మా అమ్మే నా శత్రువు | Evaram Katha On Funday | Sakshi
Sakshi News home page

మా అమ్మే నా శత్రువు

Nov 9 2025 7:55 AM | Updated on Nov 9 2025 7:55 AM

Evaram Katha On Funday

ఆ టెలిగ్రామ్‌ చూడగానే రామ్‌ సదై బాబులో ఆందోళన మొదలైంది. గబుక్కున స్టూలుమీద నుంచి లేచి, ‘‘ఈ ఉద్యోగం మానేయాలి. నా వల్ల కాదు’’ అనుకుంటూ భార్య ఉన్న గదిలోకి ప్రవేశించాడు.ఆమె గర్భవతి. మంచం మీద విశ్రాంతి తీసుకుంటోంది. భర్త చేతిలో టెలిగ్రామ్‌ చూడగానే ఆమెకు విషయం అర్థమైంది. ‘‘ఇంతకీ ఏమైంది?’’ భర్తను ఆత్రంగా అడిగింది.‘‘నా సెలవుకు అనుమతి లభించలేదు’’ నిస్పృహగా అన్నాడు రామ్‌ సదై. ‘‘నీ పరిస్థితి గురించి అంతా పూసగుచ్చినట్టు వివరించాను. వాళ్లకు కనీసం కనికరం కలగలేదు. రేపు మధ్యాహ్నం నేను బయలుదేరాలి’’ అని ఒక నిముషం ఆగి మళ్లీ చెప్పాడు. ‘‘ఉద్యోగానికి రాజీనామా చేసి ఉన్న పొలాన్ని సాగు చేసుకోవటం మంచిదనిపిస్తోంది’’.శశిముఖి మధ్యలోనే అందుకుంది.

 ‘‘మనిద్దరమే అయితే మీకు ఉద్యోగం ఉన్నా, లేకపోయినా ఫరవాలేదు. కానీ ఇప్పుడు..’’ అర్ధోక్తితో ఆగిపోయింది.ఆమె పూర్తిగా చెప్పవలసిన పనేం లేదు. తమ ఆర్థిక పరిస్థితి గురించి రామ్‌ సదైకి పూర్తి అవగాహన ఉంది. అందుకే వెంటనే స్పృహలోకి వచ్చి, కోపాన్ని అదుపు చేసుకున్నాడు. తర్వాత కోర్టు పని మీద బయటకు వెళ్లాడు. అతను తిరిగి వచ్చిన తర్వాత భార్య అడిగింది. ‘‘ఇంతకీ మీరేం నిర్ణయించుకున్నారు?’’. ‘‘నేనేం చేయాలో నువ్వే చెప్పు?’’ అన్నాడు రామ్‌ సదై. ‘‘ఈ పరిస్థితుల్లో నిన్ను వదిలేసి నేను ఎలా వెనక్కి తిరిగి వెళ్లేది? ఒకవేళ తీసికెళదామనుకున్నా అది దగ్గరా దాపూ కాదు. డాక్టర్లు నిన్ను ప్రయాణాలు చేయవద్దని హెచ్చరించారు. పోనీ మనకు తెలిసిన వాళ్లను సాయం చేయమని అడుగుదామా?’’‘‘హాస్పిటల్లో పనిచేసే మంత్రసానిని రోజూ రమ్మనమని చెబుతాను. అవసరమైతే తను నీతోనే ఉంటుంది. 

ఎలాగూ ఏడెనిమిది రోజుల్లో మథుర్‌ కాకా వచ్చేస్తారు. ఈలోపు నీకు ఇబ్బంది ఉండదు..’’.అతని మాటలను మధ్యలోనే అడ్డుకుంటూ.. ‘‘నయన్‌ దీదీని రమ్మని పిలవకూడదూ.. ఇక్కడికి దగ్గరేగా. తనొచ్చి నాకు తోడుగా ఉంటుంది’’ అంది శశి. ‘‘నువ్వు భలే చెప్పావు. నీకు సాయం చేయటానికి ఎవరెవరిని పిలవాలా అని సతమతమవుతున్నాను. నాకెందుకు నయన్‌ పేరు తట్టలేదో? ఈ మధ్య నా బుర్ర పనిచేయటంలేదు’’తలకొట్టుకుంటూ అన్నాడు  రామ్‌ సదై.నయనతార భర్త హరిపాద గంగూలీ. దర్భంగాలో రైల్వేలో పనిచేస్తున్నాడు. తనకి వచ్చే అరకొర జీతంతో కుటుంబాన్ని నెట్టుకు రావటానికి ఇబ్బంది పడుతున్నాడు. ఈ మధ్యనే వాళ్లకు ఒక బాబు పుట్టాడు.రామ్‌ సదై తన భార్య పరిస్థితిని పూర్తిగా వివరించి నయనతారను వెంటనే బయలుదేరి రావలసిందిగా లేఖ రాశాడు.

 ఆమె ఖర్చులకు డబ్బులు కూడా పంపాడు. ఆమె శశిముఖికి దూరపు చుట్టం. వరసకు అక్క అవుతుంది. ఓ వైపు డబ్బుకు కటకటలాడటం, మరో వైపు తన కంటే డబ్బు ఉన్న చెల్లెలి కుటుంబానికి సాయపడితే కొంతయినా ఉపయోగపడుతుందన్న ఆలోచనతో వెనకా ముందు ఆలోచించకుండా ముజారఫ్‌పూర్‌ బయలుదేరింది నయన.రామ్‌ సదై వెళ్లే రైలులోనే ఆమె దిగింది. తల మీద నుంచి మోకాళ్ల వరకూ షాల్‌ కప్పుకుని పసిపిల్లవాడిని చేతిలో ఉంచుకున్న నయనతారను చూడగానే అతనికి సంతోషం కలిగింది. ‘‘నువ్వొచ్చావు. నాకు కొంచెం ఆందోళన తగ్గింది. ఇద్దరు ఆడవాళ్లను ఒంటరిగా వదిలేసి వెళుతున్నందుకు దిగులుగానే ఉంది. ఏం చేయను తప్పటం లేదు. కాకా త్వరలోనే వచ్చేస్తాడు. ఈలోపు ఎలాంటి ఇబ్బంది ఉండదనే అనుకుంటున్నాను’’ అని జాగ్రత్తలు చెప్పాడు. ఆ తర్వాత తన దగ్గర పనిచేసేవాడిని పిలిచి ఆమెకి వాహనం సిద్ధం చేయమని చెప్పి రైలెక్కేశాడు. 

ఆ మర్నాడే శశిముఖికి ప్రసవం అయ్యింది. మరి కాసేపటికే ఇబ్బందికర పరిస్థితుల్లో పడింది. నయనతారకి ఆమెను ఎలా ఊరడించాలో అర్థం కాలేదు.తన పరిస్థితి అర్థం చేసుకున్న శశిముఖి ‘‘అక్కా, ఖోకాను ఒక్కసారి నాకు చూపిస్తావా? అనడిగింది.వెంటనే నయనతార పసిబిడ్డను తీసుకొచ్చి ఆమె పక్కలో ఉంచింది. ‘‘దీదీ.. నాకు ఇంకా ఎక్కువ సమయం లేదు. ఈ బిడ్డను నీ చేతుల్లో పెడుతున్నాను. నీ బిడ్డ మాదిరిగానే వాడిని సాకుతానని మాటివ్వు’’. అంది శశిముఖి. ‘‘వీడొకటి.. నా బిడ్డకొకటి వేర్వేరు కాదు. ఇద్దరూ నాకు సమానమే.. పైగా ఇప్పడు ఈ మాటలన్నీ ఎందుకు? నీకేం కాదు. నువ్వు బాగానే ఉంటావు. భయపడకు. ఒకవేళ భగవంతుడు అలా రాసిపెట్టి ఉండి ఏదయినా అనుకోనిది జరిగితే, మీ అబ్బాయికి తల్లి లేని లోటు ఉండదు.’’ ధైర్యం చెప్పింది నయన.కానీ అర్ధరాత్రి గడిచేసరికి శశిముఖి  ప్రాణాలు విడిచింది. రామ్‌ సదై బాబుకు రెండు టెలిగ్రామ్‌లు వెంట వెంటనే అందాయి. తన భార్య ఆరోగ్య పరిస్థితి సరిగా లేదనే సమాచారంతో ఒకటి, హఠాత్తుగా ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లిందన్న విషాదకర వార్తతో మరొకటి. 

అంతగా వెలుతురు లేని గదిలో ఉంది నయన. శశిముఖికి పరిచయం ఉన్న వాళ్లెవరో పరామర్శకని ఇంటికి వచ్చారు. ఆ సమయంలో తన బిడ్డను మంచం మీద పడుకోబెట్టి శశిముఖి బిడ్డకు పాలిస్తోంది నయన. అదే మంచం మీద వచ్చిన అతిథులను సర్దుకుని కూర్చోమని చెప్పింది. లాంతరు ఒత్తిని కొంచెం పెద్దది చేసింది. గదిలో కొంచెం వెలుతురు ఎక్కువయ్యింది.అక్కడికొచ్చిన వినోద్‌ బాబు భార్య.. ‘‘ఈ పిల్లవాడు దీదీ బిడ్డ అన్న మాట. అచ్చం అమ్మలాగా ఎంత అందంగా ఉన్నాడు. కనీసం అమ్మను చూసుకోలేకపోయాడు పాపం’’ అంది. అంతలోనే ఆమె పక్కన కూర్చున్న మరో ఆమె అందుకుంది. ‘‘వాడి మొహం చూడు. అచ్చు వాళ్లమ్మలా మిసమిసా మెరిసిపోతుంది. తను ఎంత మంచిది! ఆరోగ్యం సరిగ్గా లేదని మాకు ముందే చెప్పి ఉంటే ఎలాగోలా కాపాడుకునేవాళ్లంగా ’’ ఇలా చెప్పుకుపోతోంది.

ఆ బిడ్డ శశిముఖి సంతానం కాదని, తన బిడ్డ అని చెప్పబోయి నయనతార ఆగిపోయింది. ఇద్దరు పిల్లల్లో ఎవరు ఎవరి బిడ్డ అని తేల్చి చెప్పటం ఇతరులకు చిక్కు సమస్యే! నల్లగా బలహీనంగా ఉన్న బిడ్డను నయనతార బిడ్డగానూ, అప్పుడే పుట్టిన వాడికంటే బాగా పుష్టిగా ఉన్న నయనతార బిడ్డను శశి బిడ్డగానూ వాళ్లు భావించారు. అందరూ వెళ్లిపోయాక తీరిగ్గా చాలాసేపు ఆలోచించింది నయన. అసలు చిక్కుముడిని విడతీయకపోతే పోయేది ఏం ఉంది అన్న ఆలోచన చేసింది. తన బిడ్డకు తల్లి లేని లోటు లేకుండా చేస్తానని శశిముఖికి మాటిచ్చాను. దానిని కాపాడుకోవచ్చు.అలాగే మరో వైపు డిప్యూటీ బాబు సంపదతో తన బిడ్డ పెరిగి పెద్దవాడవుతాడు. దానికి అడ్డుకోవటం ఎందుకు? తల్లి లేని బిడ్డకు తల్లినవుతున్నాను కదా..? అని తనను తాను సమాధానపరుచుకుంది. 

శశిముఖి వార్త తెలియగానే పదిరోజులు సెలవు పెట్టి ఇంటికి వచ్చాడు రామ్‌ సదై.  ఆమె మరణించిందన్న వాస్తవాన్ని జీర్ణించుకో లేకపోయాడు. ఆమె ఉన్నదనే భావనతోనే ఇంట్లో కలియతిరుగుతున్నాడు. డాబా మీద, వంటింట్లో, స్నానాల గదిలో ఇలా ఆమె కోసం వెతుక్కుంటున్నాడు. గుండె బద్దలై పిచ్చివాడిలా వ్యవహరిస్తున్నాడు.ఇదంతా చూసి కదిలిపోయినట్టుగా నటించింది నయనతార. రాని కన్నీళ్లను తుడుచుకుంటూ.. ‘‘జరిగిందేదో జరిగిపోయింది. ఆమె ఇక తిరిగి రాదు. ఆ విషయాన్ని అర్థం చేసుకో. లోపలికి వచ్చి కాస్త ఎంగిలిపడి ఆ తర్వాత విశ్రాంతి తీసుకో’’ అంది.ఆమెను చూడగానే స్పృహలోకొచ్చాడు. ఆమె చెప్పినట్టే స్నానం చేసి, భోజనం చేసి ఆ తర్వాత వాలు కుర్చీలో కూర్చున్నాడు. పనివాడు అందించిన హుక్కాను పీలుస్తూ ఆలోచనల్లోకి జారుకున్నాడు. నయన్‌ చేతిలో పసిపిల్లవాడితో అక్కడకి వచ్చింది. ‘‘పిల్లవాడు కాస్త సన్నగా ఉన్నాడు. కానీ మీ ఇద్దరికి బాగా పోలికలున్నాయి’’ అని చెప్పి పిల్లవాడిని అతని పొత్తిళ్లలో ఉంచబోయింది.

రామ్‌ సదైకి వాడిని చూడాలనిపించలేదు. ‘‘తల్లిని మింగేసిన రాక్షసుడు’’ అన్నాడు పరుషంగా. ‘‘నువ్వు చెప్పింది నిజమే కావచ్చు. కానీ వాడిని వదిలేస్తే..’’రామ్‌ సదై ఆ చిన్నారిని సరిగా ఒడిలో పడుకోబెట్టుకోలేదు. దాంతో అసౌకర్యంగా అనిపించి ఆ పిల్లవాడు   ఏడుపు అందుకున్నాడు. ‘‘ఏమిటో ఈ పిల్లాడు.. పెద్దమ్మ అయిన నా దగ్గరకి తప్ప ఎవరి దగ్గరకీ వెళ్లడు’’ అంటూ నయన ఆ పిల్లవాడిని తీసుకుని భుజం మీద వేసుకుంది. ఆ తర్వాత చెల్లెలి భర్తతో భవిష్యత్తు గురించి చర్చించటం మొదలుపెట్టింది.‘‘నువ్వొచ్చేశావ్‌ కదా? నేను మా ఊరు బయలుదేరతాను. నేను సర్దుకోవలసిన చాలా ఉన్నాయి’’ అంది. ‘‘వద్దొద్దు ఆ పని మాత్రం చేయొద్దు. ఈ పిల్లవాడిని నేను పెంచి పెద్ద చేయలేను. ఉద్యోగంలో టూర్లు చేస్తూ వీడిని చూసుకోవటం కాని పని. నువ్విక్కడే ఉండు. మీ ఆయనకు కూడా ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చూస్తాను’’ అన్నాడు. అది చాలా భారమైన పని అన్నట్టు ప్రవర్తించింది నయనతార. ‘‘ఇతరుల పిల్లలను సొంత పిల్లల్లా పెంచటం కష్టం. అదీగాక సమాజం కూడా ఏదో ఒక తప్పు ఎంచుతూ ఉంటుంది. కానీ నీ ఇబ్బందిని చూసిన తర్వాత కాదనాలనిపించటం లేదు. నాకు శక్తికి మించిన పనే అయినా చేస్తాను’’ అంటూ రామ్‌ సదై కి తన పట్ల సానుభూతి కలిగేలా జీవితాంతం అతను తన మీద కృతజ్ఞత చూపేలా మాట్లాడింది. 

‘‘శశిముఖి బిడ్డను తన బిడ్డలా సాకుతోంది. అంతే కాదు. తనకు కూడా ఓ పసిబిడ్డ ఉన్నాడన్న స్పృహనే  ఆమెకు లేదు’’.చాలామంది నయనతార గురించి గొప్పగా చెప్పటం ప్రారంభించారు. రామ్‌ సదైలో కూడా ఇదే అభిప్రాయం ఏర్పడింది. తన బిడ్డకు లోటు లేకుండా చూస్తున్న ఆమె సాధారణ వ్యక్తి కాదు అనుకునేవాడు. గుండ్రంటి అందమైన తన పిల్లవాడిని అతని బిడ్డగా చెప్పేది. అది అతనూ నిజమేనని భావించేవాడు. రామ్‌ సదై టూర్‌కి వెళ్లి వచ్చినప్పుడల్లా ఇద్దరు పిల్లలకు కొత్త బట్టలు కొని తెచ్చేవాడు.తన బిడ్డగా ఆమె చెప్పుకుంటున్న పిల్లవాడికి కొత్త బట్టలు ఇచ్చినప్పుడు, ‘‘వాడికి ఇదంతా అలవాటు చేయకు. వాడు పేద ఇంటి పిల్లాడు. అలాగే పెరగనివ్వు. లేకపోతే వాడు పరిస్థితులకు సర్దుకోవటం కష్టం’’ అని వారించేది. దాంతో నయన తారపైన రామ్‌ సదైకి మరింత అభిమానంపెరిగింది. ఎంత ఆత్మగౌరవం ఉన్న మనిషి అనుకుని ముచ్చటపడేవాడు. దాంతో మరింత ఎక్కువగా అతనికి బహుమతులు ఇవ్వటం మొదలుపెట్టాడు. ఈ రకంగా డిప్యూటీ బాబు కుమారుడు జతిన్, నయనతార కుమారుడు ఉపేన్‌లు స్థానాలు మార్చుకుని భిన్నమైన పాత్రల్లో పెరగటం మొదలుపెట్టారు. 

ప్రతిరోజూ పాఠాలు చెప్పటానికి ట్యూటర్‌ ఇంటికి వచ్చేవాడు. జతిన్‌ చిన్నతనంలోనే ఓ విషయం గ్రహించాడు. తను పేదింటి బిడ్డ కావటంతో ప్రపంచం పెద్దగా తన పట్ల ఆసక్తిని చూపదు అని సరిపెట్టుకున్నాడు. స్కూలులో అతను ఎంతగా ప్రయత్నించినా కూడా ప్రధానోపాధ్యాయుల ప్రశంసలన్నీ ఉపేన్‌ వైపే ఉండేవి. జతిన్‌ ప్రయత్నాలను, తెలివితేటలను గుర్తించి ట్యూటర్‌ అతనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం ప్రారంభించాడు. ఉపేన్‌ ఒక క్లాసులో తప్పితే అతన్ని అదే క్లాసులో ఉంచేందుకు ప్రయత్నించారు. కానీ నయనతార పోరాడి అతను పై తరగతిలో అడుగుపెట్టేలా చేయగలిగింది. దాని వల్ల అతనికి బహుమతులు లభించాయి. జితిన్‌ ఇలాంటి అడ్డదారులను నమ్ముకోలేదు.తల్లి ప్రేమకు నోచుకోకుండానే పెరిగి పెద్దవాడయ్యాడు జతిన్‌. కానీ సరస్వతీదేవి అనుగ్రహం మాత్రం అతనికి పుష్కలంగా ఉండేది. దాంతో అతనికి ఎన్నో అవార్డులు, పురస్కారాలు అతని సొంతమయ్యాయి. అతనికి ఫీజులు చెల్లించటం మానేయమని, ఏదయినా చిన్న ఉద్యోగంలో అతన్ని చేర్చమని నయనతార అప్పుడప్పుడు రామ్‌ సదైతో అనేది. అతను ఈ మాటలను పెద్దగా పట్టించుకునేవాడు కాదు. 

దాంతో జతిన్‌ను పిలిచి మందలించింది. ‘‘ఇంకోళ్ల డబ్బుతో చదువుకోవటానికి సిగ్గులేదా నీకు. ఇప్పటికి చదివింది చాలు. రామ్‌ సదై మంచివాడు కాబట్టి ఇంతకాలం నిన్ను బాగా చూసుకున్నాడు. ఇంకొకళ్లయితే నిన్ను వీధిలోకి విసిరేవాళ్లు’’.తల్లి మాటలకు బాగా నొచ్చుకున్న జతిన్‌– రామ్‌ సదైని కలిశాడు. తాను కోల్‌కత్తా వెళుతున్నానని, స్కాలర్‌ షిప్పు డబ్బులతో చదువుకుంటానని చెప్పాడు. ‘‘ఏమైంది. ఇక్కడ ఏదయినా ఇబ్బంది అనిపిస్తోందా?’’ అడిగాడు రామ్‌ సదై.‘‘అదేం లేదు. పై చదువులు చదువుకోవటానికి కోల్‌కత్తా అనుకూలంగా ఉంటుందని..’’ జవాబు చెప్పాడు జతిన్‌.ఆ తర్వాత కోల్‌కత్తా వెళ్లి అక్కడ ఒక మెస్సులో ఉన్నాడు. ఎవరి నుంచి పైసా సాయం ఆశించకుండా తన సొంత డబ్బుతో కష్టపడి చదువుకున్నాడు. ముందు బీఏ డిగ్రీ పూర్తి చేసి, ఆ తర్వాత లాయర్‌ అయ్యాడు.


ఉపేన్‌ అతనికి దరిదాపుల్లో లేడు. చదువులోగానీ, పేరు ప్రఖ్యాతుల్లో గానీ.కానీ అతని పెద్దమ్మగా నయనతార అన్ని విషయాల్లో అతన్ని పొగుడుతూండేది. ఇది ఇంకెంత కాలం కొనసాగేదో గానీ, ఇంతలోనే అనుకోని పరిణామం సంభవించింది.హఠాత్తుగా కలరా వ్యాపించటంతో పనిచేస్తున్న చోటే మృత్యువు పాలయ్యాడు రామ్‌ సదై. ∙∙ ‘‘ఉపేన్, మనకి ఏమవుతుంది? మీ నాన్న వదిలేసిన దాన్ని ఎలా మేనేజ్‌ చేస్తావో కూడా తెలియటం లేదు’’ నయనతార ఆందోళనగా అంది.‘‘ఫరవాలేదు పెద్దమ్మా.. మనం ఉన్నదానితో సర్దుకోగలం’’ జవాబిచ్చాడు ఉపేన్‌.‘‘అది వీలుకాని పని. మనకు అప్పు ఇచ్చే వాళ్లు కూడా కనిపించటం లేదు’’ దీనంగా చెప్పింది నయన.‘‘ఒకసారి తాతగారిని కలుద్దాం. ఆయన మనకు ఏమైనా సలహా ఇస్తారు’’ అన్నాడు ఉపేన్‌.ఈ సమయానికి జతిన్‌ లాయర్‌గా దర్భంగాలో మంచి పేరు ప్రఖ్యాతులు గడించాడు. సంపాదన బాగా పెరిగింది. ఉపేన్‌ని తన సొంత తమ్ముడిలా ప్రేమించేవాడు. 

వాళ్ల పరిస్థితి తెలిసిన తర్వాత అప్పులన్నీ తీర్చేశాడు. అంతే కాదు. వాళ్లను తనతో వచ్చెయ్యమని కోరాడు.జతిన్‌ ఆస్తిపాస్తులన్నీ చూసిన తర్వాత నయనతార అసూయ కలిగింది. మాటల్లో వర్ణించలేనంత పశ్చాత్తాపానికి లోనయ్యింది. పిల్లలను అటూ ఇటూ మార్చటం వల్ల తాను సాధించింది ఏమీ లేదని గుర్తించింది. కనీసం తనే అతని తల్లిని అనే మాటను కూడా జతిన్‌కు చెప్పుకోలేని స్థితిలో ఉన్నందుకు చింతించింది. ఉపేన్‌కు చెడ్డ స్నేహితులు ఎక్కువయ్యారు. ఎక్కువ సమయం వాళ్లతో గడుపుతూ జులాయిగా తిరిగేవాడు. ‘‘నీకోసం మంచి ఉద్యోగం చూశాను. అందులో చేరావంటే అంతా సక్రమంగా సాగుతుంది. నీకు కూడా ప్రశాంతంగా ఉంటుంది’’ అతనికి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు జతిన్‌.

ఉపేన్‌కి ఈ సలహా నచ్చలేదు. నయనతార చాలా రోజులుగా అతనికి బ్రెయిన్‌ వాష్‌ చేస్తోంది. జతిన్‌ తమకు రుణపడ్డాడని. ఉపేన్‌ అతన్ని ఏమైనా అని సాధించవచ్చని సలహా ఇచ్చింది. ‘‘నువ్వు నన్ను వదుల్చుకోవాలనుకుంటున్నావా?’’ అడిగాడు ఉపేన్‌.ఈ మాటలకు జతిన్‌ మనసు గాయపడింది. ‘‘ఇంకెప్పుడూ నిన్ను పనిచేయమని నేను అడగను’’ అని అక్కడ నుంచి చకచకా కదిలి వెళ్లిపోయాడు. హరిపాద, అతని భార్య తీవ్రస్థాయిలో తగువు పడ్డారు. జతిన్‌కి అతను మంచి సంబంధం తెచ్చాడు. అమ్మాయి పేరు సరోజిని. ప్రభుత్వ ప్లీడరు కార్తీకబాబు కుమార్తె. అతను బాగా ఆస్తిపరుడు. జతిన్, సరోజినిల జంట బావుంటుందని, స్వర్గంలో కుదిరిన సంబంధం అని ఎంతగానో భావించాడు. అతను వంశచరిత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. 

నయనతార ఈ మాట వినగానే ఇంతెత్తున ఎగిరింది. ‘‘మన జీవితాలను తీర్చిదిద్దిన వ్యక్తిని ఆయన లేనంత మాత్రాన మరచిపోతామా? పాపం ఆయన బిడ్డను అలాగే వదిలేస్తామా? నా కంఠంలో ప్రాణం ఉండగా అలా ఎప్పటికీ జరగనివ్వను. మీరు ఆ అమ్మాయిని ఉపేన్‌కి ఇచ్చి వివాహం చేయండి. లేకపోతే నేను ఉరిపోసుకుని చస్తా’’ అని హెచ్చరించింది.భార్య ప్రవర్తనతో కంగుతిన్నాడు హరిపాద. ఆమెతో వాదించి ప్రయోజనం లేదనిపించి అక్కడ నుంచి మాయమయ్యాడు.ఎలాగయినా ఈ పెళ్లిని అడ్డుకోవాలని నిర్ణయించుకున్న నయన ముందుగా జతిన్‌కి కబురు పెట్టింది. ఉపేన్‌కి అతను ఎలా రుణపడ్డాడో చెప్పుకొచ్చింది.అతను అనుభవిస్తున్న సంపద అంతా రామ్‌ సదై బాబు దయ వల్లనే సాధ్యపడిందని, వాళ్లిద్దరి రుణం తీర్చుకునే సందర్భం వచ్చిందని వివరించింది.  ‘‘ఇప్పుడు అంత దుర్మార్గంగా ఎలా వ్యవహరించగలుగుతున్నావ్‌’’ అని నిలదీసింది. 

‘‘అమ్మా, ఈ పెళ్లి సంబంధం కుదిర్చింది నాన్న కదా? ఆయనతోనే నువ్వు మాట్లాడు’’ అని జతిన్‌ ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత కోర్టుకు వెళ్లిపోయాడు.దాంతో నయనతారకు మరే ప్రత్యామ్నాయం కనిపించలేదు. ఉపేన్‌ను  కలుసుకుని, ‘‘బాబూ, నీతో మాట్లాడాలి’’ అంది.‘‘జతిన్‌ పెళ్లి గురించి నువ్వు వినే ఉంటావు. నువ్వేం కంగారు పడకు. కిందా మీదా పడయినా సరే, అదే అమ్మాయినిచ్చి నీకు పెళ్లి చేస్తా’’ అని ప్రకటించింది. దాంతో కంగుతిన్నాడతను.‘‘పెద్దమ్మా?  ఏమిటి నువ్వు అంటున్నది?’’ గట్టిగా అరిచాడు. ‘‘పూర్వీకులు, వంశ చరిత్ర, సామాజిక స్థితి అన్నింటిని పరిశీలించారు. వాళ్లిద్దరి జాతకాలు కుదిరాయి. ముహూర్తం నిశ్చయించారు. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు తన కూతురిని తమ్ముడికి కాకుండా నాలాంటి మూర్ఖుడికివ్వటానికి సిద్ధపడే వాళ్లు ఎవరు ఉంటారు చెప్పు’’ అనడిగాడు. 

‘‘నువ్వు ఏ వంశచరిత్ర, పూర్వీకుల గురించి మాట్లాడేది?’’ ఎన్నో సంవత్సరాలుగా గుండెల్లో దాచుకున్న రహస్యాన్ని బట్టబయలు చేయటానికి సిద్ధమవుతూ అంది నయన. ‘‘నువ్వు గొప్పగా చెప్పే వంశవృక్షాన్ని జతిన్‌ నీ దగ్గర నుంచి గుంజుకున్నాడు. ఇప్పుడు నేను ఆ రహస్యాన్ని బట్టబయలు చేస్తే జతిన్‌ పెళ్లి ఎలా అవుతుందో చూస్తాను’’ సవాల్‌ చేస్తున్నట్టుగా అంది.ఉపేన్‌ మళ్లీ అరిచాడు. ‘‘నీకేమయినా పిచ్చి పట్టిందా? తను నా వంశచరిత్రను ఎలా గుంజుకోగలుగుతాడు?’’ అన్నాడు.‘‘పిచ్చోడా? నీ వంశచరిత్రకు నువ్వు విలువ ఇవ్వాలి. వంశచరిత్ర ముందు సంపద, సామాజిక స్థాయి ఎందుకూ కొరగావు అనేది నేను అనుకుంటే, నా కొడుకుని ఇంకొకరితో మార్చే దానినా?’’ఉపేన్‌ మంచం మీద ఎగిరి దూకాడు. ‘‘పెద్దమ్మా..?’’‘‘ఇంకా పెద్దమ్మా ఏమిటి? అమ్మా అని పిలువు. నువ్వెప్పుడూ నన్ను నువ్వు అలా పిలవలేదు. నాకు ఆ అదృష్టం లేకుండా పోయింది.

 నేను నీ కోసం ఎంతో చేశాను. చివరికి దీని వల్ల నాకేం మిగిలింది? ఇప్పుడు నేను అందరికీ చెబుతాను. పుట్టినప్పుడు మీ ఇద్దరిని నేను ఎలా మార్చానో? ఈ రోజు వాడికి రెండు డిగ్రీలు ఉన్నందుకు అహంకారం, తలపొగరు నెత్తికెక్కి హద్దులు లేకుండా వ్యవహరిస్తున్నాడు. వంశచరిత్ర.. దాన్ని ఇప్పడే నాశనం చేస్తా. అప్పుడు కానీ నాకు మనశ్శాంతి దొరికేలా లేదు’’ అంది గట్టిగా నిట్టూర్పు విడుస్తూ. ‘‘నువ్వు ఇంకేం మాట్లాడకు. ఇంకొక్క మాట మాట్లాడినా నిన్ను నేను చంపేస్తా’’ ఉగ్రుడయ్యాడు ఉపేన్‌..ఆ రోజు మధ్యాహ్నం భోజనాల సమయంలో అతని జాడ కనిపించలేదు. అలా అప్పుడప్పుడు అతను మాయం కావటం మామూలే. అందుకే ఎవరూ అంతగా పట్టించుకోలేదు.సాయంత్రం జతిన్‌కి అతని పేరుతో ఓ టెలిగ్రామ్‌ వచ్చింది. ‘‘దాదా, నేను రంగూన్‌ వెళ్లిపోతున్నాను. మీరంతా సుఖసంతోషాలతో జీవించాలి. అదే నేను మీ నుంచి కోరుకుంటాను. ఇకపోతే నేను చేసిన తప్పులను నువ్వు క్షమిస్తావనే అనుకుంటున్నాను. ఉంటున్నాను– ఉపేన్‌’’ అని ఉంది అందులో.  

బెంగాలీ మూలం: మాధురీలతా దేవి అనువాదం: డాక్టర్‌ పార్థసారథి చిరువోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement