తెల్లటి ఎండ ఎచ్చంగా కొడుతుంది, సరిగ్గా పన్నెండుగూడా కాలేదు టైము. అప్పటికి రొండుసార్లు అడిగి అడిగి మౌనంగా కూసుకున్నాడు జానుగాడు. రంగిసెట్టి కొట్టుకాడ పిల్లోడ్ని కూసోబెట్టి జొన్నసొప్ప కోయనీకి పోయింది రంగమ్మ. ‘సెట్టి దప్పికైతుంది ఒక్క గలాసు నీళ్లియవూ’ అని మూడోసారి అడగలేక ఎండిపోయిన పెదాల్ని నాలికతో రుద్దుకుంటూ కూసున్నాడు జానుగాడు అనబడే జాన్సన్.రంగమ్మ, ఆనందరావుల కొడుకు జాన్సన్ వయసు పదేళ్ళు. బడి మీన గాలి మల్లినప్పుడో, బడికి పంతులుగారు వచ్చినప్పుడో, ‘అయిదో క్లాస్ అబ్బీ’ నువ్వు అని చెబితే వినడమే తప్ప ఆ మాసిపోయిన పుస్తకాల సంచి వంక ఏనాడూ చూసిందే లేదు. పొద్దుగూకులు బస్టాప్ కాడ ఉండే పిచ్చి తుమ్మసెట్టు కింద సీట్లపేకలాడే వాళ్ల దగ్గర కూకోని పొద్దు ఎల్లబుచ్చుతుంటాడు.
ఎప్పుడన్నా వాళ్ళమ్మ గట్టిగా అర్సుకుంటే ఉన్న ఒక్క బర్రెని మేపడానికి పోతాడు.ఆనందరావుకి, రంగమ్మకి పెళ్ళి జరిగి పదేళ్లు దాటింది. ఆనందరావూ అచ్చం జానుగాడిలాగానే ఉండేవాడు. పెళ్లయిన కాణ్ణుంచి రంగమ్మకి అది నచ్చేది కాదు. రంగమ్మ తీరు వేరే, ఉన్నంతలో కాపరాన్ని నడుపుకోవాలని ఆశ. ఎప్పుడో గవర్నమెంట్ వాళ్లు ఇచ్చిన ఇల్లు కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. అది బాగుజేపియాల, ఇంటికి ఒక బలుబైనా కరంటు ఉండాల అని అనుకుంటా మొగుడికి చెవిలో ఇల్లుకట్టుకుని చెబుతా ఉంటది. ఊళ్ళో పనిలేదు. ఉన్న కరువు పనికి పోబుద్దిగాదు. పొద్దునే లేసుడు సీట్లపేక కాడ ఊసుపోని కబుర్లు.
రంగమ్మకు ఇంట్లో ఉన్న ఒక్క బర్రెతో కాలం గడిచిపోయేది. దానిమేత, పాలు తీయడం, చల్ల జేసి అమ్మడం వల్లనే ఆ ఇల్లు ఆమాత్రమైనా గడుస్తుంది, నడుస్తుంది. రంగిసెట్టి కొట్టు ఆ ఊరికి ఒక రచ్చబండలాంటిది. బేల్దార్ పనికి కూలోళ్లు కావాలంటే యాడ దొరుకుతారో లోకంలో అందరికి తెల్సిన సంగతే, పల్లెటూళ్ళలో తక్కువ రేటుకు తేరగా దొరుకుతారని అసుమంటి వాళ్లకి రంగిసెట్టి లాంటి వాళ్ళు సాయం చేసి, నాలుగురాళ్లు యెనకేసుకుంటారు. ఊళ్ళోవాళ్ల బలహీనతలన్ని ఎలాగూ ముందే తెల్సిపోయి ఉంటాయి కాబట్టి బేరాలు తేలిగ్గానే తెగుతాయి. సదువు ఉండకూడదు, ఎదురు మాట్లాడితే పద్ధతిగాదు, ఇచ్చిన లెక్క కాడికి తలొంచుకుని ఎల్లిపోవాలో ఇట్టాంటోళ్లని యెతికి యెతికి మరీ పట్టుకుంటారు.
కాతాలు రాసుకునే బొక్కులో నుంచి మడతలుపడిన ఒక కాయితాన్ని, సేట్‌కి ఇచ్చాడు రంగిసెట్టి. మాకు తెలుగు రాదు సెట్టి నువ్వే పిలు వాళ్లని అన్నారు వాళ్లు. పదిమందిని పిలిపించాడు రంగిసెట్టి. అందులో ఆనందరావుతో పాటు ఇంకో తొమ్మిదిమంది పేర్లున్నాయి.రంగమ్మకి శానా కుశాలుగా ఉంది. ఈ మడిసిగాని ఆ పనికి ఒప్పుకుని పోతే అనుకున్న పనులన్నీ సక్కంగా అయిపోతాయి. పిల్లోడికి సదువు వస్తది, ఇల్లు బాగుచేసుకోవచ్చనే ఆశ ఆమె కళ్ళలో కనబడుతుంది. ‘ఒదినా నిజంగానే మనోళ్ళు దేశం పోతారంటావా పనికి! మా యన్నకి ఏమి అలవాట్లు లేవు కాని మా ఇంటాయన ఏమంటాడో ఏమో అసలే మిడిమ్యాలపు మడిసి’ అని రంగమ్మ చెవిలో గుసగుసలాడింది ఓబుగాడి పెళ్లాం రాహేలమ్మ.
‘పోతారు లేమ్మే పోక ఈడేం జేత్తారు, గుడ్డి గుర్రానికి పండ్లు తోముతారా?’ అని విసుక్కుంది రంగమ్మ.పిలిచిన అందరూ రంగిసెట్టి కాడ గుమి గూడారు. అదిగో అప్పుడు చూశాడు జానుగాడు హైద్రాబాద్ సేట్ చేతిలో ఒక ఆకుపచ్చని సీసా. ఆగి ఆగి తాగుతున్నాడు సేటు. మధ్య మధ్యలో చిన్నగా తేపుతున్నాడు. రంగమ్మ సేట్ చెప్పబోయే మాటకోసం చూస్తుంటే; ఆనందరావు– ఇల్లు , పిల్లోడు, సీట్లపేక సావాసగాళ్ళని వదిలి వెళ్ళాలా అని దిగులుగా కూసున్నాడు. జానుగాడి చూపులన్నీ ఆ ఆకుపచ్చని సీసా మీదనే ఉన్నాయి. అదేందో కనుక్కోవాలని వాడికి మామూలు కుశాలుగా లేదు, అమ్మనో అయ్యనో అడిగినా చెప్పేలాగా లేరు. పక్కనే ఉన్న సావాసగాడ్ని అడిగాడు ‘ఏందిరా ఆ సీసా’ అని.
వాడికి తెల్సి తెలియని మాటల్తో చెప్పాడు ‘ఒరే అది డింకు సీసా సల్లగ ఉంటది. తాగితే దీనబ్బా ఒహటే తేపులు, మొన్న మా అయ్య పెద్ద కూర తిని, ఇది తాగి రొంత నాగూడక ఇచ్చినాడు. ఓ యబ్బ చెప్పెటానికి కాదు, కాని పది రూపాయల్రా’ అని ఊరించాడు. జానుగాడికి అది మనాదిలో పడింది. పది రూపాయలు తెచ్చుకోవాలా ఆ డింకు తాగాలా...!పని చేయగలరు అని నమ్మకం కుదిరి, వాళ్ల కంటికి నదురుగా కనబడేసరికి రంగిసెట్టి ఇచ్చిన లిస్ట్‌కి టిక్కు పెట్టుకుని బేరాలు మొదులు పెట్టారు. ఏడాది ఎగ్రిమెంటు, నాలుగు నెలలకి వారం సెలవు, పెద్ద పండక్కి రొండు జతల బట్టలు, వారం వారం బటోడా, కాకుండా సమచ్చరానికి పదైదు వేలు డబ్బులు, తిండి, ఉండడానికి వసతి. రంగమ్మ కళ్ళు మెరిశాయి.
అనందరావుకన్నా ఆ మాటకొస్తే ఆడికి వచ్చిన అందరికన్నా తనే ముందు సరే అని చెప్పేసేలాగా ఉంది. ఎవరూ ఏమీ మాట్లాడ్డం లేదు. రంగిసెట్టి గొంతు సవరించుకుని ‘ఏందిరా సాలవా..? ఇంకేమైనా ఉన్నాయా గొంతెమ్మ కోరికలు అడిగి సావండి’ అని గదమాయించాడు. ఏలియా గాని, యాకోబు గాని ఏం ఉలుకు లేదు పలుకు లేదు, వాళ్లకీ లోపల సంతోషంగానే ఉంది కాని ఇంకా ఎవరైనా ఎక్కువ ఏమైనా అడిగితే బాగుండు అని మెదలకుండా ఉన్నారు. అందరూ గొణుక్కుంటూఉన్న టయానికి దిగ్గున లేశాడు ఓబయ్య ‘ఏంది సేటు నీ సమత్కారం, ఊరుగాని ఊరు పెళ్లాం పిల్లల్ని వొదిలి అంతగాలం ఆడుంటే ఇయ్యేనా మీరిచ్చేది. ఇరవై వేలియ్యి. మిగతా అన్నీ మామూలే. అట్లయితే సెప్పు, లేకపొతే వచ్చిన కారెక్కిపో’ అని అరిసినట్టుగా మాట్లాడి కూకున్నాడు.రంగిసెట్టికి కోపం నెత్తికి అంటుకుంది.
సేట్లు ఒద్దంటే తన కమీషన్ ఎక్కడ తనకి రాకుండా పోతుందో అని గుబులు పడ్డాడు. ‘ఏరా ఓబిగా! గతిలేని నా కొడకా! తాగుబోతు వాగుడంతా వాగి నోటి కాడ కూడు లాగేస్తావా ఈళ్లందరిదీ’ అని దిగ్గున లేచి తన్నబోయాడు. అక్కడున్న అందరూ వారించి ‘ఏంది సెట్టినోరు బో లేచ్చాంది తగ్గు తగ్గు’ అని ఆపినాక, నోట్లో ఉన్న పుగాక్కాడ తుప్పుక్కున ఊసి, ‘సూడు సేటు గారూ ఓబిగాడు అడిగిన దాంట్ల ఏమి తప్పులేదు. మీరే ఇంకోపాలి ఆలోసించుకోండి. మాదంతా ఇప్పుడు ఒకటే మాట. కావాలంటే మీరు రంగిసెట్టికిచ్చే కమీసన తక్కువ జేసుకోండి’ అని యాకోబు తగులుకునే తలికి అందరూ ‘అవునవును’ అని గొంతు కలిపారు. ‘మీకు బలిసిందిరా నా కొడకల్లారా ఏదో మీ కుటంబాలు బాగుంటాయని, నాలుగు మెతుకులు తింటారని అనుకుంటే నా కమీసన్ గురించి వాగుతున్నారు. పోండి మీరు ఎట్ట జత్తే నాకెందుకు, మీ సాడు మీరు తాగండి’ అని పైపంచె దులుపుకుని లోపలికి వెళ్ళిపోయాడు.
దేశం అంతా తిరిగి పల్లేల్లో నుంచి ఇలా చదువు సంధ్య లేనివాళ్లని ఏరుకొచ్చి పనిలో పెట్టి, వాళ్లతో గొడ్డు చాకిరీ చేపించుకోవడం బాగా తెల్సిన పని. సిటీ బయట నీళ్లు దొరకని చోట కడుతున్న అపార్ట్‌మెంట్స్‌కి వీళ్లని తోలి ఆ ఇరవై వేలు ఇస్తే లెక్క సరిగ్గా సరిపోతుందని ఆ సేట్లకి తెల్సు. రంగిసెట్టికి నొప్పి తెలియకుండా మళ్ళీ అందరినీ పిలిపించి, ఓకే మీరు చెప్పినట్టే ఇస్తామని ఒప్పించారు. అలగా వాళ్లతో మాటపడ్డందుకు రంగిసెట్టి ఏమంత సంతోషంగా లేడు. అతని కడుపులో మంట ఇప్పట్లో తగ్గదు. నవ్వు పులుముకుని, ‘మీ కడుపు నేనెందుకు కొడతాన్రా అయ్యలారా’ అని అందరికీ కలిపి ఒకే ఒక నమస్కారం పెట్టి ఊరుకున్నాడు.
జానుగాడు వాళ్ల నాన్న చెయి పట్టుకుని ‘అయ్యా ఆ డింకుసీసా గావాల’ అన్నాడు. అసలే ఊరు వదిలెల్తున్న చికాకు ఎవరి మీద సూపియాలో నెత్తి గోక్కుంటున్న వాడికి ఈ మాట వరంలా చిక్కింది. ‘నా కొడక ఊరొదిలి నేను పోతా ఉంటే నీకు డింకు గావాల్నా గాలికి బుట్టిన నాకొడకా’ అని రొండు జబురుకున్నాడు. గబుక్కున రంగమ్మ లాక్కుని, ‘యాందీ మడిసి ఒక సుకము లేదు దుక్కము లేదు పిల్లోడ్ని సావనూకుతున్నాడు’ అని తిట్లకి లంకించుకుంది. జానుగాడి కళ్ళలో ఏడుపు లేదు, వాడి మనసంతా సీసామీదే ఉంది. రంగిసెట్టి ఆ నల్లటి ఇనపదాంతో ఆ మూత తెరిస్తే చేత్తో పట్టుకుని సల్లగా తాగాలని ఉంది. పది రూపాయలు– పదంటే పది రూపాయలు గావాల.
అందర్నీ రేత్రి పదింటికల్లా టేషను కాడికి రమ్మని వాళ్ల ఏజెంటుని అక్కడే పెట్టి సేట్లు కార్లో వెళ్ళిపోయారు. మాపటేలకి యాకోబు, సాలమాను, ఓబయ్య, ఆనందరావు, ఇంకా మిగిలినోళ్ళంతా పాస్టర్ కాడికి బోయి పార్ధన జేపిచ్చుకొని బయలుదేరుతూ, అయ్యగారి సేతిలో తలా ఒక ఇరవై రూపాయలు పెట్టి వొందనాలు జెప్పి బయలుదేరారు. అబ్బా ఆ డబ్బుల్లో నుంచి ఒక్క పది కాగితం జారిపడితేనా దీనెక్క ఇక ఆ సల్లటి సీసా మనదే అనుకున్నాడు జాను గాడు. అయ్యని అడుగుదామా అని అంటే నిన్న తిన్న దెబ్బలు యాదికొచ్చి యెనిక్కి తగ్గాడు.రంగమ్మ దిష్టి తీసింది మొగుడికి. ఇంట్లో ఉన్న రొండు వందకాయితాలు తీసి జేబీలో పెట్టి కళ్లనీళ్లు తిరుగుతుండగా ‘అయ్యో! నెత్తిన ఇత్తులు బడ్డా కాణ్ణుంచి నేను నిన్నేమీ కోరిక కోరలేదు.
నువ్వు ఎట్టా తిరిగినా ఏదో నోటి తుత్తర కొద్దీ వసపిట్ట మోయిన వాగుంటా. అదంతా మతిలో బెట్టుకోమాక. పని జేసుకో యాలకి తిను, తాగుడు జోలికి పోమాక. నీకోసం నాలుగు నెలలదాక చూస్తా ఉంటా’ అని కళ్ళు తుడుచుకుంది. జాన్సన్ గాడు మాత్రం నాన్న జేబు వంకే చూస్తున్నాడు. అమ్మ ఇచ్చిన రొండు వందల్లో ఒక్క పది ఇస్తే బాగుండు అనుకున్నాడు కాని, అడగడానికి నిన్న దెబ్బలు ఇంకా మతికి ఉన్నాయి.‘ఓ అన్నా ఈ మడిసి సంగతి నీకు తెల్సుగద! అసలే తాగుడు మడిసి. నువ్వే రొంత కనిపెట్టుకుని నీ పక్కనే ఉంచుకోన్న నీ సెల్లెలు అనుకోని మాట కాసుకోన్నా! అంతా నీ మీన్నే పెడుతున్న రొంత జాగ్రత అన్నా!’ అని కళ్ళలో నీళ్ళు కళ్ళలో పెట్టుకుంది రాహేలమ్మ.
‘పోవే నీ... నా గురించి నాకు తెల్వదా? ఏదో పొద్దుగాల పన్జేసి ఆనెక్కాలకి ఒక గుక్కెడు తాగుతా. దానికే ఏందీ ఇంత రంజీబు. అయినా తాగి పడుకోనీకి నేను మా అయ్య కాడికి కాదే పోయేది, పనికి. సేట్ల కాడ ఇయి నడవ్వు’ అని నవ్వుతూ తిడుతూ ముందుకు కదిలాడు. బస్సు పదిమంది వలస కార్మికులని ఎక్కించుకుని వెళ్ళిపోయింది. ప్రతి శనివారం రంగిశెట్టి దుకాణం కాడసందడి సందడిగా ఉంటది ఆడున్న కాయిన్ బాక్స్‌కి పనికి బోయినోళ్లు అందరూ పోన్ జేత్తారు. అందరూ అయిపోయినాకయితే రొంత ఎక్కువసేపు మాట్లాడొచ్చు అని అట్లనే నిల్చుకోని ఉండేది రంగమ్మ. అదే టైములో ఒకనాడు జానుగాడు పోయి ‘రంగిసెట్టి! మా అయ్య వచ్చాక ఇస్తా గాని సొమ్ములు, ముందు ఆ చల్ల సీసా ఇవ్వు’ అని గాలం వేశాడు.
అసలే తనమాట కాదని ఎక్కువ సొమ్ములు పెరుక్కున్నారని కోపంలో ఉన్న రంగిసెట్టి , ‘యాడరా నీ అయ్య వచ్చి ఇచ్చేది? అప్పుడే నువ్వు డింకు తాగే మొగోనివయ్యావా! మీ అయ్యలు ఆడ నానా తిట్లు తిని సంపాదిస్తుంటే ఈడ ఈ గూద నా కొడుకులకు ఏం జేయాలో తెలియడం ల్యా’ అని చెడు తిట్లకి లంకించుకున్నాడు. ఎవురి గొడవలో వాళ్ళుండడం వల్ల జానుగాడికి, రంగిసెట్టికి మజ్జన జరిగింది ఎవురూ సూడలేదు. బిత్తరపోయిన జానుగాడు సల్లగా వొచ్చి అమ్మ పక్కన నిలబడుకొని ఫోను వచ్చేదాకా వాడి సూపంతా ఆడ్నే ఉంది.ఆ గుండ్రటి కుండ అందులో సల్లని నీళ్ల మధ్యలో ఆకుపచ్చని సీసాకాయ. ఆ కంగారులోనే ‘అయ్యా ఎట్లున్నావురా అయ్యా’ అంటే, ‘బాగున్నా’ అన్నాడే గాని, పది రూపాయలు అడగలేదు.
రంగమ్మ ఇంట్లో ఎప్పుడు మంచం మీద పక్క శుభ్రంగా ఉంచుతుంది. గొడవ అయినాక దాన్ని కోపంతో చిందరవందర చేస్తూ మంచం మీద పడుకున్నాడు జాను గాడు. వాడికి పది రూపాయలు కావాలి. తలా ఒక రూపాయి అడుగుదామని ఆలోచన జేసీ అడిగాడు. నేరుగా రంగమ్మ కాడికి వచ్చి ‘ఏంది మీ పిల్లోడు రూపాయి అడిగినాడు ఏంది కత’ అని అడిగేతలికి జానుగాడి ఈపు సాపు జేసింది రంగమ్మ. ‘బడికి పోయి సదువుకోమంటే పోడుగాని ఈడికి డింకు సీసా గావాలంట నాకాడ సొమ్ములున్నా ఇప్పియ్యను గాక ఇప్పియన్ను నీ సొయ్యం నీకు అణగాల. ఎవురుకాడైనా చేయిజాపినా, ఇంట్లో రూపాయి కాన్రాకపోయినా నా కొడకా కొడితే మీ జేజవ్వ దిగిరావాల’ అని ఆ రోజంతా తిడతానే ఉంది.జాను గాడికి నిద్రలో అదే, మెలకువలో అదే! పదిరూపాయలు. పెద్ద కూర తిన్న రోజంతా ఆడి ధ్యాసంతా దానిమీన్నే ఉండేది. సీట్లపేక కాడికి కూడ పోవట్లే.
ఒక్కొక్క రోజు ఎల్లి రంగిసెట్టి కొట్టు కాన్నే కూసోని, రోజుకి ఎంతమంది తాగుతున్నారా అని లెక్కేలేసే వాడు. దేవుడా ఒక్క పది రూపాయలు దొరికేలా చేయమని సెర్చీ కాడికి బోయి పార్ధన కూడా చేశాడు. ప్చ్.. అయినా గాని వాడికి ఆ వరం దక్కలేదు.ఆనందరావు పనిలో కుదురుకున్నాడు. బటోడ డబ్బులు దాచుకోవడం మొదులు బెట్టాడు. ఒక పక్కన అదిలించే వాళ్ళు లేక ఓబు తాగుడు ఎక్కువైంది. పనికి మూడు రోజులు బోతే మిగతా మూడు రోజులు నాగా లాగా తయారైంది. ముందు ఏజెంట్ చెప్పి జూశాడు. రాహేలుకి పోన్ జేశారు. ఆయమ్మ నెత్తి నోరు కొట్టుకుని ఏడ్చి మరి జెప్పింది. నవ్వి నేను తాగలేదు అనేవాడు, ఆ మాట కూడా తాగే చెప్పేవాడు. మెల్లగా పనికి పోకుండా తాగుడుకు బానిసై అప్పులు జేసీ ఒంట్లో బాగోని కాడికి తెచ్చుకున్నాడు.
మూడు నెలలు కావడానికి ఇంకో వారం ఉంది అనగా ఒక అర్ధరాత్రి కాడ రంగిసెట్టి పోన్ మోగింది. ‘ఏంది సెట్టి నీ కమీషన్ కోసం తాగుబోతు నాయాల్ని పంపినావు. వాడు తాగి తాగి ఈడ సచ్చిపోయినాడు. వాడికి సొమ్మేం రాదు. ఏదో మళ్లా ఆ ఊరికి పనోళ్ల కోసం రావాలిగాబట్టి రొంత సొమ్ము పంపుతున్నా అక్కడ నువ్వే సెటిల్ జేసుకో’ అని ఏజెంట్ చెడామడా తిట్టి పోన్ పెట్టేసినాడు. రంగిసెట్టికి గుండె దడ పెరిగింది. మాదిగ పల్లె వైపు ఉరికాడు. ముందు సలవాదిరిని లేపుకుని విషయం చెప్పి అందరికి చెబుదాం పదమన్నాడు. పల్లె మొత్తం నిద్ర లేచింది. రాహేలమ్మ స్పృహ కోల్పోయింది. రంగమ్మ పరుగెత్తి కెళ్లి ‘ఊరుకో వదినా’ అంటూ ఊరడిస్తోంది.
ఆనందరావు, యాకోబు ఇద్దరు ఓబు శవాన్ని తీసుకుని బయలుదేరారు.
మాదిగపల్లె ఓబు శవం కోసం ఎదురు చూస్తోంది. సంగతి తెల్సినకాణ్ణుంచీ జానుగాడు, రంగమ్మ ఆణ్నే ఉన్నారు. రాహేలుని ఆపడం ఎవురుతరం కావటం లేదు. రంగమ్మ పక్కనే కూర్చుని ‘ఊరుకో వొదినా! అంతా మన గాచారం’ అని అనునయిస్తోంది.‘గాచారం గాదు ఒదినా, మన తలరాత. ఈ ఊరిమీన ఉన్నంత ఎండ ఏఊర్లో అయినా ఉందా? ఎన్నడైనా ఇంత మబ్బు తునక చూసినమా, తోవ తడిసే వాన జూసినమా? రొండు బిందెల నీళ్లకు ఎంత దూరం పోతుంటిమీ, నీళ్ల కోసం గడప దాటని ఆడది ఉందా మనూళ్లో. వారానికి ఒక బిందె నీళ్ళు ఇది గదూ మన బతుకు. కాని సారాయి జూడు దానికి నీళ్ల కొదువే ఉండదు. ఇళ్ళూ, ఊళ్ళు ఆర్పి కూసుంటుంది. నీళ్ళు లేకపోయినా ఈ నా బట్టలు ఆ మందు తాగి ఇదిగో ఇట్టా మన తాళ్ళు తెంపుతున్నారు’ అని అంటూ మళ్ళీ ఏడవడం మొదులు బెట్టింది. రంగమ్మ కళ్ళు తుడుచుకుంది.
ఆనందరావుకి తాగుడు లేదు. అదొక్కటే సంతోషం తనకి. ఓబు ఇంటికాడ శవాన్ని దించి నీళ్లుబోసుకుని వద్దామని ఆనందరావు, యాకోబు ఇళ్లకి వచ్చారు. రంగమ్మ కళ్లనిండా నీళ్ళు పెట్టుకుని అనందరావుకి ఎదురెళ్ళింది. పొంతలో నీళ్ళు తోడి, గాబులో నీళ్ళు కలిపి రేకుల తలుపున్న దొడ్లో పెట్టింది. జాను గాడికి నాన్న జోబు మీద కన్ను పడింది. ఒక్క పది రూపాయలు అయ్యొచ్చిండు. ఇగ ఇయాలో రేపో చేతిలో సల్లని సీసా గొంతులో తీయగా అబ్బా వాడికి వాడే ఊరించుకుంటున్నాడు.ఏందయ్య ఎందుకు మీరు పోయింది ..? పక్క పొంటి మనిషి అంతగనం తాగుతుంటే మీరు చెప్పొద్దా అంటూ ఆనందరావుని నిలదీసింది రంగమ్మ.
‘నువ్వు మా పని కాడికి రావే ఆడజేసే గొడ్డు చాకిరీ నీకు తెలుస్తది. లేచిన కాణ్ణుంచి రేత్రి ఎనిమిది దాకా వొంచిన నడుము ఎత్తేదానికి ఉండదు. బువ్వ ఒక్కసారే పెడతారు. మారన్నం అడిగితే ఇంగ అంతే మా కత, రోజూ పచ్చడి, పప్పే! దానికి తోడు నీళ్ల మజ్జిగ. దీనమ్మ జీవితం ఆణ్నే సచ్చిపోతే బాగుండని ఎన్నితూర్లు అనుకున్నానో తెల్సునా. ఓబుగాడు పోయిన మూడో రొజునుంచే వాని స్యాతగాలే పని, వాడి పని గూడా మేమే జేసి, ఆ నాలుగు రాళ్లు ఇప్పిచ్చినం. వాడి బాదలకి మందు అదే అని తెల్సినాక యాడ్నే ఆపేది. వాడిని ఆసుపత్రికి తీసకపొమ్మని అడిగితే ఆ సేట్ నా కొడుకు తాగుబోతు నాయాళ్లు మాకు అక్కర్లేదు అని ఎల్లిపోయినాడు’ అని కళ్ళు తుడుచుకున్నాడు. రంగమ్మకి విషయం పూర్తిగా అర్థమైంది . ఇంతకి మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా మళ్ళీ ఆనందరావు ఎనిక్కి పోడని ఊహించి ఇంకేం మాట్లాడలేదు.
ఎప్పటిలానే నేలని ఎండబెట్టడానికి మళ్ళీ ఎండ వచ్చింది. ఓబుని పూడ్చిపెట్టడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. నీళ్ల టాంకి కోసమని పొయినోళ్లకి దొరకనే లేదు.ఆనందరావు, యాకోబు, ఇంకొంతమంది తలా ఇంత అని వేసుకుని అవసరమైన పెట్టే, తెల్లగుడ్డ, సెంటు సీసాలు, చల్లడానికి చిల్లర అన్ని సమకూర్చారు. పాస్టర్‌గారికి కబురు వెళ్ళింది.నీళ్ల బండి దొరకని కారణంగా స్నానం లేదు. సెంటు కొట్టి పెట్టెలో పెట్టడమే అని తీరుమానం చేసి పాస్టర్ కోసం ఎదురు చూస్తున్నారు.జానుగాడు లేచేసరికి ఎదురుగుండా నోట్ల కట్టలు కనబడ్డాయి. ఇంట్లో అమ్మా, అయ్యా ఎవురూ లేరు. బయటకి వచ్చి మల్లొకసారి ఎవరూ లేరని సూసుకుని, మెల్లిగా ఒక నోటు లాగి నిక్కర జేబిలో పెట్టుకుని ఒక్క ఉదుటున బయటకి ఉరికాడు. వాడి మనసులో ఒకటే ఆశ ... ఆ సీసా సల్లగా గొంతులోకి పొయే కల. మధ్యలో బడికి పోతున్న తన సావాస గాళ్లని ఆపి, జేబులో నోటు చూపెట్టి సీసా తాగబోయే సంగతి చెప్పాడు.
ఒక్కసారిగా వాళ్లంతా నవ్వడం మొదులు పెట్టారు. ‘ఒరే జానుగా! అది అసలు సొమ్ము గాదురా అది పిచ్చి నోటు. ఎవురైనా సచ్చిపొతే వాళ్లమీద జల్లడానికి తెచ్చే సొమ్ములు’ అనేసరికి జానుగాడికి ఎక్కడలేనినీరసం ఆవహించింది. ఉసూరుమంటూ వెనక్కి మరులుకొని ఓబు ఇంటిదగ్గరకి పోయాడు. అక్కడా ఉండబుద్ది గాలేదు. ఇంటికి పోయి ఆ నోటు ఆడ్నే పార్నూకి మంచమెక్కి పొనుకున్నాడు. మజ్జానం అవుతావుంది. రంగమ్మ ఇంటికి బోయి, ఒకమారు జానుగాడికి అన్నం బెట్టి వచ్చింది.సరిగ్గా రొండు గంటలకి బతికినంతకాలం తాగి తాగి సచ్చిపోయిన ఓబు పోయినాక కనీసం నీటిసుక్క గూడా ఒంటిమీన పడకుండా పెట్టెలో పడుకుని పోతున్నాడు. పల్లె పల్లె మొత్తం ఖాళీగా ఉంది. ఓబుని పెట్టెలో పెట్టి తీసుకుపోవడానికి లేపారు. పలకలు మోగుతున్నాయి.
సరిగ్గా అదే టయానికి పడుకున్న జానుగాడు నిద్ర లేచాడు, బయటకి వచ్చి చూస్తే జనం పోతా ఉన్నారు.కళ్ళు నుల్చుకున్నాడు. తెల్లటి ఎండలో మిల మిలా మెరుస్తున్న రొండు రూపాయల బిళ్ల. దగ్గరకి వెళ్లాడు కళ్ళు పెద్దవి చేసి చూశాడు. ఇది కాగితం కాదు, బిళ్ల– చెల్లుతుంది అనుకుని తీసుకుని జోబిలో వేసుకున్నాడు, ఆనందం ఆగేలా లేదు వాడికి. ఇంకా ముందుకు పోయాడు ఇంకో రూపాయి, ఇంకా ముందుకు పోతే ఇంకో రెండు రూపాయలు... గులాం పూసుకుని కొన్ని పూలు మీదబడి కొన్ని దొరికాయి.సరిగ్గా లెక్క జూసుకున్నాడు మొత్తం పది రూపాయలు.రంగిసెట్టి కొట్టు ఒకటే కళ్లముందు కనబడుతుంది జానుగాడికి, వాడిలో వాడే లోపల్లోపల మాట్లాడుకుంటున్నాడు ‘ఎట్లుంటది? అది సోడాలాగే ఉంటదా. తియ్యగా, పుల్లగా, అసలు ఇంట్లో నీళ్లే తాగడానికి రొండు రోజుల తర్వాత పనికి రావు. ఇన్ని రోజులు ఆ సీసాలో నీళ్లు పాడైపోవా?’ బుర్ర నిండా గందరగోళం.
ఇంక కాసేపట్లో ఆ సీసా తన చేతిలో ఉంటది. పరిగెత్తుతున్నాడు, కాళ్లు కాల్తున్నాయి. అయినా ఆగడం ల్యా, పలకల దరువు పెరిగే కొద్ది జానుగాడిలో హుషారు పెరుగుతుంది. దరువు దరువుకి ఒక అంగ వేసుకుంటూ సరిగ్గా రంగిసెట్టి కొట్టు దగ్గర ఆగిపోయాడు జానుగాడు.
వీళ్లు అందరూ కనబడకుండా పోయాక తాగుదామని ఆలోచన చేశాడు. మళ్ళీ ఎవురైనా సొమ్ములు యాడివి అంటే దొరికినాయని చెప్పినా నమ్మరు. శవం కాడియి ఏరుకున్నావా అని తన్నినా తంతారని ఆగాడు. ఒక పక్క ఓబుని పాతిపెట్టే కార్యక్రమం నడుస్తోంది, ఏడుపులు ఇనొస్తున్నాయి.రంగిసెట్టి కొట్టుకాడ జేబిలో డబ్బులు తీసి సరిగ్గా లెక్కబెట్టి ‘ఇదిగో రంగిసెట్టి లెక్క. నాకో సీసా ఇయ్యి’ అని దాదాపుగా అరిసినంత పనిజేశాడు జానుగాడు.
లెక్క సరిచూసుకున్నాడు సెట్టి, యాడియిరా అని అడగబోయి, యేముందిలే పట్నం సొమ్ము అనుకుని గల్లాలో వేసుకుని సీసా మూత తీసి ఇచ్చాడు.అదే సప్పుడు కోసమే జానుగాడు కలగన్నది. ఆ ఇనుప సువ్వ దీసుకుని రంగిసెట్టి మూత తీస్తుంటే జానుగాడి మనసులో బో కుశాలయింది.చేతిలో చల్లని సీసా, పైన ఎర్రటి ఎండ. నీళ్ళు గుడక ఇంత ప్రేమగా ఏనాడు తాగలేదు. ఓబు కార్యక్రమం అయిపోయింది. అందరూ యెనిక్కి మరలుకుని వస్తున్నారు, ఓబుని తల్సుకుని పనికి పోవాలా వద్దా అని ఆనందరావు గుబులు పడుతున్నాడు. రంగమ్మ కళ్లముందు బాగుజేసుకున్న ఇల్లు, బలుబు ఎల్తురు అగపడతున్నాయి. కళ్ళముందు కుర్చీలో కూర్చుని సల్ల డింకు సీసా తాగుతున్న జానుగాడు అగపడుతున్నాడు.చిరాగ్గా మొహం బెట్టుకుని రంగిసెట్టి ఆ ముగ్గురినీ జూత్తా ఉన్నాడు.


