
మనుషులకైనా, యంత్రాలకైనా ‘విధుల విరమణ’ వీడ్కోలు ఇవ్వటం అన్నది భావోద్వేగ భరితంగా ఉంటుంది. ఆగస్టు 25న మిగ్–21 యుద్ధ విమానాలకు చివరి టేకాఫ్‌తో లాంఛనంగా వీడ్కోలు పలకటానికి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ స్వయంగా ఒక మిగ్–21ను నడిపారు. ఆ క్షణాలలో అక్కడున్న వారి హృదయాలన్నీ భారమైన కళ్లతో ఆ దృశ్యాన్ని వీక్షించాయి. ‘మిగ్–21’ను కనుక మనిషి అనుకుంటే.. యుద్ధ యోధుడు అనాలి. ఆయుధం అనుకుంటే కనుక... ఆకాశపు ఏకే–47 అనాలి. ఎన్నో యుద్ధాలలో భారత్ వెన్నుదన్నుగా ఉన్న ఈ గర్జించే ‘గన్ను’, కనిపించని టార్గెట్‌ను సైతం ఒక్క చూపుతో భస్మం చేసే ఈ ‘కన్ను’... రూపురేఖలకు విహంగమే కాని, ఇండియన్ ఆర్మీలో సకల బలాల, దళాల ‘అక్షౌహిణి!’ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు ఆరు దశాబ్దాలకు పైగా దోస్త్ మేరా దోస్త్!!
పాం ర్స్... కోబ్రాస్
భారత వైమానిక దళం (ఐ.ఎ.ఎఫ్) ఈ నెల 26న మిగ్–21 యుద్ధ విమానాలకు ఘనంగా వీడ్కోలు పలకబోతోంది. దీనర్థం – ఇకపై ఈ ఫైటర్ జెట్‌లను మన ఆర్మీ ఏ విధమైన విధులకూ ఉపయోగించదు. 62 ఏళ్లుగా సైన్యానికి సేవలు అందిస్తున్న మిగ్–21 లకు స్వస్తి చెప్పటం కోసం భారత ప్రభుత్వం చండీగఢ్‌లో ఆ రోజున ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది.
ఐ.ఎ.ఎఫ్‌లో ప్రస్తుతం మిగ్–21 విమానాలకు చెందిన స్క్వాడ్రన్‌లు రెండు మాత్రమే ఉన్నాయి. ఒకటి : ‘పాంథర్స్’ (23వ స్క్వాడ్రన్), రెండు : ‘కోబ్రాస్’ (3వ స్క్వాడ్రన్). రాజస్థాన్‌లోని బికనీర్‌కు సమీపంలో – ‘నల్’ ఎడారి యుద్ధ విమానాల స్థావరం నుంచి ఇవి పని చేస్తుంటాయి. రెండు లేదా అంతకంటే ఎక్కువ విమానాలు, నిర్వహణా సిబ్బంది, వాటిని నడిపే పైలట్‌లతో కూడిన విభాగాన్ని ‘స్క్వాడ్రన్’ అంటారు.
వేరియంట్‌లలో చివరి మిగ్
ఐ.ఎ.ఎఫ్. ఈ ఆరు దశాబ్దాలలో పలు రూపాంతర (వేరియంట్) రకాలైన మిగ్–21లను యుద్ధాలలో ప్రయోగించింది. అవి : మిగ్–21 ఎఫ్, మిగ్–21 పిఎఫ్, మిగ్–21 ఎఫ్.ఎల్, మిగ్–21 ఎం, మిగ్–21 బిస్, మిగ్–21 బైసన్. చివరి వేరియంట్ అయిన ఈ బైసన్ మిగ్‌లనే ఇప్పుడు మన వైమానిక దళం పక్కన పెట్టబోతున్నది. స్క్వాడ్రన్ 3, స్క్వాడ్రన్ 23లో కలిపి ప్రస్తుతం మొత్తం 36 మిగ్–21 బైసన్‌లు ఉన్నాయి. అరవై ఏళ్లకు పైగా భారత వైమానిక దళానికి వెన్నెముకగా నిలిచిన ఈ మిగ్–21 యుద్ధ విమానాలలో ఒక దానిని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ గత నెలలోనే నడిపి మిగ్‌లకు లాంఛనంగా వీడ్కోలు పలికారు. (పైన ఫోటోలు). రష్యన్ సంతతికి చెందిన ఈ ఫైటర్ జెట్‌పై శిక్షణ పొందిన పైలట్‌లు ఆ వీడ్కోలు క్షణాలలో భావోద్వేగానికి లోనయ్యారు.
నిజానికి భారత వైమానిక దళం దశల వారీగా మిగ్–21ల వాడకాన్ని తగ్గించుకుంటూ వస్తోంది. ఆ క్రమంలో ఇది చిట్టచివరి ఉపసంహరణ. ప్రధానంగా భద్రతా సంబంధ కారణాలతో ఐ.ఎ.ఎఫ్. వీటిని నిలిపివేస్తోంది. టెక్నాలజీ పాతపడి పోవటం, ఫైటర్ స్క్వాడ్రన్‌లను ఆధునికీకరించవలసిన అవసరం ఏర్పడటం వల్ల కూడా మిగ్–21 ల నుంచి భారత్ ఆధునాతన దేశవాళీ ఎల్.సి.ఎ. ఎంకె–1ఎ ఫైటర్ జెట్‌లకు మళ్లుతోంది.
రష్యా నుంచి తొలి మిగ్
మిగ్–21 అన్నది 1950లలో సోవియట్ యూనియన్ వృద్ధి చేసిన సూపర్‌సోనిక్ యుద్ధ విమానం. ప్రపంచంలోనే అత్యధికంగా ఉత్పత్తి అయిన జెట్‌గా కూడా దీనికి రికార్డు ఉంది. భారత్ మొట్టమొదట 1963లో సోవియెట్ యూనియన్ నుండి మిగ్–21ను కొనుగోలు చేసింది. ఆ తర్వాత, రష్యా నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని, విడి పరికరాలు దిగుమతి చేసుకుని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ (హాల్)లో స్వయంగా మిగ్‌లను తయారు చేసుకోవటం మొదలుపెట్టాం. మిగ్–21లోని వేరియంట్‌లన్నీ భారత్ వృద్ధి చేసుకున్నవే. అంతేకాదు, ఐ.ఎ.ఎఫ్. దగ్గరున్న మొత్తం 850 మిగ్–21లలో అత్యధికంగా ‘హాల్’ ఉత్పత్తి చేసినవే. 1987 తర్వాత çహాల్‌లో మిగ్–21ల తయారీ వివిధ కారణాలతో ఆగిపోయింది. రష్యా 1986లోనే పూర్తి స్థాయిలో మిగ్‌ల ఉత్పత్తిని నిలిపివేసింది.
మిగ్–21ల ఘన చరిత్ర
వియత్నాం యుద్ధం (1955–1975) : ఉత్తర వియత్నాం వైమానిక దళం మిగ్–21 లను విస్తృతంగా ఉపయోగించి అమెరికాపై విజయం సాధించింది. 1966లో అమెరికా డ్రోన్‌లను కూల్చేసింది!
అరబ్–ఇజ్రాయెల్ ఘర్షణలు: 1967లో జరిగిన ఆరు రోజుల యుద్ధంలో (జూన్ 5 నుంచి 10 వరకు), ఆ తర్వాతా జరిగిన ఘర్షణల్లో ఈజిప్ట్, సిరియా, ఇరాక్... ఇజ్రాయెల్‌పై మిగ్–21లతో తలపడ్డాయి. అయితే ఆరు రోజుల యుద్ధం ప్రారంభంలోనే చాలా వరకు మిగ్‌లు ధ్వంసం అయ్యాయి!
ఇరాన్–ఇరాక్ యుద్ధం (1980–1988):
ఇరాన్, ఇరాక్ రెండూ కూడా ఈ ఎనిమిదేళ్ల దీర్ఘ పోరాటంలో పరస్పరం మిగ్–21లను ప్రయోగించుకున్నాయి.
సిరియా అంతర్యుద్ధం, లిబియా ఘర్షణలు: సిరియన్ వైమానిక దళం, లిబియా ఘర్షణల్లో లిబియా వైమానిక దళం మిగ్–21లను ఉపయోగించాయి.
భారత్–పాక్ యుద్ధాలు
1965లో జరిగిన ఇండో–పాక్ యుద్ధంలో మిగ్–21ల పాత్ర పరిమితంగానే ఉంది. గగనతల దాడులేమీ జరగలేదు. 1971లో మిగ్–21 లు భారత్‌కు గగనతల పోరాటంలో ఆధిక్యతను చేకూర్చాయి. పాక్ విమానాలను కూల్చేశాయి.
1971లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో పాకిస్తా¯Œ సేనలపై భారత్ మిగ్–21 యుద్ధ విమానాలు విరుచుకుపడిన తీరు ప్రపంచ దేశాలను సైతం విస్మయపరచింది. డిసెంబర్ 13వ తేదీన ఢాకాలోని గవర్నర్ అధికార భవనంపై భారత్ మిగ్–21 బాంబులతో దాడిచేసింది. ఆ మర్నాడే గవర్నర్ తన పదవికి రాజీనామా చేశారు. తర్వాతి రోజే 93,000 మంది పాక్ సైనికులు భారత సైన్యం ఎదుట లొంగిపోయారు.
1999 కార్గిల్ వార్‌లో ఎత్తయిన ప్రదేశాల నుండి ఉపరితల దాడులకు భారత్ మిగ్–21 లను సంధించింది. వైమానిక రక్షణ కార్యకలాపాల కోసం కూడా వీటిని ఉపయోగిం చింది. ఆపరేష¯Œ సఫేద్ సాగర్‌లో భాగంగా ఆనాడు పాకిస్తానీ అట్లాంటిక్ విమానాన్ని మిగ్ ఒక్క దెబ్బతో నేలమట్టం చేసింది.
2019లో పాక్‌తో ఉద్రిక్తతలు పెరిగినప్పుడు పాక్‌పై భారత్ జరిపిన భారీ దాడిలో మిగ్–21లు కీలక పాత్ర పోషించాయి. అత్యంత శక్తిమంతమైన ఎఫ్–16ను సైతం నేల కూల్చాయి.
మిగ్‌కు ఆ పేరెలా వచ్చింది?
మాస్కోలో 1939లో ప్రారంభమైన ‘మికోయన్’ ఏరోస్పేస్ కంపెనీ సంస్థాపకుల పేర్ల నుండి మిగ్–21 అనే మాట వచ్చింది. ఇందులో 21 అనేది మిగ్ విమానం మోడల్ నెంబరు. ‘మికోయన్’ సంస్థ.. ఆర్టెమ్ మికోయన్, మిఖాయిల్ గురేవిచ్ అనే ఇద్దరు ఏరో డిజైనర్‌ల ఆలోచన నుంచి ఆవిర్భవించింది.
అన్నీ ఇన్నీ కాని ప్రత్యేకతలు!
మిగ్‌లు తేలికపాటి, సూపర్‌సోనిక్ ఫైటర్ జెట్‌లు. గగనతలం నుంచి గగనతలంలోకి, గగనతలం నుండి భూతలంలోకి ఇవి సులువుగా మెరుపు దాడులు చేయగలవు. బాంబులను, మిసైళ్లను మోసుకుపోగలవు. సెకనుకు 250 మీటర్ల వేగంతో నిట్టనిలువుగా కూడా ప్రయాణించి శత్రు దేశాలను భయభ్రాంతులకు గురి చేయగలవు. కొన్ని సాంకేతికతలైతే అత్యంత అధునాతనమైనవి. కంటికి కనిపించని సుదూర లక్ష్యాలపైనా నేరుగా దాడి చేయగల రాడార్ వ్యవస్థ మిగ్‌లలో ఉంది. ప్రస్తుతం 60 కంటే ఎక్కువ దేశాల వాయుసేనల్లో 11,000కు పైగా మిగ్–21 విమానాలు పని చేస్తున్నాయి.
ఇజ్రాయెల్ దొంగిలించింది!
భారత వైమానిక దళానికి చేరిన తొలి సోపర్‌సోనిక్ ఫైటర్ జెట్‌లు మిగ్–21 లు. 1960–70 ల మధ్య భారత్‌కు గగనతల యుద్ధంలో ఇవి శక్తిమంతమైన అదనపు బలగాలు అయ్యాయి. పశ్చిమ దేశాలకు పక్కలో బల్లెంలా మారాయి. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ మిగ్–21ల టెక్నాలజీని దొంగిలించిందని కూడా అంటారు! ఒకసారి వీటిని నడిపిన పైలట్‌లు మరే విమానాన్నీ నడపటానికి ఆసక్తి చూపరనే మాటా వినిపిస్తుంటుంది. గాలిలో చురుగ్గా కదలటం, అత్యధిక వేగాన్ని అందుకోవటం మిగ్‌లలోని మరికొన్ని ప్రత్యేకతలు. సాధారణ యుద్ధ విమానాలు ‘ఫ్లయ్–బై–వైర్’ అనే సిస్టమ్‌తో వేగాన్ని నియంత్రించుకుంటాయి. మిగ్‌లు గేర్ సిస్టమ్‌తో పని చేస్తాయి. దాంతో గంటకు 2000 కి.మీ. వేగాన్ని కూడా ఇవి అందుకోగలవు! అంత వేగంలో పైలట్ పట్టు కోల్పోవటమే తరచు జరిగే మిగ్‌ల ప్రమాదాలకు కారణం అని నిపుణులు చెబుతున్నారు.
‘ఎగిరే శవపేటికలు’!
మొదట్లో గగన సింహాలై గర్జించి, విజయ చిహ్నాలుగా గుర్తింపు పొందిన మిగ్–21 లు తర్వాత్తర్వాత తరచు ప్రమాదాలకు గురవుతూ పైలట్‌లు, పౌరులు మరణిస్తుండటంతో ‘ఎగిరే శవపేటిక’లు అనే అప్రతిష్ఠను, అపకీర్తిని మోయవలసి వచ్చింది. కాలం చెల్లిన మిగ్‌లను ఇంకా ఎన్నేళ్లు ఉపయోగిస్తాం అనే విమర్శలు కూడా ఎక్కువయ్యాయి. మరోవైపు సుఖోయ్, రఫేల్, తేజస్ వంటి యుద్ధ విమానాల రాకతో వీటికి ప్రాముఖ్యం తగ్గిపోయింది. భారత వాయుసేన ఆధ్వర్యంలోని 872 మిగ్ విమానాల్లో 482 విమానాలు పలు ప్రమాదాల్లో నేలకూలాయని 2012లోనే ఆనాటి రక్షణమంత్రి ఏకే ఆంటోని రాజ్యసభలో వెల్లడించారు కూడా. ఆనాటి లెక్కల ప్రకారమే చూసుకున్నా... 171 మంది పైలట్‌లు, 39 మంది పౌరులు మరణించారు. పైగా భారత వాయుసేనలో అత్యధికంగా కూలిపోయిన యుద్ధ విమానాలు కూడా ఇవే. యాదృచ్ఛికంగా – 1963లో తొలిసారిగా ఎక్కడైతే భారత వాయుసేనలోకి వీటిని తీసుకుని జాతికి అంకితం చేశారో అదే వైమానిక స్థావరంలో తుది వీడ్కోలు పలకనున్నారు.
మిగ్‌ల స్థానంలో ‘ఎంకె–1ఎ’లు
భారత వాయు సేన 1963 నుండి మిగ్–21లను ఉపయోగిస్తోంది. ఇప్పుడు వీటి స్థానంలోకి, దేశీయంగా తయారౌతున్న ఎల్.సి.ఎ. తేజస్ ఎంకె–1ఎ విమానాలను వినియోగంలోకి తేబోతోంది. ‘హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్’ (హెచ్.ఎ.ఎల్.) ఈ ఎంకె–1ఎ లను ఉత్పత్తి చేస్తోంది. హెచ్.ఎ.ఎల్.తో ఇప్పటికే 83 ఎంకె–1ఎ ల కోనుగోలు కోసం ఆర్డర్ పెట్టిన ప్రభుత్వం, భారత వాయుసేన ను మరింత బలోపేతం చేయటానికి ఇటీవలే మరో 93 ఎంకె–1ఎల కోసం రూ.66,000 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. నాలుగేళ్ల క్రితం తొలి విడతగా 2021 ఫిబ్రవరిలో రూ.48,000 కోట్లతో ప్రభుత్వం ఆర్డరు ఇచ్చిన 83 విమానాల డెలివరీ కూడా మొదలు కావలసి ఉంది.