నిత్యకు పెళ్లి చూపులు. పెళ్లిచూపులు అనగానే సాధారణంగా వయసొచ్చిన ఏ ఆడపిల్ల మొహంలోనైనా పెళ్లి కళ ఉట్టిపడే మెరుపు కనిపిస్తుంది. దానికి భిన్నంగా నిత్య మొహంలో ఏదో టెన్షన్!నిత్య భయాందోళనలకు కారణం వచ్చిన సంబంధం నచ్చకపోవడం కాదు – మొదటిసారి పెళ్లి చూపుల పేరుతో మగపెళ్లివారి ముందు కూర్చోవడం. పెళ్లి వయసు వచ్చిన తర్వాత ఎన్ని సంబంధాలు వచ్చినా, తల్లి తాయారమ్మ వాటిని నిత్య నిర్ణయం వరకు రానివ్వలేదు. అందం, గుణం, చదువు అన్నిటిలోనూ ముందు వరసలో నిలిచే ఒప్పుల కుప్ప నిత్య. అలాంటి నిత్యను పెళ్లి చేసుకోవడానికి ఒక మాదిరి వరుడెవరూ సరిపోడని, నవలా నాయకుడు వంటి వాడు రావాలని తాయారమ్మ దృఢమైన అభిప్రాయం. అందువల్లనే వచ్చిన సంబంధాలన్నీ తాయారమ్మ వడపోతలోనే వీగిపోతున్నాయి. కాని, ఈసారి వచ్చిన జానకి రామయ్య సంబంధం బంగారం లాంటిదని, దీనిని కాదనడం అదృష్ట దేవత తలుపు తడుతుంటే తెరవక పోవడమేనని పెళ్లిళ్ల పేరయ్య మరీ మరీ చెప్పడంతో తాయారమ్మ కొంచెం మెత్తబడింది.
పెళ్లిచూపులు ఏర్పాటు చెయ్యడానికి ఒప్పుకుంది.ఎప్పుడూ యెటువంటి పరీక్షల భయం లేకుండా, నల్లేరు మీద నడకలా ‘బి.టెక్.’ వరకు నిరాటంకంగా ఉత్తీర్ణురాలవుతూ పట్టా తీసుకున్న నిత్యకు పెళ్లి చూపుల పరీక్ష అంటే భయం పట్టుకుంది. తీరా వరుణ్ణి చూసిన తర్వాత తన నిర్ణయం చెప్పడానికి, బాగోగులు చర్చించి సలహాలివ్వడానికి తల్లి, అన్నయ్య మాత్రమే ఉన్నారు. అన్నయ్య చందు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఆఫీసులో అత్యవసరమైన పని తగిలిందనీ, సమయానికి వచ్చేస్తాననీ, ఈలోగా ముహూర్తం ప్రకారం తంతు కానివ్వమనీ ఫోన్ చేశాడు. ఒకవేళ చందు రావడం ఆలస్యమయితే ఈలోగా ఏ మాటా చెప్పమని అవతలి వాళ్లు వొత్తిడి చేస్తే – అమ్మ మాత్రమే గతవుతుంది. కాని అమ్మ ఏ విషయంలోనూ ఓ పట్టాన నిర్ణయం తీసుకోలేని నిత్యశంకితురాలు.
తల్లి ఆమె పెళ్లి విషయంలో తీసుకున్న నిర్ణయానికి యిప్పటికీ బాధపడుతుండడం తనకు తెలుసు. అందువల్ల పూర్తిగా తల్లి మీద ఆధారపడ్డం కంటె మరొకరెవరైనా వుంటే మంచిదని నిత్య చిన్నప్పటి నుంచి తనతో కలిసి చదువుకొన్న సత్యను తోడుగా రమ్మని పిలిచింది. సత్య కుటుంబం వుండేది పక్క వీథిలోనే గనుక ఆమె పిలిచింది తడవుగా వచ్చింది. సత్య కూడా నిత్య ఈడుదే గనుక ఆమెను పెళ్లిచూపుల్లో పక్కన కూర్చోపెట్టుకోవద్దని తాయరమ్మ నిత్యను చాటుకు పిల్చి చెప్పింది. తల్లి ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న నిత్య తనకే విషయంలోనూ సత్య పోటీ కాదని, కొత్తవాళ్ల ముందు తను ‘నెర్వస్’ కాకుండా ఆమె తోడుగా వుంటుందని తన చర్యను సమర్థించుకొంది.
నిత్యతో పోలిస్తే సత్య అంత తెలివైంది కాదు. పరీక్షల్లో మాత్రం యెక్కడా తప్పకుండా తను కూడా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అనిపించుకుంది. సత్య తల్లిదండ్రులిద్దరూ ఒక పేరున్న ప్రైవేట్ హాస్పిటల్ లో పనిచేస్తున్నారు. కాంపౌండర్ గా పనిచేస్తున్న సత్య తండ్రి తాగుడు వ్యసనంతో విధులకు సరిగా హాజరు కాకపోయినా, డాక్టర్ గారు పట్టించుకోరని, నర్స్‌గా మంచి నైపుణ్యం వున్న సత్య తల్లి శకుంతలను మాత్రం ఆయన ప్రత్యేకాభిమానంతో చూస్తారని జనం చెప్పుకుంటారు. ఆ అభిమానానికి అక్రమసంబంధం కూడా కారణమని డాక్టర్ ఆంతరంగికులు చెవులు కొరుక్కుంటారు. నిజానిజాల మాటెలావున్నా సత్య కుటుంబ నేపథ్యం మీద సదభిప్రాయం లేని తాయారమ్మ సత్య తరచుగా తమ యింటికి రావడానికి యిష్టపడదు. చనువు పెరిగితే కొడుకు చందుకు సత్య యెక్కడ వల వేస్తుందోనని కూడా తాయారమ్మ అనుమానం.
సిద్ధాంతిగారు పెట్టిన ముహూర్త సమయానికి వధువును చూపించాలని పెళ్లిళ్ల పేరయ్య అవధాని తొందర పెట్టడంతో ఆ చాదస్తం నచ్చక విసుక్కుంటున్న నిత్యను బతిమాలి మగపెళ్లివారి ముందుకు తీసుకెళ్లింది తాయారమ్మ. నిత్య కోరిక ప్రకారం సత్య కూడా ఆమెకు తోడుగా వెళ్లింది. పెళ్లికూతుర్ని చూడ్డానికి వరుడు జానకిరామయ్య కూడా అతని చిన్నాన్న, పిన్ని మాత్రమే వచ్చారు. తల్లి సూచన మేరకు సంప్రదాయాన్ని పాటిస్తూ తలవంచుకుని కూర్చున్న నిత్యను తలెత్తి వరుణ్ని చూడమన్నట్టు గిల్లి, సైగ చేసింది సత్య. వరుడు జానకి రామయ్య వంక నిత్య ఓరగా చూసింది. డ్రెస్సింగ్ విషయంలో సింపుల్ గా వున్నా, అందమైనవాడే అనుకుంది. మధ్యవర్తి అవధాని ముందుగానే వర్ణించి చెప్పినట్టు లక్షణంగా వున్న నిత్యను చూసి పెళ్లికొడుకు చిన్నాన్న, పిన్ని పెళ్లికొడుకు అభిప్రాయాన్ని ప్రత్యేకంగా అడక్కుండానే తమకు నచ్చినట్టు కళ్లతో వ్యక్తం చేశారు. అదను చూసుకొని అవధాని ఇరుపక్షాలను వుద్దేశించి పరిచయ ప్రసంగం ప్రారంభించాడు.
‘అయ్యా, నేను ముందే మనవి చేసినట్టు వధూవరులు ఒకరికొకరు సరిపోతారు. అమ్మాయిని చూశారు కదా! సాక్షాత్తూ మహాలక్ష్మే. తన చదువు సంధ్యల గురించి, గుణగుణాల గురించి తెలియజేసిన తర్వాతే తమను తీసుకొచ్చాను. ఇక అబ్బాయి పేరుకు తగ్గట్టుగానే అపర శ్రీరామచంద్రుడు. ఈ కాలంలో వుండాల్సిన కుర్రాడు కాదు. పోతే ఇతని చిన్నతనంలోనే తల్లి దండ్రులు గతించడం వల్ల పిన్ని బాబాయిల పెంపకంలో పెరిగాడు. ఇక్కడి చదువులు సరిపోక ఢిల్లీలో వుండి సివిల్ సర్వీసెస్ పరీక్షలకు చదువుతున్నాడట. ఆరోగ్యం దృష్ట్యా వండి పెడుతూ ఆలనా పాలనా చూసేవాళ్లుంటే చదువుమీద దృష్టి పెట్టడానికి వీలుగా వుంటుందని పెళ్లిప్రయత్నాలు ప్రారంభించారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఏ జిల్లా కలెక్టరో అవుతాడు. ఇంతవరకు కల్యాణ ఘడియలు రాకపోవడం వల్ల ఈ సంబంధం మీ వరకు వచ్చింది...!’’
అవధాని చెప్పడం పూర్తికాకుండానే వరుడి బాబాయి శివయ్య కలిగించుకొని వరుడి విషయంలో తమ పాత్ర గురించి తెలియజేశాడు.
‘పూర్వజన్మలో యెంతో పుణ్యం చేసుకుంటే తప్ప మా జానకిరాముడు లాంటి బుద్ధిమంతుడు భర్తగా దొరకడు. మా అన్నయ్యకిచ్చిన మాట ప్రకారం పెంచి పెద్ద చెయ్యడం తప్ప పెళ్లయాక తనమీద మా పెత్తనం కూడా వుండదు. తన తెలివికి, చదువు మీద శ్రద్ధకూ తప్పకుండా కలెక్టరు అవుతాడని అందరూ అంటున్నారు. ఒకవేళ వుద్యోగం లేకపోయినా మా వాడు బతకడానికి లోటులేని ఆస్తి, అతని వాటామీద నేను కూడబెట్టిన డబ్బు వున్నాయి. అందువల్ల కట్నకానుకలు కూడా మేము ఆశించడం లేదు. అమ్మాయి మాకు నచ్చింది. మీరు అమ్మాయిని లోపలకు తీసుకెళ్లి అభిప్రాయం తెలుసుకుంటే నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టుకుందాం...’’
‘‘అమ్మా నిత్యా, అన్నీ విన్నావు కదా. అయినా అబ్బాయితో కూడా మాట్లాడతానంటే లోపలకెళ్లి మాట్లాడుకోవచ్చు. ఉభయులూ చదువుకున్నవాళ్లు గనుక ముందుగా మనసులు విప్పి మాట్లాడుకోవడంలో తప్పు లేదు...’’ అంటూ అవధాని చేసిన ప్రతిపాదనను ఆ అవసరం లేదన్నట్టు యిద్దరూ సున్నితంగా తిరస్కరించారు.నిత్యను లోపలకు తీసుకెళ్లిన తర్వాత ముగ్గరి మధ్య పెళ్లికొడుకు గురించిన చర్చ ప్రారంభమైంది.‘‘పెళ్లి కొడుకు బొత్తిగా నోట్లో నాలుకలేని మెత్తని మనిషిలా వున్నాడు’’ అంటూ ముందుగా తాయారమ్మ అనుమానాన్ని వ్యక్తం చేసింది.
‘‘అవసరం లేనిదే నోరువిప్పని అల్లుడు దొరికితే మీకే మంచిది కదా ఆంటీ. చీటికీ మాటికీ గొంతెమ్మ కోర్కెలు కోరకుండా వుంటాడు. ఆ పైన సంసారంలో ఆడదాని మాటే చెల్లుతుంది.’’ సత్య పెళ్లికొడుకు మౌనాన్ని సమర్థించింది.
‘‘నాకయితే పెళ్లికొడుకు తెగ నచ్చేశాడు. ఇలాంటి బుద్ధుడు దొరికితే నేనెగిరి గంతేసి చేసుకుంటాను. నిత్యా, నీకు ఓకేనా? ఏమైనా అనుమానాలున్నాయా?’’ సత్య నిత్యను కదిలించింది.‘‘ముసలోడి పేరులా ఆ పాత తరహా పేరు నచ్చలేదు. కళ్లజోడు పెట్టుకోవడం వల్ల యెక్కువ వయసున్నవాడిలా కనిపిస్తున్నాడు. పెళ్లిచూపుల్లో నయినా ‘షూ’ వేసుకొని ‘ఇన్ షర్ట్’ చేసుకొని రాలేదంటే అచ్చటా ముచ్చటా తెలియని అడవిమనిషిలా వున్నాడు. ఇంకా...’’‘‘ఊ... ఇంకా ఈ కాలపు కుర్రాళ్లలా ఫ్యాషన్ పేరుతో గడ్డం పెంచి బూచాడి అవతారంలో రాలేదు. లేకపోతే ఏమిటీ నీ సిల్లీ డౌట్స్? అబ్బాయి నీట్‌గా ‘హేండ్సమ్’గా పాత సినిమాల్లో హీరోలా వున్నాడు. ఈ ఆఫర్ నీకు ‘జాక్ పాట్’ లాంటిది ఎక్కువగా ఆలోచించక ముందు ‘ఊ’ అను...’’
సత్య హితోపదేశం పూర్తి కాకుండా తలుపు తోసుకొని అవధాని లోనికొచ్చాడు.‘‘ఏమ్మా? మీ ఆలోచనలింకా తెమల్లేదా? మగపెళ్లివారు మీ నుంచి తీపికబురు కోసం యెదురు చూస్తున్నారు. సాధారణంగా పెళ్లిచూపుల్లో ఆడపిల్ల యిష్టం తెలుసుకోకుండా పెళ్లికొడుకు తరఫువాళ్లు ‘స్పాట్’లో అవునో కాదో తేల్చకుండా తర్వాత కబురు చేస్తామని వెళ్లిపోతారు. అలాంటిది వీళ్లు మంచివాళ్లు గనుక ముందుగా తాము ‘సరే’ అని, ఆ తర్వాత పెళ్లి కూతురికి నోరు విప్పే స్వేచ్ఛనిస్తున్నారు. నిజానికి యిప్పుడు కాకపోతే మూడేళ్ల వరకు వివాహం జరగదని సిద్ధాంతి హెచ్చరించకపోతే యిప్పుడీ సంబంధం మీ వరకు వచ్చేది కాదు. అబ్బాయి ఏ వ్యసనాలు లేని వజ్రం. అత్త పెత్తనం, ఆడబిడ్డ పోరు లేవు. అందువల్ల మీరు యెక్కువగా ఆలోచించి సంబంధం దాటపెట్టుకోకండి. ఏ వయసులో ఆ ముచ్చట ఆ వయసులో జరగాలి. మీరు అవునంటే ఈ శుభవార్త వారికి చెప్పేస్తాను. ‘ఆలస్యాత్ అమృతం విషం’ అన్నారు. ఏం తాయారమ్మగారూ, సరేనా?...’’
అటు సత్య, యిటు అవధాని ‘బ్రెయిన్ వాష్’ చెయ్యడంతో తల్లీ కూతుళ్లిద్దరూ సానుకూలమైన ధోరణికి వచ్చారు. తాయారమ్మ అవధానికి ‘సరే’ అని చెపుదామని నోటి చివరి వరకు వచ్చేసరికి చందు హడావిడిగా వచ్చి వాళ్లలో చేరాడు. కొడుకు సమయానికి రావడం శుభసూచికంగా భావించిన తాయారమ్మ పెళ్లికొడుకు వివరాలు అతనికి చెప్పి అంతిమనిర్ణయం అతనికి విడిచిపెట్టి వూగిసలాట నుంచి బయటపడింది. చందు పెళ్లివారి దగ్గరకెళ్లి, తనను పరిచయం చేసుకొని పెళ్లికొడుకుతో మాట్లాడి, తిరిగి లోపలకొచ్చి తల్లికి, చెల్లికి తన అభిప్రాయం తెలియజేశాడు.
‘‘సంబంధం నిస్సందేహంగా మంచిదే. కాని ‘సివిల్ సర్వీసెస్’ పరీక్ష లాటరీ లాంటిది. దానిలో సక్సెస్ కావడానికి ‘మెరిట్’తో పాటు అదృష్టం కూడా కలసిరావాలి. దానినే లక్ష్యంగా పెట్టుకొని సాధించలేక చతికిలపడిన మేధావులెందరో వున్నారు. సో, నిత్యకింకా వయసు దాటిపోలేదు గనుక రెండేళ్లు ఆగగలిగితే ఈ సంబంధం చేసుకుందాం...’’
అసలే చప్పున ఏ నిర్ణయమూ తీసుకోలేని తాయారమ్మకు ‘కర్ర విరక్కుండా పాము చావకుండా’ రీతిలో కొడుకు చెప్పిన మాటలు రుచించాయి. అవధాని ద్వారా విషయం విన్న పెళ్లివారు నిరాశగా వెనుదిరిగారు!
తాయారమ్మకు నలభయ్యేళ్ల నాటి తన పెళ్లి సంగతి గుర్తొచ్చింది. క్లాసులో యెప్పుడూ ఫస్ట్ వచ్చే తనను పెళ్లీడు వచ్చిందని సవతితల్లి చదువు మానిపించి సంబంధాలు వెతకడం ప్రారంభించింది. తండ్రి ఆమెకెదురు చెప్పలేని నిస్సహాయుడు. ఎవరో ఒకడికి కట్టబెట్టి తనను వదిలించుకోవడమే ధ్యేయంగా ఆమె అడ్డమైన సంబంధాలకు యెగబడేది. అలా తెచ్చిన సంబంధాలలో గుడ్డిలో మెల్లలాంటిది వెంకటేశ్వర్లు మాష్టారిది. ‘గవర్నమెంటు వుద్యోగం, నీ మొహానికి యింతకంటె యెవరొస్తారు, ఒప్పుకో’మని సవతితల్లి అనసూయ బలవంతపెట్టింది. తండ్రి కూడా భార్యా విధేయతతో తనకు సర్ది చెప్పబోయాడు. అయినా, నల్లగా నాజూగ్గా లేని వరుణ్ని చూసి తను యిష్టపడలేదు.
ధైర్యం చేసి నచ్చలేదని చెప్పబోతుండగా సమయానికి గుమ్మంలోకొచ్చిన వరసకు అన్నయ్య అయిన రాఘవులు కలుగజేసుకొని పెళ్లికొడుకు స్థితిగతులు తెలుసుకొని ‘ఫర్వాలేదు, చేసుకొ’మ్మని సలహాయిచ్చాడు. తన శ్రేయోభిలాషి అయిన రాఘవులు మీద నమ్మకంతో ‘సరే’ అంది. కాని పెళ్లయిన యేడాది తిరక్కుండానే వెంకటేశ్వర్లు రంగు బయటపడింది. అతను పచ్చి తాగుబోతు, పేకాటరాయుడు. బతికిన ఆరేడేళ్లు నరకం చూపించి ‘లివర్ సిరోసిస్’తో చనిపోయాడు. అప్పటి నుంచి అతని పెన్షన్, తను వెతుక్కున్న కాన్వెంట్ టీచర్ వుద్యోగం ఆధారంగా పిల్లలు చందు, నిత్యను ఏలోటు యెరక్కుండా పెంచి, చదివించింది. రాఘవులు మాట మీద మొగ్గి ఆ క్షణంలో తప్పుడు నిర్ణయం తీసుకోకపోతే తన బతుకిలా కాలిపోయేది కాదని జీవితం పొడుగునా మథనపడేది అందుకే. తన కూతురు నిత్య జీవితమైనా తనలా కాకూడదని ఆమె పెళ్లి విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనే నిశ్చయంతోనే – నిత్య కొస్తున్న సంబంధాలన్నిటినీ మొగ్గలోనే తుంచేసింది!
జానకిరామయ్య సంబంధాన్ని కాదనడంలో తన నిర్ణయం సరయినదేనని తృప్తిపడిన తాయారమ్మ వారం తిరక్కుండా ఒక వార్త తెలిసి నిర్విణ్ణురాలైంది. జానకిరామయ్యకి పెళ్లి కుదిరిందనీ పెళ్లికూతురు యెవరో కాదు – సత్య అని రూఢిగా తెలిసిన తాయారమ్మ ఆవేశంతో చిందులు తొక్కింది. ముందుగా తన మాట లెక్కచెయ్యకుండా పెళ్లి చూపులకు సత్యను తోడుగా తెచ్చుకున్న నిత్యను చీవాట్లు పెట్టింది. ఆ తర్వాత మా కొచ్చిన సంబంధాన్ని లాక్కొన్నారంటూ సత్య కుటుంబం మీద తగవుకు వెళ్లింది. ఆఖరి ప్రయత్నంగా అవధానిని పిల్చి, తాము పొరపాటు చేశామని యెలాగైనా చేజార్చుకున్న సంబంధాన్ని తిరిగి నిత్యకు ఖాయం చెయ్యమని బతిమాలింది. డబ్బు ఆశ చూపి ప్రలోభపెట్టింది. కాని మాట తప్పడానికి మగపెళ్లివారు అంగీకరించలేదు. వాళ్ల తిరస్కారానికి అవమానంతో రోషంతో రెచ్చిపోయిన తాయారమ్మ నిత్యకు అంతకంటె పదిరెట్లు మంచి సంబంధం చేస్తానని సవాల్ విసిరింది.
ఆనాటి నుంచి నిత్యకు యెన్ని సంబంధాలు వచ్చినా, వాటిని తప్పిపోయిన జానకిరామయ్య సంబంధంతో పోల్చి, తన గీటుకు రాక తాయారమ్మ తిరస్కరిస్తూనే వుంది. నిత్య తల్లి మాటను కాదని స్వతంత్ర నిర్ణయం తీసుకోలేకపోతోంది. అలా క్రమంగా యేళ్లు గడుస్తున్న కొద్దీ నిత్య వయస్సు ముప్పైలోకి రావడంతో సీను మారిపోయింది. అంత వయసున్న పెళ్లికొడుకులు దొరక్కపోవడంతో రెండోపెళ్లి సంబంధాలు రావడం తాయారమ్మను కలవరపరిచింది.
సత్య జానకిరామయ్యల కల్యాణ శుభలేఖ మొదలుకొని అనేక సందర్భాలకు ఆ జంట నుంచి నిత్యకు, తాయారమ్మకు ఆహ్వానాలు అందుతూనే వున్నాయి. వాటిలో అతి ముఖ్యమైంది జానకిరామయ్య ఐఏఎస్‌కు సెలక్ట్ కావడం. ఒక్కక్షణం నిదానించకుండా చేజేతులా జారవిడుచుకున్న అదృష్టాన్ని తలచుకొని స్వయంకృతాపరాధానికి అవ్యక్తమైన ఆవేదనతో అనుక్షణం కుమిలిపోతున్న తల్లీ కూతుళ్లు సత్యకి సంబంధించిన ఏ వేడుకలకు హాజరుకావడం లేదు. ఇటీవల సత్య జానకిరామయ్య దంపతులు తమ ఏకైకపుత్రిక నిశ్చితార్థానికి రావలసిందిగా స్వయంగా వచ్చి యిచ్చిన ఆహ్వానపత్రిక చూసి నిత్య మనసు వుద్విగ్నభరితమైంది. చూస్తుండగానే నలభైయ్యేళ్ల వయసు మీద పడిన కుమారి నిత్య కన్నీటి బొట్లు పడిన ఆ ఆహ్వానం ఆమెను అవహేళనం చేస్తున్నట్టుంది...!


