దేశాన్ని నడిపించే మార్గదర్శక పత్రం: రాష్ట్రపతి
న్యూఢిల్లీ: మన దేశ గుర్తింపునకు రాజ్యాంగమే మూలస్తంభం అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉద్ఘాటించారు. వలసవాద మనస్తత్వాన్ని వదిలించుకోవడానికి, జాతీయవాద దృక్పథాన్ని అలవర్చుకోవడానికి రాజ్యాంగం దోహదపడిందని అన్నారు. బుధవారం పార్లమెంట్ పాత భవనం సెంట్రల్ హాల్‌లో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజుజు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, కాంగ్రెస్ ముఖ్యనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సహా అన్ని పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. రాష్ట్రపతి నేతృత్వంలో రాజ్యాంగ ప్రవేశికను అందరూ సామూహికంగా పఠించారు.
తెలుగు, మలయాళం, మరాఠి, నేపాలీ, పంజాబీ, బోడో, కశ్మీరీ, ఒడియా, అస్సామీ భాషల్లో భారత రాజ్యాంగం డిజిటల్ వెర్షన్‌ను రాష్ట్రపతి విడుదల చేశారు. ఒరిజినల్ రాజ్యాంగం కాలీగ్రఫీకి సంబంధించిన స్మారక బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ప్రసంగిస్తూ... ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ప్రజల ఆకాంక్షలను వ్యక్తీకరిస్తున్న పార్లమెంట్ నేడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రజాస్వామ్య వ్యవస్థలకు ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. దేశ గుర్తింపునకు, ఆత్మగౌరవానికి రాజ్యాంగమే ప్రతీక అని వివరించారు. దేశాన్ని ముందుకు నడిపించే మార్గదర్శక పత్రమని అభివరి్ణంచారు.
ఇతర దేశాల నుంచి ప్రశంసలు
‘‘రాజ్యాంగ స్ఫూర్తిని, సామాజిక, సాంకేతికత మార్పులను దృష్టిలో పెట్టుకొని నేర న్యాయ వ్యవస్థకు సంబంధించిన కీలకమైన చట్టాలను అమల్లోకి తీసుకొచ్చాం. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినీయం చట్టాలకు స్ఫూర్తి శిక్ష విధించడం కాదు, ప్రజలకు న్యాయం చేకూర్చాలన్న ఆశయమే. ప్రజలకు ఓటు హక్కు కల్పించి, వారి ఆకాంక్షలకు ప్రతిబింబంగా నిలుస్తున్న భారత పార్లమెంటరీ వ్యవస్థను ఇతర దేశాలు సైతం ప్రశంసిస్తున్నాయి. భారత రాజ్యాంగ వ్యవస్థకు అనుగుణంగా శాసన, కార్యనిర్వాహక, న్యాయ విభాగాలు దేశ ప్రగతికి పాటుపడుతున్నాయి. ప్రజల జీవితాలకు స్థిరత్వాన్ని, మద్దతును అందిస్తున్నాయి.
ఆర్థిక న్యాయంలో అతిపెద్ద విజయం సాధించాం
దేశంలో గత కొన్నేళ్లుగా ఎన్నికల్లో ఓటు వేసేవారిలో మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రజాస్వామ్యం పట్ల వారి సామాజిక విశ్వాసానికి ఇదొక ప్రబల ఉదాహరణ. పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల దాకా అన్ని రకాల ఎన్నికల్లో మహిళలు, యువత, పేదలు, రైతులు, ఎస్సీ, ఎస్టీలు, మధ్య తరగతి.. ఇలా అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటూ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. రాజ్యాంగ ఆత్మను వ్యక్తీకరించేవి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయమే. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వమే రాజ్యాంగ ఆశయాలు. మన దేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా పరుగులు తీస్తోంది. పార్లమెంటరీ వ్యవస్థ విజయవంతం అవుతోందని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఆర్థిక న్యాయంలో భారత్ అతిపెద్ద విజయం సాధించింది. ఏకంగా 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడడం నిజంగా గొప్ప విషయం’’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.
VIDEO | Delhi: President Droupadi Murmu (@rashtrapatibhvn) releases digital version of the Constitution of India in 9 languages during Constitution Day celebrations at Samvidhan Sadan.
(Source: Third Party)#Constitution
(Full video available on PTI Videos -… pic.twitter.com/rR9DIfmkX6— Press Trust of India (@PTI_News) November 26, 2025


