ఈ వారం కథ: పునీతులు | This week's story of funday | Sakshi
Sakshi News home page

ఈ వారం కథ: పునీతులు

Aug 17 2025 8:46 AM | Updated on Aug 17 2025 8:46 AM

This week's story of funday

పొద్దెక్కుతోంది. మబ్బుల్నే లేచిన ఈశ్వరి చకచకా బీడీల ఆకు కత్తిరిస్తోంది. పక్కనే ఉయ్యాలలో పడుకోబెట్టిన పాప ఉలిక్కిపడి లేచి ఏడుపందుకుంది. తప్పదన్నట్లు లేచి, బిడ్డకు పాలిస్తూ ‘ఇంకొంచెంసేపు పడుకోవే తల్లీ!’ అంటూ మురిపెంగా పాప బుగ్గలు నిమిరింది. పాప మెరిసే కళ్ళతో తల్లినే నిటారుగా చూస్తోంది. ఆడపిల్ల అయినా తండ్రి కళ్లే వచ్చాయి. అచ్చం రాజేష్‌ చూస్తున్నట్లే ఉంది అని మురిసిపోతున్న ఆమె మనసు భర్త వైపు మళ్లింది.

ప్రసవానికి వచ్చిన ఈశ్వరికి బిడ్డ పుట్టి ఆరు నెలలైనా తల్లిగారింట్లోనే ఉంటోంది. తన ఇంటికి వెళితే తనూ, తన భర్తనే. ఇక్కడైతే తనకు, పసిపిల్లకు తోడుగా తల్లి, తమ్ముడు ఉన్నారు. ఎమ్మెస్సీ చదివిన రాజేష్‌ తమ ఊర్లోనే ప్రైవేటు కాలేజీలో పాఠాలు చెబుతున్నాడు. రెండు ఊర్ల మధ్య గంట బస్సు ప్రయాణం. అందుకే శని, ఆదివారాలు తానే వచ్చిపోయేవాడు. అలా హాయిగా ఉంటున్న వారి మధ్య ఏడాది పరీక్షలు వచ్చి అడ్డుగా నిలిచాయి. ఉదయం, సాయంత్రం కాలేజీలో స్పెషల్‌ క్లాసులు నడుస్తున్నాయి. ఆదివారాల్లో కూడా భార్య, కూతురును చూసి వచ్చేంత తీరిక లేని పని. రాజేష్‌ రాక దాదాపు నెల రోజులవుతోంది.


పాలు తాగుతూ నిద్రపోయిన బిడ్డను హమ్మయ్య అనుకుంటూ ఈశ్వరి మెల్లగా ఉయ్యాలలో వేసి మళ్ళీ ఆకును ముందేసుకుంది. డెలివరీ అయిన నెల రోజులు తప్ప వచ్చిన్నుంచి రోజుకు వేయి బీడీలు చేస్తోంది. తమ్ముడిది బీడీ కంపెనీలో గుమస్తా కొలువు. తన డెలివరీకి అయిన ఖర్చులైనా ఇంటికి ముట్టజెప్పాలని ఆమె ఆరాటం.అప్పుడే దూరం నుంచే ‘అక్కా!’ అని అరుచుకుంటూ వస్తున్నాడు ఆమె తమ్ముడు.‘ఏందిరా శ్రీనూ.. మెల్లగరా!’ అని ఆయన్నే చూస్తోంది.‘బావను పోలీసులు పట్టుకుపోయిండ్రట’ అంటూ ఇంట్లోకి వచ్చాడు.‘ఎందుకురా!’ అంటూ  లేచి నిలబడింది ఒక్కసారిగా.తమ్ముని వెనుకే కాలేజీ వాచ్‌మన్‌ మల్లన్న కూడా వచ్చాడు.
‘ఏంటిదే మల్లన్నా.. సారుకేమైందే?’ అని ఎదురెళ్ళింది.

లోపలున్న తల్లి అరుగు మీదికి వచ్చింది.మల్లన్న నోరిప్పటానికి కిందిమీద అయితున్నాడు.‘చెప్పే అన్నా.. ఏమైంది!’ అని ఏడుస్తూ ఆయన భుజాలు పట్టి కుదిపింది ఈశ్వరి.‘సారు కాలేజీల ఆడపిల్లను పాడు చేసిండట’ అని మెల్లగా అని, ఇంకేమీ చెప్పలేకపోయాడు.
‘ఎప్పుడు. ఎక్కడ!’ అంది నమ్మబుద్ధికాక.‘నిన్న పొద్దుగూకంగ. కాలేజీలనేనట!’ అంటూ తనకు తెలిసింది చెప్పాడు.‘నేనత్తపా!’ అని బిడ్డను చంకలో వేసుకుంది.‘అక్కడేమున్నది. కోపంతోటి ఊరోళ్లు మీ సామాన్లను బజార్లేసి కాలవెట్టిన్రు. నువ్వు ఊర్లెకస్తే ఊకోరు’ అన్నాడు ఊర్లోని తీవ్రత ఆమెకు అర్థమయేలా.‘ఇదెక్కడి అన్యాలముల్లో..’ అని రాగం తీస్తూ కూలబడింది.‘ఇప్పుడు బావ ఎక్కడున్నడు?’ అని శ్రీను మల్లన్నను అడిగాడు.

‘జగిత్యాల పోలీసులచ్చి తీసుకపోయిండ్రు’ అన్నాడు.ఏడుస్తూనే ఈశ్వరి బిడ్డని చంకనేసుకొని తమ్ముణ్ణి తీసుకోని బయలుదేరింది. వాకిట్లోకి వచ్చినంక ‘మల్లన్నా.. అన్నం తిని పో!’ అని తల్లివైపు చూసి, ముందుకు నడిచింది.జగిత్యాల పాత బస్టాండులో దిగి పిల్లను భుజం మీద వేసుకొని ఈశ్వరి దబదబా నడుచుకుంటూ పోలీస్‌స్టేషన్‌ గేటు ముందట నిలబడింది. ఆమె వెనుకాలే వచ్చిన శ్రీను– జవాన్‌తో ‘పొద్దుగాల్ల పూడూర్‌ నుంచి మా బావను పోలీసులు పట్టుకచ్చిండ్రు’ అన్నాడు.‘రేప్‌ కేసోడా! ఆన్ని ఇప్పుడే జైలుకు తీసుకపోయిండ్రు’ అని రోడ్డుకు ఆ వైపున్న జైలు వైపు చేయెత్తి చూపాడు.ఈ మాట వినగానే ఏడ్చుకుంటూ రోడ్డు దాటి కోర్టు వెనుకాల ఉన్న జైలు గేటు వైపు ఉరికింది ఈశ్వరి.‘అక్కా ఆగే.. గిట్లురుకుతే బస్‌ కిందవడి సత్తవ్‌!’ అంటూ ఆమె వెనుక నడిచాడు శ్రీను.జైలు గేటు దగ్గరికి పోగానే ‘ఏయ్‌! దూరం జరుగు’ అని గదమాయించాడు జైలు పోలీస్‌.

శ్రీను ఆయనకు తమ పరిస్థితిని శాంతంగా వివరించాడు.‘ఇప్పుడే తెచ్చిండ్రు. గింత జల్ది ములాఖత్‌ ఇయ్యరు’ అన్నాడు జవాన్‌.
  ‘ఈమె మా అక్క, ఆయన పెండ్లాం. మా బావ మంచోడు. అట్ల చదువుకొనే పిల్లను పాడు చేసేటోడు కాదు. ఒక్కసారి మేం మాట్లాడాలె. గంతే! లోపలికి పంపిత్తే నూర్రూపాలిత్త’ అని జేబులో చేయి పెట్టిండు శ్రీను.‘ఓయ్‌ గదంత నడవదిక్కడ’ అని జవాన్‌ అంటుండగా మోటార్‌ సైకిల్‌ మీద ఒకాయన సరాసరి ఈశ్వరి, శ్రీనుల దగ్గరికి వచ్చి, ‘నా పేరు రాజేందర్‌. వకీలును. మా బావ పూడూర్‌ సర్పంచ్‌. మీ గురించి ఇప్పుడే ఫోన్‌ చేసి చెప్పిండు’ అన్నాడు.‘యాళ్ళకచ్చిండ్రు. మా బావను చూడాలే!’ అన్నాడు శ్రీను దండం పెడుతూ.‘సరే!’ అనుకుంటూ ఆయన లోపలి పోయాడు. ఈశ్వరి, శ్రీను కూడా ఆయన వెంట వెళ్లి లోపల ఓ చెట్టు కింద నిలబడ్డారు.వకీలు వెంట రాజేష్‌ వస్తున్నాడు. దూరం నుంచే ఆయన ముఖం కమిలిపోయినట్లు కనబడుతోంది. బహుశా ఊర్లో దెబ్బలు బాగానే  కొట్టినట్లున్నారు.
ఈశ్వరి కళ్ళల్లో నీళ్లు అప్పటికే ఏడ్చి ఏడ్చి ఎండిపోయాయి. ఇప్పుడామెకు రాజేష్‌లో తన భర్త కనబడ్తలేదు. ఒక పిల్లను బలాత్కారం చేసిన మృగాడు అగుపడుతున్నాడు.

రాజేష్‌ దగ్గరికి రాగానే, ‘పాపపుముండ కొడుకా! నీ బతుకు చెడ. నిన్ను నమ్మి చదువుకోనికి వచ్చిన పిల్లను పాడు జేస్తవా! అంత మదమెక్కిందా! ఆగలేకపోతే నేనే వస్తుంటి కదా! నిను నమ్మి పోతే బతుకే ఆగం చేసినవ్‌ గద! పో బాడకవ్, నీ సావు నువ్వు సావుపో!’ అని ముఖం మీద ఉమ్మేసి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది.  ఎంతో దిగులుగా భర్తను చూడ్డానికి వచ్చిన మల్లీశ్వరి ఇట్లా ఆడపులి అవుతుందని ఎవరూ అనుకోలేదు. వకీలు ఇదంతా చూస్తూ బొమ్మలా నిలబడిపోయాడు.రాజేష్‌ను లోపలికి తీసికెళ్లారు.కాసేపటికి కోలుకున్న వకీలు ‘ఏందయ్యా మీ అక్క అట్ల జేసింది?’ అన్నాడు శ్రీనుతో.‘అక్క అట్లంటదని నేను కూడా అస్సలు అనుకోలేదు సార్‌. మీదవడి ఏడుస్తదనుకుంటే ఇట్లజేసింది. దానికి బావ అంటే మస్తు ఇష్టం. అసుంటోడు ఇట్ల జేసేసరికి దానికి వశం కాని కోపమచ్చినట్లుంది. 

అది సల్లవడ్డంక నేను సముదాయిస్తా గని ఇప్పుడు మనం ఏంజెయ్యాలె?’ అన్నాడు శ్రీను.‘మీ బావ చేసింది పెద్ద తప్పు. బెయిల్‌ దొరకుడు కష్టం. అయితే ఆ పిల్లతోటి మా సారుది తప్పేం లేదు. అంత నా ఇష్ట ప్రకారమే జరిగింది అని కోర్టుల చెప్పించాలె. పోలీసులతోని ఎఫ్‌ఐఆర్‌ల వేరే సెక్షన్లు పెట్టించాలె. బాగనే ఖర్చయితది. అంతా లక్ష దాక..’ అంటూ ఆగాడు వకీలు.
‘అట్లయితే మా బావ బయిటికస్తడా?’ అన్నాడు శ్రీను ఆశగా.‘కోషిష్‌ చేద్దాం. చేతుల పైసలుంటె..’ అని మళ్ళీ సగమే మాట్లాడాడు వకీలు.‘పైసల సంగతి నేను చూసుకుంటా!’ అని వకీలుకు భరోసా ఇచ్చి, అక్కను వెతుక్కుంటూ శ్రీను బస్సెక్కి ఇంటికి వచ్చాడు.
ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. రోజుటి తీరే ఈశ్వరి బీడీలు చేస్తూ కూచుంది. పాప నిద్రపోతోంది.ఏమైందిరా అన్నట్లు తల్లి శ్రీను మొకం చూసింది. కొంచెం ఆగమన్నట్లు సైగ చేశాడు.కొద్దిసేపటికి ‘అక్కా! బావను బయటికి తేవచ్చు అని వకీల్‌ సాబ్‌ అన్నడు. పైసలు ఖర్చయితయట లక్ష రూపాయల దాకా’ అని ఆగాడు.

ఈశ్వరి ఏమీ మాట్లాడలేదు.‘మాట్లాడవేమే! మొగాడు జైల్ల ఉంటె ఇట్లనేనా చేసేది?’ అంది తల్లి.‘అట్ల జేసినంక ఆడు నా మొగడే కాదు. ఉంచుకుంటే మీతోటి ఉంటా. ఎల్లగొడితే నా బతుకు నేను బతుకుత’ అంది ఈశ్వరి మొండిగా.‘అది గట్లనే అంటది గని నువ్వు అప్పోసప్పోజేసి బావనైతే బయటికిదే. అటెనుక అన్ని సుదురాయిస్తయి’ అంది తల్లి ఇంటి పెద్దగా.ఓ రోజు బాధితురాలి వాంగ్మూలం జడ్జి రూములో రికార్డు అయింది.‘ఆ రోజు ఏం జరిగింది.. రాజేష్‌ నిన్ను ఏం చేశాడో చెప్పు’ అని జడ్జి శాంతంగా అడిగాడు.  తడుస్తున్న కళ్ళను తుడుచుకోవడం తప్ప నోరిప్పలేదు.‘క్లాసులో మీ సార్‌ నిన్ను ఏం చేశాడు? అప్పుడు అక్కడ ఎవరైనా ఉన్నారా?’ అడిగాడు జడ్జి మరింత ఓపిగ్గా.ఏడుపే సమాధానం.‘ఆయన ఏం చేశాడో నీ మెడికల్‌ రిపోర్ట్స్‌లో ఉంది. అది ఎలా జరిగిందో నీ నోట చెబితే కేసు ముందుకు పోతుంది’ అన్నాడు కొంత అసహనంగా.

ఆమె ఏడ్పు ఆపకపోవడంతో ‘ఈ మాటకైనా సమాధానం చెప్పు.. రాజేష్‌ నీపై చేయి వేస్తే వద్దని చెప్పవా?’ అన్నాడు.దించి ఉన్న తలను నిలువుగా, అడ్డంగా ఊపింది.కేసు కాగితాల్లో జడ్జి ఆమె వయసును చూశాడు. పద్దెనిమిదేళ్ళకు నెల రోజులు తక్కువగా ఉంది. ఇంకేమీ అడగకుండా ‘సరే.. వెళ్లు’ అంటూ ఆమెను పంపించేశాడు.‘బెయిల్‌ పిటిషన్‌ వేయాలి’ అని వకీలు శ్రీను వంక చూశాడు.ఆయన చూపులు పసిగట్టి ‘అయిదు వేలు ఉన్నయ్‌!’ అన్నాడు శ్రీను.‘సరే తే!’ అని డబ్బులు పాకెట్లో పెట్టుకొని వకీల్‌ వెళ్ళిపోయాడు.బెయిల్‌ రోజు కేసు తిరగబడింది.అంతా ముందే తెలిసినట్లు జడ్జి ‘ఇది ప్రొటక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌ యాక్ట్‌ కిందికి వస్తది. అది నాన్‌ బెయిలెబుల్‌ అఫె. కరీంనగర్‌లో పోక్సో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఉంది. ఈ కేసును అక్కడికి బదిలీ చేస్తున్న’ అని చెప్పి ఫైలును పక్కన పెట్టేశాడు.రాజేష్‌ను పోలీసులు తీసికెళ్లారు.ఏమీ అర్థం కాక శ్రీను వకీల్‌ దగ్గరికి వెళ్ళాడు.

‘పోక్సో కేసయింది. కరీంనగర్‌ కోర్టుకు పోవాలే. ఆన్నే ఫ్రీ లీగల్‌ సెల్‌ ఉంటది. వకీలును ఇస్తరు’ అని శ్రీనుకు ఓ చీటీ రాసిచ్చి, నా పని అయిపోయింది అన్నట్లుగా వకీలు జారుకున్నాడు.తెల్లారే శ్రీను కరీంనగర్‌ వెళ్లి కోర్టులో ఉన్న డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీస్‌ అథారిటీని కలిశాడు. వాళ్లు వివరాలు తీసుకొని, ఒక వకీలు దగ్గరికి పంపారు.  ‘పోక్సో కేసు కాబట్టి నెల రోజుల్లోపలే తీర్పు వస్తది’ అన్నాడు కొత్త వకీలు.ఆయన అన్నట్లే పదిహేను రోజులకే విచారణకు వచ్చింది.జడ్జి ప్రశ్నలకు రాజేష్‌ తల వంచుకొని మౌనమే నా సమాధానం అన్నట్లు నిలబడ్డాడు.‘మైనర్‌ బాలికపై లైంగిక అత్యాచారం చేసిన ముద్దాయి రాజేష్‌కు కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష, యాభై వేల రూపాయల జరిమానా విధిస్తోంది’ అని ఒకే వాక్యంలో జడ్జి తీర్పు చెప్పేశారు. స్పీడ్‌ కోర్టు తన పవర్‌ చూయించింది.నిజామాబాద్‌ జైల్లో చోటు లేదని రాజేష్‌ను చర్లపల్లి జైలుకు పంపారు.

రాజేష్‌ కాలం మౌనంగా, విచారంగా సాగుతోంది. భార్య ఘాటైన తిరస్కారంతో ఆయన మనసు మరింత కుంచించుకు పోయింది. జైలులో బతకడానికి పర్వాలేదు కాని, చావడానికే మార్గం లేదని విషాదంగా నవ్వుకున్నాడు. బయట చావడానికి ఎన్నో దారులు. ఉరి వేసుకోవచ్చు, రైలు కింద పడవచ్చు, విషం తాగవచ్చు, కత్తితో కోసుకోవచ్చు. ఇక్కడ అవేవీ కుదురవు. ఖైదీ చస్తే నేరం జైలు అధికారులు మోయాలి. అందుకే చావనీయరు.చర్లపల్లి జైలు అధికారుల్లో శోభన్‌ ఒకరు. ఆయన మనిషికి ఎక్కువ, పోలీసుకు తక్కువ. తన బ్యారక్‌లోని ప్రతి ఖైదీనీ ఆయన కళ్లు స్కాన్‌ చేస్తుంటాయి. కోర్టు శిక్ష వేసినా, మనిషిలోని మంచి చెడులను ఆ కళ్లు వేరు చేసి చూడగలవు. కొన్నాళ్లుగా రాజేష్‌ ఒంటరితనాన్ని గమనించిన శోభన్‌ ఓ రోజు అతన్ని తన ఆఫీసుకు పిలిపించాడు.‘రా! కూచో.. కోర్టుకు సాక్ష్యాలు కావాలి కాని, జైలుకు వాటితో పనిలేదు. 

మాతో ఏదైనా మాట్లాడచ్చు’ అన్నాడు.జైలర్‌ ఇచ్చిన చొరవతో రాజేష్‌ చాలా రోజుల తర్వాత నోరు విప్పాడు.‘నేను కాలేజీలో మ్యాథ్స్‌ చెప్పేవాణ్ణి. డెలివరీకి వెళ్లిన భార్య, పుట్టిన పాప ఇంకా అత్తవారింట్లోనే ఉన్నారు. ఈలోగా ఈ సంఘటన జరిగింది. ఒక టీచర్‌గా నేను చేసింది తప్పే. కారణమేదైనా విధి నిర్వహణకు నాది నమ్మక ద్రోహమే. పోక్సో చట్టం దృష్టిలో నాది నేరమే. అంతా నా ఇçష్ట ప్రకారమే జరిగింది అని పదిహేడేళ్ల అమ్మాయి జడ్జికి చెప్పినా మగాడే నేరస్తుడు అని బొంబాయి కోర్టు శిక్ష వేసింది. మంచీ చెడూ అని గీత గీసి వేరుచేయలేని సున్నితమైన విషయం ఇది. నా విషయంలో మాత్రం నా కుటుంబానికి తీరని ద్రోహం చేశాను. ఐదేళ్ల తరవాత బయటికి వెళ్లినా, మళ్ళీ నా వాళ్ల ముందు నిలబడే మొకం నాకు లేదు’ అన్నాడు తల దించుకుంటూ.

తప్పు ఎలా జరిగిందో చెప్పకున్నా జరిగిన నష్టాన్ని రాజేష్‌ లెక్కేస్తున్న తీరు శోభన్‌ను కదిలించింది. స్త్రీ పరువు, వృత్తి ధర్మం, కుటుంబ బాధ్యతలకు విలువిచ్చే మనిషి కూడా ఓ ఉద్రేక క్షణాన విచక్షణ కోల్పోవడం దురదృష్టమే అనిపించింది. ఎమ్మెస్సీ చదవాడని తెలిశాక రాజేష్‌కు జైలు స్కూల్లో పని దొరికింది. తన చదువు నలుగురికి పనికొస్తున్నందుకు రాజేష్‌కు కొంత తృప్తిగా ఉంది.
అలా రెండేళ్లు గడిచాయి. ఇంతవరకు ఒక్కసారి కూడా రాజేష్‌ను కలవడానికి ఎవరూ రాలేదు. అసలు అక్కడి పరిస్టితి ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తితో శోభన్‌ ఓ సెలవు రోజు సరాసరి రాజేష్‌ అత్తవారింటికి వెళ్ళాడు.తానెవరో చెప్పగానే శ్రీను ‘నమస్తే సార్‌!’ అంటూ కుర్చీ వేశాడు.గోడవారగా కూచొని బీడీలు చుడుతున్న ఈశ్వరి తలెత్తి ఆయన్ని చూడలేదు. ఆమె పక్కనే పాపను ముందేసుకుని అమ్మమ్మ కూచుంది.

‘ఏమయ్యా మీ బావను చూడ్డానికి రావచ్చు కదా!’ అన్నాడు శోభన్‌ చొరవగా.‘ఎవరూ పోవద్దని మా అక్క ఒట్టేయించుకుంది సార్‌!’ అన్నాడు శ్రీను.అప్పుడాయన ఈశ్వరి వైపు తిరిగి ‘నీ భర్త తప్పే చేశాడు కాని చెడ్డవాడు కాదమ్మా!’ అన్నాడు శాంత స్వరంలో.ఆమె జవాబీయలేదు.‘తప్పు చేసినంక మంచోడెట్లయితడు అంటది. బావ గురించి ఇంకో మాటే మాట్లాడది’ అన్నాడు శ్రీను.‘జైల్లో బతుకుతున్నవాళ్లకు తమవారిని కలవడమే పరమానంద క్షణాలు. తమ కోసం ఎవరు రాని ఖైదీలు భోజనం కూడా సరిగా చేయరు. నలుగురిలో కలవరు. రాజేష్‌ పరిస్థితి అలాగే ఉంది. అందుకే నేను ఇక్కడి దాకా వచ్చాను.’ అన్నాడు శోభన్‌.ఈశ్వరిలో కదలిక లేదు. ఆ మాటలు విననట్లే ఉంది.‘అది చాలా మొండిది సార్‌.. మేం చెప్పి చెప్పి చాలించుకున్నాం’ అన్నాడు శ్రీను.‘తమ వారు జైల్లో ఉంటే ఏ కుటుంబానికైనా నలుగురి ముందు తలవంపే! ఓ రకంగా కుటుంబమంతా శిక్ష అనుభవిస్తున్నట్లే! కాలాన్ని వెనుకకు తిప్పలేం. కాబట్టి ఏదో తోవ పట్టుకొని మనమే ముందుకు నడవాలి’ అని ఆగి, జవాబు కోసం ఈశ్వరి వైపు చూశాడు. షరా మామూలే. ఆమెలో ఏ మార్పు లేదు.  

అంతలో ఒకామె టీ తీసుకోని వచ్చింది.కప్పు అందుకుంటూ ‘ఈమె ఎవరు?’ అన్నాడు శోభన్‌. ‘అదే పిల్ల, విమల. మా బావకు శిక్ష..’ అని ఆగాడు శ్రీను.ఆ మాట వినగానే చేయి కాలినట్లు కప్పు వెంటనే పక్కన పెట్టాడు.‘ఈ ఊరేనా?’‘‘కాదు. దూరమే. కాని, కోర్టు తీర్పు వచ్చినంక ఊర్లె కుల పంచాయతీ పెట్టిండ్రు. ‘దీని బతుకు ఖరాబు చేసినోనికి ఐదేండ్లు జైలు శిక్ష, యాభై వేలు జుల్మానాతో సరిపోయింది. మరి దీన్ని ఎవడు చేసుకుంటడు’.. అని విమల నాయన అడిగిండు. ‘కోర్టులనే పంచాయతీ తెగింది. ఇంకేముంటది’ అని పెద్దమనుషులు అన్నరు. అప్పుడు విమల నాయన మా అక్కతోటి ‘అవునే ఈశ్వరీ.. నువ్వు ఆడదానివే కదా.. ఆడు నీ మొగడే కదా.. న్యాయం నువ్వే చెప్పు. నీ మాటే ఖరారు’ అన్నడు. అప్పుడు అక్క లేచి విమల చేయి పట్టుకోని..  రాజేష్‌ వచ్చినంక సంసారం చేసేది విమలతోనే’ అని ఈమెను ఇంటికి తెచ్చింది’’ అన్నాడు శ్రీను.

ఈశ్వరి శిల్పంలా అలాగే ఉంది. ఆమెను ఎలా అర్థం చేసుకోవాలో శోభన్‌ బుర్రకు తట్టడం లేదు. ఈశ్వరి పట్ల గౌరవం పెరిగినా, ఆమెను కరిగించే విద్య తన వద్ద లేదనుకున్నాడు.  ప్రత్యర్థి చెక్‌ పెట్టాక దారి తెలియని ఆటగాడిలా లేచి నిలబడ్డాడు.‘సరే.. వెళ్ళొస్తా!’ అంటూ బయటికి వచ్చాడు. ఈశ్వరి గంభీర మౌనాన్ని ఛేదించలేక శోభన్‌ వాగ్బాణాలన్నీ విరిగిపోయాయి. ఆయన మనసంతా గందరగోళంగా ఉంది.ఊరి బయట ఉన్న చిన్న హోటల్‌లో టీ తాగుతూ కాసేపు గడిపాడు. చేసేదేమి లేక కొంత గ్యాప్‌ తీసుకోని మళ్ళీ రావాలని అనుకుంటూ బయటికి వచ్చాడు. కారు డోర్‌ తెరుస్తుండగా కొద్ది దూరంలో రోడ్డు పక్కన ఉన్న మర్రి చెట్టు కింద విమల నిలబడి ఈయన్నే చూస్తూ కనబడింది. 

ఆమెను గుర్తు పట్టి అక్కడే ఉండు అని చేయి ఊపి కారును తీసికెళ్ళి ఆమె ముందు ఆపాడు.కారు దిగుతూ ‘ఏంటమ్మా ఈమె ఎవరికీ అర్థం కాకుండా ఉంది’ అన్నాడు తాను చెట్టు కిందికి వెళుతూ.‘పట్టింపులు ఎక్కువైనా.. ఈశ్వరక్క చాలా మంచిది. నన్ను మా ఇంట్లో కన్నా మంచిగా చూసుకుంటది. డిగ్రీ కూడా చదివిస్తానంటున్నది. తర్వాత ఏదైనా ఉద్యోగం చేస్తాను. అయితే..’ అని విమల అటు ఇటు చూసింది.‘నీకేం కాదమ్మా.. నేను ఉన్నాను కదా! మనసులో ఉన్నదంతా చెప్పేయ్‌!’ అన్నాడు.‘నాకు శ్రీను అంటే ఇష్టం’ అంది మెల్లగా.ఈ ట్విస్టుకు అడ్జస్టు కావడానికి శోభన్‌కు కొంత సమయం పట్టింది.‘జరిగింది ఓ పీడకల అనుకుంటా సార్‌! దాన్నే తలుచుకుంటూ ఏడుస్తూ కూచుంటే ఇక్కడ కొన్ని జీవితాలు, కుటుంబాలు కోలుకోలేని దెబ్బ తింటున్నాయ్‌’ అంది.విమల మాటలు ఆయనకు ఎన్నడూ చదవని పాఠంలా అనిపించాయి. గాయపడిన పక్షి ఎగరడానికి రెక్కలను టపటప ఆడిస్తున్నట్లుగా ఉన్నాయి.
‘మరి శ్రీను..’ అన్నాడు విషయంలోకి వస్తూ.

‘శ్రీనుకు కూడా ఇష్టమే. అసలైతే రాజేష్‌ సార్‌ జైలు నుంచి రాగానే మేమిద్దరం దూరంగా వెళ్లిపోదామనుకున్నాం. అయితే ఈశ్వరక్క నమ్మకాన్ని దెబ్బ తీశామనే బాధ వదిలేది కాదు. మీరు తలుచుకుంటే మా నలుగురి బతుకుల్ని సరిదిద్దగలరని ఆశ పుడుతోంది’ అంది చేతులు జోడిస్తూ. ఆ మాటలకు ఈశ్వరి వేసిన కటికముడి కొద్దిగా విచ్చుకుంటున్న ఆశ శోభన్‌ మనసులో కదిలింది.
‘గుడ్‌ విమలా! మీ నిర్ణయం వండర్‌ ఫుల్‌. నా సర్వీసులో ఇదొక డిఫరెంట్‌ చాలెంజ్‌. వదిలి పెట్టను. మళ్ళీ వస్తాను. మళ్ళీ మళ్ళీ వస్తాను. విజయం మనదే. ఆల్‌ ది బెస్ట్‌!’ అంటూ కారులో కూచున్నాడు.‘మెనీ మెనీ థాంక్స్‌ సార్‌. బై బై!’ అంటూ విమల వీడ్కోలు చెప్పింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement