షర్మిల, సునీతలకు రాచమల్లు సూటి ప్రశ్నలు
మీరు బాబు మేలుకోసమే పనిచేయడం నిజంకాదా?
వివేకా హత్య కేసులో హంతకుడికి మద్దతుగా నిలవడం వెనుక మర్మమేమిటి?
వివేకా అటెండర్‌కు సెలవిచ్చి కాణిపాకం ఎందుకు పంపారు?
వివేకా లేఖను సునీత, ఆమె భర్త ఎందుకు దాచిపెట్టారు?
రెండో భార్యతో వివేకా చాటింగ్స్ బయటపెట్టగలరా?.. రెండో భార్య కుమారుడి డీఎన్‌ఎ టెస్ట్‌కు సిద్ధమా?
‘మర్డర్ ఫర్ గెయిన్’ కోణంలో విచారణ కోరతారా?
ఒత్తిడి చేసి తప్పుడు స్టేట్‌మెంట్లు ఇప్పించడం నిజం కాదా?
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ కుట్రలో సునీత, షర్మిల పావులుగా మారారని పదేపదే రుజువవుతోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి లేవనెత్తిన అంశాలలో ఒక్క దానికైనా సునీతగానీ, షర్మిలగానీ జవాబివ్వగలరా అని ఆయన ప్రశ్నించారు.
నిజాలకు పాతరేసి దర్యాప్తు సంస్థలను, న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యమన్నట్లు వారి తీరు ఉందని రాచమల్లు బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలను సంధించారు. ధైర్యముంటే వాటికి జవాబివ్వాలని రాచమల్లు సవాల్ చేశారు. ఆ ప్రశ్నలిలా ఉన్నాయి.
» వివేకా హత్య కేసులో అతి ముఖ్యమైన అంశాలను వదిలేసి సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తూ ఎందుకు తప్పుదోవపట్టిస్తున్నారు? ఎవరి ప్రయోజనం కోసం మీరు పనిచేస్తున్నారు?
» సునీత కుటుంబం వివేకాకు చెక్‌పవర్ తీసేసి ఖర్చులకు డబ్బులు కూడా లేని పరిస్థితికి తీసుకురావడం నిజం కాదా?
» సునీత తండ్రిని హత్య చేసింది తానేనని ఒప్పుకున్న దస్తగిరి దర్జాగా బయట తిరుగుతున్నా అతనికి మీరు మద్దతుగా నిలవడం వెనక మర్మమేమిటి? అతనిని శిక్షించాలని ఎందుకు కోరడం లేదు?
» చంద్రబాబుకు, సునీతకు, దస్తగిరికి ఒకే న్యాయవాది ఎందుకు ఉన్నారు? అత్యంత ఖరీదైన న్యాయవాది లూథ్రాను దస్తగిరి బెయిల్ రద్దు కాకుండా సునీత నియమించడమేమిటి?
» హత్యకు ముందు రోజు వివేకా అటెండర్ పండంటి రాజశేఖర్‌ను వివేకా భార్య సౌభాగ్యమ్మ, సునీత భర్త రాజశేఖర్ సెలవు ఇచ్చి మరీ కాణిపాకం ఎందుకు పంపించారు?
» వివేకాను హత్య చేయడానికి ముందు కొన్ని డాక్యుమెంట్ల కోసం ఆయన్ను హింసించామని దస్తగిరి చెప్పాడు. డాక్యుమెంట్లను వెరిఫై చేసుకున్న తర్వాతనే హత్య చేసినట్లు చెప్పాడు. హత్య చేశాక కూడా ఒకటికి రెండుసార్లు డాక్యుమెంట్లు వెరిఫై చేసుకున్న తర్వాతే బయటకు వెళ్లినట్లు చెప్పాడు. రౌండ్ సీల్‌తో ఉన్న ఆ డాక్యుమెంట్లు ఏమిటి? వాటి గురించి మీరు ఎందుకు పట్టుబట్టడం లేదు?
» హత్య జరిగిన చోట లేఖను సునీత భర్త రాజశేఖర్ ఎందుకు దాచినట్లు? లేఖలో విషయాలు ఎవరికీ చెప్పకుండా లేఖను దాచాల్సిందిగా పీఏ కృష్ణారెడ్డిని ఆదేశించాల్సిన అవసరమేమిటి?
» హత్య గురించి తెలియజేసే కీలకమైన వివేకా లేఖ గురించి సునీత సీబీఐకి రెండు రకాల స్టేట్‌మెంట్లు ఎందుకు ఇచ్చారు? అసలు సీబీఐ సునీతకు ఆ వెసులుబాటు ఎందుకు ఇచ్చినట్లు?
» వివేకాకు అనేకమందితో అక్రమ సంబంధం ఉందని పేర్లతో సహా దస్తగిరి స్టేట్‌మెంట్‌లో ఉంది. ఆ మహిళల భర్తలు, పిల్లలు వివేకాపై కక్షపెంచుకున్నారని ఆ స్టేట్‌మెంట్‌లో ఉంది. వారిపై విచారణ ఎందుకు కోరడంలేదు?
» వివేకాను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఆయన జీవించి ఉంటే 30 నుంచి 40శాతం ఆస్తులను తన రెండో భార్యకు ఇచ్చేవారు. అందుకని ఇది మొదటిభార్య కుటుంబం చేసిన మర్డర్ ఫర్ గెయిన్ కాదా? ఈ కోణంలో మీరు ఎందుకు విచారణ కోరడం లేదు?
» వివేకా రెండో భార్య షమీమ్‌కు, వివేకాకు మధ్య నడిచిన చాట్స్‌ను బయటపెట్టే ధైర్యం మీకు ఉందా?
» షమీమ్ కుమారుడికి డీఎన్‌ఏ టెస్ట్ చేయించడానికి మీరు సిద్ధమేనా?
» చంద్రబాబుతో కలసి ఈ కేసులో ఇన్వెస్టిగేషన్‌ను మీరు అనుకున్నట్లు నడిపిస్తుండడం నిజం కాదా? పలువురి చేత తప్పుడు స్టేట్‌మెంట్లు ఇప్పించడం అందుకు రుజువు కాదా? హిమకుంట్లకు చెందిన ఓ వ్యక్తిపై సునీత, ఆమె భర్త రాజశేఖర్ చెప్పినట్లు చెప్పాల్సిందిగా ఒత్తిడి చేయడం నిజం కాదా?
» ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చి కోర్టుకు వెళ్లడం, విచారణను అడ్డుకోవడం.. గడచిన రెండు మూడేళ్లుగా సునీతకు ఇదే పని కదా? ఎవరి ప్రయోజనం కోసం విచారణ పూర్తికాకుండా అడ్డుకుంటున్నారు?
» చంద్రబాబుకు ప్రయోజనం చేకూర్చడమే మీ లక్ష్యమని రాష్ట్ర ప్రజలకు అర్ధమయ్యింది. వచ్చే ఎన్నికల వరకు ఈ కేసును లాగాలని, తద్వారా చంద్రబాబుకు మేలు చేయాలని మీరు పనిగా పెట్టుకున్నారు. మీరు చంద్రబాబు చేతిలో పావులుగా మారడం నిజం కాదా?


