జగమంత కుటుంబం ఏకాకి జీవితం | funday cover story | Sakshi
Sakshi News home page

జగమంత కుటుంబం ఏకాకి జీవితం

Aug 10 2025 7:07 AM | Updated on Aug 10 2025 7:34 AM

funday cover story

ప్రపంచ జనాభా ఎనిమిదివందల కోట్లు దాటేసింది. ఎటు చూసినా మనుషులతో కిటకిటలాడే ప్రదేశాలే! అయినా ప్రపంచవ్యాప్తంగా ఒంటరితనంతో బాధపడుతున్న ఏకాకుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. జగమంత కుటుంబంలో ఏకాకులు తమదైన చీకటిలోకంలో కృంగి కృశించిపోతున్నారు. భరించరాని ఒంటరితనం వల్ల మానసిక, శారీరక సమస్యలకు లోనవుతూ అర్ధాంతరంగా రాలిపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఒంటరితనాన్ని ‘ప్రపంచవ్యాప్త మహమ్మారి’గా (గ్లోబల్‌ ఎపిడమిక్‌) గుర్తించిందంటే, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

ప్రపంచ జనాభా ఎనిమిదివందల కోట్లు దాటేసింది. ఎటు చూసినా మనుషులతో కిటకిటలాడే ప్రదేశాలే! అయినా ప్రపంచవ్యాప్తంగా ఒంటరితనంతో బాధపడుతున్న ఏకాకుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది.జగమంత కుటుంబంలో ఏకాకులు తమదైన చీకటిలోకంలో కృంగి కృశించిపోతున్నారు. భరించరాని ఒంటరితనం వల్ల మానసిక, శారీరక సమస్యలకు లోనవుతూ అర్ధాంతరంగా రాలిపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఒంటరితనాన్ని ‘ప్రపంచవ్యాప్త మహమ్మారి’గా (గ్లోబల్‌ ఎపిడమిక్‌) గుర్తించిందంటే, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

‘కోవిడ్‌–19’ అనుభవాలను చూసిన జనాలకు మహమ్మారి తీవ్రత ప్రత్యేకంగా వివరించాల్సిన పనిలేదు. అలాగని ఒంటరితనం అంటువ్యాధి కాదు. అయినా, దీనిని డబ్ల్యూహెచ్‌ఓ మహమ్మారిగా గుర్తించిందంటే, దానికి కారణమేమిటి? ఒంటరితనం మహమ్మారి స్థాయిలో ప్రాణాలను కబళిస్తోందా? అనే అనుమానాలు చాలామందిలో తలెత్తుతాయి. ఒకసారి గణాంకాలను పరిశీలిస్తే, ఆ అనుమానాలన్నీ పటాపంచలైపోతాయి. ఒంటరితనం మోగిస్తున్న ప్రమాదఘంటికల గణాంకాలు ఇవి:

ఒంటరితనం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 8.71 లక్షల మంది మరణిస్తున్నారు. ఈ సంఖ్య ఏటా మలేరియా వల్ల సంభవించే మరణాల కంటే ఎక్కువ. పరిస్థితి ఈ స్థాయిలో ఉండటం వల్లనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒంటరితనం మరణాలను ప్రపంచవ్యాప్త మహమ్మారిగా గుర్తించింది. ఒంటరితనం సమస్య అభివృద్ధి చెందిన ధనిక దేశాలతో పోల్చుకుంటే, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోను, పేద దేశాల్లోను ఎక్కువగా ఉంది. మన భారతదేశంలో ఒంటరితనం సమస్య ప్రమాదకరమైన స్థాయిలోనే ఉంది. ‘కోవిడ్‌–19’ తర్వాత ఒంటరితనం సమస్య ప్రపంచవ్యాప్తంగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాల ప్రకారం రకరకాల స్థాయుల్లో ఒంటరితనంతో బాధపడేవారిలో పిల్లలు కూడా ఉంటుండటం ఆందోళనకర అంశం.

మన దేశంలో ఒంటరితనం సమస్య గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే, పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటోంది. పట్టణ ప్రాంతాల్లోని యువతలో 17.3 శాతం మంది తీవ్రస్థాయి ఒంటరితనంతో బాధపడుతుంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 9.5 శాతంగా ఉంది. 
మన దేశంలో 45 ఏళ్లు పైబడిన వారు ప్రధానంగా మూడు కారణాల వల్ల ఒంటరితనంతో బాధపడుతున్నారు. ఈ అంశంపై జాతీయ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సంస్థ వెల్లడించిన గణాంకాలు ఇవి

విస్తరిస్తున్న ఒంటరితనం
ఒంటరితనం సమస్య చాప కింద నీరులా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. అవివాహితులు, భాగస్వామికి దూరం కావడం వల్ల ఏకాకులుగా మిగిలిన వారిలో 39 శాతం మంది ఒంటరితనంతో బాధపడుతుంటే, వివాహితులలో సైతం 22 శాతం మంది ఒంటరితనంతో బాధపడుతుండటం ఆందోళనకర పరిణామం. ఒంటరితనం సమస్య అకాల మరణాలకు దారితీస్తోందని, అందువల్ల దీనిని మహమ్మారిగానే గుర్తించాల్సి ఉంటుందని అమెరికా సర్జన్‌ జనరల్‌ వివేక్‌మూర్తి తన పరిశోధన వివరాలను వెల్లడించారు. ఆయన వాదనతో ఏకీభవించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఒంటరితనాన్ని మహమ్మారిగా గుర్తించింది. 

ఒంటరితనం ఆరోగ్యంపై చూపే దుష్ప్రభావం రోజుకు ఏకంగా పదిహేను సిగరెట్లు తాగడం వల్ల వచ్చే దుష్ప్రభావాలకు సమానంగా ఉంటుందని డాక్టర్‌ వివేక్‌మూర్తి చెబుతున్నారు. ఈ లెక్కన ఒంటరితనంతో బాధపడేవారి బతుకులు పొగ తాగకున్నా, పొగ చూరిపోతున్నట్లు అర్థమవుతోంది. జీవితంలో బరువు బాధ్యతలతో కుంగిపోతున్న పెద్దలే కాదు, చదువు సంధ్యలు ఇంకా పూర్తికాని కుర్రకారు కూడా ఒంటరితనం సమస్యతో బాధపడుతున్నట్లు వివిధ అంతర్జాతీయ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యల వల్ల ఒంటరితనంతో బాధపడేవారు సర్వసాధారణమే అయినా, ఇటీవలి కాలంలో సోషల్‌ మీడియా ప్రభావం వల్ల ఒంటరితనంతో బాధపడేవారి సంఖ్య కూడా పెరుగుతోందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఒంటరితనంతో బాధపడేవారు ఏ తరంలో ఎందరెందరు ఉన్నారంటే...

ఈ జబ్బుల ముప్పు ఎక్కువ
ఒంటరితనంతో బాధపడే వారికి పలు శారీరక, మానసిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒంటరితనం వల్ల తలెత్తే సమస్యల్లో గుండెజబ్బులు, పక్షవాతం, మధుమేహం, అధిక రక్తపోటు, రోగనిరోధక శక్తి క్షీణత, జ్ఞాపకశక్తి క్షీణత కలిగించే డెమెన్షియా, అల్జీమర్స్‌ వంటి వ్యాధులు ప్రధానమైనవి. తరచుగా ఈ సమస్యలు ప్రాణాంతకంగా మారే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవే కాకుండా, ఒంటరితనం వల్ల దిగులు, కుంగుబాటు, ఆందోళన, నిద్రలేమి, ఏకాగ్రత లోపం, ఆత్మహత్య ధోరణులు, స్వీయహాని ధోరణులు, మాదకద్రవ్యాల దుర్వినియోగం, మానసిక ఒత్తిడి స్థాయిలో పెరుగుదల వంటి మానసిక సమస్యలు కూడా ఎక్కువవుతాయి. ఇలాంటి శారీరక, మానసిక సమస్యల వల్ల ఒంటరితనం బాధితుల్లో అకాల మరణాల ముప్పు 26 శాతం వరకు పెరుగుతోందని డాక్టర్‌ వివేక్‌మూర్తి చెబుతున్నారు.

ఒంటరితనం కారణంగా స్థూలకాయం, థైరాయిడ్‌ సమస్యలు, ఉబ్బసం, బైపోలార్‌ డిజార్డర్, కొన్ని రకాల ఆటిజం వంటి ఇతర శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని ఒక తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాకు చెందిన టులేన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్, చైనాలోని గువాంగ్‌ఝో యూనివర్సిటీకి చెందిన బ్రెయిన్‌ హాస్పిటల్‌ శాస్త్రవేత్తలు ఒంటరితనంతో బాధపడే పలువురు రోగులపై క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహించారు. ఒంటరితనం వల్ల 26 రకాల దీర్ఘకాలిక వ్యాధులు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, వీటిలో కొన్ని ప్రాణాంతక వ్యాధులు కూడా ఉంటాయని వారు తేల్చారు.

ప్రమాదకరమైన ప్రొటీన్ల పెరుగుదల
ఒంటరితనంతో బాధపడేవారిలో ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదకరమైన ప్రొటీన్లు అధిక స్థాయిలో ఉన్నట్లు ఇటీవలి వైద్య పరిశోధనల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రొటీన్ల వల్ల ఒత్తిడి పెరగడం, కొలెస్ట్రాల్‌ పెరగడం సహా పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని అంతర్గతమైన వాపులకు, గుండె, మెదడు వంటి కీలక అవయవాల పనితీరులోని అవరోధాలకు ఈ ప్రొటీన్లే ప్రధాన కారణమని కేంబ్రిడ్జి యూనివర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్‌ చున్‌ షెన్‌ చెబుతున్నారు. ఒంటరితనంతో బాధపడేవారిలో దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే దాదాపు రెండువందల ప్రొటీన్లు అధిక స్థాయిలో ఉన్నట్లు తమ పరీక్షల్లో గుర్తించినట్లు ఆయన వెల్లడించారు.

  • బయటపడాలంటే ఏం చేయాలి?
    ఒంటరితనానికి సంబంధించి పైన చెప్పిన లక్షణాలతో బాధపడుతున్నట్లయితే, ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి ఎంత త్వరగా ప్రయత్నిస్తే అంత మంచిది. అందుకోసం ఏం చేయాలంటే...

  • ఇతరులతో సానుకూల దృక్పథంతో వ్యవహరించండి. ముభావంగా ఉంటూ ఎవరైనా పలకరిస్తే, ముక్తసరిగా బదులివ్వడంతో సరిపెట్టుకోకుండా, సానుకూలంగా మాట్లాడండి.

  • ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇంకా ఒంటరిగానే ఉంటున్నట్లు అనిపిస్తే, స్వచ్ఛంద సేవాసంస్థల కార్యకలాపాల్లో పాలుపంచుకోండి. మీకు నచ్చిన హాబీలకు సంబంధించిన సంస్థల్లో చేరండి. దీనివల్ల క్రమంగా మీలో ఆత్మవిశ్వాసం పెరిగి, ఒంటరిననే భావన తగ్గుతుంది.

  • ఉదయంవేళ ఆరుబయట నడక సాగించడం, వ్యాయామం చేయడం, ఆటలాడటం వంటివి చేయండి. ఉదయం వేళ సూర్యకాంతిలో గడిపినట్లయితే, మెదడులో ఎండార్ఫిన్, సెరటోనిన్‌ల స్థాయి పెరిగి, ఉత్సాహంగా అనిపిస్తుంది.

  • ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకుంటే వెంటనే వైద్యులను లేదా మానసిక వైద్య నిపుణులను సంప్రదించాలి. వారి సూచనల మేరకు అవసరమైతే మందులు వాడాల్సి ఉంటుంది. మీ పరిస్థితిని సన్నిహితులకు చెప్పండి.

కొన్ని వాస్తవాలు
ఒంటరితనం ప్రపంచవ్యాప్త సమస్యగా మారడంతో పలు సంస్థలు ఒంటరితనాన్ని రూపుమాపే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. బ్రిటన్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘క్యాంపెయిన్‌ టు ఎండ్‌ లోన్లీనెస్‌’ 2011 నుంచి ఒంటరితనంపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. ఒంటరితనం సమస్యపై శాస్త్ర పరిశోధనలకు, సామాజిక సేవలకు సహాయం అందిస్తోంది. ‘క్యాంపెయిన్‌ టు ఎండ్‌ లోన్లీనెస్‌’ పరిశోధనల ప్రకారం ఒంటరితనాన్ని గురించి వెలుగులోకి వచ్చిన వాస్తవాలు కొన్ని:

కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఎందరితో సంబంధాలు ఉన్నా, కొందరు ఒంటరితనంతో బాధపడుతుంటారు. కుటుంబ బాంధవ్యాలు, స్నేహ సంబంధాల పరిమాణానికి, ఒంటరితనానికి ఎలాంటి సంబంధం లేదు. ఒంటరితనం ఒక మానసిక స్థితి.

ఒంటరితనం వేర్వేరు స్థాయుల్లో ఉంటుంది. అస్తిత్వ, భావోద్వేగ, సామాజిక స్థాయుల్లో చాలామంది ఒంటరితనంతో బాధపడుతుంటారు.
ఈ స్థాయుల్లో ప్రపంచంతో సంబంధం తెగిపోయినట్లుగా భావించడం, కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఎందరున్నా తమను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరనుకుని బాధపడటం, స్వార్థం తప్ప సామాజిక సంబంధాలలో మరేమీ లేదనుకుని, సమాజానికి వీలైనంత దూరంగా ఉండటం వంటి లక్షణాలతో బాధపడుతుంటారు.

చిన్నవయసులోనే ఒంటరితనం బారినపడిన వారు ఏకాగ్రత లోపం కారణంగా చదువుల్లోను, కెరీర్‌లోను వెనుకబడిపోతారు.
ఒంటరితనం సమస్య కేవలం ఆ సమస్యతో బాధపడేవారికి మాత్రమే పరిమితం కాదు. ఈ సమస్య ప్రపంచ ఆర్థిక పురోగతికి అవరోధంగా నిలుస్తూ, ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తోంది.

ఒంటరితనంతో బాధపడే ఉద్యోగుల కారణంగా ఉత్పాదకత తగ్గిపోతుంది. ఫలితంగా వారు పనిచేసే సంస్థలకు, ప్రభుత్వాలకు ఆర్థికభారం ఎదురవుతుంది.

బ్రిటన్‌లో ఒంటరితనంతో బాధపడేవారి శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణ కోసం ఎదురయ్యే వార్షిక తలసరి వ్యయం 9900 పౌండ్లు (రూ.11.50 లక్షలు) వరకు ఉంటుందని ‘క్యాంపెయిన్‌ టు ఎండ్‌ లోన్లీనెస్‌’ అంచనా. ప్రపంచస్థాయిలో ఈ వ్యయం ఎంత ఉంటుందనే దానిపై కచ్చితమైన లెక్కలేవీ అందుబాటులో లేవు.

  1. మహమ్మారిగా పరిణమించిన ఒంటరితనం కేవలం ప్రజారోగ్య సమస్య మాత్రమే కాదు, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీసే సమస్య. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఈ సమస్యపై మరింతగా దృష్టి సారించి, నివారణ చర్యలు చేపడితే తప్ప సమగ్ర సామాజిక, ఆర్థిక, ఆరోగ్య పురోగతిని సాధించడం సాధ్యం కాదు.

    దీర్ఘకాలిక ఒంటరితనం లక్షణాలు
    ఎక్కువకాలం ఒంటరితనంతో బాధపడుతున్నట్లయితే, మిగిలిన దీర్ఘకాలిక వ్యాధుల మాదిరిగానే ఒంటరితనాన్ని కూడా దీర్ఘకాలిక వ్యాధిగానే పరిగణించాలని పలువురు మానసిక వైద్యనిపుణులు చెబుతున్నారు. వారు చెబుతున్న ప్రకారం దీర్ఘకాలిక ఒంటరితనం లక్షణాలు ఇవి

  2. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతమంది ఉన్నా, వారితో దగ్గర కాలేకపోవడం. వారికి దగ్గరగా ఉన్నా, వారితో పొడి పొడిగా మాట్లాడటమే తప్ప భావోద్వేగాలను పంచుకోలేకపోవడం. వారితో గాఢమైన బంధాన్ని అనుభూతి చెందకపోవడం.

  3. స్నేహితులు చాలామంది ఉన్నా, వారిలో ఎవరూ దగ్గరి స్నేహితులు లేకపోవడం. స్నేహంగా ఉంటున్నవారిని దగ్గరగా భావించలేకపోవడం. ఎందరు స్నేహితులు ఉన్నా, వారిలో కనీసం ఒక్కరైనా మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారని లోలోన బాధపడుతుండటం.

  4. పని ప్రదేశంలో చుట్టూ ఎందరున్నా, ఎవరికీ పట్టని ఏకాకిలా బాధపడుతుండటం. చేసే పని మీద పూర్తిస్థాయి ఏకాగ్రత చూపలేకపోవడం.

  5. ఆత్మన్యూనతకు లోనవడం, ఆరోగ్య పరిస్థితిపై లేనిపోని అనుమానాలతో భయపడటం, తరచుగా ప్రతికూల ఆలోచనలతో సతమతం కావడం.

  6. కుటుంబంలోని శుభకార్యాలు, స్నేహితులతో పార్టీలు వంటి వేడుకల్లో పాల్గొనాల్సి వస్తే, బాగా అలసిపోయినట్లగా, ఉక్కిరిబిక్కిరి అయినట్లుగా ఇబ్బందిపడటం.

  7. వేడుకల్లో పాల్గొనేటప్పుడు చుట్టూ జనాలు ఆనందోత్సాహాలతో ఉన్నా, నిర్లిప్తంగా ఎవరికీ పట్టనట్లుగా ఒక మూలన కూర్చుండిపోవడం.

  8. పని ప్రదేశంలో చుట్టూ ఎందరున్నా, ఎవరికీ పట్టని ఏకాకిలా బాధపడుతుండటం. చేసే పని మీద పూర్తిస్థాయి ఏకాగ్రత చూపలేకపోవడం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement