
అందం కోసం వాడే సబ్బును ఒక బాలుడు క్యాన్సర్ వ్యాధి మీద ప్రయోగించే ఆయుధంగా మార్చాడు. ఆశ్చర్యంగా ఉంది కదూ? కాని, ఇది నిజం. అమెరికాకు చెందిన పదిహేనేళ్ల హీమన్ బెకెలె తయారు చేసిన ఈ సబ్బు ప్రస్తుతం స్కిన్ క్యాన్సర్ రోగులకు వరంగా మారింది. ఈ ప్రత్యేకమైన సబ్బు చర్మంలోని రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరచి, క్యాన్సర్ కణాలను ఎదుర్కొనేలా చేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే, ఈ సబ్బు వాడితే చర్మంపై ఉన్న మలినాలకే కాదు, చర్మం లోపల చాపకింద నీరులా దాగి ఉన్న క్యాన్సర్ కణాలకు కూడా గుడ్‌బై చెప్పొచ్చు! కీమోథెరపీ, వేల కొద్దీ మాత్రలు అవసరం లేకుండా, ఒక చిన్న సబ్బుతోనే క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చు. ప్రస్తుతానికి ఇది ఇంకా పరిశోధనల దశలో ఉన్నప్పటికీ, శాస్త్రవేత్తలు దీని పనితీరుపై విశ్వాసంతో ఉన్నారు. ఇది కచ్చితంగా ఉపయోగకరమైన ఫలితాలను ఇస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ అద్భుత ఆవిష్కరణకు గుర్తింపుగా హీమన్ బెకెలెకు టైమ్ మ్యాగజైన్ ‘2024 కిడ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది. అంతేకాదు, ‘త్రీ ఎమ్ యంగ్ సైంటిస్టు’ చాలెంజ్‌లో పాల్గొని, పాతికవేల డాలర్లు (అంటే రూ. 21,82,600) నగదు బహుమతిని కూడా గెలుచుకున్నాడు. ఇంత డబ్బు వచ్చిందని పుస్తకాలకు గుడ్‌బై చెప్పలేదీ హీమ¯Œ . స్కూల్‌లో క్లాసులు, హోమ్‌వర్క్‌ల మధ్యలో కూడా ఫార్ములాలను కలిపి ఈ క్యాన్సర్ కిల్లింగ్ సబ్బు మీద తన పరిశోధనను కొనసాగిస్తున్నాడు. దీనిని త్వరలోనే పెద్దస్థాయిలో ఉత్పత్తి చేసి, అవసరమున్నవారికి ఉచితంగా అందించాలన్న ఆశయంతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించాలని కలలు కంటున్నాడు.
అలా మొదలైంది!
ఇంత చిన్న వయసులోనే ఇలాంటి గొప్ప ఆలోచన రావడానికి ఓ గట్టి కారణం ఉంది. హీమన్ పుట్టిన ఇథియోపియాలో ప్రజలకు తగినన్ని వైద్య సౌకర్యాలు లేకపోవడాన్ని చిన్నప్పుడే గమనించాడు. అందుకే, ‘అందరికీ వైద్య సౌకర్యాలు అందాలంటే ఎలా?’అనే ప్రశ్నతో మొదలుపెట్టి, అందరికీ చౌకగా, సులభంగా చికిత్స అందించే మార్గాన్ని వెతికాడు. ఆ వెతుకులాట చివరకు బాత్‌రూమ్ షెల్ఫ్‌పై ఉన్న సాధారణ సబ్బు దగ్గర ఆగింది. అలా రోజూ వాడే సబ్బులో శాస్త్ర విజ్ఞానాన్ని, రసాయనాలను కలిపి, ఒక మహాశక్తిమంతమైన ఆయుధంగా మార్చేశాడు.