
ఒకానొకప్పుడు దేవగురువు బృహస్పతి శిల్పశాస్త్రం, వాస్తుశాస్త్రం, దండనీతి శాస్త్రం, కామశాస్త్రం వంటి లౌకిక శాస్త్రాలను సమగ్రంగా రచించాడు. యోగ్యులు, బుద్ధిమంతులు అయిన శిష్యులకు ఆ శాస్త్రాలను నేర్పించడం ప్రారంభించాడు. దేవగురువును దర్శించుకుందామని ఒకనాడు ఇంద్రుడు ఆయన ఆశ్రమానికి వచ్చాడు. శిష్యులకు ఆయన లౌకిక శాస్త్రాలను నేర్పిస్తుండటం గమనించి ఆశ్చర్యపోయాడు. గురువుకు పాదాభివందనం చేసి, ఆయన చూపిన ఆసనంపై కూర్చున్నాడు.
పాఠం పూర్తయి, శిష్యులంతా వెళ్లిపోయే వరకు ఓపికగా ఉండి, ‘గురువర్యా! మీరేమీ అనుకోనంటే, నాదొక సందేహం. తత్త్వబాహ్యాలైన ఈ శాస్త్రాలను మీరు ఎందుకు రచించారు? మానవులను మరింతగా విషయవాంఛలలో ముంచడానికి తప్ప ఇవెందుకు పనికొస్తాయి? గురువర్యా! తమరేమి ఆశించి ఈ శాస్త్రాలను శిష్యులకు బోధిస్తున్నారో గాని, నాకిది సముచితంగా తోచడం లేదు. ఇందులో ఇంకేమైనా పరమార్థం ఉంటే, అది నేను తెలుసుకోదగినదే అయితే దయచేసి వివరించండి’ అన్నాడు ఇంద్రుడు.ఇంద్రుడి ప్రశ్నలోని ఆందోళనను గుర్తించాడు బృహస్పతి.చిన్నగా నవ్వుతూ, ‘ఇంద్రా! ఇందులోని తత్త్వరహస్యం ఏమిటనేదే కదా నీ సందేహం? చెబుతాను, విను’ అంటూ బృహస్పతి ఇలా చెప్పసాగాడు.
‘నేను రచించి, శిష్యులకు బోధిస్తున్న ఈ శాస్త్రాలన్నీ తత్త్వరహస్యాలే, తత్త్వబోధలే! పారంపర్యంగా ఇవి తత్త్వప్రాప్తికి కావలసిన చిత్తశుద్ధిని కలిగిస్తాయి. నీ సందేహం తొలగిపోవడానికి నీకు సోదాహరణంగా చెబుతాను, శ్రద్ధగా విను. అంతా నీకే అవగతమవుతుంది.
కాంపిల్య నగరంలో విధిజ్ఞుడు అనే శిల్పశాస్త్ర పండితుడు ఉండేవాడు. అతడు శిల్పశాస్త్రంలోనే కాకుండా వాస్తు, జ్యోతిష శాస్త్రాలలో విశేష ప్రతిభాసంపన్నుడు. చాలా నీతిమంతుడు. ఆ నగరంలో ఎవరు ఇల్లు కట్టుకోవాలనుకున్నా, అతడినే పిలిచేవారు. ఆ విధంగా అతడు విశేషంగా ధనం సంపాదించాడు.
అతడిని ఆశ్రయించుకుని చాలామంది ఉపాధి పొందేవారు. వారికి శాస్త్రపరిజ్ఞానం లేదు. వారు విధిజ్ఞుడితో ఉంటూ అతడు చెప్పిన పనులు చేస్తూ, అతడు ఇచ్చే వేతనాలతో బతుకుతూ ఉండేవాళ్లు. తన విద్యతో పుష్కలంగా ధనం సంపాదించిన విధిజ్ఞుడు విరివిగా దానధర్మాలు చేసేవాడు. నగరంలో దేవతాపూజలను ఘనంగా జరిపించేవాడు. అలా నగరంలోని ప్రముఖులు మొదలుకొని సామాన్యుల వరకు అందరికీ ఇష్టుడయ్యాడు. అతడి పేరు ప్రఖ్యాతులు క్రమంగా పొరుగు రాజ్యాలకు పాకాయి.
ఇతర దేశాల రాజులు కూడా విధిజ్ఞుడిని పిలిపించుకుని, అతడి సలహా సూచనలతో భవనాలు, తటాకాలు, దేవాలయాలు నిర్మింపజేసుకుని, అతడికి ఘనంగా పారితోషికం, కానుకలు ఇచ్చి పంపుతుండేవారు. ఆ ధనంతో విధిజ్ఞుడు మరింతగా దాన ధర్మాలు చేసేవాడు. శిల్ప వాస్తు జ్యోతిష శాస్త్రాలలో విశేష ఖ్యాతి పొందిన విధిజ్ఞుడు కొంతకాలానికి ఆయువుతీరి మరణించాడు. చేసిన పుణ్యకర్మల ఫలితంగా అతడు స్వర్గానికి చేరుకుని, అక్కడ సుఖాలను అనుభవించి, కొన్నాళ్లకు మళ్లీ జన్మించాడు.ఈసారి అతడు కాంపిల్య రాజవంశంలో జన్మించి, యుక్తవయసు వచ్చాక పట్టాభిషిక్తుడై రాజయ్యాడు.
రాజుగా అతడు ప్రజారంజకమైన పాలన సాగించేవాడు. సాధు సజ్జనులను ఆదరించేవాడు. రాజ్యంలో అనేక దేవాలయాలను, వాపీ కూప తటాకాదులను నిర్మించి, రాజ్యం నిత్యం సుభిక్షంగా ఉండేలా చూసుకునేవాడు. అసంఖ్యాకంగా యజ్ఞ యాగాదులను నిర్వహించి, విప్రులకు విశేషంగా గోదానాలు, భూదానాలు చేసేవాడు. సుదీర్ఘకాలం రాజుగా పాలించి, పేరు ప్రఖ్యాతులు పొందిన తర్వాత కొన్నాళ్లకు తనువు చాలించాడు. రాజ జన్మలో చేసిన పుణకర్మల ఫలితంగా మళ్లీ స్వర్గానికి చేరుకుని, చాలాకాలం సుఖభోగాలను అనుభవించాడు. పుణ్యఫలం అంతరించాక కొన్నాళ్లకు మళ్లీ భూలోకంలో జన్మించాడు.
ఈసారి అతడు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రుల ఆలనపాలనలో బాల్యం హాయిగా గడిపాడు. ఉపనయనం తర్వాత బ్రహ్మచర్యాశ్రమం స్వీకరించి, గురుకులంలో చేరాడు. గురువుకు శుశ్రూష చేస్తూ, వేద వేదాంగాలను, సకల శాస్త్రాలను క్షుణ్ణంగా అభ్యసించాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత గురుకులవాసం ముగించి, ఇంటికి చేరుకున్నాడు. యోగ్యురాలైన కన్యను పెళ్లాడి గృహస్థాశ్రమం స్వీకరించాడు. గృహస్థాశ్రమంలో నిత్య నైమిత్తిక కార్యాలను నియమం తప్పక నెరవేరుస్తూ, అతిథి అభ్యాగతులను ఆదరించేవాడు. గొప్పగొప్ప వ్రతాలు, పూజలు చేసి, యోగిగా మారి వానప్రస్థం స్వీకరించాడు. వానప్రస్థంలో ఫల కందమూలాదులనే ఆహారంగా స్వీకరిస్తూ, రోజులో అధిక కాలం తపోనిష్ఠలోనే గడిపేవాడు. క్రమంగా సాధనలో పరిపక్వత సాధించి, చివరకు భవబంధాలను విడిచిపెట్టి, సన్యాసాశ్రమం స్వీకరించాడు. సన్యాసాశ్రమంలో కఠోర సాధన సాగిస్తూ, ఆత్మసాక్షాత్కారం పొంది, జీవన్ముక్తుడై, చివరకు విదేహ కైవల్యం సాధించాడు.
ఇంద్రా! విన్నావు కదా! శిల్ప, వాస్తు, జ్యోతిష శాస్త్రాలు విధిజ్ఞుడికి వేర్వేరు జన్మలలో క్రమంగా ఉన్నతి పొందడానికి, చివరకు ముక్తిని పొందడానికి దోహదపడ్డాయి. లౌకిక శాస్త్రాలు మానవులను మాయలో ముంచేస్తాయని భయపడటం నిర్హేతుకం. లౌకిక శాస్త్రాలు మానవుల ఐహిక సుఖాలకే కాదు, ఆముష్మిక ఔన్నత్యానికి కూడా ఉపయోగపడతాయి. శచీపతీ! ఈ లౌకిక శాస్త్రాలన్నీ కలకండ ముక్కల్లాంటివి. తత్త్వోపదేశమనే కషాయాన్ని సులువుగా గ్రోలడానికి అవి ఉపకరిస్తాయి. లౌకిక శాస్త్రాల సహాయం లేకుండా, సామాన్యులు తత్త్వాన్ని సులువుగా గ్రహించలేరు. అయినా, కైవల్యమే ఏ జీవికైనా అంతిమ లక్ష్యం, అదే అంతిమ గమ్యం’ అని చెప్పాడు బృహస్పతి.
∙సాంఖ్యాయన