
తూర్పు ఇంకా తెల్లవారలేదు. వీధి లైట్లు మిణుకు మిణుకుమంటూ వెలుగుతున్నాయి. కార్తీకమాసంలోనూ చలిగాలులు వీస్తున్నాయి. ఇంటి నుంచి బయటకు వచ్చాడు గణపతి శాస్త్రి. పంచె పైకిలాక్కుని, భుజం మీద కండువా వేసుకుని, రాగిచెంబు చేత్తో పట్టుకుని ఆ మసకచీకటిలో కేదార్ ఘాట్‌కేసి నడవడం మొదలుపెట్టాడు. కాశీలోని ఆ ఇరుకు రోడ్లమీద నడవడం కొత్తవాళ్ళకు సవాలే! శాస్త్రికి ప్రతి సందు తెలుసు. అతనికి తెలియని వాడ, చూడని ప్రదేశం లేదు.నెమ్మదిగా కేదార్ ఘాట్‌లో మెట్లు దిగాడు. మూడుసార్లు ‘హరహర మహాదేవ్’ అంటూ గంగలో మునిగి గట్టు మీదకు వచ్చాడు.
కండువాతో వొళ్ళు తుడుచుకుని, పంచె పిండుకుని కట్టుకున్నాడు. నుదుట విభూతి ధారణ చేసి, శివ పంచాక్షరి మంత్రం మనసులో జపిస్తూ, రాగి చెంబులోని గంగా జలంతో శ్రీగౌరీ కేదారేశ్వరుడితో బాటు, అరుణాచలేశ్వరుడికి, దక్షిణామూర్తికి అభిషేకం చేశాడు. ఛప్పన్న గణపతిని, మీాక్షి అమ్మవారిని కూడా దర్శించుకొని, మళ్ళీ చెంబుతో గంగాజలం తీసుకుని బయల్దేరాడు. ఉత్తర వాహినిగా సాగే గంగా ప్రవాహాన్ని , నదీ జలాలమీద గిరికీలు కొడుతున్న తెల్లని కొంగల్ని చూస్తూ, నెమ్మదిగా మానస సరోవర్ ఘాట్, క్షేమేశ్వర్ ఘాట్, చౌసెట్టి ఘాట్‌ల మీదుగా దశాశ్వమేధ ఘాట్ చేరుకున్నాడు. అలాగే ఘాట్ల మీద నడక సాగిస్తూ మణికర్ణిక ఘాట్‌కు చేరుకున్నాడు. అప్పటికే అక్కడ మృతిచెందిన అదృష్టవంతుల కాష్టాలు కాలుతున్నాయి.
‘ఆ అదృష్టం కోసమే కదా తను పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు. రిటైరయిన తర్వాత వచ్చిన డబ్బులతో కాశీలో ఇల్లు కొనుక్కున్నదే అందుకోసం. పిల్లలు ఇద్దరూ బాగా స్థిరపడ్డారు. తన శేషజీవితాన్ని విశ్వేశ్వరుని సన్నిధిలో గడపాలని, తన కాష్టం ఇక్కడే కాలాలని ఇక్కడకు వచ్చేశాడు. మానవజన్మ దుర్లభం. ఈ జన్మలో కాశీలో మరణిస్తే మోక్షమే. మళ్ళీ జన్మంటూ ఉండదు’ అనుకున్నాడు. అక్కడున్న తారకేశ్వర లింగానికి గంగాజలంతో అభిషేకం చేశాడు శాస్త్రి. మళ్ళీ రాగి చెంబుతో గంగా జలం తీసుకున్నాడు.
భక్తిభావం పొంగుతుంటే తన్మయత్వంతో ‘విశ్వేశ్వరా! నా ఆఖరిశ్వాస నీ సన్నిధిలో, ఈ కాశీక్షేత్రంలోనే తీసుకునే అదృష్టం ప్రసాదించు తండ్రీ!’ అంటూ చేతులు జోడించి మనస్సులోనే ప్రార్థించి విశ్వనాథుని మందిరంలోకి అడుగుపెట్టాడు. సర్కారువారి పుణ్యమాని మందిరం దగ్గర కొన్ని ఇరుకు ఇరుకు వీధులన్నీ విశాలమయ్యాయి. భక్తులు గంగానదిలో స్నానం చేసి సరాసరి విశ్వనా«థుని దర్శనం చేసుకోవచ్చు. అక్కడి మందిరంలో పండిట్స్‌తో బాటు భద్రతా సిబ్బంది కూడా గణపతి శాస్త్రికి పరిచయం అయినవాళ్లే. శాస్త్రికి క్యూలతో పనిలేదు. సరాసరి అంతరాలయంలోకి వెళ్లి, అక్కడే ఎంతసేపైనా ధ్యానం చేసుకోగలడు. రాగిచెంబులో తెచ్చిన గంగాజలంతో విశ్వేశ్వరునికి అభిషేకం చేసుకున్నాడు.
బయటకు వచ్చి అన్నపూర్ణని, ఆ ప్రాంగణంలో భాస్కర రాయులవారు ప్రతిష్ఠించిన శ్రీచక్ర లింగాన్ని, విశాలాక్షిని దర్శనం చేసుకున్నాడు. గదోలియా చౌక్‌లో పనులు చూసుకొని, జంగంబాడి మఠ్, పాండే హవేలీ, సైకిల్ స్వామి సత్రం మీదుగా గదికి బయలుదేరాడు. ఇరుకు సందుల్లో తాపీగా తిరుగుతున్న ఆవుల్ని, భయపెట్టే కుక్కల్ని తప్పించుకుంటూ, రుద్ర జపం చేసుకొంటూ నడవడం శాస్త్రి ప్రతిభ.‘ఈ దారుల్లో ఆవులు మనుషుల్ని పొడవవు. ఆలయం మీద నుంచి గద్దలు ఎగరవు. బల్లులు అరవవు. శవాలు వాసన పట్టవు. ఇంతకంటే గొప్ప పుణ్యక్షేత్రం ప్రపంచంలో ఉందా?’ అనుకున్నాడు శాస్త్రి.‘అయ్యా! విశ్వనాథుని గుడికి ఎలా వెళ్ళాలి?’ అన్నారు ఎవరో.
కాశీలో చాలామంది తెలుగు మాట్లాడుతుంటారు. పక్కకు చూశాడు శాస్త్రి. ఓ అరవయ్యేళ్ళ పైబడిన పెద్దాయన కుటుంబంతో నిలబడి ఉన్నాడు.‘శివ శివ అనుకుంటూ వెళ్ళండి. లేకపోతే ఓం నమశ్శివాయ అనుకుంటూ వెళ్ళండి’ అన్నాడు.‘అది కాదు స్వామీ! మందిరానికి దారెటని’ అన్నాడు ఆ పెద్దాయన.‘ఎక్కడనుంచి వచ్చారు? ఎక్కడ దిగారు?’ అన్నాడు శాస్త్రి. ‘రాజమండ్రి నుంచి వచ్చామండి. ఎక్కడా ఆశ్రమాలు ఖాళీ లేవండి. గంగలో మునిగి బట్టలు మార్చుకున్నాం’ అన్నాడు ఆయన.‘సరే! ఒక పనిచేయండి. ఇక్కడికి దగ్గరలోనే మా ఇల్లు. అక్కడ మీరు మీ సామాన్లు పెట్టుకుని విశ్రాంతి తీసుకోవచ్చు. అదిగో అలా తిన్నగా వెళ్లి ఎడమపక్కకు తిరిగితే విశ్వనాథుని ఆలయం.
నాకూడా రండి’ అని వాళ్ళ సమాధానం కోసం చూడకుండా తన ఇంటికేసి దారితీశాడు. వాళ్ళు ఆనందంగా శాస్త్రిని అనుసరించారు.‘ఇదిగో ఇదే విశ్వనాథుని మందిరం. పది నిమిషాలు నడవ గలిగితే మా ఇల్లు’ ఆన్నాడు శాస్త్రి.‘అయ్యా! తమరు పుణ్యాత్ములు. నా పేరు రామనాథం. రిటైర్డ్ స్కూల్ టీచర్ని. ఈమె నా భార్య వైదేహి. వీడు నా కొడుకు రవి. వాడి భార్య రేవతి. వాళ్ళు నా మనవలు’ అని కుటుంబ సభ్యులందరినీ పరిచయం చేశాడు. శాస్త్రి తన ఇల్లు చూపిస్తూ, ‘నాదో నాలుగు గదుల చిన్న ఇల్లు. మీకు నచ్చితే ఆ గదిలో మీ సామాన్లు పెట్టుకుని గుడులన్నీ తిరిగి రావొచ్చు. మీ గదికి తాళం వేసుకుని వెళ్ళిరండి‘ అన్నాడు గది చూపించి. అప్పుడే మిగిలిన రెండు రూముల్లో వసతి దొరకని తెలుగు వాళ్ళ కుటుంబాలు ఖాళీ చేసి వెళ్లాయి. ‘అయ్యా! మేము ఓ నాలుగు రోజులుండి ఇక్కడ చుట్టుపక్కల ఆలయాలు అన్నీ చూసుకుంటాము. రోజుకు ఎంత ఇవ్వాలో చెప్పండి’ అన్నాడు రామనాథం.
‘నేను భక్తులకు సేవ చెయ్యడం భగవంతునికి సేవ చెయ్యడంగా భావిస్తాను. బంధుమిత్రులకు, వసతి దొరకని వారికి నా గదులు ఉచితంగానే ఇస్తాను. ఇక్కడ స్టౌ, పాత్రలు ఉన్నాయి. మీ పిల్లలకు పాలు కాచి ఇచ్చుకోవచ్చు. మీరు ఖాళీ చేసి వెళ్లేటప్పుడు తలుపుకు గొళ్లెం పెట్టి వెళ్ళిపోవచ్చు. భోజనానికి ఇక్కడ సత్రాలు, ఆశ్రమాలు చాలా ఉన్నాయి. అందరూ ఉచితంగానే భోజనం పెడతారు. మీరు ఇవ్వాలనుకున్న డబ్బులు ఎవరైనా అవసరం ఉన్నవాళ్లకు ఇవ్వండి’ అన్నాడు శాస్త్రి. రామనాథం కుటుంబం వారికి చూపించిన గదికి వెళ్ళిపోయారు. తన గదికి వెళ్లి మళ్ళీ స్నానం చేసి, సంధ్యావందనం చేసుకుని, ప్రాణాయామం, ధ్యానం చేసి, యోగాసనాలు వేసి పది నిముషాలు మౌనంగా కూర్చున్నాడు.
కరోనా సమయంలో భార్య పోవడంతో శాస్త్రి ఒంటరి వాడయిపోయాడు. ‘అందరూ పోయేవాళ్ళమే, కాస్త ముందు వెనుక. అదృష్టవంతురాలు కనుకనే అనసూయ కాశీలో పోయింది’ అని సర్దిచెప్పుకున్నాడు. కాశీ వచ్చిన వారికి సేవ చెయ్యడం అంటే విశ్వనాథుడికి సేవ చెయ్యడంలాగే భావిస్తాడు శాస్త్రి.రామనాథం వాళ్ళు సామాన్లు గదిలో పెట్టుకుని తాళం వేసుకుని గుడికి వెళ్ళిపోయారు. ఇంతలో సెల్ మోగింది. చూస్తే బెంగళూరు నుంచి పెద్దకొడుకు విశ్వనాథ్. శాస్త్రి సెల్ ఆన్ చేశాడు.‘ఎలా ఉన్నారు నాన్నా?’ అన్నాడు విశ్వనాథ్.‘భేషుగ్గా ఉన్నాను.
చెప్పు’ అన్నాడు శాస్త్రి.‘మీకు చెప్పాను కదా నాన్నా కొత్తగా విల్లా తీసుకుంటున్నాను అని.. రేపు పదిహేనో తారీఖున గృహప్రవేశం. నాలుగు రోజులుండి వెళ్ళండి. రాను పోను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాను’ అన్నాడు.‘ఈ భవబంధాలు తెంచుకుంటేనేగానీ నేను అనుకున్న గమ్యం చేరలేనురా. రిటైర్ అయ్యాక ఐదేళ్లు ప్రతి ఏడాదీ అమలాపురం నుంచి కాశీ వచ్చేవాడ్ని. పదేళ్ల క్రితం ఇల్లు కొన్నప్పటి నుంచి మీ అమ్మ పోయినా ఎక్కడికీ వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నాను. ఎందుకని? నా ఆఖరి శ్వాస ఇక్కడే తీసుకోవాలని, నా కాష్టం ఇక్కడే కాలాలని. నువ్వు బెంగళూరు నుంచి, చిన్నాడు అమెరికా నుంచి ఫోన్ చేస్తారు. అప్పుడు నా మనసు అటే లాగుతుంది. మీరు జీవితాల్లో బాగా స్థిరపడ్డారు. నాకా పెన్షన్ వస్తుంది. నా గురించి ఆలోచించొద్దురా. అస్తమానూ ఫోన్లు చేసి నా ప్రస్థానానికి ఆటంకం కలిగించకండి రా! రావడానికి కుదరదు’ అన్నాడు శాస్త్రి్త.
‘అయ్యో! అదేమిటి నాన్నా! కన్నబిడ్డ శుభమాని గృహప్రవేశానికి రమ్మని పిలుస్తే కుదరదంటారేమిటి? ఈ ఒక్కసారికి నామాట వినండి. రాకపోతే మేం అంతా బాధపడతాం. మీరు రాకపోతే అసలు గృహప్రవేశమే చేసుకోము’ అన్నాడు బాధగా.‘ప్రతిదానికి ఈ ఏడుపొకటి. సరే! రెండు రోజుల కంటే ఉండటానికి కుదరదు. ఇదేఆఖరిసారి. సరేనా?’ అన్నాడు శాస్త్రి్త అయిష్టంగానే. ‘అలాగే.. థాంక్యూ! నాన్నా’ అన్నాడు విశ్వనాథ్ ఆనందంగా. సెల్ కట్ చేశాడు. కాఫీ తాగుదామని చూశాడు. పాలు లేవు. చిన్న గ్లాసుడు బియ్యం సింగిల్ బర్నర్ స్టవ్ మీద పడేశాడు. రాత్రి మిగిలిన మజ్జిగ ఉంటే వేసుకుని తిన్నాడు. ఏది ఉంటే అది తినడం, లేకపోతే పస్తుండటం; మరీ ఆకలనిపిస్తే ఏ ఆంధ్ర ఆశ్రమానికో, గాయత్రి సత్రానికో, కరివెన సత్రానికో వెళ్ళడం; అక్కడ భోజనం అయ్యిందనిపించడం; అక్కడ సత్రంవారికి, యాత్రికులకు ఏదో ఒక సేవ చెయ్యడం అలవాటయిపోయింది.
మళ్ళీ సెల్ మోగింది.చూస్తే అమలాపురం నుంచి చిరకాల మిత్రుడు రామ్మూర్తి. కాల్ లిఫ్ట్ చేశాడు.‘ఒరేయ్! శాస్త్రి! నువ్వు అస్తమానూ ఫోన్ చేసి కాశీ రా, గంగలో మునుగు, విశ్వేశ్వరుని దర్శనం చేసుకో అని చెబుతున్నావు కదా! నా భార్య కూడా వెళదామండి అని గొడవ చేస్తోంది. రేపు పన్నెండో తారీఖు ఉదయం కాశీ వస్తున్నాం. మాకు ఆశ్రమంలో వసతి ఏర్పాట్లు చెయ్యరా’ అన్నాడు రామ్మూర్తి.‘అలాగే. ఎంతమంది వస్తున్నారురా?’‘నేను, నాభార్య, కొడుకు, కోడలు’ ఆన్నాడు రామ్మూర్తి.‘ఏనాడూ గుడికి వెళ్ళనివాడివి, భగవన్నామం జపించనివాడివి, శుద్ధబద్ధకస్తుడివి. ఇంటిపని, బయటపని మీ ఇల్లాలే చేస్తుందికదా! ఇన్నాళ్ళకు విశ్వనాథుని దర్శనం చేసుకోవాలని నీకు బుద్ధిపుట్టింది. శుభం. తప్పకుండా రండి. నేను చూసుకుంటా’ అన్నాడు శాస్త్రి. ‘థాంక్స్ రా!’ అన్నాడు రామ్మూర్తి.
తర్వాత నెమ్మదిగా ఆంధ్రాశ్రమం ఆఫీసులోకి వెళ్ళాడు. అక్కడ యాత్రికులకు ఆశ్రమం తరపున సేవ చేస్తూ గడిపాడు. సాయంత్రం ఆరు అయ్యింది దశాశ్వమేధ ఘాట్‌కు బయల్దేరాడు. గంగా హారతికి సమయం. కనుల విందుగా జరిగే హారతుల్ని చూడడానికి వచ్చిన జనాలు మెట్ల మీద కూర్చొన్నారు. మైకులో శ్రావ్యంగా భక్తి సంగీతం సాగుతోంది. కొంతమంది విదేశీయులతో బాటు మిగతా యాత్రికులు కూడా ఆ సుందర దృశ్యాలని తమ కెమెరాలలో భద్రపరచుకుంటున్నారు. అంతలో పట్టు పంచెలు కట్టుకున్న యువకులు హారతులు సమర్పించడానికి సిద్ధమవుతున్నారు. నదిలో అందమైన పడవల మీద జనం కూర్చుని, తమ కనుల ముందు జరుగుతున్న గంగా హారతుల్ని భక్తి శ్రద్ధలతో గమనిస్తున్నారు.
ఎప్పుడూ కూర్చునే మండపంలోనే కూర్చున్నాడు శాస్త్రి. హారతి ప్రారంభమయ్యింది. రోజూ చూసే హారతులయినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది శాస్త్రికి. హారతి అవగానే ఆశ్రమానికి వచ్చాడు. గిన్నెలు ఖాళీగా ఉన్నాయి.రెండు అరటిపళ్ళు తిని శివపురాణం తీశాడు. పది గంటల దాకా పారాయణం చేసి నడుము వాల్చాడు. శివనామ స్మరణ చేసుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. రోజులు గంగా ప్రవాహంలా నెమ్మదిగా గడుస్తున్నాయి.ఉదయాన్నే ఎవరో తలుపు కొడుతూంటే తలుపు తీశాడు. ఎదురుగా రామ్మూర్తి, భార్య, కొడుకు, కోడలు చిరునవ్వుతో నిలబడ్డారు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది రామ్మూర్తి పన్నెండో తారీఖు వస్తానన్నాడని.‘రండి...రండి’ అంటూ ఆహ్వానించాడు.అప్పటికే శాస్త్రి గంగాస్నానం చేసి, మణికర్ణిక ఘాట్‌లో కాలుతున్న కాష్టాల్ని కనులనిండుగా చూసి, విశ్వేశ్వరునికి అభిషేకం చేసుకు వచ్చి సంధ్య వార్చుకోడం ముగించాడు.
రామ్మూర్తిని చూడగానే ‘రా... రా... రామ్మూర్తి! ఎన్నాళ్ళకెన్నాళ్ళకు’ అంటూ ఆహ్వానించాడు.‘మీకు ఇంట్లోనే రెండు రూములు ఏర్పాటు చేశాను. కాలకృత్యాలు తీర్చుకుని రండి. గంగా స్నానం చేసి, విశ్వేశ్వరుని దర్శించుకుందురుగాని’ అన్నాడు శాస్త్రి.వారికి గదులు చూపించాడు.‘కార్తీకమాసంలో కాశీ వచ్చారు. మంచి పని చేశారు, త్వరగా తయారై రండి’ అన్నాడు.ఓ అరగంటలో అందరూ వచ్చారు. అందర్నీ కేదార్ ఘాట్‌కు తీసుకెళ్ళి, సంకల్పం చెప్పించి స్నానాలు చేయించాడు.‘ఏం చలిరా నాయనా! వణికిపోతున్నాను. నా వల్ల కాదు బాబోయ్ అంటున్నా మా అన్నపూర్ణ బలవంతంగా లాక్కొచ్చింది’ అన్నాడు రామ్మూర్తి గజగజ వణుకుతూ.‘ఈ మాత్రం చలికే ఇంత హడావిడి చేస్తున్నావ్. ఈ చలిని గులాబ్ సర్దీ అంటారు ఇక్కడ వాళ్ళు. జనవరి నెలలో చూడాలి, చలికి కాలు బయట పెట్టలేం. అయినా పుణ్యం ఊరికే రాదుగా. పుణ్యం కావాలంటే ఆమాత్రం కష్టపడక తప్పదు’ అన్నాడు శాస్త్రి.
ఘాట్ల మీద నడిపిస్తూ, ఆ విశేషాలు వర్ణిస్తూ విశ్వనాథుని దర్శనం చేయించాడు. ఆ తర్వాత సహస్ర లింగేశ్వరుడు, మనోకామేశ్వరుడు, ధనేశ్వరుడు, ప్రీతికేశ్వరుడు, సాక్షి గణపతి, ఢుండి గణపతి, అన్నపూర్ణ, విశాలాక్షిల దర్శనం చేయించాడు. ‘ఇళ్ళల్లోను, షాపుల్లోనూ గుళ్ళు కట్టుకోవడమేమిటిరా? వీళ్ళ భక్తి పాడుగాను!’ అన్నాడు రామ్మూర్తి.‘కాదురా. ఒకనాటి గుళ్లనే, షాపులుగా, ఇళ్లుగా మార్చేశారు. ఏం చెయ్యగలం?’ అన్నాడు శాస్త్రి్త.రామ్మూర్తికి చాలా అలసటగా ఉంది. భారీకాయంతో నడవలేక పోతున్నాడు. ఆతని భార్యకి మాత్రం ఇంకా చూడాలని ఉంది. ఉత్సాహంగా శాస్త్రి్త ముందుకు సాగుతూ, మంగళగౌరి, మాయుఖాదిత్యుడు బిందుమాధవుడు, కాలభైరవుడు, దండపాణి, కృత్తివాసేశ్వరుని దర్శనాలు చేయించాడు.రామ్మూర్తికి కాఫీ చుక్క గొంతులో పడకపోవడంతో చుక్కలు కనిపిస్తున్నాయి. అతగాడి దృష్టి అంతా కాఫీ మీదే ఉండి చిరాకుగా ఉంది.
‘ఈ ఊరేమిటిరా శాస్త్రి్త! ఈ ఇరుకిరుకు సందులు గొందులు, వాటిల్లో అడ్డంగా పడుకున్న కుక్కలు, తాపీగా సాగే ఆవులు వాటి మలమూత్రాలు, దుర్గంధం... మోటార్ సైకిళ్ళ విన్యాసాలు, కిక్కిరిసిన జనం... వాళ్ళ జరదాలు, కిళ్ళీల కంపు... అబ్బబ్బ! ఎలా ఉంటున్నావురా బాబూ? దేవుడు కాశీలోనేగాని, కూచిమంచి అగ్రహారంలో లేడా? ఆ పండిట్లు ఏమిటిరా? వాళ్ళ దౌర్జన్యం ఏమిటి? వాళ్ళ చెయ్యి తడిపితే కాని విశ్వనాథుని దర్శించుకోనివ్వరా?’ అన్నాడు రామ్మూర్తి అసహనంగా.‘నువ్వు కాశీయాత్రకు వచ్చావు. విహార యాత్రకు కాదు. ఇది మహోన్నతమైన ఆధ్యాత్మిక కేంద్రం. అందమైన ప్రదేశాలు చూడాలంటే కాశ్మీర్‌కు వెళ్లొచ్చు. జన్మ సార్థకం కావాలంటే కాశీకే రావాలి. దీన్ని మహా శ్మశానం అంటారు. నువ్వు చెప్పే ఈ అసౌకర్యాలన్నీ మన భక్తిని, సహనాన్ని పరీక్షించడానికి విశ్వనాథుడు పెట్టే పరీక్షలు’ అన్నాడు శాస్త్రి్త. దర్శనాలయ్యి ఆశ్రమానికి వచ్చేటప్పటికి మధ్యాహ్నం రెండు అయ్యింది. ‘కాఫీ’ అన్నాడు రామ్మూర్తి.
‘ఇక భోజనాలే. ఆంధ్రా ఆశ్రమంలో భోజనం చాలా బాగుంటుంది. భోజనాలు అయ్యాక విశ్రాంతి తీసుకోండి. సాయంత్రం ఆరుగంటలకు హారతికి వెళ్దాం’ అని భోజనాలకు తీసుకెళ్లాడు.తను కూడా విశ్రాంతి తీసుకుని సాయంత్రం దశాశ్వమేధ ఘాట్‌కు తీసుకెళ్ళి హారతి చూపించాడు. రామ్మూర్తికి ఈ దర్శనాలు, హారతుల మీద ఆసక్తి లేదు. ఎక్కడ మంచి భోజనం దొరుకుతుందా, ఎక్కడ సుఖంగా కునుకు తీయవచ్చా అన్నదాని మీదే ధ్యాస!రెండో రోజు మనిషిని తోడు ఇచ్చి, చింతామణి గణపతి, సంకట మోచన్ హనుమాన్, దుర్గా దేవాలయం, కాశీరాజు కోట, అస్సీ ఘాట్, బెనారస్ విశ్వవిద్యాలయం చూసే ఏర్పాటు చేశాడు. మూడోరోజు శాస్త్రి కారు ఏర్పాటు చేశాడు.‘ఈ కారు డ్రైవర్ జగన్నాథ్ మన కోనసీమ వాడే. ఎక్కడ ఏం చెయ్యాలో, ఎక్కడ పిండప్రదానం చెయ్యాలో అన్నీ అతనే చూపిస్తాడు. రేపు త్రివేణి సంగమం వెళ్లి రండి. ఎల్లుండి గయలో ఎక్కడ ఏది చెయ్యాలో అన్నీ చూపిస్తాడు.
గయలో పిండ ప్రదానం చేస్తే పితృ దేవతలు తరిస్తారు. మన జన్మ కూడా ధన్యమే అంటారు. నేను రేపు మా పెద్దాడి గృహప్రవేశానికి బెంగళూరు వెళ్లి రెండు రోజుల్లో వచ్చేస్తాను. మీరు అన్నీ చూడటానికి మూడు నాలుగు రోజులు పడుతుంది. ఈలోపు నేను వచ్చేస్తాను’ అన్నాడు శాస్త్రి రామ్మూర్తి భుజం మీద చెయ్యేసి.‘నువ్వున్నావు కాబట్టి వచ్చానురా శాస్త్రి! లేకపోతే గుమ్మం దిగే ప్రసక్తే లేదు. నీకు తెలుసుగా, ఇంటి పక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికే వెళ్లను. అవునూ గాయత్రి సత్రంలో భోజనాలు చాలా రుచిగా ఉంటాయని విన్నాను’... అన్నాడు రామ్మూర్తి బొజ్జ చేత్తో రాసుకుంటూ.‘నీకు భుక్తి మీద ఉన్న రక్తిలో పదోవంతు భక్తి మీద ఉంటే బాగుండేది రా! సరే అలాగే కానీయ్’ అన్నాడు శాస్త్రి్త.రామ్మూర్తి కుటుంబం కార్లో కూర్చోగానే కారు బయల్దేరి, మలుపు తిరిగింది.ఇంతలో రామనాథ కుటుంబంతో వచ్చాడు. కుటుంబం అంతా శాస్త్రికి దండం పెట్టి వెళ్ళిపోయారు.
తన నివాసానికి వచ్చి పూజాకార్యక్రమాలు ముగించుకొని, ఫలహారం తిని, ఆశ్రమానికి వచ్చి యాత్రికుల సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాడు. మర్నాడు ఉదయమే సెల్ మోగింది. కొడుకు జగన్నాథ్. ఆన్సర్ చేసి ‘చెప్ప రా!’ అన్నాడు.‘ఈరోజు సాయంత్రం ఫ్లయిట్‌కు టికెట్ పంపించాను. అందింది కదా! మళ్ళీ మీకు పదహారో తారీఖుకు కాశీకి టికెట్ బుక్ చేశాను. ఎట్టి పరిస్థితుల్లో మీరు రావాలి నాన్నా!’ అన్నాడు విశ్వనాథ్.‘అలాగేలేరా! వస్తున్నాను’ అన్నాడు అయిష్టంగానే. ఆ సాయంత్రం ఫ్లైట్‌కు బెంగళూరు బయల్దేరాడు. విశ్వనాథ్ ఎయిర్ పోర్ట్‌కు కారులో వచ్చి తండ్రిని రిసీవ్ చేసుకున్నాడు.ఆరాత్రి కొడుకు, కోడలు మనవడితో సంతోషంగా గడిపాడు. మరునాడు గృహప్రవేశానికి బంధుమిత్రులందరూ వచ్చారు. అందరూ శాస్త్రి్త అదృష్టాన్ని, ఆధ్యాత్మిక చింతననూ పొగిడేవారే! విశ్వనాథ్ కొన్న విల్లా చాలా ఖరీదైనది.
కొడుకుతో అటువంటి ఇంటిలో ఉండే అవకాశం వదులుకున్నందుకు కొందరు శాస్త్రి మీద జాలి పడ్డారు. గృహప్రవేశానికి వచ్చినవాళ్ళందరితో మంచి హడావుడిగా ఉంది. మంత్రాలతో, మంగళ వాయిద్యాలతో, తోరణాలతో, పట్టుచీరలతో ఇల్లు కళకళలాడుతోంది. ఇంతలో శాస్త్రి్త సెల్ మోగింది. చూస్తే డ్రైవర్ జగన్నాథ్ కాల్ చేస్తున్నాడు. పక్కకు వెళ్లి ఆన్ చేశాడు.‘చెప్పు జగన్నాథ్’ అన్నాడు.‘సార్! ఘోరం జరిగిపోయింది సార్! మీ ఫ్రెండ్ రామ్మూర్తి గారిని గయలో విష్ణుపాదాల దగ్గర పిండ ప్రదానం చేయించి, కాశీలో కేదారఖండం తీసుకురాగానే హార్ట్ ఎటాక్ వచ్చి ప్రాణం వదిలేశారు సార్! బాడీని మణికర్ణికా ఘాట్‌కు తీసుకొచ్చాం సర్!’ అన్నాడు జగన్నాథ్. శాస్త్రి్త నిర్ఘాంతపోయాడు. స్థాణువులా నిలబడిపోయాడు.
తేరుకుని ‘అయ్యో! నేను రేపు వస్తున్నాను. నువ్వు దగ్గరుండి కార్యక్రమాలన్నీ సజావుగా చేయించు’ అని సెల్ కట్ చేశాడు. టైం చూస్తే మధ్యాహ్నం రెండు అయ్యింది. ఎవరి హడావుడిలో వాళ్ళు ఉన్నారు. కొందరు భోజనాలు చేస్తున్నారు. శుభం జరుగుతున్న ఈ ఇంట్లో ఎవరికీ ఈ వార్త చెప్పడానికి లేదు. వెంటనే బాత్రూంలో దూరి తల స్నానం చేసి వచ్చాడు.‘ఇదేమిటి నాన్నా! మిట్టమధ్యాహ్నం వేళ ఈ స్నానం ఏమిటి?’ అన్నాడు జగన్నాథ్.‘నాకు కాశీలో అలవాటు రా!’ అన్నాడు. ఇంతలో కొడుకు ఎవరో పిలిస్తే వెళ్ళిపోయాడు.శాస్త్రి్త ఆలోచనలో పడ్డారు.‘ఎంత అదృష్టవంతుడు రామ్మూర్తి! బాధ్యతలు తీరిపోయాయి.
ఒక్కనాడు గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోని వాడు కాశీలో, అందులోనూ భైరవ యాతనలకు తావు లేని కేదార ఖండంలో ఆఖరిశ్వాస తీసుకున్నాడంటే విశ్వనాథుని దయలేకుండా జరుగుతుందా? పుణ్యాత్ములు పాపాత్ములని మనం ఏవో లెక్కలు వేస్తాం. కానీ ఆ విశ్వేశ్వరుని లెక్కలు వేరే ఉంటాయి. ఎవరికి ఏది, ఎప్పుడు ఇవ్వాలో లిఖించేది ఆయనే’ అనుకున్నాడు శాస్త్రి. అతగాడికి బాధపడాలో, సంతోషించాలో అర్థం కావడం లేదు. ‘అది పూర్వజన్మ సుకృతం. ఈ జన్మలో కాకపోతే గత జన్మలో చేసుకున్న పుణ్యం’ అనుకున్నాడు. సాయంత్రానికి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. శాస్త్రి కుటుంబసభ్యులు మాత్రమే మిగిలారు.. ‘రేపు ఉదయమే కదా ఫ్లయిట్. బట్టలు, మందులు, పూజాసామాన్లు అన్నీ సర్డుకోవడం అయిపోయింది. పెందరాళే పడుకోవాలి. ప్రొద్దున్నే లేవాలి కదా!’ అన్నాడు శాస్త్రి.
‘సరే! నాన్నా! పడుకోండి. తెల్లవారు ఝామునే లేపుతాను’ అన్నాడు విశ్వనాథ్.శాస్త్రికి మనసంతా వికలం అయిపోయింది. పడుకున్నాడన్న మాటేగాని, చిన్ననాటి మిత్రుడు అలా అకస్మాత్తుగా శివైక్యం చెందడాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడు. ఏ అర్ధరాత్రికో నిద్రలోకి జారుకున్నాడు. రోజు బ్రహ్మమూహూర్తంలో లేచే శాస్త్రి్త ఇంకా లేవలేదు. విశ్వనాథ్ రెడీ అయ్యి టైమ్ చూసుకున్నాడు. ఫ్లయిట్‌కి టైమవుతోంది. లేపుదామని తండ్రి గదిలోకి వచ్చాడు.
శాస్త్రి్త ప్రశాంతంగా పడుకుని ఉన్నాడు.‘ప్రయాణానికి టైమవుతోంది. లేవండి నాన్నా!’ అంటూ శాస్త్రి వంటిమీద చెయ్యివేశాడు. చల్లగా మంచులా తగిలింది తండ్రి శరీరం. జరిగింది నమ్మలేక పోయాడు. తిరిగి రానిలోకాలకు తండ్రి ప్రయాణం ఎప్పుడో ప్రారంభమయ్యిందని విశ్వనాథ్‌కు తెలియగానే ‘అయ్యో! నాన్నా’ అని గట్టిగా అరిచాడు. ఆ కేకకి విశాలాక్షి పరిగెత్తుకొచ్చింది.
దీనినే లాలటలిఖితం అంటారేమో! విశ్వనాథుని లిఖితం... అగోచరం..
అదృశ్యం...
అనూహ్యం.