
సూర్యవంశ రాజులలో త్రిశంకుడు ఒకడు. అతడు ధర్మపరాయణుడు, సద్గుణవంతుడు. ఒకసారి అతడికి చిత్రమైన కోరిక కలిగింది. తన మానవ శరీరంతోనే స్వర్గానికి వెళ్లాలనేదే ఆ కోరిక. ‘మహర్షీ! బొందితో స్వర్గానికి వెళ్లాలని నా కోరిక. అది నెరవేరడానికి తగిన యజ్ఞం నిర్వహించండి’ అని కులగురువు వసిష్ఠుడిని కోరాడు. ‘రాజా! నీ కోరిక అసమంజసమైనది, అస్వాభావికమైనది. నీ కోరిక తీర్చడానికి నేనెలాంటి సాయం చేయలేను’ అంటూ వసిష్ఠుడు నిరాకరించాడు.వసిష్ఠుడి నిరాకరణతో త్రిశంకుడు దిగులు చెందాడు. సింహాసనాన్ని విడిచిపెట్టి, దక్షిణ దిశగా ప్రయాణం ప్రారంభించాడు. ఆ ప్రయాణంలో అతడు వసిష్ఠుడి కుమారులను కలుసుకున్నాడు. తపస్సంపన్నులైన వసిష్ఠుడి నూరుగురు కుమారులు తన కోరిక ఈడేర్చగలరని భావించి, వారికి తన కోరికను తెలిపి, తగిన యజ్ఞాన్ని చేయమని కోరాడు.త్రిశంకుడి కోరిక విని వసిష్ఠ కుమారులు ఆగ్రహోదగ్రులయ్యారు.
‘మా తండ్రి నిరాకరించిన తర్వాత అదే కోరికను నెరవేర్చమని మమ్మల్ని అడగటానికి నీకెంత ధైర్యం? నీ కోరిక కుర్రతనమో, వెర్రితనమో అర్థం కాకుండా ఉంది. ఇది అస్వాభావికం, అనుచితం. నువ్వు మూర్ఖుడివి, పాపాత్ముడివి. అందుకే మా తండ్రి నిరాకరించినా పట్టించుకోకుండా, అదేపనిగా పాకులాడుతున్నావు’ అని నిందించారు.వసిష్ఠ కుమారుల మాటలకు త్రిశంకుడు చిన్నబోయాడు. ‘మా కులగురువైన వసిష్ఠులవారు నిరాకరించారని, గురుపుత్రులైన మిమ్మల్ని ఆశ్రయించాను. మీరు నన్ను అర్థం చేసుకోకుండా దూషిస్తున్నారు. మీరు కూడా నా కోరికను తిరస్కరిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో నాకు ఒకటే ఉపాయం మంచిదనిపిస్తోంది. నా కోరికను నెరవేర్చగల మరో గురువు కోసం అన్వేషించడమే ఇప్పుడు నేను చేయదగిన పని’ అన్నాడు త్రిశంకుడు.త్రిశంకుడి మాటలకు వసిష్ఠపుత్రులు మండిపడ్డారు.
‘పాపాత్ముడా! నువ్వు గురుద్రోహాన్ని తలపెడుతున్నావు. మీ వంశానికి తరతరాలుగా గురువైన మా తండ్రిని కాదని, మరో గురువును చూసుకుంటానని అంటున్నావు. ఈ క్షణం నుంచి నువ్వు చండాలుడివి అవుతావు’ అని శపించారు.త్రిశంకుడు విచారంతో రాజధానికి వచ్చాడు. రాత్రి అశాంతిగా నిద్రించాడు. రాత్రి గడిచేసరికి తాను చండాలుడైనట్లు కనుగొన్నాడు. బంగారు వన్నెతో ఉన్న అతడి శరీరం నల్లగా మారింది. స్ఫురద్రూపి అయిన త్రిశంకుడు కురూపిగా మారిపోయాడు. అతడి ఆకారాన్ని చూసి, మంత్రులు కూడా నమ్మలేకపోయారు. ప్రజలు హేళన చేశారు. తన పరిస్థితికి త్రిశంకుడు కుంగిపోయాడు. దీర్ఘంగా ఆలోచించాడు. తన దుస్థితిని తప్పించి, తన కోరికను తీర్చగలవాడు ఒక్కడే ఒక్కడు– మహా తపస్సంపన్నుడైన విశ్వామిత్రుడు అని తలచాడు. అతడి కోసం వెదుకులాడుతూ బయలుదేరాడు. త్రిశంకుడు విశ్వామిత్రుడి ఆశ్రమానికి చేరుకునే వేళకు విశ్వామిత్రుడు ధ్యానంలో ఉన్నాడు. కాసేపటికి విశ్వామిత్రుడు కళ్లు తెరిచాడు.
ఎదురుగా దీనవదనంతో కురూపిగా ఉన్న త్రిశంకుడు కనిపించాడు. అతడిని దగ్గరకు పిలిచాడు. ‘నువ్వు అయోధ్య రాజువైన త్రిశంకుడివని నాకు తెలుసు. నీ పరిస్థితి ఎందుకు ఇలాగైంది? నువ్వు ఏదో దిగులుతో ఉన్నావు, కారణమేంటి? నీకు నేను చేయగల ఉపకారమేముంది?’ అని అడిగాడు.విశ్వామిత్రుడు ఆదరంగా పలకరించే సరికి త్రిశంకుడు కన్నీళ్లు పెట్టుకుని, చేతులు జోడించాడు.‘మహర్షీ! బొందితో స్వర్గానికి వెళ్లాలనేది నా కోరిక. మా కులగురువు వసిష్ఠుడు నా కోరికను నిరాకరించాడు. ఆయన పుత్రులను ఆశ్రయించాను. వారు కూడా నా కోరికను నిరాకరించారు. అంతేకాదు, నన్ను శపించారు. వారి శాపం వల్లనే ఇలా మారాను. నా కోరిక నెరవేర్చగల సమర్థులు మీరు మాత్రమే! అందుకే మిమ్మల్ని ఆశ్రయించాను. ఇక మీరే నాకు దిక్కు’ అన్నాడు.విశ్వామిత్రుడు అతడి దుస్థితికి జాలిపడ్డాడు. ‘నీ కోరికను నేను తీరుస్తాను’ అని అభయమిచ్చాడు.త్రిశంకుడి కోసం విశ్వామిత్రుడు ఒక మహాయాగం నిర్వహించాడు.
విశ్వామిత్రుడి తపోబలం వల్ల త్రిశంకుడు బొందితోనే స్వర్గానికి చేరుకున్నాడు.త్రిశంకుడు స్వర్గానికి చేరడం ఇంద్రుడికి ఇష్టంలేక, ‘త్రిశంకూ! గురుపుత్రుల శాపం పొందిన నువ్వు స్వర్గంలో ఉండటానికి అనర్హుడవు. వెంటనే భూలోకానికి వెళ్లిపో!’ అన్నాడు. ఇంద్రుడి ఆజ్ఞతో దేవతలు అతడిని తోసేశారు.‘మహర్షీ! దేవతలు నన్ను తోసేశారు. నేను కిందకు పడిపోతున్నాను. కాపాడండి’ అంటూ త్రిశంకుడు ఆర్తనాదాలు చేశాడు. విశ్వామిత్రుడు ‘నువ్వు అక్కడే నిలు’ అని పలికి, తన మంత్రబలంతో త్రిశంకుడు ఉన్నచోటునే మరో స్వర్గాన్ని నిర్మించాడు. ‘త్రిశంకూ! ఇది నీ స్వర్గం. నీ పేరుతో త్రిశంకు స్వర్గంగా ప్రఖ్యాతి పొందుతుంది. ఇంద్రుడి స్వర్గం అంతరించిపోతే అంతరించవచ్చు గాని, నేను నీ కోసం నిర్మించిన స్వర్గం నిలిచి ఉంటుంది.’ అన్నాడు విశ్వామిత్రుడు.
∙సాంఖ్యాయన
నువ్వు అయోధ్య రాజువైన త్రిశంకుడివని నాకు తెలుసు. నీ పరిస్థితి ఎందుకు ఇలాగైంది? నువ్వు ఏదో దిగులుతో ఉన్నావు, కారణమేంటి? నీకు నేను చేయగల ఉపకారమేముంది?