శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ఎప్పుడు.. ఎందుకు.. ఎలా మొదలయ్యాయో తెలుసా..!?

Do You Know When The Brahmotsavam Of Sri Venkateswara Started !? - Sakshi

నాడు నెలకొక బ్రహ్మోత్సవం!

నేడు ఏడాదికి ఒకటి.. అధికమాసం వచ్చినప్పుడు రెండు..

ఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలకు తిరుమల సర్వాంగసుందరంగా ముస్తాబవుతోంది. తొమ్మిదిరోజుల పాటు సప్తగిరులు గోవిందనామ ధ్వనులతో మారుమోగనున్నాయి. అసలు వెంకన్న బ్రహ్మోత్సవాలు ఎప్పుడు మొదలయ్యాయి, బ్రహ్మోత్సవాలు ఎందుకు జరిపేవారు, ఎన్నివాహనాలపై గోవిందుడు భక్తులకు దర్శనమిచ్చేవాడు.. బ్రహ్మోత్సవాల చరిత్రను తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం.

లోక కల్యాణం కోసం తనకు ఉత్సవాలు జరపమని ఆ గోవిందుడే బ్రహ్మదేవుడిని ఆజ్ఞాపించారట! వెంకన్న ఆదేశాలమేరకే బ్రహ్మదేవుడు ఏటా ఈ ఉత్సవాలు జరుపుతాడని ప్రతీతి. కన్యామాసం (అశ్వయుజం) లోని శ్రవణా నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు ముందు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించారట. బ్రహ్మే స్వయంగా ఉత్సవాలను నిర్వహించారు కాబట్టే ఈ ఉత్సవాలకు ‘బ్రహ్మోత్సవాలు’గా పేరు వచ్చింది. ఈ బ్రహ్మోత్సవాలను ఒకదశలో నెలకొకటి వంతున ప్రతి ఏటా పన్నెండు బ్రహ్మోత్సవాలు జరిగేవట!

స్వయంగా బ్రహ్మే ఈ ఉత్సవాలను జరుపుతాడని చెప్పడానికి ప్రతీకగా ప్రతిరోజూ వాహనం ముందు బ్రహ్మరథం కదులుతుంది. ఒక్క రథోత్సవం రోజు మాత్రం ఈ బ్రహ్మరథం ఉండదు. ఆ రోజు స్వయంగా ఆ బ్రహ్మదేవుడే పగ్గాలు స్వీకరించి రథం నడుపుతాడని చెబుతారు. అంకురార్పణతో మొదలయ్యే ఈ ఉత్సవాల్లో ధ్వజారోహణం, చినశేషవాహనం, పెద్దశేషవాహనం, సింహవాహనం, ముత్యాలపందిరి, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, మోహినీ అవతారం, గరుడవాహనం, గజవాహనం, సూర్యప్రభవాహనం, చంద్రప్రభవాహనం, రథోత్సవం, బంగారు తిరుచ్చి వంటి వాహనాలపై దేవదేవుడు కొలువై భక్తకోటికి దర్శనమిస్తారు.

క్రీస్తుశకం 614లో పల్లవరాణి సమవాయి.. మనవాళ పెరుమాళ్‌ అనే భోగశ్రీనివాసమూర్తి విగ్రహాన్ని సమర్పించింది. అప్పట్లో ఈ విగ్రహాన్ని ఊరేగించి బ్రహ్మోత్సవాలు జరిపినట్లు ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత క్రీస్తుశకం 1254 చైత్రమాసంలో తెలుగురాజు విజయగండ గోపాలదేవుడు, 1328లో ఆషాఢమాసంలో ఆడితిరునాళ్లు పేరిట త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాథ యాదవ రాయలు ఉత్సవాలు జరిపారు.

అలాగే 1429లో ఆశ్వయుజ మాసంలో వీరప్రతాప దేవరాయలు, 1446లో మాసి తిరునాళ్ల పేర హరిహర రాయలు. 1530లో అచ్యుతరాయలు బ్రహ్మోత్సవాలు జరిపారు. ఇలా 1583 ప్రాంతంలో బ్రహ్మోత్సవాలు ఏడాదిలో ప్రతినెలా జరుగుతుండేవి. ఆ తరువాత కొన్నేళ్ల పాటు ఈ ఉత్సవాలు అర్ధంతరంగా ఆగిపోయినట్లు కూడా తెలుస్తోంది. ఏడాదికి పన్నెండుసార్లు జరిగే ఈ ఉత్సవాలు క్రీస్తుశకం 1583 నాటి వరకు కొనసాగాయి. అయితే కాలక్రమేణా మార్పులు జరిగి ఏడాదికి పది రోజుల పాటు నిర్వహించడం మొదలుపెట్టారు.

బ్రహ్మోత్సవాలు అంటే ఠక్కున గుర్తొచ్చేది గరుడ వాహనం. అంత పేరున్న గరుడ వాహనాన్ని క్రీ.శ 1530కి ముందు వాడినట్టు చరిత్రలో ఎక్కడా లేదు. సూర్యప్రభ వాహనం, గజవాహనం క్రీ.శ 1538లో ప్రారంభించారు. సింహవాహనం క్రీ.శ 1614లో మొదలైంది. మట్ల కుమార అనంతరాజు క్రీ.శ 1625లో శ్రీవారికి బంగారు అశ్వవాహనం, వెండి గజవాహనాన్ని, సర్వభూపాల వాహనాన్ని బహూకరించారు. ఇటివల టీటీడీ సర్వభూపాల వాహనాన్ని కొత్తగా తయారు చేయించింది. ప్రస్తుతం ఈ వాహనాన్నే వినియోగిస్తున్నారు.

బ్రహ్మోత్సవాలు ప్రారంభమవు తున్నాయి అని ప్రకటించే విధానం అప్పట్లో విచిత్రంగా ఉండేది. శ్రీవారి ఆలయం ముందు పెద్ద పేలుడు సంభవించినట్టు శబ్దం చేసి మంటను వేసేవారట. ఈ పద్ధతిని ఆదిర్వేది అనేవారు. తొలిసారిగా ఈ విధానాన్ని క్రీ.శ 1583లో ప్రారంభించినట్టు శాసనాధారం ఉంది. ఉత్సవాలకు ముందు శ్రీవారి ఆలయాన్ని వైదిక ఆచారాలతో శుద్ధి చేసేందుకు క్రీ.శ 1583లో ప్రవేశపెట్టిన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజన కార్యక్రమం నేటికీ సాగుతోంది.

2020, 2021లో కరోనా కారణంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించారు. కరోనా ప్రభావం తగ్గడంతో గత ఏడాది నుంచి బ్రహ్మోత్సవాలను యథాప్రకారం భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది అధికమాసం కారణంగా రెండు బ్రహ్మోత్సవాలు వచ్చాయి. గత నెల సెప్టంబర్‌ 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. అక్టోబర్‌ 15 నుంచి 23 వరకు నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ ఉత్సవాలను కూడా గొప్పగా జరపడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. - తిరుమల రవిరెడ్డి, సాక్షి, తిరుపతి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top