
సహ్యాద్రి ప్రాంతంలో మాతాపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో విష్ణుదత్తుడనే విప్రుడు ఉండేవాడు. ఆయన నిష్ఠాగరిష్ఠుడు. ఆయన భార్య పేరు సుశీల. పేరుకు తగినట్లే భర్తకు అనుగుణంగా నడుచుకునేది. విష్ణుదత్తుడు నిత్యనైమిత్తిక కర్మలను క్రమం తప్పక ఆచరించేవాడు. అతడి ఇంటి ఆవరణలో రావిచెట్టు ఉండేది. ఆ రావిచెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉంటుండేవాడు.విష్ణుదత్తుడు ప్రతిరోజూ నిత్యకర్మలను పూర్తి చేసుకున్న తర్వాత భోజనానికి ముందు రావిచెట్టు కింద భూతబలి సమర్పిస్తుండేవాడు. అలా సమర్పించిన ఆహారాన్ని రావిచెట్టు మీదనున్న బ్రహ్మరాక్షసుడు కాకిరూపంలో వచ్చి ఆరగించేవాడు. ఆ ప్రసాదాన్ని రోజుల తరబడి ఆరగిస్తుండటంతో బ్రహ్మరాక్షసుడిలో తామస ప్రవృత్తి నశించింది. ఒకరోజు ఆ రాక్షసుడికి ఒక సద్బుద్ధి పుట్టింది. తనకు చాలా రోజులుగా తిండిపెడుతున్న విష్ణుదత్తుడికి ఏదైనా మేలు చేస్తే బాగుంటుంది కదా అనుకున్నాడు. ఆ ఆలోచన రాగానే, బ్రహ్మరాక్షసుడు విష్ణుదత్తుడి ఎదుట సౌమ్యరూపంలో ప్రత్యక్షమయ్యాడు.
‘విప్రవర్యా! రోజూ నువ్వుపెడుతున్న అన్నం తింటున్నాను. నీకు ఏదైనా మేలు చేయాలని అనిపించింది. నేను ఏదైనా చేయగల సమర్థుడిని. ఏమాత్రం సంకోచించక నీకు నేను చేయగల ప్రత్యుపకారం ఏమిటో చెప్పు. తప్పక చేస్తాను’ అన్నాడు.విష్ణుదత్తుడు తన భార్యతో చర్చించి, ‘రాక్షసోత్తమా! మాకు తీరని కోరిక ఒకటి ఉంది. దత్తస్వామి ఈ ప్రాంతంలోనే సంచరిస్తూ ఉంటారని వినడమే గాని, ఏనాడూ వారి దర్శనభాగ్యం మాకు కలగలేదు. వారిని ఒకసారి చూపించు, చాలు’ అని చెప్పాడు.‘చాలా మంచి కోరిక. కాని, ఒక షరతు. దత్తస్వామిని అల్లంత దూరం నుంచి చూపించే ప్రయత్నం మూడుసార్లు చేస్తాను. ఆయన చిత్ర విచిత్ర రూపాలలో తిరుగుతూ ఉంటాడు. గుర్తించి ఆయనను పట్టుకోగలిగితే నీ అదృష్టం’ అన్నాడు రాక్షసుడు. విష్ణుదత్తుడు సరేనన్నాడు.
ఒకరోజు విష్ణుదత్తుడు ఏదో పనిలో ఉండగా, బ్రహ్మరాక్షసుడు హఠాత్తుగా వచ్చాడు. ‘దత్తస్వామి ఇక్కడకు దగ్గరలోనే తిరుగుతున్నాడు. వెంటనే నాతో రా’ అని పిలిచాడు. విష్ణుదత్తుడు హుటాహుటిన అతడి వెంట బయలుదేరాడు. బ్రహ్మరాక్షసుడినే అనుసరిస్తూ ఒక వీథిలోకి చేరుకున్నాడు. ఆ వీథిలో మద్య మంసాదులు విక్రయిస్తున్న అంగళ్లు ఉన్నాయి. అక్కడ ఒక వ్యక్తి తప్పతాగి, పిచ్చివాడిలా తిరుగుతున్నాడు. రాక్షసుడు ఆ వ్యక్తిని చూపించి, ‘అతడే దత్తస్వామి. వెళ్లి దర్శించు’ అని విష్ణుదత్తుడికి చెప్పి వెళ్లిపోయాడు. కళ్ల ముందు ఉన్న ఉన్మాదిని దత్తస్వామి అని నమ్మలేకపోయాడు విష్ణుదత్తుడు. రాక్షసుడు తనను ఆటపట్టించడానికి అలా చెప్పి ఉంటాడని భావించి, అక్కడి నుంచి వెనుదిరిగి ఇంటికి వెళ్లిపోయాడు.రాక్షసుడు మళ్లీ విష్ణుదత్తుడికి కనిపించి, ‘విప్రోత్తమా! ఏమి మందమతివయ్యా! నీకు ముందే చెప్పాను కదా, దత్తస్వామి చిత్రవిచిత్ర రూపాల్లో తిరుగుతుంటాడని. మరచినట్లున్నావు. అందుకే గుర్తించలేక వెనుదిరిగావు. పోనీలే, ఈసారి మళ్లీ చూపిస్తాను’ అని చెప్పి వెళ్లిపోయాడు.
కొన్నాళ్లకు రాక్షసుడు మళ్లీ వచ్చాడు. ‘విష్ణుదత్తా! రా రా! దత్తస్వామి ఇక్కడకు దగ్గరలోనే తిరుగుతున్నాడు’ అని పిలిచాడు. విష్ణుదత్తుడు అతడితో పాటే వెళ్లాడు. ఈసారి రాక్షసుడు శ్మశానానికి దారితీశాడు. శ్మశానంలో దుమ్ముకొట్టుకుని ఉన్న ఒక మనిషి కనిపించాడు. అతడి చేతిలో కపాలం ఉంది. చుట్టూ నాలుగు కుక్కలు ఉన్నాయి. ‘అతడే దత్తస్వామి’ చెప్పాడు రాక్షసుడు. విష్ణుదత్తుడు అతడి వద్దకు చేరుకోబోయాడు. అతడు కస్సుమంటూ చేతికందిన కట్టెతో విష్ణుదత్తుడిని కొట్టాడు. విష్ణుదత్తుడు భయంతో గజగజలాడుతూ వెనుదిరిగి చూడకుండా ఇంటికి పరుగు తీశాడు. రాక్షసుడు దూరం నుంచి ఇదంతా చూస్తూ ఉన్నాడు. ‘వెర్రిబాపడు ఈసారి కూడా అవకాశాన్ని పాడుచేసుకున్నాడు’ అనుకుని విచారించాడు.ఇంకొన్నాళ్లకు రాక్షసుడు మళ్లీ వచ్చాడు. ‘విష్ణుదత్తా! నీకు ముందే చెప్పాను. మూడుసార్లు దత్తస్వామిని దూరం నుంచి చూపిస్తానని. ఇదే చివరిసారి. దత్తస్వామి దగ్గర్లోనే ఉన్నాడు. వెంటనే నాతో రా’ అన్నాడు. విష్ణుదత్తుడు రాక్షసుడి వెంట బయలుదేరాడు. ఈసారి ఏం జరిగినా, దత్తస్వామి పాదాలను వదలకూడదని ముందే నిశ్చయించుకున్నాడు.
రాక్షసుడు ఈసారి ఊరవతలి వెలివాడకు దారితీశాడు.కొంతదూరంలో ఒక వికృతాకారుడు కనిపించాడు. అతడు ఒక గాడిద కళేబరం నుంచి మాంసం ముద్దలను పెకలించి, వాటిని కాకులకు, గద్దలకు, కుక్కలకు, నక్కలకు విందుగా పెడుతున్నాడు. ‘విష్ణుదత్తా! అతడే దత్తస్వామి. వెళ్లి అతడి పాదాలను ఆశ్రయించు’ అని చెప్పి బ్రహ్మరాక్షసుడు వెళ్లిపోయాడు.కాకులూ గద్దలకూ, కుక్కలూ నక్కలకూ గాడిద మాంసం పంచుతున్న వికృత స్వరూపుణ్ణి చూడగానే విష్ణుదత్తుడికి ఒళ్లు జలదరించింది. ఏదైతే అదే జరుగుతుంది అనుకుని, విష్ణుదత్తుడు ధైర్యం కూడదీసుకున్నాడు. నేరుగా వికృతాకారుడి వద్దకు చేరుకుని, అతడి పాదాలు పట్టుకున్నాడు. ‘ఓరీ మూఢుడా! నా కాళ్లు పట్టుకుంటావేమిరా?’ అంటూ గద్దించాడు ఆ వికృతాకారుడు.
విష్ణుదత్తుడు పాదాలను మరింత గట్టిగా పట్టుకున్నాడు. వికృతాకారుడు విష్ణుదత్తుడి వీపు మీద మాంసం ముద్దలతో బాదాడు. ఎంత బాదుతున్నా, విష్ణుదత్తుడు చలించలేదు. తన పట్టువీడలేదు. కాసేపటికి వికృతాకారంలో ఉన్న దత్తస్వామి ప్రసన్నుడయ్యాడు. ‘విష్ణుదత్తా! ఈ వికృతాకారుడితో నీకు పనేమిటయ్యా? నాకోసం మూడుసార్లు వచ్చావు’ అని సౌమ్యంగా అడిగాడు.ఆయన అలా అడగడంతోనే విష్ణుదత్తుడి వీపుమీద మాంసం ముద్దల బరువు ఎవరో తీసేసినట్లుగా మాయమైంది. అతడి కాళ్లు, చేతులు పులకరించాయి. నెమ్మదిగా కళ్లు తెరిచి, తల పైకెత్తి చూశాడు.కళ్లెదుట పీతాంబరాలతో దత్తాత్రేయస్వామి దర్శనమిచ్చాడు. విష్ణుదత్తుడు పులకాంకితుడయ్యాడు.
∙సాంఖ్యాయన