క్రెడిట్‌ లాగితే కాల్‌ దొరికింది | Funday Crime Story | Sakshi
Sakshi News home page

క్రెడిట్‌ లాగితే కాల్‌ దొరికింది

Aug 31 2025 8:12 AM | Updated on Aug 31 2025 8:12 AM

Funday Crime Story

తీగ లాగితే డొంక కదిలినట్లు క్రెడిట్‌ కార్డ్స్‌ క్లోనింగ్‌ గురించి ఆరా తీస్తే, అంతర్జాతీయ కాల్‌ డైవర్షన్‌ వ్యవహారం బయటపడింది. హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు 2009లో ఈ అనుభవం ఎదురైంది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ, అసాంఘిక శక్తులకు సహకరిస్తున్న ఈ ముఠాను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.సాధారణంగా విదేశాల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌పై భద్రతా సంస్థల నిఘా ఉంటుంది. అనుమానాస్పద కాల్స్‌ వచ్చే నంబర్లను అవసరమైతే టాప్‌ చేస్తుంటారు కూడా! అంతర్జాతీయ కాల్స్‌పై నిఘా కోసం వాడే ఉపకరణాలు దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఉన్న ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ గేట్‌వే లాంగ్‌ డిస్టెన్స్‌ (ఐఎల్‌డీ) ఆపరేటర్ల వద్ద ఉంటాయి. 

విదేశాల నుంచి వచ్చే కాల్స్‌ అక్కడి ఎక్స్‌చేంజ్‌ లేదా సర్వీస్‌ ప్రొవైడర్‌ ద్వారా నేషనల్‌ లాంగ్‌ డిస్టెన్స్‌ ఆపరేటర్‌కు చేరుతాయి. అక్కడి నుంచి ఐఎల్‌డీ ఆపరేటర్‌కు వచ్చి, ఆపై ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ లేదా శాటిలైట్‌ ద్వారా మన దేశానికి వస్తాయి. ఇవి ఢిల్లీ, ముంబై, చెన్నై కోల్‌కతాలలో ఉన్న ఇంటర్నేషనల్‌ గేట్‌వే ఆఫ్‌ ఐఎల్‌డీ ఆపరేటర్, నేషనల్‌ లాంగ్‌ డిస్టెన్స్‌ ఆపరేటర్, బీఎస్‌ఓ టెలిఫోన్‌ ఎక్స్‌చేంజీల ద్వారా ఇక్కడ రిసీవ్‌ చేసుకునే ఫోన్‌కు వస్తుంది.సర్వీస్‌ ప్రొవైడర్ల ఆధ్వర్యంలో జరిగే ఈ విధానం మొత్తం సెకను కన్నా తక్కువ కాలంలోనే పూర్తవుతుంది. ఈ సేవలు అందించినందుకు ఇక్కడి ఇంటర్నేషనల్‌ గేట్‌వే ఆఫ్‌ ఐఎల్‌డీ ఆపరేటర్, నేషనల్‌ లాంగ్‌ డిస్టెన్స్‌ ఆపరేటర్, బీఎస్‌ఓ టెలిఫోన్‌ ఎక్సేంజ్‌లకు సైతం విదేశీ కాల్‌ ఆపరేటర్లు నిర్ణీత మొత్తాలు చెల్లిస్తారు. 

్రభుత్వం నుంచి లైసెన్స్‌ తీసుకునే ఈ సంస్థలు తమ ఆదాయం నుంచి నిర్దేశిత మొత్తాన్ని పన్నుగా చెల్లిస్తాయి. విదేశీ ఆపరేటర్లు ఇక్కడి వారికి డబ్బు చెల్లించకుండా ఉండేందుకు, కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఉపకరించేలా కొన్నేళ్ల కిందట కాల్‌ డైవర్షన్‌ పద్ధతిని రూపొందించారు. ఇక్కడ ఉంటున్న కొంతమందికి సోషల్‌ మీడియా ద్వారా ఎరవేసి అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేసేలా చేస్తుంటారు. ఇలా ఈ బాక్సులు ఏర్పాటైన తర్వాత విదేశంలో ఉన్న ఇంటర్నేషనల్‌ గేట్‌వే ఆపరేటర్‌కు వచ్చిన ఫోన్‌ కాల్‌ అక్కడ డేటాగా మార్చేస్తారు. దాన్ని ఇంటర్‌నెట్‌ ద్వారా నేరుగా ఇక్కడి వారి వద్ద ఏర్పాటు చేయించిన బాక్సులకు పంపిస్తారు. వీరి దగ్గర ఉండే Vó ట్‌వేలు ఈ డేటాను మళ్లీ కాల్‌గా మారుస్తాయి. 

వాటిని అనుసంధానించి ఉన్న సీడీఎమ్‌ఏ ఎఫ్‌డబ్ల్యూటీగా పిలిచే పరికరాలకు చేరుతుంది. స్థానికంగా తీసుకున్న సిమ్‌కార్డులను ఈ సీడీఎమ్‌ఏ ఎఫ్‌డబ్ల్యూటీల్లో నిక్షిప్తం చేస్తారు. విదేశీ గేట్‌వే నుంచి డేటా రూపంలో వీటికి వెళ్లిన అంతర్జాతీయ కాల్‌ లోకల్‌గా మారిపోయి, అందులో నిక్షిప్తం చేసిన సిమ్‌కార్డు నంబరు నుంచి వస్తున్నట్లు ఆ ఫోన్‌ అందుకునే వ్యక్తికి చేరుతుంది. 
దీని వల్ల విదేశాల్లో ఉండే వ్యక్తికి కాల్‌ చార్జీలు తగ్గుతాయి. వాట్సాప్‌ నిషేధం ఉన్న దేశాల నుంచి ఈ కాల్స్‌ ఎక్కువగా చేస్తుంటారు. ఫలితంగా దేశంలోని ఆపరేటర్లకు రావాల్సిన ఆదాయం, ప్రభుత్వానికి రావాల్సిన పన్ను దెబ్బతింటాయి. దేశంలోని సర్వీసు ప్రొవైడర్ల ఆదాయానికి గండి కొట్టడం ద్వారా విదేశీ సర్వీసు ప్రొవైడర్స్‌ ఆ మొత్తాన్ని మిగుల్చుకుని, ఇక్కడ పరికరాలు ఏర్పాటు చేసి సహకరించిన స్థానికులకు హవాలా రూపంలో కమీషన్‌ పంపిస్తుంటారు.

విదేశాల్లో ఉంటున్న ఇలాంటి సర్వీస్‌ ప్రొవైడర్స్‌తో ఈ–మెయిల్‌ ద్వారా పరిచయం పెంచుకున్న హైదరాబాదీలు వి.రమేష్, మహ్మద్‌ అబ్దుల్‌ ఖదీర్, ఆర్‌డీ శ్రీనివాస్, నజీబ్‌ అహ్మద్‌ ఖాన్‌ కాల్‌ డైవర్షన్‌కు సహకరించడానికి అంగీకరించారు. వీరు హైదరాబాద్‌లోని రెండు ప్రాంతాల్లో గేట్‌వేలతో కూడిన అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేశారు. వీటిలో వినియోగించే సిమ్‌కార్డులను మారుపేర్లతో సంగ్రహించారు. వాటి బిల్లులు చెల్లించడానికి క్లోనింగ్‌ చేసిన క్రెడిట్‌ కార్డులను వినియోగించారు. ఇలాంటి కాల్‌ డైవర్షన్స్‌ను ఎక్కువగా వాట్సాప్‌ నిషేధంగా ఉన్న దేశాల్లో ఉంటున్న వారితో పాటు ఉగ్రవాదులు, మాఫియా కార్యకలాపాలు సాగించేవారు వాడుతున్నారు. ఈ విధానంలో ఫోన్‌ ఎక్కడ నుంచి వస్తోందనేది తెలుసుకోవడం స్థానికంగా డైవర్షన్‌ పరికరాలు ఏర్పాటు చేసిన వారికీ సాధ్యం కాదు. 

ఈ ముఠా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు చిత్రంగా చిక్కింది. ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు 2009 జనవరి 29న సికింద్రాబాద్‌ ప్రాంతంలో తిరుగుతున్నారని, క్లోనింగ్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోళ్లు చేస్తున్నారని ఓ కానిస్టేబుల్‌కు సమాచారం అందింది. ఆయన ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సికింద్రాబాద్‌ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వి.రమేష్, మహ్మద్‌ ఖుద్దూస్‌లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తమకు క్లోనింగ్‌ క్రెడిట్‌ కార్డులను ముంబైకి చెందిన ముగ్గురు వ్యక్తులు అందిస్తున్నారంటూ బయటపెట్టారు. వీటితో షాపింగ్స్‌ చేస్తున్నామని చెప్పారు. వీరిని అరెస్టు చేయడానికి సిద్ధపడ్డ పోలీసులు, వీరి వస్తువులను సోదా చేశారు. 

రమేష్‌ దగ్గర లభించిన ఓ పుస్తకంలో సీడీఎమ్‌ఏ ఫోన్‌కు చెందిన ‘9298’ సిరీస్‌తో సీరియల్‌గా 20కి పైగా నంబర్లు కనిపించాయి. వీటిని చూసి అనుమానించిన పోలీసులు కాస్త లోతుగా విచారించారు. ఫలితంగా పంజగుట్టలోని సఫైర్‌ అపార్ట్‌మెంట్స్, మాసబ్‌ట్యాంక్‌లోని మహేశ్వరి కాంప్లెక్స్‌ల్లో అత్యాధునిక ఉపకరణాలు ఏర్పాటు చేసి, అంతర్జాతీయ ఇన్‌కమింగ్‌ కాల్స్‌ను లోకల్స్‌గా మారుస్తూ జరుగుతున్న కాల్‌ డైవర్షన్‌ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ప్రాంతాల్లో దాడి చేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మిగిలిన నిందితులను పట్టుకుని, కాల్‌ డైవర్షన్‌ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు.
·  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement