
రావణుడు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి వరాలు పొంది, త్రికూట పర్వతానికి వచ్చాడు.ఈ సంగతి తెలిసి, రావణుడి మాతామహుడు సుమాలి తన మంత్రులైన మారీచుడు, సుబాహుడు, ప్రహస్తుడు, మహోదరుడు, విరూపాక్షుడు సహా తన అనుచరులతో కలసి రావణుడిని కలుసుకోవడానికి వచ్చాడు.‘నాయనా! నువ్వు బ్రహ్మదేవుడి నుంచి ఉత్తమ వరాలు పొందావు. విష్ణువు వలన భయం కారణంగా మేమంతా లంకను విడిచి వెళ్లి, రసాతలంలో తలదాచుకుంటూ వస్తున్నాం. లంకానగరం మనది. ఒకప్పుడు రాక్షసులు నివసించిన నగరం అది.
ఇప్పుడు నీ సోదరుడు, బుద్ధిమంతుడు అయిన కుబేరుడు లంకను తన నివాసంగా చేసుకున్నాడు. నువ్వు బుద్ధిబలంతో గాని, సామ దాన భేద దండోపాయాలతో గాని తిరిగి లంకను స్వాధీనం చేసుకున్నట్లయితే, మంచి పని చేసినట్లవుతుంది. నువ్వు లంకకు అధిపతివి కాగలవు. నువ్వు మన రాక్షసులందరికీ ప్రభువువు కాగలవు’ అని అన్నాడు.‘తాతా! కుబేరుడు మాకు అగ్రజుడు, పూజ్యుడు. నువ్విలా మాట్లాడటం తగదు’ అన్నాడు రావణుడు.ప్రహస్తుడు కలగజేసుకుని, ‘రావణా! నీ మాటలు వీరోచితంగా లేవు. శూరులకు భ్రాతృప్రేమ ఉండరాదు. తోబుట్టువులైన అదితి, దితి సౌందర్యవతులు. వారిద్దరూ కశ్యప ప్రజాపతి భార్యలు. అదితి ముల్లోకాలకు ప్రభువులైన దేవతలను, దితి దైత్యులను కన్నారు.
సాగర పర్వత వన సమన్వితమైన ఈ భూలోకంపై దైత్యులు అధికారం కలిగినవారై ఉండేవారు. విష్ణువు యుద్ధాలలో దైత్యులెందరినో చంపి, ముల్లోకాలను దేవతల వశం చేశాడు. సోదరులతో విరోధం పెట్టుకోవడం అనే విపరీతాన్ని నువ్వొక్కడివే చేయడం లేదు. పూర్వం సురాసురులు ఇదే పని చేశారు. కాబట్టి నేను చెప్పినట్లు చేశావంటే, లంకాధిపత్యమే కాదు, నీకు త్రిలోకాధిపత్యం కూడా లభించగలదు’ అన్నాడు.ప్రహస్తుడి మాటలతో రావణుడు ఆలోచనలో పడ్డాడు.కాసేపు ఆలోచించాక, ‘సరే! అలాగే చేస్తాను’ అని పలికాడు. రావణుడి మాటలతో సుమాలి, అతడి మంత్రులు, అనుచరులు ఆనందంతో తబ్బిబ్బయ్యారు.మాతామహుడితోను, అతడి మంత్రులతోను చర్చలు జరిపిన తర్వాత కుబేరుడి వద్దకు మాటకారి అయిన ప్రహస్తుడిని రాయబారిగా పంపాలని రావణుడు నిర్ణయించాడు.
‘‘ప్రహస్తా! నువ్వు లంకకు వెళ్లు. ధనాధిపతి అయిన కుబేరుడితో సామ మార్గంలో ఇలా చెప్పు’ అని తన సందేశాన్ని ఇలా చెప్పాడు: ‘సౌమ్యుడైన కుబేరా! మహాత్ములైన రాక్షసులకు చెందిన లంకా నగరంలో నువ్వు నివాసం ఏర్పరచుకున్నావు. ఇది నీకు తగదు. అందువల్ల ఇప్పుడు లంకను తిరిగి మాకు ఇచ్చేసినట్లయితే, నాకు సంతోషాన్ని కలిగినవాడివి, ధర్మాన్ని పాలించిన వాడివి కాగలవు’ అని ఆదేశించాడు.రావణుడి ఆదేశంతో ప్రహస్తుడు లంకకు బయలుదేరాడు.
కుబేరుడి మందిరానికి చేరుకుని, అతడితో ‘బుద్ధిశాలివైన కుబేరా! నీ సోదరుడైన దశకంఠుడు రావణుడు నన్ను నీ వద్దకు పంపాడు. రావణుడి ఆజ్ఞపై నేను చెబుతున్న మాటలు విను– పూర్వం ఈ లంకానగరాన్ని సుమాలి మొదలైన రాక్షసులు ఏలుకున్నారు. అందువల్ల సౌమ్యంగా అర్థిస్తున్న నీ సోదరుడైన రావణుడికి ఈ లంకను అప్పగించు’ అని చెప్పాడు.
‘ప్రహస్తా! రాక్షసులెవరూ లేని ఈ లంకను నా తండ్రి నాకు అప్పగించాడు. ప్రజలకు తగిన దాన గౌరవాలు కల్పించడం ద్వారా దీనిని నేను నివాసయోగ్యం చేశాను. నువ్వు వెళ్లి రావణుడితో ఇలా చెప్పు’ అని– ‘రావణా! ఈ లంకానగరం, ఈ రాజ్యం నీకు చెందినదే! ఏ బాధలు లేకుండా రాజ్యాన్ని అనుభవించు. నా రాజ్యాన్ని, నా ధనాన్ని నీతో ప్రత్యేకంగా పంచుకోవలసిన పనిలేదు. ఇవి మనిద్దరమూ కలసి అనుభవించవలసినవి’ అని చెప్పి ప్రహస్తుడిని సాగనంపాడు.తర్వాత కుబేరుడు తన తండ్రి విశ్రవసుడి వద్దకు వెళ్లాడు. లంకను అప్పగించాలంటూ రావణుడు తన వద్దకు దూతను పంపిన విషయం చెప్పి, ఇప్పుడు తానేం చేయాలో చెప్పమన్నాడు.
‘కుమారా! రావణుడు ఈ సంగతి నాకు కూడా చెప్పాడు. నేను మందలించాను. అయినా వాడు నా మాట పట్టించుకోవడం లేదు. దుష్టబుద్ధితో లంకను ఆక్రమించుకుంటే నశిస్తావని కూడా వాడికి చాలాసార్లు చెప్పాను. వాడికి మంచిచెడులు తెలియడం లేదు. హితవు వినే పరిస్థితిలో లేడు. కుమారా! ఈ పరిస్థితుల్లో ధర్మసమ్మతం, శ్రేయోదాయకం అయిన మార్గం చెబుతాను విను. నువ్వు నీ అనుచరులతో కలసి లంకను విడిచిపెట్టు. ఉత్తర దిశలో కైలాసపర్వత ప్రాంతంలో ఉత్తమమైన మందాకినీ నది ఉంది. ప్రశాంతమైన ఆ ప్రదేశంలో దేవ గంధర్వ కిన్నెర కింపురుషాలదులు ఆనంద విహారాలు చేస్తుంటారు. అలాంటి మందాకినీ తీరంలో నివాసయోగ్యమైన నగరాన్ని నిర్మించుకో’ అని సలహా ఇచ్చాడు.
తండ్రి సలహాతో కుబేరుడు తన భార్యా పుత్రులతో, అమాత్యులతో, పరిజనంతో రథాది వాహనాలను సిద్ధం చేసుకుని, కైలాసం వైపు ప్రయాణం ప్రారంభించాడు. కుబేరుడు లంకను ఖాళీ చేసేయడంతో ప్రహస్తుడు సంతోషించాడు. వెంటనే రావణుడి వద్దకు వెళ్లి, లంకానగరం ఇప్పుడు శూన్యంగా ఉంది. నువ్వు నీ సోదరులు, అమాత్యులు, పరివారంతో చేరుకుని, లంకను యథేచ్ఛగా అనుభవించవచ్చు’ అని చెప్పాడు.రావణుడు లంకను ఆక్రమించుకుని, రాక్షసుల చేత రాజ్యాభిషిక్తుడయ్యాడు. లంకను విడిచి వెళ్లిన కుబేరుడు కైలాస పర్వతం వద్ద మందాకినీ తీరానికి చేరువలో
అలకాపురి నగరాన్ని నిర్మించుకున్నాడు.
∙సాంఖ్యాయన