ఏఐ కారణంగా... వచ్చే ఉద్యోగాలేవి? పోయే ఉద్యోగాలేవి? | next five years due to the rise of artificial intelligence | Sakshi
Sakshi News home page

ఏఐ కారణంగా... వచ్చే ఉద్యోగాలేవి? పోయే ఉద్యోగాలేవి?

Aug 17 2025 8:39 AM | Updated on Aug 17 2025 8:40 AM

next five years due to the rise of artificial intelligence

ప్రతి నాణేనికీ బొమ్మ బొరుసులు ఉంటాయి; ప్రతి పరిణామానికీ మంచి చెడులు ఉంటాయి; కృత్రిమ మేధకు (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌–ఏఐ) కూడా ఉభయ కోణాలూ ఉంటాయి. ఏఐ దెబ్బకు ఇప్పటికే ఉన్న అనేక ఉద్యోగాలు పోతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏఐ సాంకేతికత కొత్త ఉద్యోగాలకు ఊపిరి పోస్తుందనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఏఐ కారణంగా...

వచ్చే ఉద్యోగాలేవి? పోయే ఉద్యోగాలేవి? 

ఏఐ కాయిన్‌కి అటూ ఇటూ ఒకసారి పరిశీలించి చూద్దాం.

ఏఐ దెబ్బకు ఇప్పటికే కొన్ని ఉద్యోగాలు పోయిన మాట నిజమే! సమీప భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలకూ ఎసరొచ్చే పరిస్థితులు కూడా నిజమే! కంప్యూటర్లు వాడుకలోకి వచ్చిన తర్వాత టైపిస్టుల ఉద్యోగాలు క్రమంగా తెరమరుగైపోయాయి. చిన్నా చితకా పట్టణాల్లోనూ కనిపించే టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌లు శాశ్వతంగా మూతబడ్డాయి. కొత్త సాంకేతికత ఏదైనా విరివిగా వాడుకలోకి వచ్చినప్పుడు ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం సర్వసాధారణం. నిజానికి లెక్క చూసుకుంటే, కంప్యూటర్ల వల్ల పోయిన ఉద్యోగాల కంటే కొత్తగా వచ్చిన ఉద్యోగాల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. కంప్యూటర్లు వాడుకలోకి వచ్చిన కొత్తలో టైపిస్టుల ఉద్యోగాలు పోయినా, కనీస నైపుణ్యాలు కలిగినవారికి డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగాలు వచ్చాయి. 

కంప్యూటర్ల వాడకం పెరిగాక రకరకాల అవసరాల కోసం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా పెరిగాయి. అదే రీతిలో ఏఐ కారణంగా కొన్ని ఉద్యోగాలు లేకుండా పోయినా, ఇంకొన్ని కొత్త తరహా ఉద్యోగాలు రానున్నాయి. ఏఐ కారణంగా పోయే ఉద్యోగాల గురించి ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. అమెరికన్‌ కంపెనీ ‘ఆంత్రోపిక్‌’ సీఈవో, ‘క్లాడ్‌’ ఏఐ మోడల్‌ రూపకర్త డేరియో అమోడీ ఏఐ ప్రభావం వల్ల వచ్చే ఐదేళ్లలో ఎంట్రీ లెవల్‌ ఉద్యోగాలు సగానికి సగం తగ్గిపోతాయని చెబుతుంటే, ‘వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌’ వంటి అంతర్జాతీయ సంస్థలు భిన్నమైన అంచనాలను వెల్లడిస్తున్నాయి. ఏఐ ప్రభావం వల్ల వచ్చే ఐదేళ్లలో కొత్త తరహా ఉద్యోగాలు పుట్టుకొస్తాయని ఈ సంస్థలు చెబుతున్నాయి.

కోట్లలో కొత్త ఉద్యోగాలు
ఈ ఏడాది పూర్తయ్యేలోగా ఏఐ వల్ల వివిధ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా 9.7 కోట్ల ఉద్యోగాలు కొత్తగా పుట్టుకొస్తాయని ‘వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌’ అంచనా వేస్తోంది. వైద్యరంగంలో రోగనిర్ధారణ చేయడంలో ఏఐ మానవ వైద్యులను మించిన పనితీరును ఇప్పటికే ప్రదర్శిస్తోంది. అకౌంటింగ్, భాషానువాదం వంటి రంగాల్లోనూ ఏఐ తన సత్తా చాటుకుంటోంది. ఏఐ ఎన్ని సేవలకు ప్రత్యామ్నాయం కాగలిగినా, అంతిమ నిర్ణయం తీసుకునే శక్తి మాత్రం మానవులదే! మానవ నిర్ణయాత్మక శక్తికి ఏఐ ప్రత్యామ్నాయం కాలేదు. రానున్న కాలంలో ఏఐ మరింతగా అభివృద్ధి చెంది, పరిశ్రమల తీరుతెన్నులను మార్చేస్తుందని ‘వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌’ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, ఆరోగ్య, ఆర్థిక, సాంకేతిక తదితర రంగాల్లో ఏఐ ప్రభావం వల్ల 2030 నాటికల్లా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు

5 కోట్ల వరకు కొత్త తరహా ఉద్యోగాలు పుట్టుకొస్తాయని ‘మెక్‌ కిన్సే గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌’ అంచనా వేస్తోంది. సాంకేతిక నైపుణ్యానికి తోడు మానవ కౌశలం, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, భావోద్వేగ మేధాశక్తి అవసరమయ్యే ఉద్యోగాలు పలు రంగాల్లో కొత్తగా పుట్టుకొస్తాయని, వీటికి తగినట్లుగా శరవేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని, మార్కెట్‌ అవసరాలకు తగిన నైపుణ్యాలను సాధించగలిగితే, ఏఐ ఆధారిత ఉద్యోగాలను దక్కించుకోవడం అంత కష్టమేమీ కాదని నిపుణులు చెబుతున్నారు. 

కొత్తగా వచ్చే ఉద్యోగాలు
ఏఐ వాడకం పెరగడం వల్ల పలు రంగాల్లో కొన్ని సాంకేతిక, సాంకేతికేతర ఉద్యోగాలు రానున్నాయి. ఆ కొత్త ఉద్యోగాలు, ఆ ఉద్యోగాల్లోపనిచేసేవారు నిర్వర్తించే విధుల గురించి సంక్షిప్త సమాచారం

డేటా సైంటిస్ట్‌
డేటా సైంటిస్టులు సంస్థకు అవసరమైన డేటాను విశ్లేషించి, అందులోని సమాచారాన్ని సంస్థ నిర్ణయాలకు ఉపయోగపడేలా క్రోడీకరించి అందిస్తారు.

మెషిన్‌ లెర్నింగ్‌ ఇంజినీర్‌: మెషిన్‌ లెర్నింగ్‌ మోడల్స్‌కు రూపకల్పన చేయడం, వాటిని వాస్తవ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం మెషిన్‌ లెర్నింగ్‌ ఇంజినీర్ల ప్రధానమైన పనులు. వీరు డేటా సైంటిస్టులకు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు మధ్య వారధిలా పనిచేస్తారు.

రోబోటిక్స్‌ ఇంజినీర్‌: రోబోల రూపకల్పన, నిర్మాణం, ఆటోమేటెడ్‌ సిస్టమ్స్‌తో రోబోలను అనుసంధానం చేయడం రోబోటిక్స్‌ ఇంజినీర్ల ప్రధానమైన పనులు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్స్‌ ఇంజినీరింగ్‌ విభాగాల సమ్మిళిత పరిజ్ఞానంతో వీరు పనిచేస్తారు.

ఏఐ రీసెర్చ్‌ సైంటిస్ట్‌: ఏఐ రీసెర్చ్‌ సైంటిస్టులు కొత్త ఆల్గోరిథమ్స్‌ను, ఏఐ సాంకేతికతను మరింతగా అభివృద్ధి చేసేందుకు కావలసిన మెలకువలను రూపొందించడం; డిజైనింగ్‌ ప్రయోగాలు చేయడం; నమూనాలను రూపొందించడం; వాటికి అవసరమైన పరిశోధనలు సాగించడం వంటి పనులు చేస్తారు. 

నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ (ఎన్‌ఎల్‌పీ) ఇంజినీర్‌: ఎన్‌ఎల్‌పీ ఇంజినీర్లు– మనుషుల భాషను అర్థం చేసుకుని, విశ్లేషించేలా కంప్యూటర్లను రూపొందిస్తారు. మనుషుల భాషలోని ఆదేశాలకు అనుగుణంగా పనిచేసేలా కంప్యూటర్లను తీర్చిదిద్దుతారు.

కంప్యూటర్‌ విజన్‌ ఇంజినీర్‌: ఫొటోలు, ఇతర చిత్రాలు, వీడియోలను చూసి, వాటిని అర్థం చేసుకుని విశ్లేషించేలా కంప్యూటర్లను రూపొందించడంలో కంప్యూటర్‌ విజన్‌ ఇంజినీర్‌లు కీలకంగా పనిచేస్తారు.

ఏఐ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌: ఏఐ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లు ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌ సాంకేతికతలను ఉపయోగించుకునే సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్లను రూపొందిస్తారు. సంస్థ అవసరాలకు అనుగుణంగా ఏఐ ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేస్తారు.

ఏఐ ఆర్కిటెక్ట్‌: సంస్థకు అవసరమైన ఏఐ సిస్టమ్స్‌ను రూపొందించడంలోను, వాటిని వినియోగంలోకి తేవడంలోను ఏఐ ఆర్కిటెక్ట్‌లు కీలకంగా పని చేస్తారు. ఏఐ సాంకేతిక ఉపయోగానికి అవసరమైన అవకాశాలను గుర్తించడంలోను, ఏఐ సాంకేతికతకు తగిన సాధనా సంపత్తిని సమకూర్చడంలోను వీరిదే ప్రధాన పాత్ర.

ఏఐ ట్రైనర్‌: ఏఐ సిస్టమ్స్‌కు శిక్షణ ఇవ్వడం ఏఐ ట్రైనర్ల పని. డేటాను, ఫీడ్‌బ్యాక్‌ను అర్థం చేసుకుని, పనితీరును మెరుగుపరచుకునేలా ఏఐ సిస్టమ్స్‌ను వీరు అభివృద్ధి చేస్తారు.

ప్రాంప్ట్‌ ఇంజినీర్‌: జెనరేటివ్‌ ఏఐ మోడల్స్‌ నుంచి ఆశించిన ఔట్‌పుట్‌ను రాబట్టేందుకు అవసరమయ్యే ఆదేశాలను, సూచనలను రూపొందించడంలో ప్రాంప్ట్‌ ఇంజినీర్లు కీలక పాత్ర పోషిస్తారు. ఏఐ అప్లికేషన్ల పనితీరును గరిష్ఠస్థాయిలో మెరుగుపరచే దిశగా వీరు వాటిని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తూ ఉంటారు.

ఏఐ ఎథిసిస్ట్‌: ఏఐ వినియోగం పెరిగే కొద్ది ఏఐ ఎథిసిస్టుల అవసరం కూడా పెరుగుతుంది. ఏఐ వల్ల జరిగే అనుకోని పొరపాట్లను, వాటి కారణంగా ఎదురయ్యే నైతిక సమస్యలను నివారించేందుకు తగిన రీతిలో ఏఐ సిస్టమ్స్‌ను తీర్చిదిద్దడం, ఏఐ వల్ల ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం ఏఐ ఎథిసిస్టుల ప్రధానమైన పనులు.

ఎక్స్‌ప్లెయినర్స్‌
ఏఐ డెవలపర్స్‌కు, ఏఐ సేవలను వినియోగించుకునే వ్యాపార సంస్థల యాజమాన్యాలకు మధ్య ఎక్స్‌ప్లెయినర్స్‌ వారధిలా పనిచేస్తారు. ఏఐ విధానాలు పారదర్శకంగా ఉండేలా చూడటం, వాటి పనితీరును, ప్రయోజనాలను వ్యాపార సంస్థల యాజమాన్యాలకు వివరించడంలో ఏఐ డెవలపర్స్‌ కీలక పాత్ర పోషిస్తారు. 

మార్పులకు లోనయ్యే ఉద్యోగాలు
ఏఐ ప్రభావం వల్ల ఇప్పటికే ఉన్న పలు ఉద్యోగాల్లో మార్పులు ఇప్పటికే మొదలయ్యాయి. ఏఐ వినియోగం పెరిగే కొద్ది ఈ ఉద్యోగాల్లో మరిన్ని మార్పులు కూడా జరగనున్నాయి. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల పని ఏఐ వల్ల మరింత సులభతరం అవుతుంది. కోడింగ్‌ వంటి కొన్ని పనులను ఏఐ చేసేయగలుగుతుంది. దీనివల్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల పనిభారం తగ్గుతుంది. అంతమాత్రాన వారి అవసరం పూర్తిగా లేకుండాపోదు. సంక్లిష్టమైన పనులు సజావుగా జరిగేలా చూడటంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల పాత్ర కొనసాగుతుంది. డేటా అనలిస్టుల పని కూడా ఏఐ వల్ల సులభతరం అవుతుంది. 

డేటా సేకరణ, విశ్లేషణ వంటి పనులను ఏఐ స్వయంగా చేసేస్తుంది. మార్కెట్‌ ధోరణులను గుర్తించడం, డేటా ఫలితాలను విశ్లేషించడం, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో డేటా అనలిస్టులు మరింత సమర్థంగా పనిచేసేందుకు వీలు చిక్కుతుంది. ఏఐ వల్ల సేల్స్, మార్కెటింగ్, కస్టమర్‌ కేర్‌ ఉద్యోగుల పని కూడా చాలా వరకు తేలికవుతుంది. టార్గెటెడ్‌ యాడ్స్‌ గుప్పించడం వంటి పనులను ఏఐ స్వయంగా చేసేస్తుంది. మనుషులతో నేరుగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రమే ఈ ఉద్యోగులు స్వయంగా రంగంలోకి దిగాల్సి ఉంటుంది.

కనుమరుగయ్యే ఉద్యోగాలు
ఏఐ కారణంగా కొన్ని ఉద్యోగాలు అతి త్వరలోనే తీవ్ర ప్రభావానికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ఉద్యోగాలైతే దాదాపుగా కనుమరుగైపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. టైపింగ్, కాపీయింగ్, పేస్టింగ్‌ వంటి పనులను ఏఐ స్వయంగా చేయగలుగుతోంది. దీనివల్ల డేటా ఎంట్రీ ఆపరేటర్ల ఉద్యోగాలు క్రమంగా కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఏఐతో పనిచేసే అధునాతన డ్రైవర్‌లెస్‌ వాహనాలు ఇప్పటికే కొన్ని దేశాల్లో అందుబాటులోకి వచ్చాయి. ఇవి పెద్దసంఖ్యలో వాడుకలోకి వస్తే, ఇక డ్రైవర్‌ ఉద్యోగాలు కూడా కనుమరుగైపోతాయి. కర్మాగారాల్లో బరువులు ఎత్తడం, బరువైన వస్తువులను ఒకచోటి నుంచి మరొక చోటికి చేర్చడం వంటి పనులను సునాయాసంగా చేయగలిగే ఏఐ రోబోలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే వాడుకలోకి వచ్చాయి.

ఇవి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చేటట్లయితే, కర్మాగారాల్లో పనిచేసే నైపుణ్యాలు లేని కార్మికుల ఉద్యోగాలు అంతరించిపోతాయి. ఈ–కామర్స్‌ రంగంలో ఏఐ వాడకం మెల్లగా పెరుగుతోంది. ఇది మరింతగా పెరిగితే, రిటైల్‌ సేల్స్‌ ఉద్యోగులు ఇతర ఉపాధి మార్గాలను వెదుక్కోక తప్పదు. అకౌంటింగ్‌ రంగంలో బుక్‌ కీపింగ్‌ సహా ప్రాథమిక అకౌంటింగ్‌ పనులన్నీ ఏఐ సాయంతో ఆటోమేషన్‌ ద్వారా జరిగిపోతున్నాయి. దీనివల్ల కిందిస్థాయి అకౌంటింగ్‌ ఉద్యోగాలు క్రమంగా కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఏఐ ద్వారా అందుబాటులోకి వచ్చిన నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ (ఎన్‌ఎల్‌పీ) సిస్టమ్స్‌ పురోగతి సాధిస్తున్న నేపథ్యంలో త్వరలోనే పత్రికా సంస్థలు, ప్రచురణ సంస్థల్లో ప్రూఫ్‌ రీడర్స్, ట్రాన్స్‌లేటర్స్‌ ఉద్యోగాలు ఇకపై ఉండకపోవచ్చు. 

ఏఐ ప్రభావం వల్ల మనుషులు చేసే ఉద్యోగాల్లో చాలావరకు అంతరించిపోతాయని, ఉద్యోగాల్లో మనుషుల అవసరం గణనీయంగా తగ్గిపోతుందనే వాదనలు జనాల్లో గందరగోళం రేపుతున్నాయి. ఏఐ ప్రభావం వల్ల కొన్ని ఉద్యోగాలు కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నా, అంతకు మించి కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏఐ సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకోగలిగే వారికి సమీప భవిష్యత్తులోనే పుష్కలంగా ఉద్యోగావకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఏఐ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో 2045 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మందికి ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయని ప్రపంచస్థాయి ప్రీఎమినెంట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు ‘గోల్డ్‌మన్‌ సాక్స్‌’ అంచనా వేసింది. 

ఏఐ కారణంగా 25 శాతం వరకు నైపుణ్యాలు లేని కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితులు ఉన్నట్లు చెబుతోంది. మరోవైపు ఏఐ కారణంగా 2045 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 శాతం ఉద్యోగాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయని అమెరికన్‌ బహుళజాతి ఆర్థిక సంస్థ ‘జేపీ మోర్గాన్‌ చేజ్‌’ అంచనా వేస్తోంది. ఏఐ ప్రభావంతో వచ్చే ఉద్యోగాలు, పోయే ఉద్యోగాల పరిస్థితులు ఎలా ఉన్నా, ఏఐ ప్రభావం వల్ల ప్రపంచం మరింత ముందుకు పురోగమించడం మాత్రం ఖాయం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement