
ఉప్మా సమోసా
కావలసినవి: బొంబాయి రవ్వ– ముప్పావు కప్పు, పెరుగు– అర కప్పు
మైదాపిండి– ఒక కప్పు
ఉల్లిపాయ– ఒకటి (చిన్నగా తరగాలి)
అల్లం తురుము– కొద్దిగా
పచ్చిమిర్చి– 2 (చిన్నగా కట్ చేసుకోవాలి)
పచ్చి బఠానీలు– 50 గ్రాములు (నానబెట్టి ఉడబెట్టి పెట్టుకోవాలి), క్యారెట్– ఒకటి (తురుముకోవాలి)
క్యాప్సికం– ఒకటి (సన్నగా తరగాలి)
ఉప్పు, నూనె– సరిపడా
తయారీ: ముందుగా ఒక పాన్‌లో నూనె వేడి చేసి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. అనంతరం అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు వేసి గరిటెతో తిప్పుతూ వేయించాలి. అనంతరం బఠానీలు, క్యారెట్ తురుము, క్యాప్సికం ముక్కలు ఇలా అన్నీ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు బొంబాయి రవ్వ వేసి దోరగా వేయించాలి. ఉప్పు కూడా వేసి కలపాలి. ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి బాగా కలపాలి.
ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుని ఉప్మా బాగా మగ్గించి, స్టవ్ ఆఫ్ చేసుకుని, చల్లారనివ్వాలి. ఈలోపు ఒక గిన్నెలో మైదాపిండి, తగినంత ఉప్పు, కాస్త నూనె, నీళ్లు పోసి బాగా కలుపుతూ చపాతీ ముద్దలా చేసుకుని, అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న పూరీల్లా చేసుకుని సమోసాలా చుట్టుకుని దానిలో కొద్దికొద్దిగా ఉప్మా మిశ్రమాన్ని నింపుకుని ఫోల్డ్ చేసుకోవాలి. వాటిని నూనెలో దోరగా వేయించి టమోటో సాస్‌తో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి.
ఫ్రాన్స్ లాబ్‌స్టర్ థెర్మిడార్
కావలసినవి: లాబ్ట్సర్ (పీత జాతి) – ఒకటి (రెండు లేదా మూడు రొయ్యలతో కూడా ఇలా చేసుకోవచ్చు, లాబ్‌స్టర్‌ను శుభ్రం చేసుకుని, సగం ముక్కలుగా నిలువుగా కట్ చేసుకోవాలి. ఇరువైపులా ఉండే కాళ్ల భాగాలను మరో వంటకానికి వినియోగించుకోవచ్చు)
ఆలివ్ నూనె– 2 టేబుల్ స్పూన్లు
బటర్– 3 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ ముక్కలు– అర కప్పు
వెల్లుల్లి తరుగు– ఒక టీ స్పూన్
మైదా– 2 టేబుల్ స్పూన్లు
పాలు– ఒక కప్పు, ఫ్రెష్ క్రీమ్– పావు కప్పు
ఆవాల పేస్ట్– అర టీ స్పూన్ , చికెన్ స్టాక్– పావు కప్పు, పార్మెసాన్ చీజ్– అర కప్పు, ఉప్పు– సరిపడా
మిరియాల పొడి– కొద్దిగా
కొత్తిమీర తురుము– కొద్దిగా
తయారీ: ముందుగా ఒక పాన్ లో బటర్ వేసి కరిగించాలి. బటర్ కరిగిన తర్వాత, తరిగిన ఉల్లిపాయ వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. తరువాత వెల్లుల్లి వేసి ఒక నిమిషం పాటు గరిటెతో తిప్పుతూ వేయించాలి. ఇప్పుడు మైదా వేసి 2 లేదా 3 నిమిషాలు వేయించాలి. నెమ్మదిగా పాలు, చికెన్ స్టాక్ వేసి, ఉండలు లేకుండా బాగా కలపాలి.
ఈ మిశ్రమం చిక్కబడిన తర్వాత, ఆవాల పేస్ట్, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. చివరగా, కట్ చేసి పెట్టుకున్న లాబ్ట్సర్ ముక్కలు లేదా రొయ్యలు, ఫ్రెష్ క్రీమ్ వేసి, కొన్ని నిమిషాలు ఉడికించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పున్ లో బేక్ చేసుకోవాలి. చీజ్ బంగారు రంగులోకి మారి కరిగేవరకు 10–15 నిమిషాలు బేక్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.
త్రిపుర మాయిదుల్
కావలసినవి: అన్నం– 2 కప్పులు, ఉప్పు– సరిపడా
వెల్లుల్లి రెబ్బలు– 4 (తురుములా చేసుకోవాలి)
పచ్చిమిర్చి పేస్ట్– ఒక టీ స్పూన్, బియ్యప్పిండి– ఒక టేబుల్ స్పూన్
బేకింగ్ సోడా, అల్లం పేస్ట్– కొద్దికొద్దిగా
తయారీ: ముందుగా అన్నాన్ని చేత్తో పిసికి బాగా మెత్తగా చేసుకోవాలి. దానిలో సరిపడా ఉప్పు, వెల్లుల్లి తురుము, పచ్చిమిర్చి పేస్ట్, బియ్యప్పిండి, బేకింగ్ సోడా, అల్లం పేస్ట్ ఇలా అన్నీ బాగా కలిపి.. కొద్దికొద్ది మిశ్రమంతో గుండ్రటి బంతుల్లా చుట్టుకోవాలి. వాటిని బొగ్గులపై దోరగా కాల్చి, వేడి వేడిగా ఉన్నప్పుడు టొమాటో సాస్ లేదా నచ్చిన చట్నీలతో తినొచ్చు.