డాక్టర్ రాగానే ఆ తల్లి కళ్ళల్లో నీళ్ళు చూశాడు.‘‘డాక్టర్‌గారు. నెలల పిల్ల. ఒళ్ళు కాలిపోతోంది.’’ ఆ తల్లి దుఃఖంగా చెప్పింది.ఆయన ఆ పిల్ల టెంపరేచర్ చూశాడు.‘‘నూట రెండు! తగ్గకపోగా పెరిగింది. నాకు చేతనైన చికిత్స చేస్తున్నాను. ఆపైన దైవం మీదే భారం. నుదుటి మీద ఉడుకులాం పట్టీని తడిపి వేయడం మానకండి. టెంపరేచర్ ఇంకో గంటలో తగ్గితే సరే, లేదా ప్రమాదం.’’ ఆయన హెచ్చరించాడు.దేవుడిని నమ్మేవారు అసాధ్యాలు సాధ్యాలు అవచ్చని నమ్ముతారు. ఆయన వెళ్ళాక ఆమె పూజగదిలోకి వెళ్ళి, ఏడు తరాల నుంచి తమ కులదైవమైన హూళిగాదేవి విగ్రహం ముందు మోకాళ్ళ మీద కూర్చుని, మనసులో ఆ దేవి రూపాన్ని నింపుకుని, తను అంతదాకా ఏదీ కోరలేదని, తన కూతుర్ని కాపాడే కోరికని తీర్చమని ప్రార్థించసాగింది.‘‘దైవం కొన్ని కోరికలని ఎందుకు తీర్చడంటే అవి చేటు చేస్తాయని.’’ మృదుమధుర కంఠం వినబడి ఆమె కళ్ళు తెరచి చూసింది.ఎదురుగా చిరునవ్వుతో కనపడ్డ దేవిని చూసి ఆ తల్లి కోరింది.‘‘నా కూతుర్ని బతికించు మాతా.’’
ఆ పాపకి అమ్మవారి నామాలలో ఒకటైన క్రియేశ్వరి పేరుని ఆ దంపతులు పెట్టుకున్నారు.మూడో ఏడు వచ్చేసరికి క్రియేశ్వరికి అన్ని వస్తువులని విసరడం అలవాటైంది. కనిపించిన వస్తువుని తీసుకుని విసిరి కొడుతుంది.‘‘తప్పు. అది ఎవరికైనా తగలొచ్చు.’’ తల్లి మందలిస్తుంది.ఆరో ఏట క్రియేశ్వరి విసిరిన పుస్తకం అంచు భాగం తండ్రి కంట్లో గుచ్చుకోవడంతో రక్తం కారసాగింది. తక్షణం హాస్పిటల్‌కి తీసుకెళ్ళారు. ఆయన కుడి కంటి చూపు శాశ్వతంగా పోయింది. ‘‘మంచిది. పోయింది నా కన్నేగా. ఇదే పరాయి వాళ్ళ కన్నైతే ఎంతో తగువులాట జరిగేది.’’ తండ్రి చెప్పాడు.క్రియేశ్వరి వస్తువులని విసరడం ఏడో ఏడు దాకా ఆపలేదు.క్రియేశ్వరి ఎనిమిదో ఏట స్కూల్ హెడ్ మాస్టర్ ఆమె తల్లిదండ్రులని పిలిచి టీసీ ఇచ్చి చెప్పాడు.‘‘మీ అమ్మాయి ప్రవర్తన, చదువు ఏ మాత్రం బాలేవు. మీ అమ్మాయిని సరైన దారిలో పెట్టమని నాలుగైదుసార్లు హెచ్చరించినా మీరు పట్టించుకోలేదు. తోటిపిల్లల పుస్తకాలు ఎత్తుకెళ్ళి మిఠాయి షాపుల్లో ఇచ్చి మిఠాయి కొనుక్కుంటోంది.
అందరితోనూ పోట్లాటే.’’క్రియేశ్వరికి పన్నెండో ఏడు వచ్చేసరికి మూడు స్కూల్స్ మారింది. తమ కూతురిలోని చెడ్డ లక్షణాలకి ఆ దంపతులకి రంపపు కోతగా ఉంది. క్రియేశ్వరి బంధువులు, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు తమ ఇంటికి క్రియేశ్వరితో రావద్దని నిష్కర్షగా చెప్పారు.పధ్నాలుగో ఏట వాళ్ళకి క్రియేశ్వరి పెద్ద కష్టాన్ని తెచ్చింది. ఆమె డబ్బు కోసం మగాళ్ళతో గడుపుతోందని ఆమె తల్లిదండ్రులకి తెలిసింది. కుటుంబ గౌరవం మంట కలుపుతోందని మొదటిసారి తండ్రి కూతుర్ని కొట్టాడు. ఆమె ఎదురు తిరిగి తండ్రి కళ్ళజోడుని విరగ్గొట్టి చొక్కాని చింపేసి, ఆయన్ని గదిలో బంధించి తలుపు గడియ పెట్టింది. గంట తర్వాత ఓ వీధి రౌడీ వచ్చి క్రియేశ్వరి తండ్రిని చితకబాదాడు.‘‘ఖబడ్దార్ గుడ్డి నాయాల.
క్రియ నాది. దాన్నేమైనా అంటే నిన్ను చంపేస్తాను.’’ బెదిరించాడు.‘‘నేనంటే వాడికి ఎంత ప్రేమో చూశారా?’’ క్రియేశ్వరి నవ్వుతూ చెప్పింది.మరో ఆరు నెలల తర్వాత మరో కష్టం వారికి వచ్చింది. క్రియేశ్వరి గర్భవతైంది. ఆమె బిడ్డని కంటానని పట్టుపట్టింది. బలవంతంగా అబార్షన్ చేయించారు.క్రియేశ్వరికి పదిహేడో ఏట ఆల్కహాల్ అలవాటైంది. పంతొమ్మిదో ఏట కాల్ సెంటర్లో చేరింది. అయితే, ఆమెని మూడు వారాల తర్వాత ఉద్యోగంలోంచి తీసేశారు. తల్లితండ్రులు ఆమెకి పెళ్ళి చేయకూడదని నిర్ణయించుకున్నారు. తన ఇరవై మూడో ఏట క్రియేశ్వరి ఓ ఏభైరెండేళ్ళ ఆయనతో వచ్చి చెప్పింది.‘‘ఈయన నన్ను ప్రేమిస్తున్నాడు. పెళ్ళి చేసుకుంటాడు. మా పెళ్ళి ఘనంగా చేయండి.’’
ఆ పెళ్ళి మానుకోమని బతిమాలారు. క్రియేశ్వరి ఎప్పటిలా పట్టినపట్టు విడవలేదు. ఆమె తండ్రి పీఎఫ్ మొత్తం విత్‌డ్రా చేసి కూతురి పెళ్ళి జరిపించాడు. వృద్ధాప్యంలో వాళ్ళని ఆదుకునే ప్రధాన వనరు అలా మాయమైంది. ఆమె తన ఇరవై ఎనిమిదో ఏట తండ్రి మీద దావా వేసి గెలిచి, ఇంట్లోని తన భాగాన్ని కావాలని పరాయి మతస్తులకి అమ్మింది. ఆ పొరుగుని భరించలేక వాళ్ళు అద్దె ఇంటికి మారారు. తన తండ్రి తన భాగాన్ని అమ్మాడని రెండేళ్ళ తర్వాత తెలిసి వచ్చి ఆ డబ్బు ఇవ్వమని గొడవ చేసింది. ఆయన నిరాకరిస్తే జరిగిన ఘర్షణలో క్రియేశ్వరి కొట్టిన దెబ్బలకి ఆయన మరణించాడు.‘‘ఇల్లమ్మి ఆ డబ్బు నాకు ఇవ్వనందుకు.’’ అరిచింది.ఎర్రబడ్డ కూతురి మొహంలోని రోషాన్ని, కోపాన్ని, ద్వేషాన్ని చూసి ఆ తల్లి భయంతో వణికిపోయింది. ఆవిడ చూస్తూండగానే క్రియేశ్వరి మొహంలో క్రమంగా వయసు తగ్గసాగింది.
ఇరవై మూడు నించి పదిహేనుకి, పదికి, ఐదుకి, ఏడాదికి, చివరకి మూడు నెలల పసిపాప మొహం కనిపించింది. ఆమె కళ్ళు తెరచి చూస్తే ఉయ్యాలలోని, ఇంకా పేరు పెట్టని తన కూతురు కనిపించింది. తను కలగనలేదని, అమ్మవారు భవిష్యత్తును చూపించిందని గ్రహించింది. మళ్ళీ అశరీరవాణి వినిపించింది.‘‘నీ ప్రార్థనని నువ్వు మన్నిస్తావో లేదో నీ చేతుల్లో ఉంది. పాపని నువ్వు మరో మూడు నిమిషాల్లో ఎత్తుకుంటే బతుకుతుంది. లేదా మరణిస్తుంది.’’అత్యంత అమాయక మొహం గల ఆ పాప కళ్ళు తెరిచి నీరసంగా తల్లి వంక చూస్తూంటే ఆ పాప నోట్లోంచి బలహీనమైన శబ్దాలు వినిపించాయి. రెండు నిమిషాలు తటపటాయించాక ఆమె లేచి పక్కగదిలోకి వెళ్ళింది. అంతలోనే పరిగెత్తుకు వచ్చి ఉయ్యాలలోంచి కూతుర్ని తీసుకుని గుండెలకి హత్తుకుంది. క్రమంగా నూట రెండు నించి టెంపరేచర్ నూట ఒకటికి, వందకి, తొంభై తొమ్మిదికి, చివరకి నార్మల్‌కి దిగింది.తల్లి తన బిడ్డల మీద ప్రేమని ఎన్నటికీ కోల్పోదు.
∙మల్లాది వెంకట కృష్ణమూర్తి


