌ స్టవ్‌ వెలిగించాడు. ఓ గిన్నెలో బియ్యం కడిగి స్టవ్‌ మీద పెట్టాడు. ఇంకోపక్క ఓ పళ్ళెంలో ఉల్లిపాయలు, పచ్చిమిరప ముక్కలు కట్‌ చేసి పెట్టుకున్నాడు. కోడిగుడ్డు కూడా ఆ పక్కనే కనిపిస్తోంది.ఆమ్లెట్‌ వేసుకుంటాడేమో?‘రమణీ... రమణీ’  అమ్మ కేక వినిపించింది.‘ఆ... వస్తున్నా’ అంటూ మెట్లు దిగుతుంటే, అతను కిటికీలోంచి నన్ను చూశాడు. చీకటిలో నా ఆకారం అతను గుర్తించినట్లే ఉంది. ఉదయం తొమ్మిది గంటలకు రూమ్‌ తాళం వేసి, సైకిల్‌ తీస్తూ గుమ్మంలో నిలుచున్న నన్ను తలెత్తి చూశాడు.
అతను ఈ నాలుగు మాసాలలో నన్ను చూడటం అదే మొదటిసారి.అప్పటి నుంచి రోజూ ఉదయం అదే టైమ్‌కి ఒకరినొకరు చూసుకోవడం ఒక దినచర్యలా మారింది.నేను రోజూ ఉదయం గుమ్మంలో నిలబడటం ఇంట్లో ఎవైనా గమనిస్తారేమో అనే భయం లేకపోలేదు.

ఒకసారి అమ్మ అంది ‘మన కులమే అయితే ఆ అబ్బాయిని రమణికి అడిగితే?’నాన్న అన్నారు ‘పెద్దమ్మాయికి పెళ్లి అయ్యాక కనుక్కుందాం’పుస్తకం చదువుకుంటూ ఆ మాటలు విన్న నాకు ఏదోలా అయ్యింది.కాని, మొన్న వచ్చిన సంబంధం వాళ్ళు ఏ కబురూ చేయలేదు.ఆరోజు సాయంకాలం నాలుగు గంటలకే ఆ అబ్బాయి రావడం నాకు ఆశ్చర్యం కలిగించింది.నేను కిటికీలోంచి చూస్తున్నాను.అరగంట తరువాత బ్యాగ్‌ పట్టుకుని రూమ్‌ తాళాలు వేసి, మాస్టారు గారింటికి వెళ్లి ‘మా ఊరు వెళుతున్నాను. చెల్లి పెళ్లి. వారం తరువాత వస్తాను’ అంటూ చెప్పడం వినిపించింది. అతను బయలుదేరి మా ఇల్లు దాటే సరికి,  గబుక్కున గుమ్మంలోకి వచ్చి నిలబడ్డాను.నన్ను చూసి చిన్న నవ్వు నవ్వాడు.అదే మొదటిసారి అతను నన్ను చూసి నవ్వడం.నేనూ గబుక్కున నవ్వేసి చేయి ఊపాను.

అతను ఊరు వెళ్ళాక, మూసివున్న గది తలుపులు చూస్తుంటే నాలో ఏదో అదోలాంటి దిగులులా అనిపిస్తోంది.ఈలోగా అన్నయ్యకు ఓ సంబంధం వచ్చింది.అమ్మాయి నచ్చింది. ఆ అమ్మాయి పినతండ్రి కొడుకు అక్కను చేసుకోవడానికి ఇష్టపడటంతో, కట్నకానుకల సమస్య పెద్దగా లేకపోవడంతో ఒకేసారి రెండు పెళ్లిళ్లు కుదిరిపోయాయి.వచ్ఛే నెలలో ముహూర్తాలు నిర్ణయించారు.నాలో ఏదో తెలియని ఉత్సాహం నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తూ అతని కోసం అదేపనిగా ఎదురు చూసేలా చేస్తోంది.పది రోజులు గడిచాయి.ఆరోజు ఉదయం అతని గది కిటికీ తలుపులు తెరిచి ఉండటంతో పాటు, లత తీయని గానం అతని రాకనుతెలియజేసింది.అతను మాస్టారు ఇంటికి వెళ్లి, తరువాత మా ఇంటికి వచ్చాడు. అతని చేతిలో స్వీట్ల కవరు ఉంది.

నాన్నగారు ‘రా బాబూ ...కూర్చో’ అన్నారు.‘చెల్లి పెళ్లి...’ అంటూ స్వీట్లు అందించాడు.‘రమణీ...’కర్టెన్‌ వెనుక నిలబడిన నేను వెంటనే ‘నాన్నగారూ’ అంటూ వచ్చాను.‘మంచినీళ్లు తీసుకురామ్మా’ అన్నారు స్వీట్ల కవరు నా చేతికిస్తూ.నేను లోనికి వెళ్లి గ్లాసుతో నీళ్లు తెచ్చాను.అతను నా వైపు చూడకుండానే, చేతి వేళ్ళు తగలకుండా గ్లాసు అందుకున్నాడు.నాన్నగారు ‘మీ నేటివ్‌ ప్లేస్‌ ఎక్కడ? ప్రస్తుతం చేస్తున్న జాబ్‌ ఏమిటి? గోత్రం ఏమిటి? శాఖ ఏమిటి?’ వివరాలు అడుగుతున్నారు.అతడు మా కులం కాదని అప్పుడే తెలిసింది.నేను అక్కడి నుంచి వచ్చేశాను. 

మా ఇంట్లో పెళ్ళి హడావుడి మొదలయ్యింది. అంత హడావుడిలో కూడా ఉదయం చిరునవ్వుతో విష్‌ చేసుకోవడం, రాత్రి చేతి సైగతో గుడ్‌ నైట్‌ చెప్పుకోవడం ఎవరూ గమనించకుండా జరిగిపోతూనే వుంది. ఇద్దరికీ మొదటిసారి మాట్లాడుకునే అవకాశం అన్నయ్య, అక్క పెళ్లిలో వచ్చింది.చేతిలో గిఫ్ట్‌ ప్యాకెట్‌తో కల్యాణ మండపం దగ్గర నిలబడ్డాడు. నేను చిరునవ్వుతో పలకరించాను. నాన్నగారు అంత హడావుడిలో కూడా అతడిని గమనించి ‘రా...బాబూ’ అని పిలిచి, గిఫ్ట్‌ అందుకుని ‘భోజనం చేసి వెళ్ళు బాబూ’ అంటూ నా వైపు చూశారు.

‘రండి’ అంటూ అతడిని భోజనాల దగ్గరికి తీసుకెళ్ళాను.మేము ఇద్దరం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అదే మొదటిసారి.‘మీకు మధుమతి పాటలంటే అంత ఇష్టమా?’‘అవును... మా అమ్మ ఎప్పుడూ వినే పాటలవి. ఇప్పుడు అమ్మ లేదు. నాకు ఆ పాటలు మాత్రం అమ్మ గుర్తుగా మిగిలిపోయాయి’నాకెంతో కుతూహలం కలిగింది. కాని, అక్కడ అంతకన్నా ఎక్కువ మాట్లాడే అవకాశం లేదు మరి .అతని కళ్ళల్లో లీలగా తడి...పెళ్లి హడావుడి అయిన వారం రోజులకు ఒక రోజు తెగించి చిన్న కాగితం మీద ‘సంగీతం కళాశాల దగ్గర ఈ ఆదివారం కలుద్దాం’ అని రాసి, ఖాళీ అగ్గిపెట్టెలో పెట్టి అతని గది కిటికీలో పడేశాను.నిజంగా నా దైర్యానికి నాకే ఆశ్చర్యం వేసింది.
ఇంటి దగ్గర మాట్లాడుకునే అవకాశమే లేదు.నేను సాయంకాలం నాలుగు గంటలకు కళాశాల గేటు దగ్గర నిలబడ్డాను. ఆదివారం కావడం వలన అక్కడ ఎవరూ లేరు. లోపల ఎవరో ఒకరిద్దరు కనిపిస్తున్నారు.

ఇంతలో సైకిల్‌ మీద వస్తూ అతను... నా గుండె వేగంగా కొట్టుకోసాగింది. అతను కూడా కొంచెం టెన్షన్‌గా కనిపిస్తున్నాడు.సైకిల్‌ స్టాండ్‌ వేసి నిలబడ్డాడు.ఎవరో ఒకాయన మమ్మల్ని కుతూహలంగా చూస్తూ ఆ దారంట వెళ్ళాడు.‘ఇంటి దగ్గర ాట్లాడటం కుదరదు’ అన్నాను.
‘ఇక్కడ ఇలా రోడ్‌ పక్కన... నాకెందుకో బాగులేదు’ అన్నాడతను.‘అవును’ అన్నాను.జేబులోంచి ఒక కాగితం తీసి ఇచ్చాడు.నా మొహంలోకి చూశాడు. సాయంకాలపు నీరెండ.ఇద్దరి కళ్ళూ కలిసి మళ్లీ విడిపోయాయి. దస్తూరి బావుంది.ఒకే వాక్యం. ఈ శనివారం లక్మీ థియేటర్‌లో మార్నింగ్‌ షో.ఇంట్లో ఎవరూ చూడకుండా ఆ కాగితాన్ని ఎన్నిసార్లు చదివానో!శనివారం వచ్చింది. సినిమా హాలులో కలిశాం. మాకోసమే అన్నట్లు హాలు ఖాళీగా ఉంది. ‘శంకరాభరణం’ సినిమా విడుదల అయిన రెండోరోజో... మూడో రోజో!ఒకరి గురించి ఒకరు తెలుసుకునే అవకాశం కుదిరిన రోజది. 

నెమ్మదిగా మాట్లాడుకున్నాం. ఆ చిత్రంలోని పాటలు మమ్మల్ని మౌనంగా ఉండేలా చేశాయి. స్నేహపూర్వకంగా ఒకరి చేయి ఒకరు తాకిన రోజు. మేము మరిచిపోలేని రోజు కూడా!రోజూ ఎవరూ చూడకుండా పరస్పరం విష్‌ చేసుకోవడం, రాత్రి గుడ్‌ నైట్‌ చెప్పుకోవడం మామూలుగానే గడిచిపోతోంది.అతను బిజీ అయిపోయాడు. తొందరగా వెళ్లడం, లేటుగా రావడం, ఆదివారాలు కూడా హడావుడిగా వెళ్లిపోవడం...నేను మా వదినగారి బుల్లి టేప్‌ రికార్డర్‌లో ‘శంకరాభరణం’ పాటలు వినడం... అలా మూడు నెలలు గడిచిపోయాయి.ఓరోజు అతను కిటికీలో నుండి అగ్గిపెట్టె చూపించి, సందులో పడేశాడు.‘రేపు ఉదయం కలుద్దాం. మార్నింగ్‌ షో’ అని రాసి ఉంది.అదే హాలు. అదే సినిమా. నూరవరోజుకి దగ్గరగా ఉండటంతో జనాలు కాస్తంత పలచగానే వున్నారు.హాలులో మాకు మాట్లాడుకోవడానికి వీలుగా ఉన్న సీట్లలో కూర్చున్నాం.‘నాకు సెంట్రల్‌ గవర్నమెంట్‌  ఉద్యోగం వచ్చింది’ చెప్పాడు.

‘కంగ్రాట్స్‌’ అన్నాను.‘ఢిల్లీ వెళ్లిపోతున్నాను’నాకు అర్థమైపోయింది. ఇక మేము విడిపోయే రోజు వచ్చేసింది.అతను నా చేతికి చిన్న వాచ్‌ ఇచ్చాడు.‘గుర్తుగా’ అన్నాడు.చాలాసేపు ఏం మాట్లాడుకోవాలో తెలియలేదు. తరువాత చాలా మాట్లాడుకున్నాం కాని, అంత వివరించడానికి ఏమీ లేదు.సినిమా ఆఖరి సన్నివేశం పూర్తి కాకుండానే వెళ్లిపోవడానికి లేచాం. నా చేయి అందుకుని ముద్దుపెట్టుకున్నాడు. బయటికి నడిచాం.అతను రూమ్‌ ఖాళీ చేసే రోజు వచ్చింది.ఆ రాత్రి వెళ్లిపోతున్నాడు.గుడ్‌ బై చెప్పే సమయం...నేను ఓ ప్యాకెట్‌ అతనికి చూపించి కిటికీ లోంచి పడేశాను. అందులో ‘శంకరాభరణం’ కేసెట్‌ ఉంది. అతను ఇచ్చిన వాచీ నా చేతికి గుర్తుగా కనిపిస్తోంది.‘ఈ వాచీ ఎక్కడిది?’ అని ఇంట్లో అడిగితే నా స్నేహితురాలు ఇంటర్‌ పాస్‌ అయ్యానని గిఫ్ట్‌గా ఇచ్చిందని చెప్పడానికి ఒక అబద్ధం రెడీగా ఉంచుకున్నాను.‘మధుమతి’ పాటలు నాకిప్పుడు వినబడవు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement