తాత్త్వికత
అదొక పట్టణం. నాలుగు రోడ్ల కూడలి వద్ద బస్సు కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉన్నాడు ఒక పత్రికా విలేఖరి. ఇంతలో జోరుగా వర్షం మొదలైంది. పక్కనే చిన్న చాటు ఉంటే అక్కడ నిలబడ్డాడు.ఆగకుండా గంటసేపు వానపడటంతో వీధులన్నీ జలమయమయ్యాయి. వాన నీళ్ళు, వీధి కాలువ నీళ్ళు కలిసిపోయి దారులన్నీ నీళ్ళతో నిండిపోయాయి. దాంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి.
గంట తర్వాత, వాన నిలవడంతో నీళ్ళు మెల్లమెల్లగా వెళ్ళసాగాయి. మళ్ళీ వాహనాల రద్దీ మొదలయ్యింది. ముగ్గురు మధ్య వయస్కులు అదే దారిన చిన్నగా నడిచి వెళ్తున్నారు. ఇంతలో ఒక కాలేజీ కుర్రవాడు వేగంగా మోటార్ సైకిల్‌పై వచ్చాడు. బండి వేగానికి రోడ్డు మీద ఉన్న మురికి నీళ్ళు వారిపై పడ్డాయి. ఆ ముగ్గురిలో ఒక వ్యక్తి కాలేజీ కుర్రవాడిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. ఆ మోటార్ సైకిల్ నడిపే కుర్రవాడిని పట్టుకోవాలని బండి వెనుకే పరుగులు తీశాడు. అయితే అది వీలుకాలేదు.
రెండోవ్యక్తి ‘‘వీడు మనిషి కాదు, వరాహం. ఈ రూపంలో వాహనం మీద వచ్చి నన్ను, నా గుడ్డల్ని మురికి చేసి వెళ్ళాడు’’ అని బాధపడుతూ వెళ్ళిపోయాడు.
మిగిలిన మూడో వ్యక్తి అవేవీ పట్టించుకోలేదు. రోడ్డు పక్కనున్న కుళాయి వద్ద ఒంటికి, గుడ్డలకి అయిన మురికిని శుభ్రం చేసుకుంటూ ఉన్నాడు.
అక్కడే ఉండి అంతా చూసిన ఆ విలేఖరి గబగబా ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్ళాడు. ‘‘మీ మీద మురికి నీళ్ళు పడ్డాయి కదా, మీకు కోపం రాలేదా? ఆ కుర్రవాడిని తిట్టాలనిపించలేదా?’’ అని అడిగాడు.
అతడు నవ్వి ‘‘నాకెందుకు కోపం? నేను మరింత రోడ్డు పక్కగా నడవాల్సింది. నామీద నీళ్ళు పడేట్లు నేను నడవడం వల్ల నాకీ ఇబ్బంది వచ్చింది. నన్ను నేను నియంత్రించుకోగలను కానీ ఎదుటివారి చర్యలను ఎలా నియంత్రించగలను. ఆ కుర్రవాడిని పట్టుకుని, నిలబెట్టి కొట్టినా, ఫలితం ఉంటుందని నేను అనుకోను’’ అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఆశ్చర్యపోయాడు ఆ విలేఖరి. ‘ఒకే సమస్య. ముగ్గురూ మూడు రకాలుగా స్వీకరించారు. సమస్య ఏదైనా మనం స్వీకరించే విధానాన్ని బట్టే ఫలితం ఉంటుంది’ అని తెలుసుకున్నాడు. అప్పుడే తను ఎక్కాల్సిన బస్సు రావడంతో అందులో ఎక్కి కూర్చున్నాడు.
– ఆర్.సి.కృష్ణస్వామి రాజు


