అక్కడ చనిపోయి... ఇక్కడ బతికాడు! | sakshi funday crime stories | Sakshi
Sakshi News home page

అక్కడ చనిపోయి... ఇక్కడ బతికాడు!

Sep 7 2025 1:15 PM | Updated on Sep 7 2025 1:19 PM

sakshi funday crime stories

అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసానికి ప్రతీకారంగా హైదరాబాద్‌ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ముప్పయ్యారు బాంబు పేలుళ్లకు పాల్పడిన డాక్టర్‌ బాంబ్‌ అలియాస్‌ జలీస్‌ అన్సారీ ప్రధాన అనుచరుడు సయ్యద్‌ ముసద్దిక్‌ వహీదుద్దీన్‌ ఖాద్రీ వింత కథ ఇది. ముంబైలోని ఏడు విధ్వంసాలకు బాధ్యుడైన ఖాద్రీ అక్కడి పోలీసుల రికార్డుల ప్రకారం 2003లో చనిపోయాడు. రికార్డుల్లో చనిపోయిన ఇతగాడు రహస్యంగా హైదరాబాద్‌కు మకాం మార్చి, 2010 వరకు గుట్టుగా బతికాడు. ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి తన అనుచరులకు ఈ–మెయిల్‌ పంపడంతో మహారాష్ట్ర ఏటీఎస్‌కు పట్టుబడ్డాడు. ప్రస్తుతం పరవాడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు.

సినిమాను తలపించే ఖాద్రీ ఉదంతం ఇదీ...
ముంబైకి చెందిన డాక్టర్‌ జలీస్‌ అన్సారీ ఎంబీబీఎస్‌ పూర్తి చేశాడు. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం తరవాత అతివాద భావాలు గల కొందరిని అనుచరులుగా చేసుకుని ముఠా కట్టాడు. వారిలో ఖాద్రీ కూడా ఒకడు. ఈ ముఠా 1993–94ల్లో రాజస్థాన్, మహారాష్ట్ర, హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా 36 ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు పాల్పడింది. వీరు టార్గెట్‌ చేసిన వాటిలో రైళ్లు, రైల్వేస్టేషన్లే ఎక్కువగా ఉన్నాయి. జలీస్‌ అన్సారీ ముఠా 1993లో హైదరాబాద్‌లోని నాంపల్లి, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లు, రిజర్వేషన్‌ కౌంటర్లలో పేలుళ్లుకు ఒడిగట్టింది. తక్కువ ప్రభావం గల బాంబులను తయారు చేయడంలో దిట్ట అయిన జలీస్‌ అన్సారీని పోలీసు, నిఘా వర్గాలు ‘డాక్టర్‌ బాంబ్‌’ అని పిలుస్తుంటాయి. 1994 జనవరి 3న  పోలీసులకు చిక్కడంతో ఇతడి విధ్వంసాలకు పుల్‌స్టాప్‌ పడింది. 

జలీస్‌ అన్సారీకి ప్రధాన అనుచరుడు ఖాద్రీపై ముంబైలో అనేక కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలోని రాయగఢ్‌ జిల్లాలో ఉన్న జంజీరామురాజ్‌ ఇతడి స్వగ్రామం. ముంబైలోని కేసులన్నీ 1998లో వీగిపోవడంతో నిర్దోషిగా బయటకు వచ్చాడు. కర్ణాటకలోని మంగుళూరుకు చెందిన అంతర్రాష్ట్ర గజదొంగ యాడ వసంత్‌ గ్యాంగ్‌లో చేరి ఇతని ప్రధాన అనుచరుడైన గోపాల రమణ శెట్టితో కలిసి మహారాష్ట్రలో దోపిడీలకు పాల్పడ్డాడు. 2004లో హైదరాబాద్‌ అబిడ్స్‌లోని రాజ్యలక్ష్మీ జ్యూలర్స్‌ నుంచి రూ.1.5 కోట్లు సొత్తు దోపిడీ చేసింది ఈ ముఠానే! అయితే, ఆ కేసులో ఖాద్రీ ప్రమేయం లేదు. మహారాష్ట్ర, కర్ణాటకల్లో జరిగిన దోపిడీల్లోనే ఇతను పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలోనే 2001లో ముంబై పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లాడు. ఆ తరవాతి ఏడాది బెయిల్‌పై విడుదలయ్యాడు. ఖాద్రీపై ముంబై ఏటీఎస్‌తో పాటు ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీల నిఘా పెరగడంతో ఓ పెద్ద కుట్ర పన్నాడు. 

పోలీసుల దృష్టిలో, ప్రభుత్వ రికార్డుల ప్రకారం తాను చనిపోయినట్లు నమ్మిస్తేనే నిరాటంకంగా తన కార్యకలాపాలు కొనసాగించడానికి అవకాశం ఉంటుందని భావించిన ఖాద్రీ భార్యతో కలిసి పక్కా ప్లాన్‌ వేశాడు. 2003 ఆగస్టు 15న ముంబైలోని మీరారోడ్‌లో ఉన్న ఎస్‌ఏ అపార్ట్‌మెంట్స్‌లోని తన ఫ్లాట్‌కు సలీమ్‌ అనే అనుచరుడిని పిలిచాడు. మాటల్లో పెట్టి అతడి గొంతు నులిమి చంపేశాడు. శవాన్ని ఎవరూ గుర్తుపట్టలేనంతగా అదే గదిలో కాల్చేశాడు. మృతదేహాన్ని అక్కడే ఉంచి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అప్పట్లో ఆ మృతదేహాన్ని చూసిన ఖాద్రీ భార్య అది తన భర్తదే అంటూ వాంగ్మూలం ఇచ్చింది. దీంతో పోలీసులు ఖాద్రీ చనిపోయాడని, గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారని కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసు కొలిక్కి రాకపోయినా, పోలీసు రికార్డుల్లో మాత్రం ఖాద్రీ చనిపోయాడు. 

తన భార్య, సోదరుడి సాయంతో తానే చనిపోయినట్లు ముంబై పోలీసులను నమ్మించిన ఖాద్రీ– తర్వాత జలీస్‌ అన్సారీ ముఠాలోని వ్యక్తుల సహకారంతో హైదరాబాద్‌కు వచ్చాడు.  2003 నుంచి 2006 వరకు సికింద్రాబాద్‌ ప్రాంతంలో నివసించాడు. ఆపై ఇమ్రాన్‌ అబు మన్సూర్‌ హత్మీ పేరుతో గోల్కొండలోని మొహల్లాగంజ్‌ ప్రాంతంలో అద్దె ఇంట్లో దిగాడు. అత్తర్లు, సుగంధ ద్రవ్యాలు విక్రయించే వ్యాపారి ముసుగు ధరించాడు. 2008లో ఇదే పేరు, చిరునామాతో డ్రైవింగ్‌ లైసెన్స్, 2009లో ఓటర్‌ గుర్తింపు కార్డు పొందాడు. తన కుటుంబాన్ని మాత్రం మహారాష్ట్రలోని చింబూర్‌లో ఉంచిన ఖాద్రీ తరచు అక్కడికి వెళ్లి వచ్చేవాడు. ఎప్పటికైనా మళ్లీ ముంబై వెళ్లాలని భావించిన ఇతగాడు అందుకోసం ప్లాస్టిక్‌ సర్జరీ ద్వారా తన రూపురేఖలు మార్చుకోవాలని భావించాడు. దీనికోసం హైదరాబాద్‌లోని ఓ డాక్టర్‌ను సంప్రదించాడు.  

ఇక్కడ ఉంటూ కూడా ఉగ్రవాద కార్యకలాపాలు సాగించిన ఖాద్రీ 2003 చివరలో పాకిస్తాన్‌ వెళ్లివచ్చాడు. అప్పటి నుంచి ఇతగాడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న కొందరు ఉగ్రవాద సానుభూతిపరులైన వ్యక్తులతో పాటు తన అనుచరులతోనూ ఈ–మెయిల్‌ ద్వారా సంప్రదింపులు జరిపేవాడు. వీటి కోసం ఆసిఫ్‌నగర్‌లోని ఓ జిరాక్స్‌ అండ్‌ ఇంటర్‌నెట్‌ సెంటర్‌లో ఉన్న కంప్యూటర్లను వినియోగించాడు. ఆ ఉగ్రవాదుల్లో కొందరి ఈ–మెయిల్స్‌పై నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీల దృష్టి హైదరాబాద్‌ నుంచి వారికి వస్తున్న మెయిల్స్‌పై పడింది. తరచుగా ఇవి వస్తుండటంతో వాటిలోని సంభాషణలను అధ్యయనం చేశాయి. వీటిని పంపుతున్నది 2003లో ‘చనిపోయిన’ ఖాద్రీగా నిర్ధారించారు. దీనిపై సమాచారం అందుకుని రంగంలోకి దిగిన ముంబై ఏటీఎస్‌ అధికారులు ఈ–మెయిల్స్‌ పంపుతున్న ఐపీ (ఇంటర్‌నెట్‌ ప్రొటోకాల్‌) అడ్రస్‌ ఆధారంగా మెహదీపట్నంలోని ఇంటర్‌నెట్‌ సెంటర్‌ను గుర్తించారు. అక్కడ దాదాపు పది రోజులు మాటు వేసిన ప్రత్యేక బృందం 2010 ఆక్టోబర్‌లో ఖాద్రీని పట్టుకుని ముంబై తరలించింది. ఇతడు ఇప్పటికీ మహారాష్ట్ర జైలులోనే ఉన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement