ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము
ఈ పురస్కారాలు దేశవ్యాప్తంగా చిన్నారులందరికీ స్ఫూర్తినిస్తాయని వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు స్వీకరించిన చిన్నారులు వారి కుటుంబాలకు, మొత్తం దేశానికి గర్వకారణంగా నిలిచారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రశంసించారు. విజేతలకు అభినందనలు తెలియజేశారు. ఈ పురస్కారాలు దేశవ్యాప్తంగా బాలబాలికలందరికీ స్ఫూర్తినిస్తాయని చెప్పారు. రాష్ట్రపతి శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ‘వీర్ బాల్ దివస్’కార్యక్రమంలో పాల్గొన్నారు. సాహస బాలలతోపాటు సామాజిక, సేవ, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, కళలు, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీలో అసమాన ఘనతలు సాధించిన 20 మంది చిన్నారులకు ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వీర్ బాల్ దివస్ ప్రాముఖ్యతను వివరించారు. 320 ఏళ్ల క్రితం గురు గోవింద్ సింగ్ నలుగురు కుమారులు సత్యం, న్యాయం కోసం పోరాడుతూ ప్రాణత్యాగాలు చేశారని చెప్పారు. చిన్న కుమారులైన బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్‌లు ప్రదర్శించిన ధైర్యసాహసాలు దేశ విదేశాల్లో గౌరవాన్ని అందుకుంటున్నాయని తెలిపారు. చిన్నారుల్లోని దేశ భక్తి, ఉన్నత విలువలను బట్టి ఒక దేశం గొప్పతనాన్ని గుర్తించవచ్చని పేర్కొన్నారు.
ఇద్దరు తెలుగు బాలలకు పురస్కారాలు
ఈ ఏడాది ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను 18 మంది పిల్లలకు, మరణానంతరం మరో ఇద్దరి తరఫున వారి తల్లిదండ్రులకు రాష్ట్రపతి ముర్ము అందజేశారు. పురస్కారాల గ్రహీతల్లో ఇద్దరు తెలుగు బాలలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన 16 ఏళ్ల పడకంటి విశ్వనాథ్ కార్తికేయ క్రీడా విభాగంలో పురస్కారం అందుకున్నారు. కార్తికేయ పర్వతారోహకుడు.
2025లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి సెవెన్ సమ్మిట్ చాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన అతిపిన్న వయసు్కడిగా ఘనత సాధించాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాకు చెందిన 17 ఏళ్ల పారా అథ్లెట్ శివానీ హోసూరు ఉప్పర సైతం క్రీడా విభాగంలో పురస్కారం అందుకున్నారు. ఈమె షాట్‌పుట్, జావలిన్ థ్రోలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఎన్నో అవార్డులు సాధించారు. పురస్కార గ్రహీతలకు మెడల్, సరి్టఫికెట్‌తోపాటు రూ.లక్ష నగదు ప్రోత్పాహకాన్ని రాష్ట్రపతి అందజేశారు.
పురస్కార గ్రహీతలతో ప్రధాని మోదీ భేటీ
బాల పురస్కారాలు అందుకున్న చిన్నారులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. భారత్ మండపంలో నిర్వహించిన వీర్ బాల్ దివస్ కార్యక్రమంలో భాగంగా వారితో ముచ్చటించారు. చిన్న వయసులోనే ఇతరులకు స్ఫూర్తినిచ్చే విజయాలు సాధించారని ప్రశంసించారు. ఈ విజయాలు ఆరంభం మాత్రమేనని, ఇంకా సుదూర ప్రయాణం చేయాల్సి ఉందని చెప్పారు. ఈ తరంలో జని్మంచడం ఈ చిన్నారుల అదృష్టమని, వారి ప్రతిభకు దేశమంతా మద్దతుగా నిలుస్తోందని తెలిపారు. ప్రతిభావంతులైన బాలలను మరింత ముందుకు నడిపించేందుకు ఎన్నో వేదికలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, తాత్కాలిక ప్రజాదరణ, గ్లామర్‌కు ఆకర్షితులు కాకుండా లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించాలని చిన్నారులకు ప్రధాని మోదీ సూచించారు.


