
‘ఏంటి ఇంకా పడుకున్నావ్? చుట్టూ ఉన్నదంతా చెత్తే, సమాజం కుళ్లిపోయింది. ఈ కంపులో ఎలా నిద్ర పడుతోంది? లే.. లే.. లే..’ నిద్రలో ఎవరో కుదిపినట్టు అనిపిస్తే చటుక్కున లేచాడు సీతారామారావు.మనిషి సన్నగా, బీడు భూమిలో మొలిచిన బలహీనమైన మొక్కలా ఉంటాడు. ఆ కట్ బనీన్ , లుంగీలో మరింత పీలగా కనిపిస్తున్నాడు. అశాంతి, అనుమానం తన దగ్గరి బంధువుల్లా ఎప్పుడు పడితే అప్పుడు అతని జీవితంలోకి వచ్చేస్తుంటాయి. ఎప్పుడూ ఏవేవో ఆలోచనలతో కుస్తీ పడుతుంటాడు. మనిషి ఇక్కడ, కళ్లు ఎక్కడో, మనసు ఇంకెక్కడో..?!రాత్రి బాగా పొద్దుపోయాక పడుకొన్నాడేమో నిద్ర సరిపోలేదు. మండుతున్న కళ్లతోనే అలారం వంక చూశాడు. ఆరైతే మోగేదే. ఇంకా పది నిమిషాలుంది. అలారం పెడతాడే తప్ప, ఎప్పుడూ దానికంటే ముందే మేల్కొంటాడు.
టక్.. టక్.. టక్...
గడియారంలో చిన్న ముల్లు గోల పెడుతోంది. మంచం మీద భార్య శాంత ప్రశాంతంగా పడుకొంది. ఫ్యాను గాలికి ముంగురులు అటూ ఇటూ కదులుతున్నాయి. దుప్పటి మెడ వరకు కప్పుకొని, ఆదమరచి నిద్రపోతోంది. మరొకరైతే కాసేపు భార్య మొహాన్ని చూస్తూ రొమాంటిక్ మూడ్‌లోకి వెళ్లిపోయేవారు. సీతారామారావుకు ఇవేం పట్టవు. తన ఉద్యోగం, ఎదురవుతున్న మనుషులు, అర్థమవుతున్న నిజాలు అతన్ని యాంత్రికంగా మార్చేశాయి. కాని, భార్యపై విపరీతమైన ప్రేమ. చుట్టూ ఇంత నెగటివిటీ మధ్య తానో పాజిటివ్ వైబ్రేషన్ .ఎందుకో తాను చేస్తున్న ఉద్యోగం గుర్తొచ్చింది. అది జాబ్ కాదు, అతని ఎమోషన్స్‌ని విచ్ఛిన్నం చేసిన న్యూక్లియర్ బాంబ్. ఆ వృత్తి ఎందుకు ఎంచుకున్నానా అనే బాధ తనని ప్రతిక్షణం వెంటాడుతూనే ఉంది.
సీతారామారావు సీక్రెట్ ఏజెన్సీలో పని చేస్తుంటాడు. సీక్రెట్ ఏజెన్సీ అనగానే ఏదేదో ఊహించుకోవద్దు. అందులో అంతా జేమ్స్‌బాండ్స్‌లా సూటూ కోటూ వేసుకొని, స్టైల్‌గా ఇన్వెస్టిగేషన్ చేసే ఉద్యోగులే ఉండరు. గప్‌చుప్‌గా వాళ్లకు సహాయం చేసే సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఉంటారు. సీతారామారావు కూడా అంతే! తను బగ్ తయారు చేయడంలో స్పెషలిస్టు. చిన్న చిన్న మైక్రో కెమెరాలూ, స్పీకర్లూ అమర్చడం తన పని. పెద్ద పెద్ద ఆఫీసర్లు, రాజకీయ నాయకులు, సెలబ్రెటీల కదలికలపై అనుమానం వచ్చినప్పుడు సీతారామారావు బగ్స్ అమర్చి వాళ్ల బండారాన్ని బయటపెడుతుంటాడు.
రిస్ట్ వాచ్, ఫ్లవర్ వాజ్, చొక్కా గుండీ, రాళ్ల ఉంగరాలు, కూలింగ్ గ్లాసెస్– అన్నిట్లోనూ కెమెరాలే! వందలమంది నిజ స్వరూపాల్ని లోకానికి చూపించడంలోని అదృశ్య హస్తం సీతారామారావు. లేచి కిటికీ తలుపు మెల్లగా తీశాడు. సిగరెట్ వెలిగించి, ఆ పొగల మధ్య బయట ప్రపంచాన్ని చూశాడు. మనుషులు నవ్వుతూ పలకరించుకుంటున్నారు.
ప్రేమతో మాట్లాడుకుంటున్నారు. ఆ నవ్వులు, ప్రేమలూ అన్నీ అవసరాల కోసమే! ఒక్కొక్కరికీ ఒక్కో సీక్రెట్ కెమెరా అమరిస్తే, వాళ్ల వికృత రూపాలు బయట పడతాయి. ఎందుకీ నటన? ఎవరి కోసం? సీతారామారావు మనసులో ఎప్పటి నుంచో నాటుకున్న ప్రశ్నలు ఇవి. వాటికి ఇంత వరకూ సమాధానం దొరకలేదు.టింగ్...సెల్‌ఫోన్ లో మెసేజ్ మోగింది.‘ఒకరి బుగ్గమీద పుట్టుమచ్చ పెట్టాలి. ఆఫీస్‌కు త్వరగా వచ్చేయ్’ తన పై ఆఫీసరు నుంచి సందేశం.‘బుగ్గమీద పుట్టుమచ్చ’– డిపార్ట్‌మెంట్ కోడ్ భాష. అంటే, ఎవరికో బగ్ పెట్టాలన్నమాట! ఈసారి ఎవరి నగ్నత్వం చూడాల్సివస్తుందో? కళ్లకు ఏవగింపు వచ్చింది.
ఆఫీసరుకు ఫోన్ చేశాడు.‘హలో..’‘మెసేజ్ చూశా’‘ఇంకేం త్వరగా వచ్చేయ్. బోలెడు పని ఉంది. ఈ ఆపరేషన్ మనకు చాలా ఇంపార్టెంట్’.‘నా ప్రమోషన్ సంగతి ఏం చేశారు? ఈ ఉద్యోగం చేయలేకపోతున్నా. కనీసం నా భార్యకు కూడా నేనేం చేస్తున్నానో తెలీదు’.‘చూడు సీతా! ఈ డిపార్ట్‌మెంట్‌లో నీలాంటి సిన్సియర్ ఉద్యోగిని నేనింత వరకూ చూళ్లేదు. పైగా బగ్స్ పెట్టడం నీకు తప్ప ఇంకెవ్వరికీ చేతకాదు. గొడ్డులా కష్టపడతావ్. నీ వల్ల పెద్ద పెద్ద తిమింగలాలనే పట్టాం. నీకు కాకపోతే ఎవరికిస్తాం ప్రమోషన్ . ముందు ఆఫీసుకు బయల్దేరు. నువ్వు వచ్చేలోగా నీ ప్రమోషన్ సంగతి తేల్చేస్తా. క్విక్..’.
ఫోన్ కట్ అయ్యింది.ఆరయ్యింది. అలారం మోగింది. శాంత బద్ధకంగా ఒళ్లు విరుచుకుంటూ కళ్లు తెరిచింది.‘మీరెప్పుడు లేచారు?’‘ఇప్పుడే.. పది నిమిషాలైంది.’‘నన్నూ లేపొచ్చు కదా.. కాఫీ ఇచ్చేదాన్ని’‘పర్వాలేదు. నిద్ర సరిపోలేనట్టుంది. ఇంకాసేపు పడుకో!’‘లేదు.. శుక్రవారం కదా, గుడికెళ్లాలి. మీరూ వస్తారా?’‘నువ్వెళ్లు. నేను ఆఫీసుకు వెళ్లాలి. అర్జంటు పని పడింది.’
‘ఆ.. ఆఫీసు.. పొద్దస్తమానూ ఆఫీసే. పెళ్లయి ఇంతకాలమైంది. ఏం ఉద్యోగం వెలగబెడుతున్నారో అర్థం కాదు. అప్పుడప్పుడూ మీరు నక్సలైటో, టెర్రరిస్టో అని అనుమానం కూడా వేస్తుంటుంది. ఆ కోడ్ భాషలూ మీరూనూ.. ఒక్క ముక్క కూడా బుర్రకెక్కి చావదు.’
శాంత విసుక్కుంటోంది. ఏవేవో మాట్లాడుతోంది. సీతారామారావు మనసుకు పట్టడం లేదు. ఈసారి ఎవరికి బగ్ పెట్టాలి? ఎలా పెట్టాలి? ఇవే ఆలోచనలు. సగం కాలిన సిగరెట్ నడుం విరగ్గొట్టుకొంటూ యాష్ ట్రేలో పడింది.
ఆఫీసులో అడుగు పెట్టగానే ఒకటే హడావుడి. బొకేలు, కేకులు, స్వీట్లూ, కంగ్రాచ్యులేషన్సూ, థ్యాంక్యూలూ. ఎందుకంటే... ప్రమోషన్ వచ్చింది. తనక్కాదు. తన కొలీగ్ ఉమా మహేశ్వరరావుకి.‘ఏంటి సార్ ఇది..’‘ఏమైంది’‘ప్రమోషన్ అన్నారు..’‘ఓ అదా.. ఉమ బ్యాక్‌గ్రౌండ్ తెలుసు కదా. రికమెండేషన్ గట్టిగా ఉంది. అందుకే ఈసారికి తనకు ఇచ్చేశాం.
నెక్ట్స్ టైమ్ నువ్వే లే’‘ఇలా ఎన్నిసార్లు మోసపోవాలి..’‘ఏంటి సీతా? మరీ ఇంత ఎమోషనల్ అయిపోతే ఎలా? డిపార్ట్‌మెంట్ అన్నాక ఇలాంటివి మామూలే. చెప్పా కదా, హై రికమెండేషన్ అని. మళ్లీ కలుద్దాం. అవతల చాలా పని వుంది. ఆ.. అన్నట్టు మర్చిపోయా. సాయంత్రం తాజ్ బంజారాలో ఉమకి పార్టీ ఇస్తున్నాం. నువ్వు తప్పకుండా రావాలి’.ఆఫీసరు వెళ్లిపోయాడు. ఆ క్యాబి¯Œ లో సీత ఒంటరిగా మిగిలిపోయాడు. మామూలుగా అయితే ఆ మాటలకు సీతారామారావు గుండెలు బద్దలైపోవాలి. కోపం, ఉక్రోషం తన్నుకు రావాలి. కాని, ఈ సమాజం గురించి, మనుషుల గురించి తనకు అందరికంటే కాస్త ఎక్కువ తెలుసు. అందుకే ఎలాంటి ఫీలింగ్ లేదు. అగ్గిపుల్ల భగ్గుమంది. సిగరెట్ తన ఒళ్లు కాల్చుకుంటూ పొగలు కక్కింది.
∙∙
తాజ్ బంజారా– కొలీగ్స్ అందరి చేతుల్లోనూ గ్లాసులు ఘల్లుమంటున్నాయి. వాటికి పోటీ పడుతూ ఉమా మహేశ్వరరావు మొహం వెలిగిపోతోంది. ఎవరో బాస్‌కు మైక్ ఇచ్చారు.‘హలో.. హలో... అటెన్షన్ ఎవ్రీబడీ..’అందరి కళ్లూ అటు వైపు తిరిగాయి.‘మనందరి తరపున ఉమకు కంగ్రాచ్యులేషన్స్. తన హార్డ్ వర్క్‌కి, డెడికేషన్ కి దక్కిన గుర్తింపు ఇది. అసలు ఉమానే లేకపోతే మనం ఇన్ని కేసులు సాల్వ్ చేసేవాళ్లం కాదు. బ్ల... బ్ల... బ్ల...’అందరూ చప్పట్లు కొడుతున్నారు. మైకు చేతులు మారుతోంది. కాని, మాటలే మారడం లేదు.‘ఉమా మహేశ్వరరావు అంత వర్క్‌హాలిక్‌ను నేను ఎక్కడా చూళ్లేదు’ ఎవరో పొగుడుతున్నారు.‘ఉమకు ఈ ప్రమోషన్ చాలా తక్కువ. రాష్ట్రపతి అవార్డు ఇచ్చినా తప్పులేదు’ తాగిన మైకంలో ఒకరి పిచ్చి వాగుడు.అటు తిరిగి, ఇటు తిరిగి మైకు సీత చేతికి వచ్చింది.
సీత ఏం మాట్లాడతాడో అని అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. సీత మైకు తీసుకొన్నాడు.‘నేను పెద్దగా మాట్లాడనని మీకు తెలుసు. అందుకే నా భావాల్ని విజువల్స్ రూపంలో తీసుకొచ్చా’.మళ్లీ చప్పట్లు.‘ఈ ఆలోచన నాకెందుకు రాలేదబ్బా’ బాస్ ఫీలయ్యాడు. కళ్లన్నీ తెరపైకి మళ్లాయి. ఏవీ ప్లే అయ్యింది.ఉమా మహేశ్వరరావు వస్తాడనుకుంటే స్క్రీన్ పైకి బాస్ వచ్చాడు.‘ఈ ఉమగాడు ఉన్నాడు చూశారా? వీడికి పని చేయడం చేతకాదు. ఎప్పుడు చూడూ ఆ టైపిస్టు ముందు కూర్చుని కుళ్లు జోకులు వేస్తుంటాడు..’ఉమ గురించి బాస్ ఎవరితోనో మాట్లాడుతుంటే సీత క్యాప్చర్ చేసిన వీడియో అది. బాస్ సీత వైపు గుర్రుగా చూస్తున్నాడు. ఉమ మొహం మాడిపోయింది. కొలీగ్స్ అంతా ఘొల్లున నవ్వారు.
‘నాకే బగ్ పెడతావా రాస్కెల్. నీ అంతు చూస్తా’ బాసు చేతిలోని గ్లాసు భళ్లుమంది. వెంటనే మరో విజువల్.‘రికమెండేషన్ తో ప్రమోషన్ తెచ్చుకోవడం కూడా గొప్పే! ఈ ప్రమోషన్ కోసం ఉమ ఎవడెవడి కాళ్లు పట్టుకొన్నాడో, ఎవడెవడి ... (అక్కడో బూతు మాట) నాకు తెలీదా’ ఇందాక రాష్ట్రపతి అవార్డు ఇవ్వాలని మైకులో గొంతుచించుకొన్న అతగాడి నిజ ‘స్వరం’.‘ఏంట్రా.. పిచ్చి పిచ్చిగా ఉందా? మా మాటలన్నీ దొంగచాటుగా రికార్డ్ చేస్తావా? నీ అంతు చూస్తా’ ఊగుతూనే సీతపైకి వచ్చేశాడు.తరవాత ఎవరి బండారం బయట పడుతుందో అని మిగిలిన వాళ్లంతా ఆత్రంగా తెరని మింగేసేలా చూస్తున్నారు.‘ఉమ పైకి పోజులు కొడతాడు కానీ, తేడాగాడండీ’,
‘బంజారాహిల్స్‌లో వీడికి సెకండ్ సెటప్ ఉంది తెల్సా’,‘అసలు వీడు ఫేక్ సర్టిఫికెట్‌లతో ఉద్యోగం సంపాదించాడని నా డౌటు’ఒకొక్కరి మెదడులోంచి ఉమ బట్టలిప్పుకొని బయటకు వస్తున్నాడు. అందరూ తెల్లమొహాలు వేసేశారు. ఉమ తాజ్ బంజారా వదిలేసి చాలా సేపయ్యింది.‘సీతా.. ఆఫీసు పరువు మొత్తం గంగపాలు చేశావ్.. ఏంటిదంతా’ ఎవరో అరుస్తున్నారు.‘ఆపరేషన్ బుగ్గ మీద పుట్టుమచ్చ’ ఎగతాళిగా నవ్వాడు సీతా రామారావు.ఆ కోపంలో ఎవరో సీత చంప ఛెళ్లుమనిపించారు. బాస్ ఓ పిడిగుద్దు విసిరాడు. ఆ మందంతా మూకుమ్మడిగా సీతారామారావు మీద పడిపోయింది. తొక్కిసలాటలో సీత చొక్కా చిరిగింది. కళ్లజోడు కిందపడి ఒంటికాలిదయ్యింది. పెదవి చిట్లి రక్తం కారుతోంది. పడుతూ, లేస్తూ, ఒగరుస్తూ మళ్లీ మైకు అందుకొన్నాడు.
‘ఇవీ ఫ్రెండ్స్ మనందరి అసలు స్వరూపాలు. ఎవరూ ఎవరితోనూ నీతిగా నిజాయితీగా ఉండడం లేదు. అలాంటి మనమంతా కలిసి మరొకరి కుళ్లుని తోడుతున్నాం.. షేమ్ షేమ్..’ సీత మాటలకు అందరి మైకం వదిలిపోతోంది.‘ఒరేయ్.. పిచ్చోడా లోకం అంతా ఇలానే ఉందిరా’‘అంటే మేమంతా వెధవలం. నువ్వు పత్తిత్తువా?’‘నీ పెళ్లానికి పెట్టకపోయావా కెమెరా.. ఎవరెవరితో తిరుగుతుందో తెలిసేది’ ఎవడో కారు కూత కూశాడు. మొదటిసారి సీతారామారావుకి నిజమైన కోపం వచ్చింది.
‘ఏం కూశావ్ రా..’ సీత చేయి పైకెత్తాడు. కాని, అప్పటికే నలుగురు కలిసి సీతని వెనక్కి లాగేశారు. కింద పడేసి, కాళ్లతో తన్నుతున్నారు. జరుగుతున్న తతంగం గమనించి హోటల్ మేనేజ్‌మెంట్ అలర్ట్ అయ్యింది. సెక్యురిటీ గార్డులు వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. సీతని ఎవరో లేపి కూర్చోబెట్టారు. ఒకొక్కరుగా ఆ హాలు ఖాళీ చేస్తున్నారంతా. చివరికి సీత ఒక్కడే మిగిలాడు.‘కాస్త మంచి నీళ్లు తాగండి సార్..’ హోటల్ మేనేజర్ వాటర్ బాటిల్ అందించారు.‘ఓ పెగ్ కావాలి.. ఇస్తారా’పెగ్ ఏం ఖర్మ బాటిల్ ఖాళీ అయ్యింది.‘నీ పెళ్లానికి పెట్టకపోయావా బగ్.. ఎవడెవడితో తిరుగుతుందో తెలిసేది’ఈ మాటలే గిర్రున తన చుట్టూ తిరుగుతున్నాయి.‘నా శాంత తప్పు చేస్తుందా.. ఇంపాజిబుల్’ ఖాళీ బాటిల్ నేలనేసి కొట్టాడు సీత.
‘నా శాంత తప్పు చేస్తుందా.. ఇంపాజిబుల్’ సీత తన డైరీలో ఆ రోజు రాసుకున్న చివరి వాక్యం. డైరీ తనకు ఓ స్వాంతన.ఈ ప్రపంచంలో తన భార్య తరవాత తనకు అంత నిజాయితీగా కనిపించేది ఆ డైరీనే.శాంత వంక చూశాడు. ఎప్పటిలానే చాలా ప్రశాంత వదనంతో తనని చూస్తోంది. ఆ రోజు చాలాసార్లు దగ్గరకు వచ్చి లాలించింది.‘ఏంటండీ.. ఎప్పుడూ లేనంత డల్‌గా కనిపిస్తున్నారు. ఆఫీసులో ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా..’‘కాఫీ పెట్టనా స్ట్రాంగ్‌గా’‘మీకు ఇష్టమైన చిక్కుడుకాయ కూర చేయనా’టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఆ కేరింగ్, ఆ ప్రేమ... సీతని ఇంకా ఇంకా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.‘మనం జీవితంలో ఇంకా స్థిరపడలేదు, అప్పటి వరకూ పిల్లలొద్దు’ అంటే ఆగిపోయింది.
‘నేను చేస్తున్న ఉద్యోగం ఏమిటన్నది నేను చెప్పేంత వరకూ అడక్కు’ అంటే ఆ మాటకు కట్టుబడిపోయింది.తనకు షాపింగులు లేవు. సినిమాలు షికార్లు లేవు. ఓ సగటు భార్య హక్కులన్నీ ఉద్యోగం పేరుతో సీత ఏనాడో కాలరాసేశాడు. అయినా భరించింది. అలాంటి శాంత తప్పు చేయడం ఏమిటి? నెవ్వర్.కాని పార్టీలో జరిగినదంతా కళ్ల ముందు కదులుతోంది. కొలీగ్స్ అన్న మాటలే తనని బాగా డిస్ట్రబ్ చేస్తున్నాయి.‘ప్రతీ నవ్వులోనూ, ప్రేమలోనూ కల్మషమే అని నమ్మావుగా. ఇప్పుడు నీ భార్యలో నీకు నిజాయతీ మాత్రమే కనిపిస్తోందా? తనని వెంటాడితే, తన తప్పులన్నీ తెలిసిపోతే, నీ నమ్మకం వమ్ము అయిపోతుందని భయమా. ఇప్పుడు పెట్టి చూడు నీ భార్య బుగ్గపై పుట్టుమచ్చ’ అంతరాత్మ వికృతంగా నవ్వుతోంది.
ఇప్పుడు సీత ముందున్న మార్గాలు రెండే. ఒకటి అంతరాత్మని ఎదిరించి భార్యని గుడ్డిగా నమ్మడం. లేదంటే... శల్య పరీక్ష చేసి, తన భార్య గుణవంతురాలే అని అంతరాత్మకు రుజువు చేయడం. ఎందుకో రెండో మార్గమే బెటర్ అనిపించింది. ఆపరేషన్ మొదలైంది.
‘ఆఫీసు పనిమీద అర్జెంటుగా ఢిల్లీ వెళ్తున్నా. మూడ్రోజుల వరకూ రాను. ఈలోగా ఫోన్లు కూడా ఉండవు. సరేనా..’శాంతని అబద్ధాలతో బుజ్జగించి అదే ఊర్లోని ఓ థర్డ్ క్లాస్ లాడ్జిలో దిగబడ్డాడు సీత.అప్పటికే ఇంట్లో చాలా చిన్న చిన్న సీక్రెట్ కెమెరాలు అమర్చాడు. హాల్‌లో, బెడ్ రూమ్‌లో, మేడ మీద, వంటింట్లో, ఆఖరికి బాత్‌రూమ్‌లో కూడా. ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ మినిట్ టూ మినిట్ ఆ లాడ్జ్‌లో కూర్చుని లాప్‌టాప్ ద్వారా గమనిస్తూనే ఉన్నాడు.
వంటింటికీ, పూజగదికీ సగం రోజు కేటాయిస్తోంది శాంత. టీవీ చూడడం, పడుకోవడం.. ఇదే దినచర్య.మొదటిరోజు చాలా భారంగా గడిచింది. రెండోరోజు తనపై తనకే కోపం వచ్చింది.‘ఇక చాల్లే వెళ్లిపోదాం’ అంటూ మనసు ఆరాట పడుతోంటే, ‘ఇంకెంత? ఒక్క రోజు ఆగొచ్చు కదా’ అంటూ అంతరాత్మ అడ్డుపడుతోంది.మూడోరోజు క్షణాలు యుగాల్లా దొర్లుతున్నాయి. తెల్లారితే ఇంటికి వెళ్లిపోవాలి. శాంతకు ‘సారీ’ చెప్పాలి. చెప్తాడు సరే, ‘ఎందుకు?’ అని అడిగితే, తన దగ్గర సమాధానం ఉంటుందా? కనీసం దగ్గరకు తీసుకొని గుండెకు హత్తుకోవాలి. కనీసం అలాగైనా తన గిల్టీ ఫీలింగ్ కాస్త తగ్గుతుంది. చాలారోజుల తరవాత ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు.
ఆ రోజు మామూలుగా తెల్లారింది. పక్క మీద నుంచి హుషారుగా లేచాడు సీత. రెండంటే రెండు నిమిషాల్లో రెడీ అయిపోయాడు. ఇంటికి వెళ్లిపోవాలన్న ఆత్రంతో హడావుడిగా బట్టలు సర్దుకొన్నాడు. లాప్‌టాప్ క్లోజ్ చేసి, బ్యాగ్‌లో వేసుకుంటున్నప్పుడు, అంతరాత్మ ‘ఆగు...’ అంటూ బ్రేకేసింది.‘నీ ఉద్యోగ ధర్మం నువ్వు సక్రమంగానే నిర్వర్తించావా..’ అంటూ ప్రశ్నించింది.‘తప్పు జరగడానికి, దొంగ దొరకడానికి ఒక్క క్షణం చాలు.. నువ్వేమో రాత్రంతా ఆదమరచి పడుకున్నావు’ అంటూ ఇన్వెస్టిగేషన్ క్లాసుల్లో తాను నేర్చుకొన్న పాఠాలు తనని మళ్లీ అలర్ట్ చేశాయి.
ఇష్టం లేకుండానే లాప్‌టాప్ తెరిచాడు. రాత్రి ఫుటేజీ ఒక్కసారి రివైండ్ చేశాడు. క్షణాలు భారంగా గడుస్తున్నాయి.‘ఏ ఘోరం చూడకుండా కాపాడు దేవుడా’ ఎప్పుడూ నమ్మని దేవుడ్ని తొలిసారి మనసులోనే దండం పెట్టుకున్నాడు. కాని, దేవుడు మొర ఆలకించలేదు. రివెంజ్ తీర్చుకున్నాడు.తానెప్పటికీ చూడలేననుకున్న దృశ్యం ఒకటి కళ్ల ముందు ఆవిష్కృతమైంది.‘నీ భార్య ఎవడితో రంకు వెలగబెడుతుందో నీకు తెలుసా’ అనే ప్రశ్నకు దొరికిన సమాధానం అది.‘నీ పెళ్లానికి పెట్టకపోయావా కెమెరా’ అనే సవాలుకు పర్యావసానం అది.అవకాశం లేక కొంతమంది మంచివాళ్లుగా మిగిలిపోతారు అని తాను నమ్మిన సిద్ధాంతానికి మరో నిలువెత్తు సాక్ష్యం అది.‘శాంతా...’ఒక్కసారిగా అరిచాడు.సీత మనసు ఆకలిగా ఉన్న నాలుగు కుక్కలకు వీధిలో దొరికిన ఒంటరి విస్తరాకైంది.
‘శాంతని చంపాలి’ ఇదే సీతారామారావు మిషన్ .తన పరిచయాల్ని వాడుకొని ఓ పిస్తోల్ తీసుకొన్నాడు. శాంత మరణానికి ముహూర్తం నిర్ణయించాడు. మరో రెండు రోజుల్లో శాంత పుట్టినరోజు. ఆ రోజే చంపేయాలి. ప్రతిరోజూ రాత్రి సరిగ్గా 12 గంటలకు పవర్ ఒక్కసారి ఆఫ్ అయి, ఆన్ అవ్వడం ఆ వీధిలో చాలా సాధారణంగా జరిగే విషయం. సరిగ్గా అప్పుడే శాంత నుదుటిమీద పాయింట్ బ్లాంక్‌లో పిస్తోల్ పేలాలి. అంతే. తన మనసులో శాంతపై పేరుకుపోయిన కోపం అంతా చల్లారిపోతుంది. తరవాత తాను ఏమైపోయినా పర్వాలేదు. అన్యమస్కంగానే ఇంటికి వెళ్లాడు.
‘మూడ్రోజుల్లో ఇంత చిక్కిపోయారేంటండీ’‘ఈసారి మీరెక్కడికి వెళ్లినా నన్నూ తీసుకెళ్లండి. ఒంటరిగా ఉండడం నా వల్ల కాదు బాబోయ్’ శాంత నటన మొదలైంది.‘రేపే నా పుట్టిన రోజు.. ఏం గిఫ్ట్ ఇస్తున్నారు’ అంటూ పదే పదే అడుగుతుంటే,‘నీ చావు..’ అని గట్టిగా చెప్పాలనిపిస్తోంది. కాని, దాన్ని పెదవి అంచులపై అదిమి పెట్టుకొంటున్నాడు.టేబుల్ సొరుగులో ఉన్న పిస్తోల్ పదే పదే ‘నన్ను వాడేయ్.. వాడేయ్’ అంటూ గోల చేస్తోంది.సీత మనిషి మనిషిలా లేడు. ఏవో ఆలోచనలు వేధిస్తున్నాయి. ఎప్పుడూ డైరీలో ఏవో రాసుకొంటూ, గాల్లోకి పిచ్చి చూపులు విసిరేస్తున్నాడు.
రాత్రయ్యింది. శాంత తలనొప్పంటూ పెందలాడే పడుకుంది. అలవాటు ప్రకారం కాసేపు డైరీ రాసుకొని, తానూ పక్కమీద వాలాడు. సమయం గడుస్తోంది.10 అయ్యింది.గడియారం 11వ గంట కొట్టింది.11.30 అయ్యింది.సరిగ్గా 12 గంటలకు కరెంట్ పోయింది. ప్లాన్ ప్రకారం ఆ గదిలో పిస్తోల్ శబ్దం వినించింది. ఓ చావుకేక గాల్లో కలిసిపోయింది. కరెంట్ వచ్చింది.కాని, చచ్చింది శాంత కాదు– సీత.చంపింది సీత కాదు– శాంత.
గోడ మీద రక్తపు మరక. దుప్పటంతా ఎరుపు రంగు పులుముకుంది. పక్క మీద భర్త శవం. గదంతా నిశ్శబ్దం. శాంత కుర్చీలో కూర్చుని నిర్జీవంగా పడున్న భర్త వంక కళ్లార్పకుండా చూస్తోంది. చేతిలో పిస్తోల్ అలానే ఉంది.‘ఇందులో నా తప్పేముంది? స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ . నేను బతకాలంటే మీరు చావాలి. నా దగ్గర ఇంకో మార్గం లేదు’ కళ్లతోనే భర్తతో మాట్లాడుతోంది.టక్.. టక్.. టక్ గడియారం చప్పుడు.
శాంత తల తిప్పింది. డైరీ కనిపించింది. దాన్ని చేతుల్లోకి తీసుకొంది.‘మీ గురించి నాతో ఒక్కసారైనా చెప్పారా? ఈ డైరీ చెప్పింది. ఇతరుల డైరీ చదవడం తప్పే. కాని, మీరు నా ఇతరుల జాబితాలో లేరు’ నవ్వూ, ఏడుపూ కలగలిపిన భావోద్వేగం శాంతలో.‘ఈ పేజీలూ అక్షరాలూ నాతో మాట్లాడాయి. చస్తావా చంపుతావా అని బెదిరించాయి. ఏం చేయమంటారు’ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూనే ఉంది.సడన్ గా శాంత కళ్లు డైరీలోని ఆఖరి పేజీ దగ్గర ఆగాయి. అంతకు ముందే తన భర్త రాసిన వాక్యాలు పలకరిస్తున్నాయి. ఈ డైరీలో శాంత చదవని పేజీ అదొక్కటే. శాంత కళ్లు ఆ అక్షరాల వెంట పరుగులు పెట్టాయి.
‘సీక్రెట్ కెమెరా పెడితే భగవంతుడు కూడా తప్పు చేస్తూ దొరికి పోతాడని ఓ రోజు నా మిత్రుడు చెప్పాడు. అది నిజమే అని ఈరోజు అనిపిస్తోంది. నా కొలీగ్స్‌కి బగ్ పెట్టాను. వాళ్ల నిజ స్వరూపం వెలుగులోకి వచ్చింది. నా భార్యని రహస్యంగా వాచ్ చేశా. తన బలహీనత బయటపడింది. మరి నేనేం చేశాను? నేను శీలవంతుడ్నా? అందమైన అమ్మాయి కనిపిస్తే నా మనసు ఎన్ని వికృత చేష్టలు చేస్తుందో నాకు మాత్రమే తెలుసు. ఆ మానసిక వ్యభిచారం బయట పెట్టే కెమెరా ఎక్కడుంది? నేనేంటో తెలుసుకోవడానికి నాకు ప్రత్యేకంగా బగ్ అవసరం లేదే? అద్దం ముందు నిలబడితే నా అంతరాత్మ నన్ను కడిగేస్తుంది. నా తప్పుల తక్కెడ వేస్తుంది. నా నిజాయితీ, ఆత్మసాక్షి దాని ముందు తూగగలవా? ఈ ప్రపంచంలో అందరూ గురువింద గింజలే.
తప్పు చేయని వాడికే ఎదుటి వాళ్ల తప్పుల్ని వేలెత్తి చూపించే అవకాశం ఉంటుంది. నా భార్యని నేనెందుకు చంపాలి? ఆ హక్కు నాకు లేదు. వీలైతే మరింత ప్రేమిస్తా. రేపే ఉద్యోగానికి రాజీనామా చేస్తా. అదే నాకు నేను ఇచ్చుకొనే క్షమాభిక్ష..’తరువాత కూడా ఏదో రాసి ఉంది. అప్పటికే శాంత కళ్లని కన్నీటి పొరలు కమ్మేశాయి. ఇంకో అక్షరం చదివే ధైర్యం, ఇంకో నిమిషం బతికే అర్హత తనకు లేవనిపించాయి. భర్త వంక ఈసారి ప్రేమతో చూసింది. కళ్లతోనే క్షమాపణ అడిగింది. పిస్తోల్ నుదుటి మీద పెట్టుకొంది. అది ఆమె చివరి వీడ్కోలు.ఆ గదిలో మరో బుల్లెట్ పేలిన శబ్దం.