మనుషుల కోసమే నియమాలు... నియమాల కోసం మనుషులు కాదు! | Dr Indla Vishal Reddy Psychiatrist Guidance | Sakshi
Sakshi News home page

మనుషుల కోసమే నియమాలు... నియమాల కోసం మనుషులు కాదు!

Mar 12 2026 7:35 AM | Updated on Mar 12 2026 7:36 AM

Dr Indla Vishal Reddy Psychiatrist Guidance

డాక్టర్‌ గారు, నా భర్త వయసు నలభై ఐదు సంవత్సరాలు. ఆయన ఒక మెడికల్‌ కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. ఆయన చిన్నప్పటి నుంచే చాలా ‘పర్ఫెక్షనిస్ట్‌’ స్వభావం కలిగిన వ్యక్తి. ప్రతి పని సమయానికి జరగాలని గట్టిగా పట్టుబడతారు. ఆయనతో పనిచేసే ఉద్యోగులు లేదా స్టూడెంట్స్‌ ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా వారిపై కోపంగా అరుస్తారు. అలాగే కాలేజీలో ఎవరైనా తప్పులు చేస్తున్నారని అనిపిస్తే వెంటనే ప్రిన్సిపాల్‌కు; ఒక్కోసారి ప్రిన్సిపాల్‌ గురించి పై అధికారులకూ ఫిర్యాదు చేస్తుంటారు. అందువల్ల అందరూ ఆయనను దూరంగా ఉంచుతున్నారు.

 ఆహారం విషయంలో కూడా క్యాలరీలు, పోషక విలువలు ఒక్కొక్కటి జాగ్రత్తగా పరిశీలించి మాత్రమే తింటారు. ఖర్చు చేసే ప్రతి పైసాను లెక్కపెడతారు. ఆయనకు స్నేహితులు లేదా సామాజిక జీవితం దాదాపు లేవు. ఇంట్లో పిల్లలకు గానీ, బయటివారికి గానీ చిన్న విషయాలకే ఉపన్యాసాలు ఇస్తుంటారు. దాంతో మా కుటుంబ జీవితంలోనూ, ఆయన ఉద్యోగ జీవితంలోనూ అనేక సమస్యలు వస్తున్నాయి. అయినప్పటికీ ఆయన మాత్రం తాను మారాల్సిన అవసరం లేదని, ఈ ప్రపంచమే మారాలని భావిస్తున్నారు. డాక్టర్‌ గారు, ఇది ఏమైనా సమస్యేనంటారా? లేక నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నానా? మాకు సరైన మార్గదర్శకత్వం ఇవ్వండి. ప్లీజ్‌.
– కవిత, బెంగుళూరు

మీ ప్రశ్నను చూసిన తరువాత ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. మీరు ఖచ్చితంగా ఎక్కువగా ఆలోచించడం లేదు. మీరు మీ భర్త గారి గురించి రాసిన లక్షణాలు చాలా వరకు ‘‘అబ్సెస్సివ్‌ కంపల్సివ్‌ పర్సనాలిటీ డిసార్డర్‌’’ అనే వ్యక్తిత్వ లోపం సమస్యకు సంబంధించినవిగా కనిపిస్తున్నాయి. ఇది సుమారుగా వంద మందిలో ముగ్గురికి కనిపించవచ్చు. ఇది చాలా సాధారణంగా కనిపించే వ్యక్తిత్వ విధానం. పురుషులలో కొంత ఎక్కువగా ఈ మనస్తత్వం కనిపిస్తుంది. ఇది జెనెటిక్‌ కారణాల వల్ల రావచ్చు లేదా పెరిగిన వాతావరణ ప్రభావంతో రావచ్చు. 

చిన్నవయసులో తల్లిదండ్రులతో ఉన్న అటాచ్మెంట్‌ స్టైల్‌ వల్ల కూడా ఇలాంటి మనస్తత్వ లక్షణాలు అభివృద్ధి చెందవచ్చు. వీరు నియమాలు, క్రమశిక్షణ, పద్ధతి అనే వాటిని అత్యంత ్రపాముఖ్యంగా చూస్తారు. ప్రతి పని ఖచ్చితంగా, ఒక క్రమంలో జరగాలని కోరుకుంటారు. ఇలాంటి వ్యక్తులు పనులను ఇతరులకు అప్పగించడానికి ఇష్టపడరు. అన్ని పనులు తామే చేయాలనుకుంటారు. చిన్న చిన్న తప్పుల గురించి ఎక్కువ సమయం వృథా చేస్తారు. దానివల్ల కొన్ని సందర్భాల్లో డెడ్‌లైన్లు కూడా మిస్‌ అవుతుంటాయి. తమ గురించి ఎవరూ తప్పుగా మాట్లాడకూడదని అనుకుంటారు. వీరికి మోరల్‌ విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. డబ్బు ఖర్చు చేసే విషయంలో కూడా చాలా కట్టుదిట్టంగా ఉంటారు. 

మానవ సంబంధాలలో కూడా వీరు చాలా ప్రోఫెషనల్‌గా ఉంటారు. వ్యక్తిగత అనుబంధాలు తక్కువగా ఉండవచ్చు. పని విషయంలో మాత్రం చాలా శ్రద్ధగా ఉంటారు. కొన్నిసార్లు పనిరాక్షసుల్లా మారిపోతారు. కుటుంబంతో సమయం గడపడం లేదా సరదా వీరికి ఉండకపోవచ్చు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి.. ఇలాంటి లక్షణాలు కొంతమేర అందరిలో ఉంటాయి. కానీ అవి మోతాదుకు మించి, కుటుంబ బంధాల్లో లేదా ఉద్యోగ జీవితంలో సమస్యలు సృష్టించినప్పుడు మాత్రమే దాన్ని ఒక డిసార్డర్‌గా పరిగణిస్తాం. సమాజంలో ఎంతో సక్సెస్‌ సాధించిన వ్యక్తుల్లో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి, కానీ అవి నియంత్రణలో ఉంటాయి. 

ఇక్కడ ప్రధాన సమస్య ఏమిటంటే, ఇలాంటి వ్యక్తులు సాధారణంగా చికిత్సకు సహకరించరు.‘‘నేనే కరెక్ట్, ఇతరులే మారాలి’’ అనేది వారి భావన. అందుకే చికిత్సకు ఒప్పించడం కొంచెం కష్టమే. ఒకవేళ తీసుకు వస్తే, కొన్ని రకాల సైకోథెరపీ పద్ధతుల ద్వారా కొంత మార్పు తీసుకురావడం సాధ్యమే. కొంతమందిలో వయసు పెరుగుతున్న కొద్దీ ఈ లక్షణాలు తగ్గవచ్చు. మరికొందరిలో పెరగవచ్చు కూడా. కాబట్టి వీలైనంత త్వరగా ఒక క్లినికల్‌ సైకాలజిస్ట్‌ లేదా సైకియాట్రిస్ట్‌ వద్దకు తీసుకెళ్లి మాట్లాడిస్తే మంచిది. అక్కడ నిపుణులు తగిన మార్గదర్శకత్వం అందిస్తారు. ఏమైనా... నియమాలు మనుషుల కోసమే కానీ, మనుషులు నియమాల కోసం కాదనే విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పాల్సి ఉంటుంది. ప్రయత్నించండి. ఆల్‌ ది బెస్ట్‌!

డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి, 
సీనియర్‌ సైకియాట్రిస్ట్, విజయవాడ. 
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన 
మెయిల్‌ ఐడీ:  sakshifamily3@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement