
అయోధ్య పాలకుడు ఇక్ష్వాకుడు ఒకనాడు పితృదేవతలకు శ్రాద్ధం పెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. తన పెద్దకొడుకు వికుక్షిని పిలిచి, శ్రాద్ధ భోజనాల కోసం అడవికి వెళ్లి మాంసం తెమ్మని ఆజ్ఞాపించాడు. అతడు ఆయుధం ధరించి, రథంపై అడవికి వెళ్లాడు. వరాహాలను, జింకలను, కుందేళ్లను వేటాడాడు. వేటలో అడవంతా తిరిగి తిరిగి బాగా అలసిపోయాడు. అలసట వల్ల ఆకలి దప్పులను తాళలేకపోయాడు. ఆకలి తీర్చుకోవడానికి వేటాడిన జంతువుల్లో ఒక కుందేలును భుజించాడు. మిగిలిన వాటిని తీసుకొచ్చి, తండ్రికి అందించాడు. ఇక్ష్వాకుడి చేత శ్రాద్ధ కర్మ జరిపిస్తున్న వసిష్ఠుడు ఆ జంతువుల మాంసాన్ని సంప్రోక్షించబోతూ, అది భుక్తశేషమని గుర్తించాడు. ‘ఈ మాంసం భుక్తశేషం.
ఇది శ్రాద్ధకర్మకు పనికిరాదు’ అని కోపంగా పలికాడు.ఇక్ష్వాకుడు వెంటనే కొడుకును పిలిచి, ఏం జరిగిందో చెప్పమని నిలదీశాడు.‘వేట ముగిశాక ఆకలికి తాళలేక వేటాడిన వాటిలో ఒక కుందేలును తిన్నాను’ అని చెప్పాడు వికుక్షి.శ్రాద్ధకర్మలో విధిలోపం చేసినందున ఇక్ష్వాకుడు అతడికి దేశబహిష్కారం విధించాడు. శ్రాద్ధానికి తీసుకు రావలసిన కుందేలు మాంసాన్ని భుజించడం వల్ల వికుక్షికి శశాదుడనే పేరు వచ్చింది. తండ్రి ఆజ్ఞ ప్రకారం శశాదుడు ఇల్లు విడిచి అడవులకు వెళ్లిపోయి, అక్కడే నివసించసాగాడు.కొన్నాళ్లకు ఇక్ష్వాకుడు కాలధర్మం చెందాడు. తండ్రి మరణంతో శశాదుడు తిరిగి రాజధానికి వచ్చి, మంత్రుల సలహాతో రాజ్యభారం స్వీకరించాడు.
శశాదుడికి కకుత్థ్సుడు అనే కొడుకు కలిగాడు. కకుత్థ్సుడు ఆదిపరాశక్తి అపరభక్తుడు. నిత్యం అమ్మవారిని సేవిస్తూ ఉండేవాడు. శశాదుడి మరణం తర్వాత కకుత్థ్సుడు రాజ్యపాలన చేపట్టాడు. అమ్మవారి అనుగ్రహంతో అతడు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేయసాగాడు. అతడి పాలనలో రాజ్యం సుఖశాంతులతో తులతూగుతూ ఉండేది.
అయోధ్యలో కకుత్థ్సుడి పాలన కొనసాగుతున్న కాలంలో దేవదానవులకు సంగ్రామం జరిగింది. అసురుల చేతిలో దేవతలు చిత్తుగా ఓడిపోయి, స్వర్గం నుంచి పలాయనం చిత్తగించారు. దిక్కుతోచని స్థితిలో ఇంద్రాది దేవతలందరూ నేరుగా వైకుంఠానికి వెళ్లారు.‘ఆపద్బాంధవా! జగద్రక్షకా! శరణు.. శరణు! నువ్వే మాకు దిక్కు’ అని శేషతల్పంపై చిద్విలాసంగా శయనిస్తున్న శ్రీమహావిష్ణువుకు మొర పెట్టుకున్నారు.
‘దేవతలారా! దిగులు చెందకండి. అయోధ్య రాజు శశాద తనయుడైన కకుత్థ్సుడిని సాయం కోరండి. అతడికి ఆదిపరాశక్తి అనుగ్రహం అపరిమితంగా ఉంది. అతడు యుద్ధంలో మీ పక్షాన నిలబడి, పోరాడి మిమ్మల్ని గెలిపించగలడు’ అని చెప్పాడు విష్ణువు.
విష్ణువు సలహాతో దేవతలందరూ అయోధ్యకు వచ్చి, కకుత్థ్సుడిని దర్శించుకున్నారు.కకుత్థ్సుడు వారికి ఉచిత మర్యాదలు చేశాడు.
‘దేవతలారా! మీ రాకతో నా జన్మ ధన్యమైంది. దేవతలు స్వయంగా ఇంటికి రావడమంటే, నిజంగా అరుదైన సంఘటనే! ఆజ్ఞాపించండి! మీ కోసం నేనేం చేయాలన్నా చేస్తాను. మానవమాత్రులకు దుస్సాధ్యమైన పని అనుకున్నా మీ కోసం నేను తప్పక చేస్తాను’ అని పలికాడు.
‘రాజేంద్రా! నువ్వు దేవేంద్రుడికి బాసటగా మాకు యుద్ధంలో సాయం చేయాలి. అసురులను ఓడించాలి’ అని చెప్పారు దేవతలు.
‘నేను తప్పక మీ తరఫున అసురులతో యుద్ధం చేసి, వారిని ఓడిస్తాను. కాకుంటే, నాదొక షరతు. రణరంగంలో దేవేంద్రుడు నాకు వాహనంగా ఉండాలి. అప్పుడే నేను సంగ్రామంలో విజృంభించి, అసురులను తరిమికొడతాను’ అని పలికాడు కకుత్థ్సుడు.
కకుత్థ్సుడి షరతుకు దేవతలు నివ్వెరపోయారు. తమలో తాము తర్జనభర్జనలు పడ్డారు. అవసరం తమది కనుక అతడి షరతుకు ఒప్పుకోమని ఇంద్రుడిపై ఒత్తిడి తెచ్చారు. చివరకు విష్ణువు కూడా అదే సలహా చెప్పాడు. చేసేదేమీ లేక ఇంద్రుడు సరేనంటూ వృషభరూపం ధరించి, కకుత్థ్సుడికి వాహనంగా మారేందుకు అంగీకరించాడు.
కకుత్థ్సుడు వృషభరూపంలో ఉన్న ఇంద్రుడిపైకి అధిరోహించి, రణరంగానికి బయలుదేరాడు. వృషభాన్ని అధిరోహించిన కకుత్థ్సుడు నందీశ్వరుడిని అధిరోహించిన పరమశివుడిలా కనిపించడంతో అసురులు కొంత కంగారు పడ్డారు. అయినా, శక్తి కూడదీసుకుని, దేవతలపై యుద్ధానికి సిద్ధమయ్యారు.
హోరాహోరీగా సాగిన పోరులో కకుత్థ్సుడు అసురులను చిత్తుగా ఓడించాడు. వారి నగరాన్ని స్వాధీనం చేసుకుని, ఇంద్రుడికి అప్పగించాడు.ఇంద్రుడిని వాహనంగా చేసుకున్నందుకు కకుత్థ్సుడికి ఇంద్రవాహనుడని, అసురుల నగరాన్ని స్వాధీనం చేసుకున్నందున పురంజయుడని పేరు వచ్చింది.
∙సాంఖ్యాయన
నేను తప్పక మీ తరఫున అసురులతో యుద్ధం చేసి, వారిని ఓడిస్తాను. కాకుంటే, నాదొక షరతు. రణరంగంలో దేవేంద్రుడు నాకు వాహనంగా ఉండాలి.