‘కరీంనగర్ సిటీకి చెందిన ఓ ఉద్యోగ దంపతులు 25 ఏళ్లక్రితం హుజూరాబాద్ సమీపంలోని చెల్పూర్ గ్రామంలో అద్దెకు ఉండేవారు. అక్కడ వీరికి జన్మించిన చంటిబాబుకు స్నానం చేయించడం.. ఏడిస్తే ఆడిపించడం వంటివి ఇంటి యజమానురాలు చేసేవారు. ఆ చిన్నోడు ఆమెను అమ్మమ్మ అనేవాడు. తర్వాత ఆ దంపతులు బదిలీపై వెళ్లిపోయారు. ఈక్రమంలో తల్లిదండ్రులు ఊళ్లో కిరాయికి ఉన్న ఇంటి యజమాని.. వారి పిల్లల గురించి తరచూ మాట్లాడుకోవడం వినేవాడు. ఆ పసిపిల్లోడు ఎదిగి ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్లాడు. ఇటీవల అద్దె ఇంటి అమ్మమ్మను కలిసేందుకు వచ్చాడు. చిన్నప్పుడు తనను లాలించారని గుర్తుకు తెచ్చుకుని ఆ కుటుంబ సభ్యులను హత్తుకున్నాడు. ఇంటి యజమాని అప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు’.
హుజూరాబాద్: పల్లెలు.. ఆత్మీయతకు ముల్లెలు. ఊరోళ్లంతా రక్త సంబంధీకులు కాకపోయినా.. సామాజిక వర్గాలు వేరైనా బంధువుల్లా కలిసుంటారు.. ఎవరింట్లోనైనా ఏదైనా పనిపడితే మేమున్నామంటూ భరోసా ఇస్తారు. ఇరుగుపొరుగువారు పోగవుతారు. చేయిచేయి కలిపి పనికానిస్తారు. పంట కోతకొచ్చింది.. కూలీలు దొరకట్టేదని బాధపడుతుంటే.. చూస్తూ ఊరుకోకుండా సాయంగా నడుంబిగిస్తారు. పల్లెటూరి ముల్లెను విప్పి చూస్తే ఇలాంటి ఆత్మీయ అనుబంధాలెన్నో కనిపిస్తాయి.
తలా ఓ చేయి వేస్తరు..
ఊళ్లలో జరిగే శుభకార్యాలు.. విందులు.. ఇతర కార్యాలకు వంటలు చేసేందుకు ఒకరినొకరు సహకరించుకునే తీరూ చాలా గొప్పగా ఉంటుంది. ఒకరిద్దరే ఉన్నా.. ఇరుగుపొరుగు వారు సాయంగా నిలిచి వంటావార్పు చేసి ఎవరికీ ఏ కష్టం.. నష్టం రాకుండా చూస్తారు. వంటచేసి వడ్డించే దాకా అన్నీ తామై వ్యవహరించే విధానం పల్లె సిగలో చక్కని నగలా కనిపిస్తుంది. అదే పట్టణాల్లోనైతే ఈ పనులన్నీ ఎక్కడ చేస్తామని క్యాటరింగ్‌కు అప్పగిస్తారు.
వాళ్లకు వీళ్లు.. వీళ్లకు వాళ్లు
వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఊళ్లలో ఇంటి పక్కోళ్ల పొలానికి వీళ్లు వెళ్లి కోతల్లో పాల్గొంటారు.. వాళ్ల పొలం కోతకు వస్తే వీళ్లు వెళ్తారు. ఇలా ఇంటి చు ట్టూ ఉన్నవారితో ప్రేమానురాగాలు కొనసాగిస్తారు. ఏ చిన్న పండుగ చేసుకున్నా.. ఇంట్ల ఏది వండినా పంచుకొని తింటారు. ఈ పద్ధతి వల్ల డబ్బులు లేకుండా చేను పని, ఇంటి పనులు పూర్తవుతాయి. ఇలా ఒకరి పనుల్లో ఒకరు భాగస్వామ్యం అవ్వడాన్ని గ్రామాల్లో ‘బదిలీ’ అంటారు. వరికోతలు పూర్తయ్యాక.. కొత్తబియ్యం వండి ఒకరినొకరు బంతి భోజనాలకు పిలుచుకుంటారు. ఇప్పుడు పరిస్థితి మారుతుంది. కొన్ని పల్లెలు మూలవాసం మర్చిపోతున్నాయి. ఆత్మీతకు దూరమవుతున్నాయి.
స్వచ్ఛందంగా కదిలి.. రోడ్డు నిర్మించి
గంభీరావుపేట(సిరిసిల్ల): వర్షాల ప్రభావంతో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ధాన్యం ఇంటికి తెచ్చుకునేందుకు రైతులకు దారిలేదు. రైతులంతా స్వచ్ఛందంగా కదిలారు. గంభీరావుపేట మండలం గోరింటాలకు చెందిన రైతులు చేయిచేయి కలిపారు. గ్రామ శివారులోని వాగుపై వంతెన లేకపోవడంతో తాత్కాలిక మట్టిరోడ్డును ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలా రైతులు ఐక్యంగా కలిసిరావడం.. ఒకరికొకరు సాయం చేసుకోవడం పల్లె బంధానికి అద్దంపడుతోంది.
సాగుకు సాయంగా వచ్చేవారు
నా యుక్త వయస్సులో ఒకరినొ కరు సాయం చేసుకుంటూ సాగు పనులు చేసేవాళ్లం. సరదా మాట లు మాట్లాడుకుంటూ పనులు చేస్తుంటే పని చేసినట్టు ఉండేవి కావు. కానీ, ఇప్పుడు డబ్బుకు ప్రా« దాన్యం పెరిగింది. బంధుత్వాల మధ్య వైరంగా మారి బంధాలను దూరం చేసుకుంటున్నారు. డ బ్బు ప్రాధాన్యతను పక్కన బెట్టి స్నేహంగా ఒకరినొ కరు సాయం చేసుకుంటూ సంతోషంగా జీవించవచ్చు. – మూగల సంజీవరెడ్డి,రైతు, ధర్మరాజుపల్లి
పండుగ వచ్చిందంటే..
ఒకప్పుడు పండుగ వచ్చిదంటే పల్లెలకు కొత్త రూపం వచ్చేది. దూ ర బంధువులు ఊరికి వచ్చారంటే కలివిడిగి తిరుగుతుండేవారు. పండుగకు వచ్చిన వారు యోగక్షేమాలను అడిగి తెలుసుకొని సా యం చేసేవారు. ఇప్పుడు బట్టలు, బంగారంపై మోజు తప్ప పండుగలకు ప్రాధాన్యం ఇవ్వడం లే దు. ప్రస్తుత యువతకు మంచి విషయాలు చెప్పాలంటే వారు ఎలా తీసుకుంటారో అర్థం కాని పరిస్థితి ఉంది.
– కనకం విజయ, రాంపూర్
ముచ్చటగా ఉంటది
మా ఇంట్లో పెద్దలు పండుగలు, పెళ్లిల్ల తంతుపై వారు యుక్త వయస్సులో ఉన్నప్పుడు ఆచరించిన పద్ధతి, వ్యవహారాల గురించి చెబుతుంటే ముచ్చటగా ఉంటది. అప్పట్లో ప్రతీ విషయాన్ని పక్కవారితో వారు పంచుకునే తీరు ఆశ్చర్యం వేస్తోంది. నాటి ఆచార వ్యవహారాలను నేటి యువత పాటిస్తే భవిష్యత్ తరాలు బాగుంటాయి.
– బండారి మహేశ్, తుమ్మన్నపల్లి
∙ ఒకప్పటి పల్లెల్లో కలివిడితనం
∙ ఒకరికొకరు సాయంగా మేమున్నామంటూ భరోసా
∙ సోషల్ మీడియా రాకతో ఊళ్లలో దూరమవుతున్న పల్లె సంస్కృతి


