
చుక్కపొద్దున కోళ్ళ కూతలతో తిరుపతి గోవిందరాజ స్వామి గుడి చుట్టూ ఉన్న మాడవీధుల్లోని వాళ్ళు మేలుకొని స్నాన పానాదులతో సిద్ధమౌతున్నారు. ఉత్తర మాడ వీధిలోని చిన్న జియ్యంగారు మఠం నుండి దివిటీ పట్టుకొని, తాళం పెట్టెను భుజం మీద పెట్టుకొని ఆలయ తలుపులు తెరవడానికి కైకాలరెడ్డి జియ్యంగారుతో బయలుదేరాడు. కొంచెంసేపటికి ఆలయ గుడిలో నుండి స్వామి వారిని మేలుకొలుపుతూ అర్చకులు పాడే సుప్రభాత సేవ మొదలైంది. ఎద్దుల బండ్ల మీద నుంచి వచ్చిన సుదూరప్రాంత యాత్రికులు బండ్ల వీధిలో బండ్లను నిలిపి గ్రామ చావడిలో తమ పేర్లను నమోదు చేసుకొంటున్నారు. అక్కడే వారికి అడ్డంగా మూసిన ఇనుప ప్రవేశ ద్వారాన్ని తెరిచారు. నాలుగు కాళ్ళ మంటపం వరకు గుమిగూడిన జనం ‘గోవింద! గోవిందా!!’ అంటూ గుడివైపు వెళ్ళారు. గుడితో పాటు మాడ వీధులన్నీ యాత్రికుల రాకతో సందడిగా మారిపోయాయి. స్వామివారి నైవేద్య గంటలు ఆ ప్రాంతమంతా మారుమోగాయి.
ఉత్తర మాడ వీధిలోని నమ్మాళ్వారు గుడి పక్కనుండే ఓ విశాల ప్రాంగణం కలిగిన చిన్న అంతఃపురంలాంటి భవనం ముందు దివిటీలు పట్టుకొని కొందరున్నారు. అలాగే తలకు తెల్లని పాగాలను చుట్టుకొని, మోకాళ్ళ వరకు గోచీ పంచె కట్టుకొని ఆరుగురు బలిష్టమైన బోయలున్నారు. చూడచక్కని పల్లకి ఆ భవనం ముందు ఆగి ఉంది. బాగా అలంకరించుకొని ఉన్న అందమైన స్త్రీలు భవనం నుండి బయటకొచ్చారు. తిరుపతిని కప్పేసిన చీకటి తొలగిపోలేదు. మేలిముసుగులో ఒక అప్సరలాంటి స్త్రీ అటు ఇటు చెలికత్తెలతో బయటకొచ్చింది. కాంతిపుంజంలాంటి ఆమెను చూసిన చీకటి సూర్యకాంతేమోనని భయపడినట్లు ఆ ప్రాంగణంలో చిన్నబోయింది. ఆమె ఒయ్యారంగా పల్లకీలో ఎక్కి కూర్చుంది.
పల్లకీకి అటు ఇటు ఉన్న పారదర్శక పరదాలు గాలికి రెపరెపలాడుతున్నాయి. పట్టు చమ్కీ పరదాలు మెరుపు తీగలాంటి ఆమె ముందు మెరియలేక తమ ఓటమిని అంగీకరిస్తూ తలలు వాల్చేశాయి. పున్నమి ముందు రోజు చంద్రుడు ఆమెను చూసి అసూయతో పడమటి కొండల్లోకి జారుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. బోయలు ముందు ముగ్గురు, వెనుక ముగ్గురు పల్లకీ కొయ్య తండులను లేపి భుజం మీదకు ఎత్తుకొని బయలుదేరారు. పల్లకీ ముందు దివిటీ పట్టుకొన్న వ్యక్తులు కదిలారు. పల్లకి వెనుక వైపు చెలికత్తెలు, పరివార జనం కదిలారు. కత్తులు, బల్లేలు చేత పట్టుకొని చుట్టూ భటులు రక్షణగా వెంట నడిచారు. వీళ్ళు సమ్మాళ్వారు గుడికి పడమరవైపు ఆనుకొని ఉండే దారి గుండా వెళ్తూ తీర్థకట్ట వీధిలోకి ప్రవేశించారు.
‘హరోం హరహర హరహర’ అంటూ బోయలు పల్లకీని మోసుకొంటూ నాదముని అగ్రహారాన్ని దాటుకొని తీర్థకట్ట వీధిలోని కొత్త వీధి మొదటనున్న వేంకటేశ్వరస్వామి గుడి ముందు ఆపి అందరూ నమస్కారాలు చేసుకున్నాక కపిలతీర్థం రహదారి మీదకొచ్చారు. అక్కడి నుంచి జియ్యంగార్ గుడి దాటుకొని, మంగలోళ్ల బావి, అచ్యుతరాయపురం మీదుగా కపిలతీర్థం ముందుకొచ్చి ఆగారు. ఆ రోజు కార్తీక పౌర్ణమి కావడంతో కపిలతీర్థంలో పుణ్యస్నానాలు చేయడానికి కొందరు జనం అప్పటికే ఉన్నారు. పల్లకీ దిగుతూనే అరుణోదయమైంది. మెల్లగా వెలుగు రేఖలు పడుతూనే చీకట్లు తొలిగాయి. వెలుతురు విరజిమ్మింది. పల్లకీలో దిగిన స్త్రీని గుర్తుపట్టి అక్కడున్న జనం ఆమెను చూడడానికి ఎగబడ్డారు. అందాలను రాశి బోసినట్లు ఉండే ఆమె మంద గమనంతో అక్కడున్న జనానికి చిరునవ్వుతో నమస్కరిస్తూ సాయుధ భటుల సహాయంతో కపిలతీర్థంలోని కోనేరుకు పడమర వైపున్న సంధ్యావందన మంటపంలోకి అడుగు పెట్టింది.
చిన్నగా వెళ్ళి దుస్తులు మార్చుకొనే గదిలోకి వెళ్ళింది. ఆమె పరివారం ఆమె ఆభరణాలను, దుస్తులను తీసి జాగ్రత్త చేసి, స్నానాలాచరించే దుస్తుల్ని ధరింపజేసి కపిల తీర్థం జలపాతం దగ్గరకు తీసుకెళ్ళారు. వారం ముందు కురిసిన వానల వల్ల జలపాతం ఆకాశగంగలా కోనేటి గట్టుమీదికి దుముకుతోంది. ఆమెను చెలికత్తెలు జలపాతంలో పవిత్ర స్నానాలు చేయించారు. ముఖానికి, చేతులు కాళ్ళకు పసుపు రాశారు. ఆమె భక్తితో నమస్కరిస్తూ కపిలతీర్థం జలపాతంలో స్నానమాచరించింది. బట్టలు మార్చుకోవడానికి చెలికత్తెలతో స్నానాల గదికి వెళ్ళింది. ‘ఇంతకీ ఎవరామె మనల్ని ఎందుకు ఇక్కడే ఆపేశారు?’ అడిగారు ఒక భక్తుడు అక్కడున్న ఆలయ సిబ్బందిలోని ఒక వ్యక్తితో. ‘ఆమె సెవ్వుసాని. గోవిందరాజస్వామి గుడి దేవదాసి. ఆమెకున్న పలుకుబడి సామంతరాజులకు కూడా లేదు.
ఆమె కపిలేశ్వరస్వామి గుడిలోకెళ్ళేంత వరకు మీరు వేచి ఉండాల్సిందే’ అన్నాడు ఆలయ ఉద్యోగి వెంకటయ్య. ‘మమ్మల్ని ఈ కోనేటి ఒడ్డున నిలిపితే నిలిపారు గానీ ఒక దేవకన్యను కళ్లారా చూసినట్లైంది’ అన్నాడు ఆ గుంపులోని మరొకడు. ‘ఇంతకీ మీరు ఏ ఊరి నుండి వచ్చారు? మీ పేరేమి?’ అడిగాడు వెంకటయ్య. ‘మాది శ్రీరంగం. నా పేరు రంగరాజన్. మేము పదిమంది కలిసి బండ్ల మీద తిరుపతికొచ్చాం. కపిలతీర్థంలో స్నానం చేశాకే కదా కొండెక్కాలి. అందుకని ఇక్కడికొచ్చాం. పైగా ఈ రోజు కార్తీక పౌర్ణమి. ఇలాంటి ప్రముఖ వ్యక్తులు ఇక్కడకు వస్తారని మేము ఊహించలేదు. మేము తమిళప్రాంతం నుండి వచ్చాము కాబట్టి ఈమె గురించి మాకు తెలియదు. అందుకని ఈమె ఎవరని అడిగాం. ఇంతటి అప్సరస తిరుపతిలో దేవదాసీగా ఉందంటే ఆశ్చర్యంగా ఉంది. మా శ్రీరంగంలోని దేవదాసీ కూడా ఇంత అందంగా లేదు. ఈమె ఇక్కడే పుట్టిందా?’ అడిగాడు రంగరాజన్, ‘ఈ సెవ్వుసాని విజయనగర రాజధానిలో పుట్టి పెరిగింది.
తన నృత్యంతో శ్రీకృష్ణదేవరాయలను మంత్రముగ్ధుల్ని చేసేది. రాయలవారు ఈమె పట్ల ఎంతో వాత్సల్యాన్ని ప్రదర్శించేవారు. ఆమెకు ఎనలేని సంపదలను బహూకరించారు. ఆమెకు తిరుపతి అంటే ఎంతో మక్కువ. అప్పుడప్పుడు తిరుపతికి వచ్చినప్పుడు చంద్రగిరిలో ఉండే అచ్యుత దేవరాయల ఆతిథ్యం తీసుకొని తిరుమలేశుని సందర్శించి, తన పరివారంతో విజయనగర రాజధానికి చేరుకొనేది. ఆమె అంటే అచ్యుతదేవరాయలకు ఎనలేని అభిమానం. అనురాగం. శ్రీ కృష్ణదేవరాయల మరణానంతరం ఆయన మరణ శాసనాన్ని అనుసరించి తమ్ముడైన అచ్యుత దేవరాయలు విజయనగర సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. అచ్చుత దేవరాయలు ఇరవై ఏళ్ళు చంద్రగిరిలో ఉండడం వల్ల ఆయన తరచు చంద్రగిరి చుట్టు పక్కలుండే గుళ్ళను దర్శించేవారు. ఆయన సందర్శించే గుళ్ళల్లో శ్రీ గోవిందరాజస్వామి గుడి ఒకటి.
ఆ గుడి పురోభివృద్ధికి సాధ్యమైనంత వరకు తన సహాయ సహకారాలను అందించేవారు. ఉత్సవ, ఊరేగింపుల్లో గోవిందరాజస్వామికి నృత్యగానాలు లేకపోవడం వెలితిగా తోచింది అచ్యుత దేవరాయలకు. తనకు ఏదైనా మంచి జరిగితే ఒక దేవదాసీని ఆలయానికి బహూకరిస్తానని మొక్కుకున్నాడు. ఊహించని విధంగా తన అన్న కృష్ణదేవరాయల మరణ శాసనాన్ని అనుసరించి తాను సమస్త విజయనగర సామ్రాజ్యానికి ప్రభువైనాడు. కొన్నాళ్ళకు తన మొక్కుబడిని గురించి అంతఃపురంలో ఉన్న నాట్యకత్తెలకు తెలియజేశాడు. అందరూ తటపటాయిస్తుంటే సెవ్వుసాని తాను దేవదాసీగా గోవిందరాజస్వామి ఆలయానికి వెళ్తానని ముందుకొచ్చింది. విజయనగరంలోనే మేటి అందగత్తె సెవ్వుసాని సమ్మతించగానే ఆమెను తిరుపతికి పంపి గోవిందరాజస్వామికిచ్చి వివాహం చేసి ఆ దేవునికి దాసిగా మార్చారు’ అన్నాడు వెంకటయ్య.
‘అప్పటి వరకు ఆమెకున్న సంపదను ఏమి చేశారు?’ అడిగాడు రంగరాజన్.‘ఆమె సకల సంపదలతో పాటు మంది మార్బలాన్ని, పరివారాన్ని, చెలికత్తెలను తిరుపతికి పంపుతూ అచ్యుతదేవరాయలు మరికొంత సంపదను ఆమె వెంట ఆనందంగా పంపాడు. త్వరలో తానొచ్చి గోవిందరాజస్వామిని దర్శిస్తానన్నాడు. అన్న ప్రకారం కొన్నాళ్ళకు జైత్రయాత్రలో భాగంగా తిరుపతికొచ్చి స్వామి వారిని దర్శించుకొన్నాడు. ఆ సందర్భంగా రెండు రోజులు ఏర్పాటు చేసిన ఉత్సవ ఊరేగింపుల్లో పాల్గొన్నాడు. సెవ్వుసాని ధ్వజస్తంభం ముందుండే నాట్య మంటపాల్లో చేసిన నృత్యానికి పరవశించిపోయాడు. చెంతనే ఉన్న సామంత రాజులు పులకించిపోయారు.
ప్రధాన వీధుల్లో స్వామి ఊరేగింపుల్లో పాల్గొన్నాడు. ఇసుకేస్తే రాలని జనంతో తిరుపతి నిండిపోయింది. దారి వెంబడి పూలతో, మామిడి తోరణాలతో, అరటి మానులతో అలంకరించారు. మిద్దెలపై నుండి జనం పూల వర్షం కురిపించారు. అచ్యుతరాయలు సెవ్వుసాని గానంతో కూడిన నాట్యాన్ని తనివితీరా వీక్షించాడు. చివరిరోజు స్వామివారికి అనేక వజ్రవైఢూర్యాలతో కూడిన ఎన్నో ఆభరణాలను బహూకరించాడు. మరెన్నో ఇనాంలను ప్రకటించాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు స్వామి తనని ఇంతటి వాడిని చేశాడనే కృతజ్ఞతతో. ఆ తర్వాత ఆలయం పక్కనే ఉత్తర మాడవీధిలో ఉన్న సెవ్వుసాని భవనానికెళ్ళి ఆమెను బంగారు వరహాలతో అభిషేకించాడు. తన మాట నిలిపినందుకు విలువైన ఆభరణాలను అందజేశాడు. తర్వాత దక్షిణ దేశ జైత్రయాత్రలో విజయుడై విజయనగరానికి చేరుకొన్నాడు.
‘అప్పటి నుండి సెవ్వుసాని తిరుపతిలోనే స్థిరపడిపోయిందా?’ అడిగాడు రంగరాజన్.‘అవును అప్పటినుండి ఇప్పటికీ ఆమె తిరుపతిని వీడలేదు. గోవిందరాజస్వామిని నృత్య నీరాజనాలతో ఆరాధిస్తోంది. ఆమెను చూడడానికి ఎంతో పెద్ద ధనవంతులు ఆమె ఇంటి ముందు వరుసలో నిల్చొని ఎదురు చూస్తుంటారు. ఆమె దేవుడినే తన భర్తగా భావించి, ఎలాంటి వారినీ ఇంట్లోకి అనుమతించేది కాదు. పైగా చుట్టు పక్కల సామంత రాజులకు కూడా ఆమె అంటే ఎంతో భయం. ఆమె జోలికి వెళ్ళేవారు కాదు. అంతేగాక పరిపాలనా అనుకూలతల కోసం ఆమె సహాయ సహకారాలను అర్థించేవారు. ఎందుకంటే ఆమె విజయనగర సామ్రాజ్యాధీశునికి అత్యంత సన్నిహితురాలు. ఆమె తలచుకొంటే పదవులు వూడిపోతాయి. తలలు తెగిపడతాయి. ఆమె పరపతి అలాంటిది’ అన్నాడు వెంకటయ్య.
సెవ్వుసాని రాకముందే పుణ్యస్నానాలు ఆచరించిన వాళ్ళు కపిలేశ్వరస్వామిని దర్శించి వెళ్ళిపోయారు. సెవ్వుసాని పరివారంతో కలిసి కోనేటిగట్టు మీదుండే సంధ్యావందన మంటపం నుండి వయ్యారంగా నడుస్తూ రాతి మెట్లెక్కి కపిలేశ్వర స్వామిని దర్శించడానికెళ్ళింది. స్వామివారిని దర్శించాక నాగ పడిగలను ప్రదక్షిణం చేసుకొని చక్కటి ముగ్గువేసి మధ్యలో 365 ఒత్తులతో పిండి దీపం వెలిగించి దణ్ణం పెట్టుకొంది. అర్చకులు అందజేసిన ప్రసాదాలను తిని; కపిలేశ్వరస్వామి మహిమల్ని గూర్చి; కార్తీక పౌర్ణమి విశిష్టతను గూర్చి; కోనేటి ప్రవేశ ద్వారంలోని సువిశాల మంటపానికి అటు ఇటు ఉన్న లక్ష్మీ నారాయణస్వామిని గూర్చి; శ్రీకృష్ణ సమేత దేవేరులను గూర్చి అర్చకస్వాములు చెప్తుండగా ఆనందంగా వింటూ తిరుమల కొండను దగ్గర నుండి చూస్తూ పరవశించిపోసాగింది. ఇంతలో గాలులు మొదలయ్యాయి. ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమైంది.
తుంపర్లతో మొదలవ్వాల్సిన వాన అనుకోని ఉపద్రవంలా పెద్ద పెద్ద చినుకులతో హఠాత్తుగా దండయాత్ర చేసింది. కాసేపటికి తగ్గిపోతుందనుకున్నారంతా. కాని, రాను రాను వర్షం భీకరమైంది. మెరుపులు, ఉరుములతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. మనుషుల్ని సైతం నెట్టేసే గాలులు మొదలయ్యాయి. కపిలేశ్వరస్వామి గుడి ఆవరణ నుండి కోనేటి గట్టున పెద్దగా నిర్మించి ఉన్న ముఖద్వారం మంటపానికి సెవ్వుసాని పరివారం చేరుకున్నారు.పెద్ద గాలివాన. ఉన్నట్టుండి వాతావరణం ఇంత ప్రళయంగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. రెండు గడియలపాటు కుంభవృష్టి కురిసింది. జలపాతం హెూరు చెవులు చిల్లు పడేలా ఉంది. కొండల్లోని ఎర్రని మట్టితో కలిసి జలపాతం విస్తరించి దుముకుతోంది. కోనేరు అలల తాకిడితో కంపించిపోతోంది. నల్లని మబ్బులతో పట్టపగలే చీకట్లు కమ్ముకున్నాయి. అందరి గుండెల్లో గుబులు పుట్టింది.
వరుణదేవుని ప్రతాపానికి ప్రముఖులు లేదు సామాన్యులు లేదు– అందరూ అటు ఇటు వాయించిన వర్షానికి కుడితిలో పడ్డ ఎలుకల్లా ముద్దయిపోయారు. ఉరుములు గుండెల్లో ఉరుము వాద్యాలు వాయిస్తున్నాయి. మెరుపులు అలముకున్న చీకట్లను చీల్చుతున్నాయి. అక్కడక్కడా పిడుగులు పడ్డ శబ్దాలు భయం గొల్పుతున్నాయి. ఇంతలో ఒక పిడుగు కపిలేశ్వరస్వామి గుడి మీద పడ్డట్టయింది. అందరూ ఆ శబ్దానికి, వెలుతురుకు భయ కంపితులైపోయారు. వణుకు మొదలైంది. కళ్ళల్లో దైన్యం ఆవహించింది. గుడిలో నుండి ఒక అర్చక స్వామి బతుకు జీవుడా అనుకొంటూ, పరిగెత్తుకొని అందరూ ఉన్న మంటపంలోకొచ్చాడు.‘కపిలేశ్వర స్వామికి ఏమీ కాలేదు. అయితే గుడి ప్రాకారాలు పడిపోయాయి. ఆగ్నేయంలో ఉండే వంటశాల మీద పిడుగు పడింది. వంటశాల ధ్వంసమైపోయింది. నేను పుట్టి బుద్ధెరిగాక ఇంత పెద్దవానను ఈ కపిలతీర్థంలో చూడలేదు’ అన్నాడు.
‘అమ్మగారూ! ప్రళయమొచ్చిందేమో? ననిపిస్తోంది’ అంది ఒక చెలికత్తె.‘ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. అధైర్యపడకండి’ అని అందరికీ ధైర్యం చెప్పింది సెవ్వుసాని.‘అమ్మగారూ! కోనేట్లో నీటి ఉద్ధృతికి సంధ్యావందన మంటపం కంపించిపోతోంది. నీటి ధారలు జల ఖడ్గాలుగా విరుచుకుపడుతున్నాయి. మనమున్న ఈ మంటపాన్ని ఒరుసుకొని నీళ్ళు ప్రవహిస్తున్నాయి. ఈ మంటపానికి ప్రమాదం రాదు కదా?’ అంది మరో చెలికత్తె.‘మనం చేయగలిగిందేమీ లేదు గోవింద నామ స్మరణం తప్ప’ అంది సెవ్వుసాని.అక్కడున్న వాళ్ళంతా ‘గోవిందా గోవింద’ అని గోవిందలు పెట్టడం మొదలెట్టారు. దూరభారం నుండి వచ్చిన వాళ్ళంతా ప్రాణ భయంతో బిక్కుబిక్కుమని చూస్తున్నారు. బతుకు మీద ఆశ వదిలేసుకున్నారు. మెల్లగా వాన తగ్గు ముఖం పట్టింది. ఉన్నట్టుండి తెరపి ఇచ్చింది.
‘ఇక బయలు దేరుతాం అమ్మగారూ! మళ్ళీ వాన మొదలయ్యేలోగా వెళ్ళిపోదాం’ అన్నాడు రక్షణాధికారి.సెవ్వుసాని పరివార జనమంతా బయలుదేరి ముఖమంటపం వెలుపలికొచ్చారు. సెవ్వుసాని పల్లకీ ఎక్కుతుంటే పెళపెళమని చెట్టు కొమ్మ విరిగింది. అక్కడే ఉన్న ఆలయ ఏనుగు ముందుకు అడుగేయడంతో కొమ్మ ఏనుగు వీపుమీద పడింది. ఏనుగు పెద్ద ఘీంకారం చేసింది. అక్కడున్న వాళ్ళంతా భయంతో వణికిపోయారు. ‘మంచి కాలం అమ్మగారూ! ఈ ఏనుగు ముందుకు రాకపోయుంటే ఆ చెట్టు కొమ్మ సరిగ్గా మన పల్లకి మీద పడుండేది. అంతా చిత్రంగా ఉంది. బయలుదేరుదాం పదండి’ అంటూ బోయలు పల్లకీని భుజంపై ఉంచుకొని హరోం హర హర... హర హర... అంటూ తిరుపతి వైపుకెళ్ళిపోయారు. సెవ్వుసాని పరివారంతో పాటు క్షేమంగా తమ భవనానికి చేరుకున్నారు. సాయంత్రం చీకటి పడ్డాక గోవిందరాజస్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం సందర్భంగా సగం కుండల్లో పెద్ద వత్తులతో వెలిగించిన దీపాలతో స్వామివారికి హారతిచ్చి; గుడి ప్రాంగణంలో, వెలుపల దీపాల ప్రదర్శన చేసి, ఆలయ నృత్య నీరాజనంలో పాల్గొని తన భవనానికి చేరుకొంది సెవ్వుసాని.
భవనం మీద నుండి తన చెలికత్తెలతో పాటు కపిలతీర్థం కొండ కొమ్ముమీద వెలిగించిన దీపాన్ని దర్శించుకొని రాత్రి భోజనానంతరం సెవ్వుసాని తన పడక గదికెళ్ళింది. ఎంత దొర్లినా ఆమెకు నిద్ర పట్టలేదు. ఇదంతా ఎందుకు జరిగిందని ఆలోచించాక ఏం చేయాలో ఒక నిర్ణయానికొచ్చింది. పరోపకారార్థం ఇదం శరీరం అనుకొంది. రెండు రోజుల తర్వాత వానలు కుదుట పడ్డాక మళ్ళీ కపిలతీర్థానికి తన పరివారంతో పాటు వెళ్ళి దెబ్బతిన్న ఆలయ కట్టడాలను బాగుచేయాలనుకొంది.‘కోశాధికారీ! ఈ కపిలతీర్థం గుడి ప్రాకారాలను, వంటశాలను పునర్నిర్మించాలనుకొంటున్నాను. అలాగే దెబ్బతిన్న సంధ్యావందన మంటపాలకు మరమ్మత్తులు చేయాలి. నన్ను కాపాడిన గజరాజుకు ఏమీ కాకపోయినా, ఆ వినాయకుడే నన్ను కాపాడాడనిపిస్తోంది. అందుకని కపిల తీర్థంలోని ఆలయ ప్రాంగణంలో కపిలేశ్వరుని చెంత వినాయకుడ్ని ప్రతిష్ఠించి ఆయన నైవేద్యాలకు దానాలు చేయాలి.
ఎన్ని సొమ్ములు ఖర్చు అయినా ఫర్వాలేదు’ అంది సెవ్వుసాని‘అలాగే అమ్మగారు’‘అందుకుగాను ఈ ప్రాంత సామంతరాజు రాచవీడు నాయకుని అనుమతిని తీసుకోండి’‘అవసరం లేదమ్మా! మీరు ఇంత మంచి పని చేస్తానంటే సామంత రాజులు కాదంటారా? మీరడిగిందే మహాభాగ్యంగా భావిస్తారు’ అన్నాడు కోశాధికారి.‘అది తప్పు. మనం రాచరికపు వ్యవస్థలో ఉన్నాం. విజయనగర సామ్రాజ్యాధీశుడు మనకు ఆత్మీయులు కావొచ్చు. స్థానిక సామంత రాజును గౌరవించడం మన కర్తవ్యం’‘అలాగే అమ్మగారు’సామంతరాజు అనుమతి తీసుకొన్న సెవ్వుసాని అన్ని పనులను పూర్తి చేసింది. నేటికీ సంధ్యావందన మంటపాలు చెక్కు చెదరలేదు. కపిలేశ్వరస్వామి ఆలయ ప్రాకారాలు, వంటశాల ఆమె ఔన్నత్యాన్ని చాటుతున్నాయి. ఇక ఆలయంలో ధ్వజస్తంభం పక్కనుండే వినాయకుడు ఇప్పటికీ నిత్యం పూజలందుకుంటూ భక్తులకు కొంగు బంగారమైనాడు. సంపదలు ఉంటాయి, పోతాయి. కాని, సెవ్వుసాని ధార్మికత ఎల్లకాలం నిలిచే ఉంటుంది.
∙ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి