
ఒడిశా కనికా
కావలసినవి: బాస్మతి బియ్యం– ఒక కప్పు, నెయ్యి– 5 టేబుల్ స్పూన్లు, జీలకర్ర– ఒక టీస్పూన్, లవంగాలు– 5, ఏలకులు– 3 (కచ్చాపచ్చా చేసుకోవాలి), దాల్చిన చెక్క– చిన్న ముక్క, జాజికాయ పొడి– కొద్దిగా, బిర్యానీ ఆకు– 1, కిస్మిస్, జీడిపప్పు– 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు– రుచికి సరిపడా, పంచదార– 4 టేబుల్ స్పూన్లు (రుచికి సరిపడా పెంచుకోవచ్చు), పసుపు– పావు టీస్పూన్, నీళ్లు– 2 కప్పులు
తయారీ: ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రం చేసి, సుమారు 30 నిమిషాలు నానబెట్టి, ఆ తర్వాత పూర్తిగా నీళ్లు లేకుండా వడకట్టుకుని పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుకర్‌లో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక జీలకర్ర, లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి అవి వేగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు బియ్యాన్ని కుకర్‌లో వేసి, నెయ్యిలో 2 నిమిషాలు గరిటెతో తిప్పుతూ, వేయించాలి.
వేగిన బియ్యంలో పసుపు, ఉప్పు, పంచదార వేసి బాగా కలపాలి. ఆ తర్వాత నీళ్లు పోసి, ఒకసారి కలిపి, కుకర్ మూత పెట్టాలి. ఒక విజిల్ వచ్చేవరకు మీడియం మంట మీద ఉడికించాలి. విజిల్ వచ్చాక స్టవ్ ఆపి, కుకర్ లోపల ఆవిరి మొత్తం పోయేవరకు అలాగే కదపకుండా ఉంచాలి. అనంతరం కుకర్ మూత తీసి, జాజికాయ పొడి వేసి, నెమ్మదిగా అన్నం మెతుకులు విరగకుండా కలపాలి. (ఇది పూరీజగన్నాథ ఆలయ ఛప్పన్న నైవేద్యాల్లో ఒకటి). ఈ టేస్టీ కనికాను పప్పుతో కలిపి తింటే భలే రుచిగా ఉంటుంది.
నూడుల్ వెజిటబుల్ కట్లెట్స్
కావలసినవి: నూడుల్స్– ఒక కప్పు (ఉడికించినవి)
కూరగాయ ముక్కలు– అర కప్పు (చిన్నచిన్నగా కట్ చేసుకోవాలి, నచ్చిన కూరగాయలు తీసుకోవచ్చు)
బంగాళ దుంపలు– 2 (మెత్తగా ఉడికించి, గుజ్జులా చేసుకోవాలి. కొత్తిమీర తరుగు– 2 టేబుల్ స్పూన్లు, ఉల్లికాడ ముక్కలు– కొద్దిగా
పచ్చిమిర్చి ముక్కలు– కొద్దిగా
బ్రెడ్ పౌడర్– కొద్దిగా, మొక్కజొన్న పిండి– ఒక టేబుల్ స్పూన్, ఉప్పు– తగినంత, నూనె– సరిపడా,టొమాటో కెచప్– కొద్దిగా
తయారీ: ఒక గిన్నెలో ఉడికి, చల్లారిన నూడుల్స్, కూరగాయ ముక్కలు, బంగాళ దుంప గుజ్జు, పచ్చిమిర్చి ముక్కలు, మొక్కజొన్న పిండి, బ్రెడ్ పౌడర్, తగినంత ఉప్పు వేసుకుని
బాగా కలుపుకోవాలి. అభిరుచిని బట్టి క్యారట్ తురుము వంటివి కలుపుకోవచ్చు. కొత్తిమీర తురుము, ఉల్లికాడ ముక్కలు కలుపుకుని కట్లెట్స్‌లా చేసుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే టొమాటో కెచప్ కలిపి తింటే చాలా బాగుంటాయి.
ఇటాలియన్ టొమాటో బ్రుషెట్టా
కావలసినవి: బ్రెడ్ ముక్కలు– 6 (చీజ్ బ్రెడ్ లేదా రస్క్ ముక్కలు కూడా తీసుకోచ్చు), టొమాటోలు– 3 (పండినవి ఎన్నుకోవాలి, చిన్నగా తరిగినవి), వెల్లుల్లి రెబ్బలు– 2 (చిన్నగా తరగాలి), ఆలివ్ నూనె– 3 చెంచాలు, తరిగిన తాజా తులసి ఆకులు– కొన్ని, ఉప్పు– సరిపడా, మిరియాల పొడి– కొద్దిగా
తయారీ: ముందుగా ఒక గిన్నెలో చిన్నగా తరిగిన టొమాటో ముక్కలు, ఆలివ్ నూనె, వెల్లుల్లి తరుము, తరిగిన తులసి ఆకులు, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు బ్రెడ్ ముక్కలను లేదా రస్క్ ముక్కలను ఒక టోస్టర్ లేదా పాన్‌లో ఆలివ్ నూనెతో దోరగా బేక్ చెయ్యాలి.
బ్రెడ్ ముక్కలు వేడిగా ఉన్నప్పుడే, ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకుని వాటిపై రుద్దాలి. ఇది బ్రెడ్‌కు మంచి ఫ్లేవర్‌ని ఇస్తుంది. అనంతరం ప్రతి బ్రెడ్ ముక్కపైన టొమాటో మిశ్రమాన్ని సమానంగా వేసి సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది. వీటికి సాస్‌తో కలిపి తింటే ఇంకా బాగుంటాయి.