అప్పుడు శ్యామలరావు.. ఇప్పుడు సింఘాల్‌ | TTD EO Anil Kumar Singhal transferred | Sakshi
Sakshi News home page

అప్పుడు శ్యామలరావు.. ఇప్పుడు సింఘాల్‌

Feb 2 2026 5:11 AM | Updated on Feb 2 2026 5:11 AM

TTD EO Anil Kumar Singhal transferred

చంద్రబాబు రాజకీయ కుతంత్రాలకు ఐఏఎస్‌ అధికారుల బలి

తమ ఆరోపణలు నిజమని నిరూపించుకునేందుకు తాజాగా టీటీడీ ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌పై బదిలీ వేటు

తిరుమల లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు విషప్రచారం

సీఎం వ్యాఖ్యలకు భిన్నంగా నాటి టీటీడీ ఈఓ శ్యామలరావు ప్రకటన

ఫలితంగా ఆ బాధ్యతల నుంచి ఆయన బదిలీ

తాజాగా.. లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు లేదని తేల్చిన సీబీఐ

చంద్రబాబు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండడంతో సింఘాల్‌పై చర్యలు 

ఆయన స్థానంలో సీఎం స్పెషల్‌ సీఎస్‌ రవిచంద్రకు అదనపు బాధ్యతలు

సాక్షి, అమరావతి/తిరుపతి, అన్నమయ్య సర్కిల్‌: తిరుమల లడ్డూ వ్యవహారంలో ఎలాంటి జంతు కొవ్వులేదని, తిరుమల ప్రసాదానికి మహాపచారం జరగలేదని సీబీఐ సిట్‌ తేల్చిచెప్పడంతో తీవ్ర విమ­ర్శలు మూటగట్టుకుంటూ అభాసుపాలవు­తున్న సీ­ఎం చంద్రబాబు తాము ఇప్పటి­వరకు చేసిన దుష్ప్ర­చారాన్ని నిజమని యావత్‌ భక్తకోటిని నమ్మించేందుకు ఆయన ఐఏఎస్‌ అధికారులను బలి­తీసుకుంటున్నారు. మొన్న టీటీడీ ఈఓ శ్యామల­రావు అయి­తే.. తాజాగా ఆదివారం అనిల్‌కుమార్‌ సింఘాల్‌ బదిలీ అయ్యారు.

ఇలా ఐదు నెలల వ్యవధిలోనే ఆయన ఇద్దరు టీటీడీ ఈఓలపై వేటు వేశారు. దీంతో.. తన రాజకీయ కుతంత్రాలకు చంద్రబాబు టీ­టీ­డీని వాడుకుంటూ ఐఏఎస్‌ అధికా­రు­లపై ఒత్తిళ్లు తెస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతు­న్నాయి. అయి­తే, సింఘాల్‌ బదిలీ ఉత్తర్వులను ప్రభుత్వం ఆదివా­రం హడావు­డిగా జారీచేసింది. ఆయన వెంటనే జనరల్‌ అడ్మి­నిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ (జీఏడీ)లో రిపోర్టు చేయా­లని ఆదేశించింది. ఆయన స్థానంలో ప్రస్తుతం సీఎం స్పెషల్‌ సీఎస్‌గా పనిచేస్తున్న ముద్దాడ రవిచంద్రను టీటీడీ ఈఓగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో ప్రభుత్వం నియమించింది. 

తమ ఆరోపణలు నిజమని నమ్మబలికేందుకే..
19 నెలల క్రితం చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే టీటీడీ ఈఓగా శ్యామలరావును నియమించారు. అప్పట్లో.. అధికా­రికంగా ఏ విచారణ జరగకుండానే చంద్రబాబు ‘తిరుమల లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలి­పార’ని వ్యాఖ్యానించి రాజకీయ వివాదానికి తెర­లేపిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు పరమ పవిత్రంగా భావించే ఆ ప్రసాదంలో కల్తీ జరిగిందని విషప్రచారం చేస్తూ వస్తున్నారు. కానీ, సుప్రీంకోర్టు ప్రత్యేక ఆదేశాలతో సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్‌ విచారణానంతరం తిరుమల లడ్డూలో ఎలాంటి జంతు కొవ్వు లేదని నిర్థారించింది.

దీంతో.. అప్పట్లో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ తదితరులు లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు, పంది కొవ్వు కలిపారంటూ అడ్డగోలుగా చేసిన ఆరోపణలను నిజమని ఎలాగైనా నిరూపించేందుకే అప్పుడు శ్యామలరావును.. ఇప్పుడు అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను బదిలీ చేసినట్లు చర్చ జరుగుతోంది. ఇక సాధారణంగా ఒకరి స్థానంలో మరొకరిని నియమించినప్పుడు కొత్తగా వచ్చే అధికారి వచ్చాక ఆయనకు బాధ్యతలు అప్పగించడం పరిపాటి. కానీ, సింఘాల్‌ను ఉన్నపళంగా తప్పుకుని టీటీడీ అదనపు ఈఓ వెంకయ్యచౌదరికి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించి ఆయన్ను ఘోరంగా అవమానించింది. రాజకీయ లబ్ధికోసమే అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను వాడుకుని, ఇప్పుడు పక్కకు తోసేశారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

బాబు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే తిరుమల లక్ష్యంగా..
2024 జూన్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కూటమి ప్రభుత్వం తిరుమల పవిత్రత అనే సాకుతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై గురిపెట్టింది. తిరుమల పవిత్రతను పట్టించుకోనందున అక్కడి పరిస్థితులను చక్కబె­ట్టేందుకు టీటీడీ ఈఓగా శ్యామలరావును నియమి­స్తున్నట్లు అప్పట్లో ప్రభుత్వ పెద్దలు పలుమార్లు ప్రకటించారు.

అయితే, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 జూలై 6న, జూలై 12న తిరుమలకు సరఫరా అయిన నెయ్యి టీటీడీ ప్రమా­ణా­లకు తగ్గట్లుగా లేకపోవడంతో అధికారుల స్థా­యి­లోనే వాటిని వెనక్కు పంపడానికి సిద్ధంచేశారు. ఆ శాంపిళ్లను పరీక్షించేందుకు టీటీడీ చరిత్రలో తొలిసారి గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ (నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు)కి పంపారు. జూలై 23న ఎన్‌డీడీబీ తన నివేదికలో నెయ్యిలో కల్తీ ఉందని వెల్లడించింది. దాంతో.. ఆ ట్యాంకర్లను వెనక్కు పంపించారు.

అలా నాలుగు ట్యాంకర్లను వెనక్కు పంపడంతో పాటు, ఆ కంపెనీకి షోకాజ్‌ నోటీసు కూడా ఇచ్చారు. ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యి వాడకపో­యి­నా, రెండు నెలల తర్వాత 2024 సెప్టెంబరు 18న ఎమ్మెల్యేల సమావేశంలో ‘శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రసాదానికి నాసిరకం పదార్థాలు వాడారు.. లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది’ అని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో నిత్యం పెను దుమారం రేపుతూనే ఉంది. 

బాబు వ్యాఖ్యలకు భిన్నంగా శ్యామలరావు ప్రకటనతో..
అయితే, 2024 జూలై 23నే నాటి టీటీడీ ఈఓ శ్యామలరావు చంద్రబాబు వ్యాఖ్యలకు భిన్నంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘నెయ్యి శాంపిళ్లలో కల్తీ ఉందని తేలింది. అందులో వెజిటబుల్‌ ఫ్యాట్‌.. అంటే వనస్పతి కలిసిందని తెలిసింది. ఆ సప్లయర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేందుకు నోటీసులిచ్చి రెండు ట్యాంకర్లను రిజెక్ట్‌ చేశాం’.. అని వెల్లడించారు. ఆ తర్వాత.. 2024 సెప్టెంబరు 18 నాటి చంద్రబాబు ప్రకటన తర్వాత సెప్టెంబరు 20న శ్యామలరావు మరోసారి జంతు కొవ్వు కలిపారన్న చంద్రబాబు వ్యాఖ్యలకు భిన్నంగా ‘అడల్ట్రేటెడ్‌ నెయ్యి అని తేలిన నాలుగు ట్యాంకర్లను పక్కన పెట్టాం.

రిపోర్టు వచ్చిన తర్వాత వాడాలని నిర్ణయించాం. రిపోర్టు క్లియర్‌ కాకపోవడంతో వాటిని రిజెక్టు చేశాం. వాటిని తిప్పి పంపించేశాం, సరఫరా నిలిపివేశాం’ అని ప్రకటించి ప్రభుత్వానికి టార్గెట్‌ అయ్యారు. దీంతో.. అప్పటికప్పుడు ఆయనను బదిలీచేస్తే విమ­ర్శలు ఎదుర్కొవాల్సి వస్తుందని భావించిన చంద్ర­బాబు సర్కారు దాదాపు ఏడాది తర్వాత 2025 సెప్టెంబరులో ఆయనపై బదిలీ వేటువేసింది. ఇప్పు­డు సీబీఐ సిట్‌ నివేదికతో ఉక్కిరిబిక్కిరి అవుతూ తమ ఆరోపణలను నిజమని ఎలాగైనా నమ్మించాలని అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను బలిచేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement