అనుకోకుండా మొదలైన అనశ్వర రాజన్ ప్రయాణం,నేడు ఎన్నో లక్ష్యాలు, ఎన్నో కలలతో నిండిపోయింది. మనసులో ఎన్నో గాయాలను దాచుకుని ముందుకు నడుస్తున్న ఆమె ప్రపంచం గురించిన విషయాలు ఆమె మాటల్లోనే...
⇒ నిజం చెప్పాలంటే, నేను ఎప్పుడూ హీరోయిన్ అవ్వాలని అనుకోలేదు. కరివెల్లూరులో చదువుతున్న రోజుల్లో, నా తొలి ఆడిషన్ కు ఒక ఫ్రెండ్ నన్ను లాక్కెళ్లింది.
⇒ సినిమాల్లోకి వచ్చాక నా స్కూల్ జీవితం ఒంటరిగా మారిపోయింది. కొంతమంది టీచర్లు, పేరెంట్స్ నన్ను వేరుగా చూసేవారు. ‘‘నీకు సినిమాలు ఉన్నాయిగా, చదువు ఎందుకు?’’ అనే మాటలు ఇప్పటికీ బాధిస్తాయి. స్కూల్ మానేయాలనుకున్న రోజులు కూడా ఉన్నాయి.
⇒ ఐదో తరగతిలో ఉన్నప్పుడు బస్సులో ఎదురైన ఒక చేదు అనుభవం ఇప్పటికీ వెంటాడుతుంది. ఆ సంఘటన నా బాల్యాన్ని పెద్దదిగా చేసింది. ఇప్పటికీ బస్సు ప్రయాణం అంటే కొంత ఆందోళనగానే ఉంటుంది.
⇒ ఇప్పుడు అంతకంటే భయం కలిగించేది డిజిటల్ ప్రపంచం. ఏఐతో మార్ఫ్ చేసిన ఫొటోలు, వీడియోలు చూస్తే నిజంగా వణుకు పుడుతుంది. వాటిని ఆపలేకపోవడం చాలా బాధగా ఉంటుంది.
⇒ గత ఏడాది ఒక సినిమా ప్రమోషన్స్ సమయంలో జరిగిన వివాదం నాకు చాలా నేర్పింది. ఆ సమయంలో నేను బాధితురాలిలా మౌనంగా ఉండలేదు. నా పేరు, నా గౌరవం కోసం నిలబడ్డాను. అదే నా నిజమైన బ్రేక్‌త్రూ.
⇒ ‘‘పెళ్లి గురించి కాదు, నీ కెరీర్, నీ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ఆలోచించు’’ అని చెప్పే ప్రోగ్రెసివ్ తండ్రి నాకు దొరికారు. ఆయనే నా అతిపెద్ద బలం. ఇప్పుడు నా దుస్తులు, నా ఎంపికల గురించి ఎవరు ఏమనుకుంటారో పట్టించుకోవడం మానేశాను. నాకు ఎవరికీ వివరణలు ఇవ్వాల్సిన అవసరం లేదని నేర్చుకున్నాను.
⇒ షూటింగ్ లేనప్పుడు నా బ్యాగ్‌లో తప్పకుండా ఒక పుస్తకం ఉంటుంది. నేను పూర్తిగా రొమాంటిక్ నవలల ఫ్యాన్ ని. చదవకపోయినా, కొనకుండా ఉండలేను.
⇒ స్కిన్ కేర్ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్. మేకప్ తప్పకుండా తీసేస్తాను. ముందుగా ఆయిల్‌తో క్లీనింగ్, తర్వాత మేకప్ రిమూవర్, ఆపై ఫేస్ వాష్ డబుల్ క్లీన్సింగ్ లేకపోతే నిద్రపోను. షూటింగ్ లేనప్పుడు ‘క్లీన్ గర్ల్ లుక్’ ఇష్టం. సింపుల్ స్కిన్, కాస్త డార్క్ కాజల్ అంతే.
⇒ మలయాళం వరకు మాత్రమే కాదు, ఇప్పుడు తెలుగులోకి కూడా అడుగుపెడుతున్నాను. ‘చాంపియన్’ నా తొలి తెలుగు సినిమా. మరో తెలుగు ప్రాజెక్ట్ కూడా సైన్ చేశాను.


