
రామ రావణ యుద్ధంలో చివరకు రావణుడు హతమయ్యాడు. రావణుడి అంత్యక్రియల తర్వాత రాముడు విభీషణుడిని లంకకు రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. ఆ తర్వాత యుద్ధంలో తనకు సాయం చేసిన సుగ్రీవ ఆంజనేయ, అంగదాది వానర ప్రముఖులను, విభీషణుడిని వెంటబెట్టుకుని సీతా లక్ష్మణ సమేతంగా పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరాడు.అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా జరిగింది.పట్టాభిషేకం పూర్తయిన తర్వాత కొన్నాళ్లు రాముడి ఆతిథ్యం స్వీకరించిన వారంతా తమ తమ నెలవులకు తిరిగి బయలుదేరడానికి సిద్ధపడ్డారు. యుద్ధంలో తనకు సహకరించిన వానర ప్రముఖులందరికీ రాముడు స్వర్ణాభరణాలు సహా అనేక విలువైన కానుకలను ఇచ్చి సాగనంపాడు.రావణుడికి సోదరుడై ఉన్నప్పటికీ, యుద్ధంలో తన పక్షాన నిలిచిన విభీషణుడికి సాగనంపేటప్పుడు ప్రత్యేకమైన కానుక ఇవ్వాలనుకున్నాడు. అందుకని తమ ఇలవేల్పు అయిన శ్రీరంగనాథుడి విగ్రహాన్ని విభీషణుడికి ఇచ్చాడు.
విభీషణుడికి శ్రీరంగనాథుడి విగ్రహాన్ని అందిస్తూ, ‘విభీషణా! ఇది మా ఇలవేల్పు శ్రీరంగనాథుడి విగ్రహం. నీ రాజ్యానికి శ్రీరంగనాథుడి అనుగ్రహం ఉండాలని దీనిని నీకు ఇస్తున్నాను. నీ ప్రయాణంలో ఈ విగ్రహాన్ని ఎక్కడా నేల మీద విడిచిపెట్టకు. అలా విడిచిపెడితే, ఈ విగ్రహం అక్కడికక్కడే పాతుకుపోతుంది. దీనిని తిరిగి తరలించడం అసాధ్యం’ అని చెప్పాడు.‘సరే’నని చెప్పి, రాముడి వద్ద వీడ్కోలు తీసుకుని, విభీషణుడు లంకకు తిరుగు ప్రయాణమయ్యాడు. దక్షిణ దిశగా లంక వైపు సాగించిన ప్రయాణంలో కావేరీ తీరానికి చేరుకున్నాడు.దారిలో ఎదురైన పవిత్ర కావేరీ నదిలో స్నానం చేయాలని తలచాడు విభీషణుడు. అయితే, విగ్రహాన్ని నేలపై ఉంచరాదని రాముడు చెప్పిన మాట అతడికి గుర్తుకు వచ్చింది. స్నానం చేసి వచ్చేంత వరకు ఎవరైనా విగ్రహాన్ని పట్టుకునేవారు దొరుకుతారేమోనని వెదకసాగాడు.
విభీషణుడు అలా కావేరీ తీరం వెంబడి వెదుకుతూ నడుస్తుండగా, కొంత దూరంలో ఒక బాల బ్రహ్మచారి కనిపించాడు.విభీషణుడు ఆ బాల బ్రహ్మచారిని పిలిచాడు.అతడు విభీషణుడి దగ్గరకు వచ్చి నిలిచాడు.‘బాలకా! నేను ఈ పవిత్ర కావేరీ జలాలలో స్నానం చేసి, సంధ్య వార్చుకోవాలనుకుంటున్నాను. నా చేతనున్న ఈ విగ్రహాన్ని నేల మీద పెట్టకూడదని నియమం ఉంది. అందువల్ల నేను స్నానం చేసి తిరిగి వచ్చేంత వరకు దీనిని పట్టుకోగలవా?’ అభ్యర్థనగా అడిగాడు విభీషణుడు.‘విగ్రహాన్ని పట్టుకుంటాను గాని, ఒక షరతు’ అన్నాడా బాల బ్రహ్మచారి దర్పంగా విభీషణుడికేసి చూస్తూ.‘ఏమిటా షరతు’ అడిగాడు విభీషణుడు.‘నాకు బోలెడు పనులు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ సేపు ఉండలేను. నువ్వు త్వరగా స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని వచ్చేయాలి. నాకు కాలాతీతమైతే నిన్ను మూడుసార్లు పిలుస్తాను.
నేను మూడోసారి పిలిచే సరికి నువ్వు వచ్చి, విగ్రహాన్ని తీసుకోవాలి. లేకుంటే, ఇక్కడ ఆ విగ్రహాన్ని ఉంచి వెళ్లిపోతాను’ చెప్పాడు బాలబ్రహ్మచారి.‘సరే’నంటూ విభీషణుడు విగ్రహాన్ని ఆ బాలకుడికి అప్పగించి, స్నాన సంధ్యల కోసం నదికి వెళ్లాడు.విభీషణుడు నదిలోకి ఇలా దిగాడో లేదో, ‘ఇదిగో, పెద్దమనిషీ! తొందరగా వచ్చేసేయ్. నాకు సమయం మించిపోతోంది’ అంటూ కేకవేశాడు.విభీషణుడు స్నానం ముగించుకునే లోపునే రెండోసారి కేక వేశాడు.సంధ్యవార్చుకుంటూ ఉండగా, మూడోసారి కేక వేశాడు. విభీషణుడు పరుగు పరుగున వచ్చేలోగానే ఆ బాల బ్రహ్మచారి విగ్రహాన్ని నేల మీద ఉంచి, చక చకా నడుచుకుంటూ ముందుకు సాగాడు. శ్రీరంగనాథుడి విగ్రహం అక్కడే నేలలోకి పాతుకుపోయింది.విగ్రహాన్ని పైకెత్తడానికి విభీషణుడు తన బలమంతా ఉపయోగించి ప్రయత్నించాడు. అతడి ప్రయత్నం విఫలమైంది.
రాముడు ఇచ్చిన విగ్రహాన్ని లంకకు తీసుకుపోలేని తన నిస్సహాయతకు అతడికి అంతులేని ఆవేదన ముంచుకొచ్చింది. అంతలోనే విగ్రహాన్ని నిర్లక్ష్యంగా ఉంచేసి వెళ్లిపోతున్న బాలబ్రహ్మచారి మీద పట్టరాని కోపం తన్నుకొచ్చింది. అతడిని నెత్తి మీద ఒక్కటిచ్చుకుని బుద్ధి చెప్పాలనుకుని, వడి వడిగా బాల బ్రహ్మచారిని అనుసరించాడు. అది గమనించిన బాల బ్రహ్మచారి పరుగందుకున్నాడు. విభీషణుడు కూడా పరుగున వెంబడించాడు. బాల బ్రహ్మచారి రూపంలో ఉన్న వినాయకుడు సమీపంలోని పర్వత శిఖరానికి చేరుకుని, తన నిజరూపాన్ని ప్రదర్శించాడు. ‘విభీషణా! చింతించకు. విష్ణువు విగ్రహాన్ని దక్షిణంగా ఉంచే ఆచారం ఎక్కడా లేకున్నా, నీ లంకా రాజ్యానికి తన ఆశీస్సులు కురిపించేలా నేను విగ్రహాన్ని దక్షిణం వైపు ఉంచాను’ అని పలికాడు. విభీషణుడు తన ప్రాప్తమింతేననుకుని లంకకు బయలుదేరాడు.
∙సాంఖ్యాయన