
మహాశివుడు ప్రసాదించిన అస్త్ర శస్త్రాలతో, దివ్యకవచ ప్రభావంతో పరశురాముడు కార్తవీర్యార్జునుడిని, అతడి కుమారులను, సమస్త పరివారాన్నీ యుద్ధంలో వధించాడు. యుద్ధం ముగిసిన తర్వాత తన మిత్రుడు అకృతపర్ణుడితో కలసి సదాశివుడిని దర్శించుకోవాలని కైలాసానికి బయలుదేరాడు.ఆ సమయంలో శివపార్వతులు కైలాస మందిరంలో ఏకాంతంలో ఉన్నారు. మందిర ద్వారం వద్ద కాపలాగా వినాయకుడు, కుమారస్వామి ఉన్నారు.పరశురాముడు ద్వారం వద్ద శివపార్వతీ తనయులైన వినాయకుడు, కుమారస్వామిని చూసి వారికి నమస్కరించాడు.
పక్కనే ఉన్న క్షేత్రపాలకులు నంది, భృంగి తదితరులకు నమస్కరించి, తన మిత్రుడు అకృతపర్ణుడితో కలసి నేరుగా లోపలకు ప్రవేశించబోయాడు. అది గమనించిన వినాయకుడు, ‘ఆగాగు! భార్గవరామా! ఆగు! లోపల మాతాపితరులు ఏకాంతంలో ఉన్నారు. నేను లోపలకు వెళ్లి వారి ఆజ్ఞ తీసుకుని వస్తాను. అంతవరకు ఇక్కడే నిలిచి ఉండు’ అని వారించాడు.‘సోదరా! నాకు అనుమతి ఎందుకు? నేనిప్పుడే వెళ్లి వారిని దర్శించుకుంటాను. భూలోకంలో కార్తవీర్యాది మహావీరులను మహాశివ వరప్రసాదంతో యుద్ధంలో సంహరించి వచ్చాను. వారికి ఈ విషయమే చెప్పి, ఆశీస్సులు తీసుకుని పోతాను’ అని పలికి పరశురాముడు, అకృతపర్ణుడితో కలసి చొరవగా ముందుకు నడిచాడు.
‘పరశురామా! మాతా పితరుల ఏకాంతానికి భంగం కలిగించడం దోషం. కాసేపు ఓపిక పట్టు’ మృదువుగా చెప్పాడు వినాయకుడు.
‘నేనూ శివుడికి పుత్రసమానుడినే! నాకు అనుమతి అవసరం లేదు’ అని పలికి, ద్వారం తలుపులు తోసుకుని అకృతపర్ణుడితో కలసి లోపలకు అడుగు పెట్టాడు.పరశురాముడి దురుసుతనానికి వినాయకుడిలో సహనం నశించింది. వారిద్దరినీ చెరో జబ్బ పట్టుకుని, లాగి అవతలకు పడేశాడు.పరశురాముడికి కోపం వచ్చింది.వినాయకుడి మీదకు గండ్రగొడ్డలి ఎత్తాడు. వినాయకుడు లాఘవంగా ఆ చేతిని ఒడిసి పట్టుకున్నాడు. అలాగే అమాంతంగా పరశురాముణ్ణి పైకి లేపాడు. తనతో పాటే ఏడు ఊర్ధ్వలోకాలకు, తర్వాత ఏడు అధోలోకాలకు తిప్పాడు. అక్కడి నుంచి మళ్లీ ఊర్ధ్వలోకాలకు తీసుకుపోయి, ఒక సరోవరంలోకి విసిరేశాడు.
పరశురాముడు భయభ్రాంతుడయ్యాడు. తనను రక్షించమంటూ వినాయకుడిని వేడుకున్నాడు.జాలితలచిన వినాయకుడు అతడిని తిరిగి కైలాస ద్వారం ముందుకు తీసుకువచ్చి, విడిచిపెట్టాడు. యథాస్థితికి వచ్చినందుకు పరశురాముడు ఊపిరి పీల్చుకున్నాడు. అయితే, తనను పరాభవించిన వినాయకుడి మీద కోపంతో రగిలిపోయాడు. కోపాన్ని అణచుకోలేక తన చేతిలోని పరశువును వినాయకుడి మీదకు విసిరాడు.పరశురాముడి చేతిలోని పరశువు అజేయమైనది. పరమేశ్వరుడు స్వయంగా అనుగ్రహించిన ఆయుధం అది. దానికి తిరుగులేదు. తండ్రి ప్రసాదించిన పరశువును గౌరవించి, వినాయకుడు దానికి తన ఎడమ దంతాన్ని తాకించాడు.పరశువు తాకిడికి వినాయకుడి ఎడమదంతం నేలరాలింది. దంతం నేలపడగానే భూమి కంపించింది. దంతం నుంచి కారిన రక్తంతో నేల తడిసింది. ఈ దృశ్యం చూసి, కుమారస్వామి, ప్రమధ గణాలు పెద్దగా రోదించడం మొదలుపెట్టారు. ఈ అలజడికి పార్వతీ పరమేశ్వరులు బయటకు వచ్చారు.
రక్తసిక్తమైన ముఖంతో ఏకదంతుడిగా కనిపించిన కుమారుడిని చూసి పార్వతీదేవి చలించిపోయింది. ఏం జరిగిందంటూ కుమారస్వామిని అడిగింది. అతడు జరిగినదంతా చెప్పాడు. అది విన్న పార్వతికి కోపం వచ్చింది.‘చూశారా నాథా! మీ శిష్యుడైన భార్గవుడు మీరిచ్చిన ఆయుధాన్ని మీ కుమారుడి మీదనే ప్రయోగించాడు. నాకు ఇంతకన్నా అవమానం లేదు. నేను నా తనయులను తీసుకుని మా పుట్టింటికి పోతాను’ అని కోపంగా పలికి, రుసరుసా లోపలకు పోయింది. ఆమె మాటలు విన్న పరమశివుడు సంధానకర్తలైన రాధాకృష్ణులను స్మరించాడు. వారు తక్షణమే ప్రత్యక్షమయ్యారు. వారికి విషయమంతా చెప్పి, ఎలాగైనా పార్వతీదేవికి నచ్చజెప్పమని కోరాడు.రాధాకృష్ణులు లోపలకు రావడంతో పార్వతీదేవి వారికి ఎదురేగి స్వాగతం పలికింది.
వెనుకనే పరశురాముడు వచ్చి, పార్వతీదేవి పాదాల ముందు సాష్టాంగపడి క్షమించమంటూ అభ్యర్థించాడు. అయినా పార్వతీదేవి కోపం చల్లారలేదు. అతడిని మన్నించలేదు.అప్పుడు శ్రీకృష్ణుడు జోక్యం చేసుకుని, ‘పార్వతీ! నీ వంటి జగన్మాతకు కోపం తగదు. ఈ పరశురాముడు కూడా నీకు పుత్రసమానుడే! అపరాధం చేసినందుకు పశ్చాత్తాపంతో బాధపడుతూ పాదాలు పట్టుకుని ప్రాధేయపడుతున్నాడు. ఇకనైనా కాస్త కనికరించి, ఇతణ్ణి క్షమించవమ్మా! ఏకదంతుడైనంత మాత్రాన నీ కుమారుడి కీర్తికి మచ్చ రాదులే!’ అని నచ్చజెప్పాడు.పార్వతీదేవి శాంతించి, పరశురాముడిని క్షమించింది. అప్పటి నుంచి వినాయకుడు ఏకదంతుడిగా పూజలందుకోసాగాడు.
∙సాంఖ్యాయన