ఆటపాటల అట్టహాసం ఆ నగరంలో సందడి సందడిగా కనిపిస్తుంది. వీథుల్లో ఎక్కడ చూసినా సంప్రదాయ వాద్యాలకు అనుగుణంగా చిన్నా పెద్దా, ఆడా మగా చెట్టా పట్టాలేసుకుని అడుగులో అడుగులు కదుపుతూ నాట్యకేళితో కనువిందు చేస్తారు. ఒకరోజు కాదు, ఏకంగా పదిరోజులు అట్టహాసంగా సాగే ఆటపాటలతో సాగే అద్భుతమైన వేడుక ఇది. ఈ నాట్యోత్సవానికి వేదిక పెరులోని ట్రుజిలో నగరం.
ట్రుజిలో నగరంలో ప్రతి ఏటా జనవరి నెలలో ‘ట్రుజిలో మరీనెరా’ పేరిట జరిగే ఈ నాట్యోత్సవాన్ని తిలకించేందుకు విదేశాల నుంచి పర్యాటకులు పెద్దసంఖ్యలో వస్తారు. పెరు సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా జరిగే ఈ పదిరోజుల పండుగలో అశ్వికుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఉరకలేసే పెరూవియన్ పాసో అశ్వాలను అధిరోహించిన అశ్వికులు నాట్యోత్సవం కొనసాగే వీథుల్లో విన్యాసాలు చేస్తూ తిరుగుతుంటారు. చిత్రవిచిత్ర గతులలో నాట్యమాడే నాట్యగత్తెలతో అశ్వాల మీద కూర్చునే సయ్యాటలాడుతుంటారు.
పెరూ ప్రభుత్వం ఈ వేడుకను జాతీయ సాంస్కృతిక వేడుకగా గుర్తించింది. ట్రుజిలో నగరంలో జరిగే ఈ పది రోజుల పండుగలో జనాలు పెరూవియన్ సంప్రదాయ ‘మరీనెరా’ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. అందువల్ల పెరు ప్రభుత్వం ట్రుజిలో నగరాన్ని ‘మరీనెరా రాజధాని’గా గుర్తించింది. ఈసారి ట్రుజిలోలో ఈ వేడుకలు జనవరి 20 నుంచి 30 వరకు జరగనున్నాయి.
ఈ సందర్భంగా జాతీయ మరీనెరా పోటీలను కూడా నిర్వహిస్తారు. ఈ వేడుకలు జరిగే పది రోజుల్లోనూ ట్రుజిలో నగరం నలుమూలలా వీథుల్లో భారీ స్థాయిలో ఊరేగింపులు జరుగుతాయి. ఈ ఊరేగింపుల్లో రథాల వంటి వాహనాలను ప్రత్యేకంగా అలంకరించి ఊరేగిస్తారు. ఈ రథాలపై కొందరు నర్తకీమణులు రాణుల వేషాలలో నర్తిస్తూ జనాలను అలరిస్తారు. వీథుల్లో రథాల వెంట నడుస్తూ ఆడా మగా అన్ని వయసుల వారు జంటలు జంటలుగా నాట్యాలు సాగిస్తుంటారు.


