
‘‘అరేయ్ రాజూ! మాధురికి పెళ్లి కుదిరింది. అబ్బాయి పేరు జీవన్. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్’’ సంతోషంగా చెప్పాడు ప్రకాష్. ‘‘ఓహ్ కంగ్రాట్స్‌రా ప్రకాష్! అబ్బాయి సొంత ఊరేది? అతడి అమ్మానాన్నలు ఎక్కడుంటారు?’’ అడిగాడు రాజీవ్.‘‘అబ్బాయి తండ్రి హైదరాబాద్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీసులో మంచి ఉద్యోగమే చేస్తున్నాడు. తల్లి గృహిణి, వాళ్లకు మొదట అమ్మాయి, తరువాత అబ్బాయి. అమ్మాయికి పెళ్లయిపోయింది. తను కూడా అమెరికాలోనే కాపురముంటోందట!’’ అన్నాడు ప్రకాష్.‘‘చూడబోతే గొప్పింటి సంబంధంలాగా అనిపిస్తోంది. మనలాంటి మధ్యతరగతి వాళ్లకు ఎలా తూగారు?’’ అనుమానంగా అన్నాడు రాజీవ్.‘‘వాళ్ళు డబ్బుతో పాటు మంచి మనసున్న మారాజులురా! కానీ కట్నం వద్దని కచ్చితంగా చెప్పారు’’ అన్నాడు ప్రకాష్.‘‘అయితే మాధురి అదృష్టవంతురాలు.
ఎప్పుడూ ఎలాంటి సంబంధం వస్తుందో, ఎంత కట్నం అడుగుతారోనని భయపడేవాడివి. కుదిరిపోయింది కదా, ఇప్పుడు ప్రశాంతంగా ఊపిరి తీసుకో’’ అన్నాడు రాజీవ్.‘‘రాజూ! వాళ్ళు కట్నం వద్దన్నారని మనమేమీ ఇవ్వకుండా ఊరుకుంటే మర్యాదగా ఉంటుందా? మనకూ, వెళ్లిన చోట పిల్లకూ కూడా అవమానమే’’ అన్నాడు ప్రకాష్.‘‘అడిగింది ఇవ్వకపోతే అవమానం కానీ అడగకపోతే ఇవ్వడమెందుకు?’’‘‘అరేయ్ రాజూ! అడిగిన కట్నం ఇచ్చేస్తే ఎటువంటి గొడవుండదు. అడగకపోతే కట్నం లేదని మిగిలిన అన్ని లాంఛనాలు ఘనంగా పెట్టాలి’’‘‘అదీ నిజమే అనుకో! ఇంతకీ తాంబూలాలు పుచ్చుకునేది ఎప్పుడు?’’ అన్నాడు రాజీవ్.‘‘ప్రత్యేకంగా తాంబూలాలు మార్చుకోవడమేమీ లేదు. అమ్మాయిని చూడటానికి వచ్చిన రోజునే అమ్మాయి మెడలో అత్తగారు హారం వేశారు. అబ్బాయి తన చేతికున్న ఉంగరం తీసి అమ్మాయి వేలికి తొడిగాడు.
ఇదే నిశ్చితార్థం అనుకుందాం అని మా వియ్యంకులుగారు అన్నారు.’’‘‘అదేంట్రా? ఈ రోజుల్లో ఇంత సింపుల్‌గా నిశ్చితార్థం జరుపుకున్నవారిని మిమ్మల్నే చూశాను. ఎంగేజ్‌మెంట్ పేరుతో ఇరువైపులా బట్టలు పెట్టుకోవటం; తరువాత పెద్ద హోటల్లోనో, ఫంక్షన్ హల్లోనో భారీ ఎత్తున భోజనాలు, డ్రోన్‌లతో రక రకాల ఫొటోలు తీయడం దాదాపు పెళ్ళి చేసినంత ఆర్భాటంగా చేస్తున్నారు. వీళ్లేంటీ అలికిడి లేకుండా మన కాలంలో చేసుకున్నట్లు ఇంట్లో క్లుప్తంగా ముగించారు? అబ్బాయి ఎవరి తాలూకా? కుటుంబం గురించి సరైన విచారణ చేశావా?’’ ఆరా తీశాడు రాజీవ్.‘‘హహ...’’ అంటూ నవ్వేశాడు ప్రకాష్.‘‘నవ్వుతావేంట్రా? అసలే అమెరికా సంబంధం అంటున్నావు. ఈ మధ్యన అమెరికా పెళ్లిళ్ల గురించి టీవీలో చాలా వింటున్నాము. ఎవరికీ తెలియనివ్వకుండా తాంబూలాలు కానిచ్చారంటే చాలా ఆలోచనలు వస్తున్నాయి’’ అన్నాడు రాజీవ్.‘‘అలాంటి అనుమానాలు నాకూ వచ్చాయి. వాళ్ళు మా అత్తగారికి కాస్త దగ్గరి బంధువులవుతారు. ఎవరిని అడిగినా మంచి కుటుంబమనే చెప్తున్నారు.
వాళ్ళు రాజమండ్రిలో స్థిరపడ్డారు, అబ్బాయి చదువుకోవడానికి అమెరికా వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అసలు ముందుగా పెళ్లిళ్ల పేరయ్య ద్వారా ఈ సంబంధం మనకు వచ్చింది. వాళ్లకు ఫొటోల్లో మన అమ్మాయి నచ్చిందని చెప్పడంతో విషయం మనదాకా వచ్చింది. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు చుట్టరికం బయటకు వచ్చింది. అబ్బాయి వీడియో కాల్‌లో అమ్మాయిని చూసి, మాట్లాడి తన అంగీకారం తెలిపాడు. తరువాత ఇరుపక్షాల మాటలు జరిగాయి.
అంతా సరే అనుకున్నాక పెళ్ళికి సిద్ధపడ్డాం’’ అన్నాడు ప్రకాష్.‘‘తెలిసినవాళ్లేనా? అయితే ఇంకా కంగారు పడటానికేముంది? ఇంతకీ పెళ్లెప్పుడు?’’ అన్నాడు రాజీవ్.‘‘అబ్బాయి పెళ్లయ్యాక అమ్మాయిని కూడా తీసుకెళ్లాలంటే వీసా ప్రక్రియ కోసం పెళ్లి తొందరగా చేయాలని వియ్యంకుడు జగదీష్ చెప్పాడు. పెళ్లి మరో పదిహేను రోజుల్లో’’...‘‘అయితే పెళ్లి పనుల కోసం నువ్వు రేసు గుర్రంలాగా పరుగులు తీయాలి’’ నవ్వుతూ అన్నాడు రాజీవ్.‘‘అవునురా డబ్బున్నవాళ్లతో వ్యవహారం కదా ఎలా చేస్తానో అని కంగారుగా అనిపిస్తుంది. నువ్వు మాత్రం అమ్మాయి అత్తారింటికి వెళ్ళేదాకా తోడుండాలి’’...‘‘అది ప్రత్యేకంగా నువ్వు చెప్పాలా?’’ అన్నాడు రాజీవ్.∙∙ ప్రకాష్ చిన్న వ్యాపారస్తుడు రమ అతడి భార్య, వారికిద్దరు పిల్లలు మాధురి పెద్దది, బీటెక్ పూర్తిచేసి ఊర్లో ఉన్న చిన్న ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా ఉద్యోగం చేస్తోంది.
తరువాత మహేష్ బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. ప్రకాష్ సంపాదనతో ఉండటానికి సొంత ఇల్లు కట్టుకున్నాడు. అంతకు మించి అతడికి ఎటువంటి స్థిరాస్తులూ లేవు. కూతురికి తన స్తోమతకి తగిన సంబంధాలు చూడామని పెళ్ళిళ్ళ పేరయ్యకు చెప్పాడు. ఆయన వీళ్ళు కట్నం వద్దంటున్నారు, అమ్మాయి గుణగణాలు బాగుంటే చాలంటున్నారని ఈ సంబంధం తీసుకువచ్చాడు. తీరాచూస్తే అది దగ్గరి సంబంధం కావడంతో ప్రకాష్ చాలా సంతోషించాడు. దానికితోడు బంధువులందరూ కూతురికి గొప్ప సంబంధం వచ్చిందని అతడి అదృష్టాన్ని పొగుడుతుంటే మరింత ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.
‘‘రమా! మన ఇల్లు తాకట్టు పెట్టాలనుకుంటున్నాను’’ అన్నాడు ప్రకాష్. రమ తుళ్ళిపడింది.‘‘అదేంటండీ? ఎందుకలా? మనం అమ్మాయి పెళ్లికోసం కొంత డబ్బు పక్కన పెట్టాం కదా? ఇప్పుడు ఇల్లు తాకట్టు పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది?’’ ఆశ్చర్యంగా ప్రశ్నించింది రమ.‘‘పిచ్చిదానా! అప్పుడు మనం దాచిన డబ్బు మనబోటి సంబంధం కోసం. ఇప్పుడు మన తాహతుకి మించిన గొప్పవారి సంబంధం కుదిరింది. మరి వారికి నచ్చేలా అన్ని ఏర్పాట్లు చేయాలంటే ఎక్కువ డబ్బు కావాలిగా?’’ ప్రశ్నించాడు ప్రకాష్ .
ప్రకాష్ చేతిలో డబ్బు లేక తగ్గి ఉంటాడు కాని, సహజంగా దుబారా మనిషే! రమ ఎంత నచ్చచెప్పాలని చూసినా అతడు వినలేదు. ఇంటి దస్తావేజులు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చాడు. ముందూ వెనుకా చూడకుండా ధారాళంగా ఖర్చు పెడుతున్నాడు. తండ్రి అలా డబ్బులు గుమ్మరిస్తుంటే పిల్లలకు చిత్రంగా అనిపిస్తోంది. మహేష్ అదంతా చూసి సంబరపడినా, మాధురి మాత్రం తల్లి దగ్గర నుండి విషయం రాబట్టింది. తండ్రి చేస్తున్న అప్పు చూసి ఆమె మనసు తల్లడిల్లింది. పెళ్ళిబట్టలకు, నగలకు తాహతుకు మించి కొంటుంటే భవిష్యత్తు తలచుకుని ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
ఒకరోజు ప్రకాష్ పిల్లలను, భార్యను దగ్గరకు పిలిచాడు.‘‘మధూ! మహేష్! మీకు తెలిసిన కొత్తరకం వంటకాల పేర్లు చెప్పండి. మీకు తెలియకపోతే మీ స్నేహితులనైనా అడిగి తెలుసుకోండి. పెళ్ళిలో మనం పెట్టే భోజనాలు చూసి మగపెళ్లివారు అబ్బో భలే ఉన్నాయే అంటూ నోరు తెరవాలి’’ అన్నాడు ప్రకాష్.‘‘డాడీ! నేను చెప్తాను– మొన్న మా ఫ్రెండు అక్క పెళ్ళిలో కోవా వెరైటీస్ కొత్త రకానివి పెట్టారు. పనీర్ జిలేబీ, కోవా కజ్జికాయలు వేడి వేడిగా వేసిస్తుంటే మేమంతా బోలెడన్ని తినేశాం’’ అన్నాడు మహేష్.‘‘డాడీ! తమ్ముడు అలాగే చెప్తాడు కాని, వంటవాళ్ళని అడిగితే కొత్తగా చేస్తున్న వంటకాలు చెప్తారు. ఎక్కువ రకాలు అవసరం లేదు. రుచికరమైనవి కొన్ని చేయిస్తే సరిపోతుంది’’ అంది మాధురి.‘‘మధు సరిగ్గా చెప్పింది. మీరు అనవసరమైన ఆర్భాటాలకు పోకండి’’ అంది రమ.‘‘మనం కట్నం ఇవ్వడం లేదు, భోజనాలైనా మంచిగా పెట్టకపోతే ఎలా?’’ అన్నాడు ప్రకాష్.
‘‘ముందు మనం మధూ పెళ్ళికి అనుకున్నదాని కన్నా ఎక్కువే ఖర్చు పెడుతున్నారు. పెళ్లి అవగానే సరికాదు, తరువాతే ఎక్కువ అవసరాలుంటాయి. ఇలా అయితే తరువాత ఇబ్బంది పడతాం’’ అంది రమ.ప్రకాష్‌కి ఆ మాటలు రుచించలేదు. స్నేహితుడిని సంప్రదించాడు. ‘‘మధ్య తరగతి వాళ్ళం చూసుకుని ఖర్చు పెట్టకపోతే పెద్ద దెబ్బ తగులుతుంది. వాళ్ళు అడగకపోయినా బంగారం, బట్టలు అంటూ చాలా డబ్బులు గుమ్మరిస్తున్నావు. చెల్లెమ్మ చెప్పినట్లు విను’’ అన్నాడు రాజీవ్.ప్రకాష్ అతడి మాటలు కూడా పెడచెవిన పెట్టాడు. వంటవాళ్లతో తనే స్వయంగా మాట్లాడి భారీ ఎత్తులో మెనూ తయారుచేశాడు. పెళ్లిరోజు దగ్గరకు వచ్చింది. పెద్ద కళ్యాణమండపం, దానికి అలంకరణ బ్రహ్మాండంగా చేయించాడు.భోజనాలకు ముందు అల్పాహారంలో పానీపూరీ. బజ్జీమసాలా, సమోసా చాట్, చిన్న పునుగు, వెజ్ కట్లెట్, పనీర్ టిక్కా, పావ్ భాజీ, చిన్న పిజ్జా, బఠాణీ చాట్, పెసర దోశ ఏర్పాటు చేశాడు. వచ్చిన జనం అక్కడ కిక్కిరిసిపోయి ఉన్నారు.
ఎన్నో రకాల పదార్థాలు నోరూరిస్తూ కనిపిస్తుంటే, అందులోనూ ఉచితంగా ఆకర్షిస్తుంటే ఆపడం ఎవరి తరం?... ఒకో స్టాల్ దగ్గర ఆగడం అక్కడ ఉన్న వంటకం పెట్టించుకోవడం... కొంచెం రుచి చూడటం, అది పారేసి మళ్ళీ మరోదాని కోసం వెళ్లడం, అక్కడ మరో ప్లేట్ తీసుకుని అది వేయించుకోవడం, అది కొంచెం తినగానే మరో కొత్త వంటకం కనిపించగానే చేతిలో ఉన్నది పూర్తిగా తినకుండానే చెత్త డబ్బాలో పడేసి, అక్కడకు వెళ్లి మరో ప్లేట్ అందుకోవడంలో జనం బిజీ అయ్యారు. అల్పాహారాలు తినడంతో సగానికి పైగా పొట్టలు నిండిపోయాయి. తరువాత అందరూ కాసేపు లోపలకు వెళ్లి పెళ్లి చూస్తూ కూర్చున్నారు. కాసేపటి తరువాత మళ్ళీ భోజనాల దగ్గరకు వచ్చారు. అక్కడ సుమారు పది రకాల స్వీట్లు, ఇరవై రకాల వంటకాలు, పది రకాల ఫ్రూట్స్, పది రకాల డిజర్ట్స్ ఉన్నాయి. అన్ని వంటకాలూ వేడిగా ఉండేందుకు అన్నింటి కిందా చిన్న స్టవ్‌లు కూడా ఉన్నాయి.
నోరూరించే ఎన్నో రకాల పదార్థాలను చూసి, అన్నీ రుచి చూడాలనే అతృతతో అన్నీ వేయించుకుని, పొట్టలో పట్టకపోవడంతో తినకుండానే వృథాగా చెత్తడబ్బాలో పారేస్తున్నారు. మనిషి తన నోటితో తను ఇక చాలని చెప్పగలిగేది ఆహారం విషయంలో మాత్రమే! ప్రకాష్ దంపతులు పెళ్ళికి వచ్చిన అతిథులను పలకరించి వేదిక మీద కూర్చున్నారు. వేదమంత్రాల సాక్షిగా మంగళవాయిద్యాల నడుమ బంధుమిత్రుల సమక్షంలో మాధురి, జీవన్‌ల పెళ్లి జరిగింది. తరువాత నూతన వధూవరులు, అమ్మాయి తల్లితండ్రులు, అబ్బాయి తల్లితండ్రులు భోజనాలు చేయడానికి భోజనశాల వైపుకి వస్తున్నారు. వారి వెనుక రాజీవ్ కూడా నడుస్తున్నాడు. భోజనశాలలో రెండు విభాగాలున్నాయి. ఒకటి బంతి భోజనాలు, మరొకటి బఫే భోజనాలు. వీళ్ళు బఫే భోజనాలు దాటి బంతి భోజనాల వైపుకి వెళ్తుండగా నడుస్తున్న జగదీష్ ఆగిపోయాడు.
‘‘బావగారు! బఫే భోజనం చేద్దామంటారా?’’ వెనక్కు తిరిగి వచ్చి అడిగాడు ప్రకాష్.‘‘ఆ డస్ట్ బిన్ వైపు చూశారా? అందులో ప్లేట్స్‌లో తినకుండా పారేసిన స్వీట్లు, హాట్లు, ఇతర ఆహార పదార్థాలు చూడండి. ఎంత ఆహారం వృథాగా నేలపాలయిందో చూశారా?’’ అన్నాడు జగదీష్.‘‘బావగారు! ఎక్కువ రకాల వంటకాలు చేయించాం కదండీ! ఒక్కసారే అన్నీ తినలేక పారేసుంటారు అంతే కాని, రుచిగా ఉండకపోవడం వల్ల కాదండీ’’ అన్నాడు ప్రకాష్.‘నా ప్రశ్న మీకలా అర్థమైందా?’ మనసులో అనుకున్న జగదీష్ ఒకసారి ఆయన వైపు అదోలా చూసి మౌనంగా వాళ్లతో నడిచాడు. ప్రకాష్ భోజనాల దగ్గర తనే స్వయంగా ‘‘బావగారు! ఈ స్వీటు తినండి బాగుంటుంది, చెల్లెమ్మా! ఈ పెసర పునుగు ఆవడ తినండి బాగుంటుంది, బాబూ! పుదీనా రైస్ రుచి చూడండి’’ అని పెట్టించబోయాడు. అతను ఎంత బలవంతం చేసినా జగదీష్, అతని భార్య, జీవన్ కొన్ని రకాల పదార్థాలు మాత్రమే తిన్నారు. అదిచూసి ప్రకాష్ ముఖం మాడిపోయింది.
అప్పగింతలయ్యాక మగ పెళ్లివాళ్ళు వెళ్లిపోతున్న సమయంలో అందరూ కళ్యాణమండపం బయటకు వచ్చారు. అక్కడ ఒక పక్కన చెత్తబండి పెట్టుంది. ఫంక్షన్ హాల్ లోపల నిండిపోయిన టబ్‌లు తెచ్చి అందులో వేస్తున్నారు. కొంతమంది బిచ్చగాళ్ళు అందులో నుంచి ఆహార పదార్థాలు ఏరుకుని, వాళ్ళ దగ్గరున్న సత్తుగిన్నెల్లో వేసుకుంటున్నారు. కొన్ని తడిసిపోయిన వాటిని తీసి, వారి చినిగిన దుస్తులకు తుడుస్తూ గిన్నెలో వేస్తున్నారు. రెప్పవాల్చకుండా అటువైపే చూస్తున్న జగదీష్ కనుకొలకులలో నీటి బిందువులు నిలిచాయి. జేబులోంచి కర్చీఫ్ తీసుకుని తుడుచుకున్నాడు.‘‘బావగారు! మా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? ఎందుకు బాధపడుతున్నారు’’ కంగారుగా అడిగాడు ప్రకాష్.‘‘అదేం లేదు’’ అంటూ కారెక్కి కూర్చున్నాడు జగదీశ్.పెళ్ళికూతురుని తీసుకుని మగపెళ్లివాళ్ళు హైదరాబాద్ వెళ్లిపోయారు. వెళ్ళేముందు రెండవరోజు జరుగబోయే సత్యనారాయణస్వామి వ్రతానికి, అదేరోజు సాయంత్రం ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌కి అందరినీ తప్పకుండా రమ్మని మరీ మరీ ఆహ్వానించారు.
‘‘రమా! ఎందుకో జగదీష్‌గారు సంతృప్తిగా ఉన్నట్లనిపించడం లేదు’’ వాళ్ళు వెళ్ళాక అన్నాడు ప్రకాష్.‘‘అదేం లేదు లెండి!’’ అంది రమ.‘‘ఎందుకో ఆయన కళ్ళు కూడా తుడుచుకున్నాడు’’ అన్నాడు ప్రకాష్. ‘‘ఇప్పుడవన్నీ ఆలోచించే వ్యవధి లేదు. రేపు మనం హైదరాబాద్ వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. వ్రతానికి పీటలమీద కూర్చున్నప్పుడు అమ్మాయి అల్లుడుగారికి అలాగే వాళ్ళ అత్తమామగార్లకు కూడా మనం బట్టలు పెట్టాలి. పళ్ళు, స్వీట్స్ కూడా పట్టుకెళ్ళాలి’’ అంది రమ. ‘‘రమా! మళ్ళీ చాలా డబ్బులు కావాలి... నా దగ్గరున్న డబ్బంతా అయిపోయిపోతుంది. కట్నం లేదన్న మాటే కానీ పై ఖర్చులు చాలా అయ్యాయి’’ అన్నాడు ప్రకాష్.
‘‘ఆర్భాటాలకు పోతే అలాగే అవుతుందని నేనెంత చెప్పినా మీకు అర్థం కాలేదు. ఇప్పుడనుకుని ఏం లాభం? స్వీట్స్ అన్నాను కదా అని ఖరీదు ఎక్కువ వాటి జోలికి పోకండి.
లడ్డు, కాజాలు చాలు’’ అంది రమ . ప్రకాష్ కుటుంబం మరి కొందరు దగ్గరి బంధువులతో కలిసి రెండవరోజు ఉదయం మగ పెళ్లివారింటిలో దిగారు. వారు మర్యాదగా ఆహ్వానం పలికారు. అల్పాహారంగా ఇడ్లీ, వడ, కొబ్బరి చట్నీ, కారప్పొడి వేసి పెట్టారు. సత్యనారాయణ స్వామి పూజకు ఇంట్లో బంధువులు మాత్రమే ఉన్నారు. వియ్యాలవారు భోజనాలు ఎంత గొప్పగా పెడతారోనని ఊహించుకున్న ప్రకాష్‌కి నిరాశే ఎదురైంది. పులిహోర, పూర్ణం, మిరపకాయ బజ్జీ, వంకాయ చట్నీ, ముద్దపప్పు, రసం, బెండకాయ వేపుడు, అప్పడం, గడ్డపెరుగు పెట్టారు. అందరూ శుభ్రంగా పదార్థాలన్నీ వదలకుండా తినేశారు. ‘‘అరేయ్ రాజూ! భోజనాలు మరీ ఇంత సింపుల్‌గా పెట్టారేంట్రా?’’ అన్నాడు గుసగుసగా ప్రకాష్.‘‘ఇప్పుడు ఇంట్లో వాళ్లకు మాత్రమే కదా! అందుకే ఇలా పెట్టుంటారు సాయంత్రం రిసెప్షన్‌లో బాగా పెడతారనుకుంటా. అయినా కొన్ని వంటకాలు పెట్టినా మంచి భోజనం పెట్టారు’’ మెచ్చుకుంటూ అన్నాడు రాజీవ్.
సాయంత్రం అందరూ రిసెప్షన్‌కి వెళ్లారు. అది పెద్ద ఫంక్షన్ హాల్. సహజమైన పూలతో చాలా తేలికపాటి అలంకరణ చేశారు. చూడటానికి చాలా అందంగా అనిపిస్తోంది. బయట ఎక్కడా అల్పాహారాల స్టాల్స్ లేవు. లోపలకు వెళ్ళగానే ముందుగా అందరికీ వెల్‌కమ్ డ్రింక్‌గా బాదంపాలు ఇచ్చారు. మరే ఇతర స్నాక్స్ పెట్టలేదు. రిసెప్షన్‌కి వచ్చిన వాళ్లంతా వధూవరులకు అక్షింతలు వేశాక, కుటుంబ సభ్యులు డైనింగ్ హాల్ వైపు నడిచారు. అక్కడ ఎంన్లోస్ ఒక రైతు వరి కంకులు పట్టుకుని నిలబడిన చిత్రం పెట్టారు. దాని కింద ‘ఒక వరి కంకి తయారు కావాలంటే రైతు నూట ఎనిమిది రోజులు కష్టపడతాడు’ అని రాసుంది. అది దాటుకుని లోపలకు వెళ్ళగానే, అక్కడక్కడా కొన్ని పేపర్ కటింగ్స్ పుల్ల ఆధారంగా నిలబెట్టబడి ఉన్నాయి.
‘అన్నదాతా సుఖీభవ!’...‘ఆహారం వృథా చేయకండి’...‘మీరు ఏది తినగలరో అదే తీసుకోండి’‘తినలేనిది పెట్టుకుని నేలపాలు చేయకండి’...‘పారేసేముందు పంటలు పండించే రైతు కష్టాన్ని గుర్తుచేసుకోండి’...‘పిల్లల పెళ్ళిచేయడానికి ఆ తండ్రి పడే కష్టాన్ని తలచుకుంటే ఒక్క పదార్థం కూడా పారేయకుండా తింటారు’...అనే క్యాప్షన్స్ ఉన్నాయి. అందరూ వాటిని చదువుతూ మాట్లాడుకుంటున్నారు. ‘భలే రాశారు కదా?’...‘ఇలాంటివి చదివాక ఎవరైనా ఆహారం వృథా చేస్తారా?’... ‘అన్ని చోట్లా ఇలాంటి బోర్డులు పెడితే ఎవరూ తినే పదార్థాలు పొరపాటున కూడా పారేయరు’అక్కడున్న అందరూ పైకే మాట్లాడుకుంటున్నారు. ప్రకాష్, రమ, మాధురి, రాజీవ్ ఆశ్చర్యంగా చూస్తున్నారు.
‘జీవన్ గారు! ఈ విధమైన ఏర్పాట్లు ఎవరి సూచనలతో చేశారు? నాకు చాలా నచ్చింది’ అంది మాధురి.ప్రకాష్ అల్లుడి జవాబు కోసం అటే చూస్తున్నాడు.‘డాడీ చిన్నప్పటి నుండి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. డబ్బు, ఆహారమే కాదు ఏదీ వృథా చేయడం ఆయనకు ఇష్టముండదు. ఆర్భాటాలకు పోయి అప్పు చేయడం కూడా నచ్చదు. నిన్న అక్కడ పెళ్ళిలో భోజనాలు పారేయడం చూసి చాలా బాధపడ్డారు. అన్నపూర్ణను గౌరవించిన వారి దగ్గర ఆమె కొలువుంటుందని ఎప్పుడూ చెప్తుంటారు. ఆయన మన పెళ్లి సందర్భంగా ఈరోజు చాలామంది హోమ్‌లెస్ పీపుల్‌కి ఆహారం సరఫరా చేశారు’’ అన్నాడు జీవన్.ఆ మాటలు వినగానే ప్రకాష్ ముఖంలో రంగులు మారాయి. రమ ముఖంలో ఆనందం కనిపించింది. ‘‘మామయ్య గారి అభిప్రాయాలు చాలా ఆదర్శవంతంగా అనిపిస్తున్నాయి’’ అంది మాధురి చిన్నగా.
‘‘థాంక్స్ అమ్మా!’’ అన్నాడు జగదీష్. ‘‘బావగారు ! నేను మీ విషయంలో చాలా అపోహపడ్డాను. నన్ను మన్నించండి, ఇంత మంచి కుటుంబానికి నా కూతురిని ఇచ్చినందుకు గర్వపడుతున్నాను’’ ఆనందంగా అన్నాడు ప్రకాష్. ‘‘బావగారు! ఆడపిల్ల పెళ్ళి చేసి బరువు దించుకోవాలనే తాపత్రయంతో మీరు బరువు పెంచుకున్నారని నాకు తెలిసింది. మా అబ్బాయి మీ ఇంటి అల్లుడయ్యాడు. మీ కష్టసుఖాలలో భాగం పంచుకోవడానికి అనుమతిస్తే మన్నిస్తాను’’ నవ్వుతూ అన్నాడు జగదీష్.‘‘ఏమిటది? కొంపదీసి ఇల్లు తనఖా పెట్టిన విషయం తెలిసిందా?’’ ఆలోచిస్తున్నాడు ప్రకాష్. ‘‘బావగారూ! మీరు అంతగా ఆలోచించకండి. ఏ ఆడపిల్లయినా పుట్టింట్లో ఇబ్బందులు లేకుండా ఉంటేనే తను అత్తింట్లో సంతోషంగా ఉండగలుగుతుంది. మా కోడలి సంతోషం మాకు కావాలి. ఇకనుండి మన రెండు కుటుంబాలు ఒకటే’’ అన్నాడు జగదీష్.‘‘అరేయ్ ప్రకాష్! జీవన్, మాధురి పెళ్ళిలో నాకు జీవనమాధుర్యం అంటే ఏమిటో తెలిసిందిరా!’’ అన్నాడు రాజీవ్.ఆ మాటలకు పెళ్లివారింట్లో అందరి నవ్వులు చిచ్చుబుడ్డీలలా వెలుగులపూలు జిమ్మాయి.
‘డాడీ చిన్నప్పటి నుండి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. డబ్బు, ఆహారమే కాదు ఏదీ వృథా చేయడం ఆయనకు ఇష్టముండదు. ఆర్భాటాలకు పోయి అప్పు చేయడం కూడా నచ్చదు. నిన్న అక్కడ పెళ్ళిలో భోజనాలు పారేయడం చూసి చాలా బాధపడ్డారు.
∙కె.వి.సుమలత