స్క్రోలాటం చిట్టి రీల్స్‌.. గట్టి ఆదాయం | Funday Cover Story On One minute reels | Sakshi
Sakshi News home page

స్క్రోలాటం చిట్టి రీల్స్‌.. గట్టి ఆదాయం

Nov 2 2025 8:17 AM | Updated on Nov 2 2025 8:30 AM

Funday Cover Story On One minute reels

నవ్వించు, ప్రేరేపించు, షేర్‌ చేయించు ఇవన్నీ రెండు నిమిషాల్లోనే! ఇక్కడ సమయం తక్కువ, ఐడియాలు ఎక్కువ. కాని, పవర్‌ మాత్రం మ్యాక్స్‌! టైమింగ్‌లో రీల్స్‌ కంటే ఎక్కువ, షార్ట్‌ ఫిల్మ్‌ కంటే తక్కువ. కానీ,  ఫుల్‌ ఎంటర్‌టైన్ మెంట్, ఫుల్‌ ఇంపాక్ట్, ఫుల్‌ మనీ! అవే, ఈ టూ మినిట్స్‌ వీడియోల చిన్న సినిమాలు! అందుకే, ఇవి రీల్స్‌నే కాదు, రియల్‌ లైఫ్‌లోనూ ఫాస్ట్‌ ఇంపాక్ట్‌ ఇస్తున్నాయి.

చిన్న వీడియోల పెద్ద హంగామా
ఒకప్పుడు సినిమా థియేటర్లో మూడు గంటలు కూర్చుని ఒక కథ చూస్తే, ఇప్పుడు అదే ఎమోషన్, అదే మెసేజ్, అదే ఫీల్‌ను రెండు నిమిషాల వీడియోలోనే చూస్తున్నాం! కారణం? డిజిటల్‌ ప్రపంచం వేగంగా పరుగులు తీస్తోంది. ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్లు, డేటా ఇవన్నీ కలసి మనకు రీల్స్‌ స్క్రోలింగ్‌ అనే ఒక కొత్త అలవాటు తెచ్చాయి. ఇప్పుడు ఆ రీల్సే కాస్త పెద్దవై షార్ట్‌ స్క్రోలింగ్‌ సినిమాలుగా మారాయి. అందుకే, ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్, జోష్, మోజ్‌ ఏ యాప్‌ తెరిచినా ఒక్కో స్క్రోల్‌లోనే నవ్వు, డ్రామా, పాట, డ్యాన్ ్స, ట్రెండ్, ఎమోషన్  అన్నీ మీ చేతిలోకి వస్తున్నాయి, అది కూడా రెండు నిమిషాల్లోనే! ఇంతలోనే వాటికి మిలియన్ల వ్యూస్, కోట్ల లైక్స్, సూపర్‌స్టార్‌ ఫేమ్‌. ఈ రెండు నిమిషాల ఫేమ్‌తో లక్షల ఆదాయం కూడా వస్తోంది.

ఎందుకు ఈ పిచ్చి?
మనిషి మైండ్‌ ఇప్పుడు ఫాస్ట్‌ మోడ్‌లో ఉంది. తక్కువ టైమ్‌లో ఎక్కువ ఎంటర్‌టైన్ మెంట్‌ కావాలని కోరుకుంటోంది. పది నిమిషాల వీడియో ఎవరు చూస్తారు? అదే తొంభై సెకన్లలో నవ్వు, ప్రేమ, డ్యాన్ ్స, డ్రామా అన్నీ ఇస్తే, దాన్ని మిస్సవ్వడం కష్టం! అందుకే మనసు వెంటనే ‘నెక్ట్స్‌’ అంటుంది. ఇదే డోపమైన్  లూప్‌. ప్రతి స్క్రోల్‌లో చిన్న సంతోషం, ప్రతి వీడియోలో కొత్త హిట్‌. సైకాలజిస్టుల మాట ప్రకారం, చిన్న వీడియోలు మన మెదడులో ‘ఇన్ స్టంట్‌ రివార్డ్‌’ ఫీలింగ్‌ కలిగిస్తాయి. అందుకే మనం ‘ఇంకో వీడియో మాత్రమే’ అని మళ్లీ మళ్లీ స్క్రోల్‌ చేస్తూనే ఉంటాం! వీటిలో యూట్యూబ్‌ షార్ట్స్‌ వీడియోస్‌కు ఎక్కువ క్రేజ్‌ రావడంతో, క్రియేటర్లు యూట్యూబ్‌ షార్ట్‌ ఫిల్మ్, వీడియోస్‌ కంటే రీల్స్‌లోనే తమ క్రియేటివిటీతో కథలను సృష్టిస్తున్నారు. అలా ‘ఒక్క నిమిషం చాలదు, రెండు నిమిషాలైనా ఇవ్వండి!’ అని క్రియేటర్లు డిమాండ్‌ చేసినప్పుడు, యూట్యూబ్‌ ‘సరే! మీకు 180 సెకన్లు!’ అని అంగీకరించింది. ఈ నేపథ్యం వలనే వివిధ రకాల సోషల్‌ మీడియా యాప్స్‌ కూడా ఈ రెండు, మూడు నిమిషాల వీడియోలకు ఆసక్తి చూపించడం మొదలుపెట్టాయి. ప్రస్తుతం, టిక్‌టాక్, యూట్యూబ్‌ షార్ట్స్‌ నిడివి మూడు నిమిషాల వరకు పొడుగవుతుండగా, ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ కూడా పొడవవుతున్నాయి! అలా ఇప్పుడు ప్రపంచం మొత్తం టూ మినిట్స్‌ రివల్యూషన్‌ మొదలైంది.  

క్విక్‌ కరెన్సీగా!
వాణిజ్య ప్రకటనలు అంటే పెద్ద క్యాంపెయిన్, టీవీ యాడ్స్, బిల్‌బోర్డులను అనుకుంటే, ఇప్పుడు అవి మొబైల్‌లో ఒక్క స్క్రోల్‌తో సరిపోతుంది! మార్కెటింగ్‌ ఇప్పుడు డైలాగ్‌ కాదు, రెండు నిమిషాల డ్రామాగా మారింది. ఫ్లిప్‌కార్ట్‌ రీల్స్‌లో డిస్కౌంట్‌ చెబుతుంది, స్విగ్గీ రీల్స్‌లో కర్రీ చూపిస్తుంది, మీషో రీల్స్‌లో సేల్స్‌ పెంచుతుంది! పక్కా మార్కెటింగ్‌ కన్సల్టెంట్స్‌ అందరూ ఇదే మంత్రం ‘ప్రోడక్ట్‌ ఎంత గొప్పదో కాదు, రెండు నిమిషాల్లో ఎవరి మనసు దోచుకుంటామో అదే బ్రాండ్‌ సక్సెస్‌!’ అంటున్నారు. వీటికి కంటెంట్‌ క్రియేటర్స్, ఇన్ ఫ్లుయెన్సర్స్‌ తోడవటంతో, బ్రాండ్స్‌కు క్రియేటర్లకు షార్ట్‌ వీడియోలు ఒక క్విక్‌ కరెన్సీగా మారాయి. స్టార్టప్స్‌ కూడా ఈ షార్ట్‌ వీడియోస్‌ ఆధారంగా కస్టమర్‌ను కట్టిపడేస్తున్నాయి. సంక్లిష్టమైన టెక్నాలజీని కేవలం రెండు నిమిషాల్లో అర్థమయ్యేలా చూపించి, మార్కెటింగ్‌లో కొత్త ఫ్యాషన్‌ క్రియేట్‌ చేశారు. మార్కెటింగ్‌ నిపుణుల ప్రకారం, 2026 నాటికి ప్రపంచం చూసే కంటెంట్‌లో 70 శాతం షార్ట్‌ వీడియోలే ఉంటాయి. సినిమా ట్రైలర్లు, యూనివర్సిటీ క్యాంపెయిన్లు, ఏ సందేశాలు అయినా ఇప్పుడు రీల్‌ రూట్‌లోనే అందరికీ చేరుతున్నాయి.

అంతర్జాతీయ స్థాయిలో..
ప్రపంచం మొత్తం ఇప్పుడు ‘స్క్రోల్, ప్లే, షేర్‌!’ అనే రిథమ్‌లో నడుస్తోంది. అందుకే, ప్రపంచ వ్యాప్తంగా టిక్‌టాక్, యూట్యూబ్‌ షార్ట్స్, ఇన్ స్టాగ్రామ్‌ రీల్స్, క్వాయ్, మోజ్, జోష్‌ కలిపి 80 శాతం మొబైల్‌ డేటా వినియోగానికి కారణం. ఈ కారణంగానే 2020లో యూజర్లు రోజుకు సుమారు 35 నిమిషాలు స్క్రోల్‌ చేస్తే, ఇప్పుడు 80 నిమిషాలు స్క్రోల్‌ చేస్తున్నారట! అందులో మన దేశం ముందు వరుసలో ఉంది. రోజుకు సుమారు 65 కోట్ల మంది యూజర్లు ఈ షార్ట్‌ వీడియోస్‌ వీక్షిస్తారు. ముఖ్యంగా తెలుగు, తమిళం, హిందీ వంటి ప్రాంతీయ భాషల కంటెంట్‌కు డిమాండ్‌ ఎక్కువ. అందుకే, స్థానిక క్రియేటర్లు ఇప్పుడు గ్లోబల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్లుగా ఎదుగుతున్నారు. ఈ నేపథ్యంలో, ‘2025 గ్లోబల్‌ షార్ట్‌ వీడియోస్‌ ట్రెండ్స్‌’ సర్వే ప్రకారం, వివిధ సంస్థలు పరిశీలించిన ఫలితాలను వెల్లడి చేశారు. వివిధ మొబైల్‌ యాప్‌ల డేటా, యూజర్‌ సర్వేలు, సోషల్‌ మీడియా విశ్లేషణల ద్వారా, ఒక్కో దేశంలో ప్రత్యేక కంటెంట్, ట్రెండ్స్‌ స్పష్టమయ్యాయి. ప్రతి చోటా స్థానిక భాషలు, సంస్కృతులు ఆధారంగా షార్ట్‌ వీడియోలు కొత్త దారులు సృష్టిస్తున్నాయి.

డబుల్‌ లైఫ్‌!
ఉదయం బాస్‌ ‘మీటింగ్‌ టైమ్‌’ అంటాడు, రాత్రి ఫాలోవర్స్‌ ‘రీల్‌ టైమ్‌’ అంటారు! ఇలా రెండు ప్రపంచాల మధ్య బ్రిడ్జ్‌ వేసుకుని నడుస్తున్నవారే డబుల్‌ లైఫ్‌ ఇన్ ఫ్లుయెన్సర్లు! పగలు ఆఫీస్‌లో ప్రెజెంటేషన్ ్స చేసి, రాత్రి కెమెరా ముందు ప్రెజెన్ ్స ఇస్తున్నారు. ఇలా ఇండియాలో ఇప్పటి వరకు 45 లక్షల షార్ట్‌ వీడియో క్రియేటర్లు ఉన్నారని, వారిలో దాదాపు 60 శాతం మంది ప్రైవేట్‌ ఉద్యోగులు లేదా ఫ్రీలాన్సర్లు అని తాజా రిపోర్టులు చెబుతున్నాయి. ప్రపంచం మొత్తం చూస్తే, సోషల్‌ మీడియాలోని క్రియేటర్లలో 40 శాతం మంది రెండు ఉద్యోగాలు చేస్తున్నార ని అంచనా. వీరిలో దాదాపు 6 లక్షల మంది క్రమంగా వీడియోల ద్వారా ఆదాయం పొందుతున్నారు. అంటే పగలు జీతం, రాత్రి వైరల్‌ వీడియోల ఆదాయం! దీంతో చాలామంది ప్రొఫెషనల్‌ ఉద్యోగం కంటే ఈ సైడ్‌ ఇన్ కమ్‌ పైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఆఫీస్‌లో ఇంక్రిమెంట్‌ రాకపోయినా, రీల్‌లో ఎంగేజ్‌మెంట్‌ పెరుగుతుంది! అందుకే, ఒక్క రీల్‌ సక్సెస్‌ అయితే నెల జీతం కన్నా ఎక్కువ డబ్బు వచ్చేస్తుంది. వీరంతా ప్రతిరోజూ ల్యాప్‌టాప్‌ బ్యాగ్‌లో లంచ్‌ బాక్స్‌తో పాటు మరో పక్క ట్రైపాడ్‌తో ఆఫీస్‌లకు వెళ్తూ, ఒక కొత్త వర్క్‌ కల్చర్‌తో పనిచేస్తున్నారు. మరికొందరు ‘వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీస్‌’ మాదిరి ‘వర్క్‌ ఫ్రమ్‌ రీల్‌’ అనే కొత్త ఫుల్‌ టైమ్‌ ఉద్యోగం చేస్తున్నారు! ఇలా వచ్చిన పాపులారిటీతో టీవీ షోలు, ఇంటర్వ్యూలు, బ్రాండ్‌ కొలాబరేషన్లు, సిల్వర్‌ స్క్రీన్  చాన్ ్సలు కూడా దక్కించుకుంటున్నారు. ఇలా సాధారణ ఉద్యోగుల కంటే వీరి జీవితం ఇప్పుడు మరింత ఆదాయభరితంగా, ఆనందభరితంగా, వైరల్‌గా మారింది. 

ఏఐ క్రియేటర్లు! 
ఇప్పటి క్రియేటర్లకు కెమెరా మాత్రమే కాదు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్ ్స కూడా పెద్ద సహాయంగా మారింది. వీడియో తీసేందుకు డైరెక్టర్, ఎడిటర్, మ్యూజిక్‌ డిజైనర్‌ అవసరం లేదు. ఏఐ వాయిస్, ఫేస్‌ ఫిల్టర్, స్మార్ట్‌ ఎడిటింగ్‌ యాప్‌లు ఇవే కొత్త టెక్నాలజీ టీమ్‌ మెంబర్స్‌. ఒక క్లిక్‌తో బ్యాక్‌గ్రౌండ్‌ మారిపోతుంది, వాయిస్‌ టోన్  అడ్జస్ట్‌ అవుతుంది, మూడ్‌కి సరిపోయే మ్యూజిక్‌ వచ్చేస్తుంది. కెమెరా ముందు ఉన్నది మనిషే కాని, వెనుక ఆలోచిస్తున్నది మొత్తం ఏఐనే. ఇదే కారణంగా ఇప్పుడు కంటెంట్‌ క్రియేటర్ల వేగం పెరిగింది. ఒకప్పుడు వీడియోకి రోజులు పట్టేది, ఇప్పుడు నిమిషాల్లో సిద్ధమవుతోంది!

రీల్‌లోనే ఫీల్స్, డ్రీమ్స్‌! 
బ్రేక్‌అప్‌ అయినా, బర్త్‌డే అయినా ఇప్పుడు ప్రతి ఒక్క సందర్భానికి రీల్‌ తప్పనిసరి! ముఖ్యంగా 16 నుంచి 25 ఏళ్ల వయసు వారు ‘రియల్‌ లైఫ్‌ కంటే రీల్‌ లైఫ్‌ బెటర్‌!’ అని నమ్ముతున్నారు. సినిమా చూడటానికి ఓపిక లేదు కానీ, రీల్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. ‘ఒక్క నిమిషం లవ్‌ స్టోరీ’, ‘30 సెకండ్ల అడ్వెంచర్‌’, ‘45 సెకండ్ల ట్రాజెడీ’  ఇవే ఇప్పుడు న్యూ ఏజ్‌ బ్లాక్‌బస్టర్స్‌! జెన్  జీ కి రీల్‌ అంటే భాష కాదు లైఫ్‌ స్టయిల్‌. ఇదే కారణంగా ఈ వయసు వారు సోషల్‌ మీడియాలో అత్యధికంగా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఫ్యాషన్  నుంచి ఫుడ్‌ వరకూ, ట్రావెల్‌ నుంచి ట్రెండ్‌ వరకూ అన్నీ వీళ్ల చేతుల్లోనే! అందుకే, అసలైన వైరల్‌ పవర్‌ కూడా వీరివద్దే దాగుంది. 

ప్రాంతీయ భాషల శక్తి
ప్రపంచం ఇంగ్లీష్‌లో మాట్లాడినా, సోషల్‌ మీడియాలో ఇప్పుడు ప్రాంతీయ భాషలే రాజ్యం చేస్తున్నాయి. తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ భాషల్లో ఉన్న కంటెంట్‌ ఎక్కువగా వైరల్‌ అవుతోంది.

వీక్షకులు తమ భాషలో ఉన్న కంటెంట్‌కి ఎక్కువగా కనెక్ట్‌ అవుతున్నారు. ఇందుకే ఇప్పుడు ప్రతి యాప్‌ కూడా ‘మీ భాషలో రీల్‌ క్రియేట్‌ చేయండి’ అని ప్రోత్సహిస్తోంది. తెలుగు క్రియేటర్ల రీల్స్‌ ఇప్పుడు గ్లోబల్‌ ట్రెండ్స్‌లోకి చేరాయి!

రేపటి రియాలిటీ!
భవిష్యత్తులో షార్ట్‌ వీడియోల ప్రపంచం మరింత టెక్‌ రిచ్‌గా మారబోతోంది. త్రీడీ వీడియోలు, వర్చువల్‌ రియాలిటీ, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ కంటెంట్‌ ఇవే రేపటి రీల్స్‌. క్రియేటర్లు ఇప్పుడు కెమెరాతో కాదు, మెటావర్స్‌లో రికార్డు చేయబోతున్నారు! అప్పుడు ప్రేక్షకులు కేవలం వీడియో చూడరు, దానిలోకి అడుగుపెడతారు. అంటే రేపటి రీల్‌ కేవలం వినోదం కాదు. ఒక వాస్తవిక అనుభవం అవుతుంది! ఇప్పటికే కొంతమంది క్రియేటర్లు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు కూడా. త్వరలోనే రీల్స్‌ చూడటం కాదు, అందులో జీవించబోతున్నాం. 

భవిష్యత్తులో రెజ్యూమేలో డిగ్రీ కాదు. ఫాలోవర్స్‌ కౌంటే కెరీర్‌ డిసైడ్‌ చేస్తుందేమో! హై పెయిడ్‌ జాబ్స్‌లో షార్ట్‌ వీడియో క్రియేటర్‌ ఒకటిగా మారచ్చు కూడా! అప్పుడు, డాక్టర్‌ రీల్‌ మధ్యలో ఆపరేషన్  చేస్తాడు. లాయర్‌ వాదన మధ్యలో ‘లైక్, షేర్, సబ్‌స్క్రైబ్‌ ప్లీజ్‌!’ అంటాడు. టీచర్‌ కూడా కెమెరా ముందు ‘టుడేస్‌ ట్రెండ్‌!’ అని క్లాస్‌ మొదలుపెడుతుంది. ఇలా చాలామంది కంటెంట్‌ క్రియేటర్‌నే మెయిన్‌ జాబ్‌గా, మిగతా ఉద్యోగాలను పార్ట్‌టైమ్‌లా చేస్తారేమో!

కిచెన్  నుంచి కెమెరా వరకు!
భారతదేశంలో షార్ట్‌ వీడియోల రంగంలో మహిళల సంఖ్య ఆశ్చర్యకరంగా పెరిగింది. తాజా గణాంకాల ప్రకారం 40 శాతం పైగా షార్ట్‌ వీడియో క్రియేటర్లు మహిళలే! వంటింటి కథల నుంచి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ టిప్స్, ఫ్యాషన్  నుంచి ఫిట్‌నెస్‌ వరకు, మహిళలు కంటెంట్‌ ప్రపంచాన్ని కొత్తగా మలుస్తున్నారు. ఇప్పుడు వాళ్లు కేవలం కంటెంట్‌ క్రియేటర్లు మాత్రమే కాదు, బ్రాండ్‌ అంబాసిడర్లు, ఇన్ ఫ్లుయెన్సర్లు, స్టార్టప్‌ ఫేస్‌లు కూడా అయ్యారు.

లక్షల్లో ఆదాయం!
చూస్తున్న వీడియోలు కేవలం రెండు నిమిషాలే అయినా, క్రియేటర్లకు మాత్రం లక్షల్లో ఆదాయం తెచ్చిపెడుతుంది. ఇందులో ఇండియా ఇప్పుడు ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న క్రియేటర్‌ మార్కెట్‌. 2019లో షార్ట్‌ వీడియో మార్కెట్‌ విలువ 1.3 బిలియన్‌ డాలర్లుగా ఉండగా, 2025 నాటికి అది 3 బిలియన్‌ డాలర్లకు చేరనుందని అంచనా. 2027 నాటికి ఇండియాలో క్రియేటర్‌ ఎకానమీ 45,000 కోట్ల రూపాయల విలువకు చేరనుంది. అందుకే మార్కెటింగ్‌ కూడా రీల్‌ ఫార్మ్‌లోకి వచ్చేసింది. రెండు నిమిషాల్లో బ్రాండ్‌ కథ చెప్పగలిగిన వారే గెలుస్తున్నారు. ఒక్క స్క్రోల్‌కి కోట్ల రూపాయల మార్కెట్‌– ఇదే కొత్త డిజిటల్‌ వండర్‌! 

ఈ కారణంగానే ఇండియాలో ఇప్పటికే పదకొండు వేలకు పైగా చానెల్స్‌ మిలియన్ల సబ్‌స్క్రైబర్లు దాటాయి. రోజూ కోటాను కోట్ల వ్యూస్‌! అంటే ఒక్కొక్క షార్ట్‌ వీడియో చూస్తే, మన ఫింగర్స్‌ స్క్రోల్‌ చేస్తూ ‘ఓ మై గాడ్‌!’ అని చెప్పాల్సిందే. మనీకంట్రోల్‌ సంస్థ ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం, ప్రస్తుతం 45 లక్షల ఇండియాలో క్రియేటర్లలో సుమారు 6 లక్షల మంది డబ్బు సంపాదిస్తున్నారు. వారి సబ్‌స్క్రైబర్లు, ఫాలోవర్స్‌ ఆధారంగా ఆదాయం వస్తుంది. యూట్యూబ్‌ గత మూడు సంవత్సరాల్లో 5.8 లక్షల కోట్ల రూపాయలు క్రియేటర్లకు చెల్లించిందట! ఎవరికి తెలుసు? ఈరోజు మీరు చూసిన చిన్న రీల్‌ రేపటికి లక్షలు తెచ్చే కంటెంట్‌ కావచ్చు! 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement