కుంభకర్ణుడి కొడుకులు సకుంభ నికుంభులు. రామ రావణ యుద్ధ కాలంలో వారు శాపవశాన మదగజాల రూపంలో అడవుల్లో సంచరిస్తూ ఉండేవారు. ఆ తర్వాత పులస్త్యుడి అనుగ్రహంతో శాపవిమోచన పొందారు. పూర్వరూపాలు పొందిన తర్వాత సకుంభ నికుంభులు యథావిధిగా ఇష్టానుసారం సంచరిస్తూ, లోకాలను పీడించడం ప్రారంభించారు. ‘రామ రావణ యుద్ధంలో రావణ కుంభకర్ణాదులు హతమయ్యారు. వీరు కూడా హతమైపోయి ఉండే బాగుండేది, వీరి పీడ విగడయ్యేది’ అని ఇంద్రాది దేవతలు అనుకోసాగారు.
ఇదిలా ఉండగా, ఒకనాడు నారద మహర్షి లోకసంచారం చేస్తూ సకుంభ నికుంభుల నిలయానికి వచ్చాడు. ఇద్దరు సోదరులూ ఆయనకు ఎదురేగి, అర్ఘ్యపాద్యాదులు సమర్పించి, సగౌరవంగా స్వాగతించారు. ‘నారద మహర్షీ! విశేషాలేమిటి?’ అని అడిగారు.‘మహావీరులారా! దానవ వీరుల్లో హిరణ్యాక్ష హిరణ్యకశిపులను సైతం నేను ఎరుగుదును. వారెవరూ బాహు పరాక్రమంలో మీకు సాటిరారు. మీరు కత్తి ఎత్తారంటే సహస్రాక్షుడు సైతం భయంతో తోక ముడిచి పరుగులు తీస్తాడు. మీ బలపరాక్రమాలకు భయపడి ఇంద్రుడు గజగజలాడుతున్నాడు. ముల్లోకాలలోని జనాలు మీ ధాటికి జడిసి నిద్రలో కూడా ఉలికిపడుతున్నారు’ అన్నాడు.‘ఔను నారద మహర్షీ! నువ్వు పలికినది సత్యం. ముల్లోకాలలోనూ మమ్మల్ని ఎదిరించగల వీరుడెవడు?’ అని గర్వంగా మీసాలు దువ్వుకున్నారు.
‘మిమ్మల్ని ఎదిరించేవారు ఎవరూ లేకున్నా, జ్ఞాతిద్రోహం చేసి, లంకకు పట్టాభిషిక్తుడైన విభీషణుడు ఉన్నాడు కదా, అతడే మీ శత్రువు. అతడిని జయించి, లంకను స్వాధీనం చేసుకున్నారంటే, మీ లంక మీకు దక్కినట్లవుతుంది’ అని అగ్గి రాజేసి చక్కా వెళ్లిపోయాడు నారదుడు.నారదుడి మాటలు విని సకుంభ నికుంభులు రగిలిపోయారు. వెంటనే ఒక దూతను విభీషణుడి వద్దకు పంపి, యుద్ధానికి సిద్ధం కమ్మని హెచ్చరిక సందేశం పంపారు.విభీషణుడు యుద్ధ సన్నద్ధుడయ్యాడు. సకుంభ నికుంభులకు, విభీషణుడి సేనలకు మధ్య భీకర యుద్ధం మొదలైంది. సకుంభ నికుంభుల చేతిలో విభీషణుడి సైనికులు పెద్దసంఖ్యలో నేలకొరిగారు. పోరులో వారి ముందు నిలువలేక విభీషణుడు కూడా రథాన్ని వెనక్కు మరలించాడు.
యుద్ధంలో నానాటికీ పరిస్థితులు దిగజారుతుండటంతో విభీషణుడు చింతాక్రాంతుడయ్యాడు. ‘ఇలాంటి విపత్కర పరిస్థితిలో నాకు రాముడే దిక్కు. ముందుగా ఈ సంగతిని హనుమకు తెలుపుతాను’ అనుకుని, వెంటనే ఆకాశమార్గాన గంధమాదన పర్వతానికి చేరుకున్నాడు. అక్కడ హనుమంతుడిని కలుసుకుని, సకుంభ నికుంభుల దురాగతాన్ని వివరించి, కన్నీళ్లు పెట్టుకున్నాడు.
‘భయపడకు విభీషణా! వెంటనే మనం రామచంద్రుడిని కలుసుకుందాం. ఆయన అండ మనకు ఉన్నంత వరకు సకుంభ నికుంభుల వంటివారు ఎందరు వచ్చినా, నిన్నేమీ చేయలేరు’ అని అభయమిచ్చాడు. విభీషణుడిని వెంటబెట్టుకుని వెంటనే అయోధ్యకు చేరుకున్నాడు.
విభీషణాంజనేయులు రాత్రివేళ అకస్మాత్తుగా రావడంతో రాముడు ‘ఇంత రాత్రివేళ మీరిద్దరూ ఇలా రావడానికి కారణమేమిటి?’ అని ప్రశ్నించాడు.హనుమంతుడు రాముడికి విభీషణుడి పరిస్థితిని వివరించాడు. విభీషణుడికి రాముడు ధైర్యం చెప్పి, ‘హనుమా! రేపు సూర్యోదయానికల్లా సేనలను సిద్ధం చేయి. మనం యుద్ధానికి బయలుదేరుతున్నాం’ అని ఆజ్ఞాపించాడు. మర్నాడు ఉదయమే లక్ష్మణుడికి అయోధ్యానగర బాధ్యతలను అప్పగించి, భరత శత్రుఘ్నులతో కలసి విభీషణాంజనేయులు, సేనలు వెంటరాగా రాముడు లంకకు బయలుదేరాడు.
రాముడి రాకను వేగుల వల్ల తెలుసుకున్న సకుంభ నికుంభులు యుద్ధానికి సిద్ధమయ్యారు. హోరాహోరీ యుద్ధం మొదలైంది. భరత శత్రుఘ్నులు ముందుకు వెళ్లి సకుంభ నికుంభులను ఎదుర్కొన్నారు. భరత శత్రుఘ్నులు ఎంతకూ వెనక్కు తగ్గకుండా పోరాడుతుండటంతో దానవ సోదరులిద్దరూ తమ తండ్రి కుంభకర్ణుడికి యముడు ఇచ్చిన యమదండాన్ని వారి మీదకు ప్రయోగించారు. యమదండం తాకగానే భరతశత్రుఘ్నులు కుప్పకూలిపోయారు.తన సోదరులు రణరంగంలో కూలిపోవడంతో రాముడు క్రోధావేశంతో కోదండాన్ని అందుకున్నాడు. సకుంభ నికుంభలపైకి వాయవ్యాస్త్రాన్ని సంధించాడు. వాయువేగంతో దూసుకెళ్లిన ఆ దివ్యాస్త్రం సకుంభ నికుంభులిద్దరినీ యమపురికి పంపింది.
అప్పటికీ భరతశత్రుఘ్నులు స్పృహలేకుండా ఉండటంతో రాముడు శోకతప్తుడై దుఃఖించాడు. ‘రామచంద్రా! నువ్విలా శోకించ తగునా! ఇలాంటి ఆపదలను గట్టెక్కించడంలో దిట్ట అయిన హనుమ మన చెంతనే ఉన్నాడు కదా! అతడిని పంపితే, ఇట్టే సంజీవనని సాధించుకు వచ్చి నీ తమ్ములను బతికించగలడు’ అని విభీషణుడు ఊరడించాడు.‘హనుమా! నువ్వే నా సోదరులను బతికించాలి’ వేడుకోలుగా అన్నాడు రాముడు.‘ప్రభూ! నీ ఆజ్ఞ అయితే, సంజీవనినే కాదు, ఇంద్రుడితో పోరాడి సాక్షాత్తు అమృతాన్నయినా తీసుకొస్తా’ అని పలికి హనుమంతుడు ఆకాశానికెగశాడు.
హనుమంతుడు నేరుగా అమరావతికేగి, అక్కడి నుంచి అమృతకలశంతో తిరిగి వచ్చాడు. అమృతాన్ని తాగించడంతో భరత శత్రుఘ్నులు పునర్జీవితులయ్యారు. విభీషణుడికి వీడ్కోలు పలికి రాముడు సోదరులతో కలసి అయోధ్యకు చేరుకున్నాడు.
∙సాంఖ్యాయన


