ఎన్నికల్లో షర్మిల ఖర్చు పెట్టిన ప్రతీ పైసా చంద్రబాబుదే: సతీష్‌ రెడ్డి | YSRCP Satish Reddy Serious Comments On Sharmila And Sunitha | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో షర్మిల ఖర్చు పెట్టిన ప్రతీ పైసా చంద్రబాబుదే: సతీష్‌ రెడ్డి

Mar 19 2026 1:15 PM | Updated on Mar 19 2026 2:35 PM

YSRCP Satish Reddy Serious Comments On Sharmila And Sunitha

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ను విమర్శిస్తే కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిలను ఎల్లో మీడియా హైలైట్‌ చేస్తోందన్నారు  పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో‌ షర్మిల, సునీత పావులు అని విమర్శించారు. జగన్‌తో యుద్ధం చేయలేక చంద్రబాబు.. షర్మిల, సునీతను వాడుకుంటున్నారని ఆరోపించారు. గత ఎన్నికలలో షర్మిల ఖర్చు పెట్టిన ప్రతీ పైసా చంద్రబాబు ఇచ్చినదే అని వ్యాఖ్యలు చేశారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌రెడ్డి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిలకు ఏనాడూ ఎల్లో మీడియా వార్తలు రాయలేదు. వైఎస్‌ జగన్‌ను షర్మిల విమర్శిస్తే మాత్రం పెద్ద అక్షరాలతో వార్తలు రాస్తారు. వైఎస్సార్ బతికున్నప్పుడే  షర్మిలకు ఆస్తి రాసిచ్చారు. జూబ్లీహిల్స్‌లో ఇల్లు, ఇడుపులపాయలో భూమి, హైడ్రో ప్రాజెక్టు, స్వస్తి హైడ్రో ప్రాజెక్టులో వాటా.. ఇలా అనేక ఆస్తులు రాసిచ్చారు. కొడుకు కన్నా షర్మిలకే వైఎస్ఆర్ ఎక్కువ ఆస్తి ఇచ్చారు. ఇప్పుడు జగన్ సొంతంగా సంపాదించుకున్న ఆస్తిలో కూడా వాటా కావాలని అడగటం అన్యాయం. గత ఎన్నికలలో షర్మిల ఖర్చు పెట్టిన ప్రతీ పైసా చంద్రబాబు ఇచ్చినదే. షర్మిల లాంటి చెల్లెలు తమకు వద్దని సామాన్యులు కూడా అనుకుంటున్నారు.

దస్తగిరి అనే వ్యక్తి వివేకానంద రెడ్డిని హత్య చేశారు. వివేకానందరెడ్డికి కొన్ని బలహీనతలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఇమేజ్‌కి దెబ్బ తగలకూడదని అవినాష్ భావించారు. ఇప్పటికీ సునీతక్క, వివేకం పెదనాన్న అనే అవినాష్ మాట్లాడతారు. అవినాష్ అంత ప్రేమను చూపిస్తుంటే సునీత మాత్రం వివేకా పేరును చెడగొడుతోంది. సీబీఐతో విచారణ కావాలని పిటిషన్ వేసిందే సునీత. ఆమె కోరిక ప్రకారం సీబీఐ విచారణ జరిపింది. ఒక భూమి విషయంలో ఎర్ర గంగిరెడ్డి, వివేకానందరెడ్డికి వివాదాలు వచ్చాయని దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చారు. సునీల్ యాదవ్ వివేకానంద రెడ్డిపై దాడి చేశాడని దస్తగిరి చెప్పాడు. వివేకానందరెడ్డిని హతమార్చే సమయంలో కొన్ని పేపర్ల కోసం వెతికారని కూడా చెప్పాడు

మిమ్మల్ని వదిలిపెట్టరు.. షర్మిల, సునీతకు ఓపెన్ ఛాలెంజ్

ఆ పేపర్లు ఏంటి? వివేకానంద రెడ్డికి ఇతర మహిళలతో ఉన్న సంబంధాలు ఏంటి?. అవినాష్‌ రెడ్డి జీవితంలో చిన్న మరక కూడా లేదు. కానీ అవినాష్‌ను అభాసు పాలు చేసేలా సునీత వ్యవహరిస్తున్నారు. ఎంపీ సీటు కోసం హత్య చేశారన్న షర్మిల మాటలు అవివేకం. వివేకా హత్య జరిగే సమయానికే అవినాష్ రెడ్డికి జగన్ సీటు ఇచ్చారు. వివేకా కూడా అవినాష్ గెలుపు కోసం ప్రచారం చేశారు. సునీత, చంద్రబాబు, షర్మిల, దస్తగిరి ఒక్కటే. వారందరికీ కోర్టులో వాదించేది ఒక్కరే న్యాయవాది. ఈ విషయాలపై చర్చించేందుకు మేము సిద్దమే. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టి ఎందుకు వదిలేశారు?. ఏపీలో జగన్‌ను ఓడించటానికి చంద్రబాబు ఆడిన నాటకంలో షర్మిల పాత్రధారి. తాను చెప్పినట్టే సీబీఐ, సుప్రీంకోర్టు వినాలి అన్నట్టుగా సునీత వ్యవహరిస్తున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement