తియ్యని రుచికరమైన సీతాఫలాల గురించి ఎంత చెప్పినా తక్కువే! అలాంటి సీతాఫలం గుజ్జుతో స్వీట్ రెసిపీలను చేసుకుంటే
ఆ రుచి ఇంకా అమోఘం!
మార్కెట్లో ఎక్కడ చూసినా చక్కగా పండిన సీతాఫలాలు రారమ్మని నోరూరుస్తున్నాయి. ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా రెగ్యులర్‌గా చేసుకుని తినే స్వీట్స్‌కి కూడా సీతాఫలం గుజ్జును వాడి, వాటికి కొత్త రుచిని ఇవ్వొచ్చు. అదెలానో చూద్దామా!
కుల్ఫీ
కావలసినవి: సీతాఫలం గుజ్జు – ఒక కప్పు (గింజలు తీసెయ్యాలి); పాలు – 3 కప్పులు; పంచదార లేదా కస్టర్డ్ మిల్క్ – సరిపడా; యాలకుల పొడి – చిటికెడు (అభిరుచిని బట్టి);
చదవండి: ఇషా, ఆకాష్ అంబానీ బర్త్‌డే: తరలి వెళ్లిన తారలు
తయారీ: ఒక గిన్నెలో పాలు పోసి బాగా మరిగించాలి. పాలు సగం అయ్యేంతవరకు చిన్నమంటపై కాగనివ్వాలి. ఆ తర్వాత, పంచదార లేదా కస్టడ్ మిల్క్, యాలకుల పొడి వేసి కలపాలి. మిశ్రమం చల్లగా అయిన తర్వాత, అందులో సీతాఫలం గుజ్జు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్స్‌లో పోసి, ఫ్రీజర్‌లో రాత్రంతా ఉంచాలి. కుల్ఫీ గట్టిపడిన తర్వాత, మౌల్డ్స్ నుంచి తీసి తింటే అదిరిపోతుంది.

కలాకండ్
కావలసినవి: పాలు – 2 లీటర్లు; సీతాఫలం గుజ్జు – ఒక కప్పు (గింజలు లేకుండా చూసుకోవాలి); పంచదార పొడి – అర కప్పు; నిమ్మరసం – 2 టీ స్పూన్లు; యాలకుల పొడి – ఒక టీ స్పూన్; నెయ్యి – ఒక టీస్పూన్.
తయారీ: మొదట, ఒక లీటరు పాలను మరిగించి సగం అయ్యేంత వరకు ఉడికించాలి. మరో లీటరు పాలను వేరే గిన్నెలో మరిగిస్తుండగా, అందులో నిమ్మరసం వేసి ఆ పాలను విరగొట్టాలి. వాటిని పలుచటి గుడ్డలో వేసి నీరు లేకుండా పిండాలి. అప్పుడది పనీర్ అవుతుంది. మరోపాత్రలో మరుగుతున్న పాలలో ఈ పనీర్, పంచదార పొడి, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం చిక్కగా అయ్యేంత వరకు ఉడికించి, చివరగా సీతాఫలం గుజ్జును వేసి బాగా కలపాలి. ఒక పళ్లానికి నెయ్యి రాసి, ఈ మిశ్రమాన్ని దానిపై సమానంగా పరచాలి. పైన బాదం, పిస్తా తరుగుతో గార్నిష్ చేసుకుని చల్లారనివ్వాలి. అనంతరం నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేయవచ్చు.
సీతాఫలం బాసుంది
కావలసినవి: సీతాఫలం గుజ్జు – ఒక కప్పు (గింజలు తొలగించి మిక్సీ పట్టుకోవాలి);పాలు – ఒకటిన్నర లీటర్లు; పంచదార – 5 టేబుల్ స్పూన్లు; యాలకుల పొడి – ఒక టీస్పూన్; బాదం, పిస్తా తరుగు – 2 టేబుల్ స్పూన్లు; కుంకుమ పువ్వు – కొద్దిగా.
తయారీ: ఒక మందపాటి గిన్నెలో పాలు పోసి సగం అయ్యేంత వరకు బాగా మరిగించాలి. పాలు అడుగున అంటకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలిపాలు చిక్కబడిన తర్వాత, అందులో పంచదార, యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి బాగా కలపాలి. మరో 5 నిమిషాలు ఉడికించి, స్టవ్ ఆఫ్ చేసి,పాల మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత, సీతాఫలం గుజ్జు, బాదం, పిస్తా తరుగు వేసి కలపాలి. ఈ బాసుందిని ఫ్రిజ్‌లో సుమారు 2–3 గంటలు ఉంచి సర్వ్ చేయాలి.
ఇదీ చదవండి: రూ. 1.75 - 5.27 కోట్లదాకా జీతం : ఆ 600 మందికి సుదర్శన్ కామత్ ఆఫర్


