మానవ జీవిత గమనంలో గమ్యం చేరుకునే దారిలో అవరోధాలు ఏర్పడటం సహజం. సష్టిలో ఏ ఇద్దరికీ జీవనప్రయాణం ఒకేలా సాగదు. ఏకోదరులకు కూడా ఒకేరకంగా జీవనప్రయాణం ఉండదు. భౌతిక ప్రపంచంలో కష్టాలు మనుషుల్ని బలహీన పరుస్తాయి. కానీ, ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే ప్రతి అవరోధమూ మన సహనం, విశ్వాసం, అంతర్గతశక్తిని పరీక్షించడానికి దైవం కల్పించిన గొప్ప అవకాశం.
పురాణ ఇతిహాసాలు ఈ సత్యాన్ని నిరూపించాయి. రామాయణంలో అయోధ్యకాండను పరిశీలిస్తే పట్టాభిషేకానికి సిద్ధమైన శ్రీరాముడు, కైకేయికి తండ్రి దశరథమహారాజు ఇచ్చిన వరాల కారణంగా అరణ్యానికి వెళ్లాల్సి వచ్చింది. పదునాలుగేండ్లు వనవాసం చేయాల్సి వచ్చింది. అది శ్రీరాముని జీవితంలో పెద్ద అవరోధం. కానీ స్థితప్రజ్ఞత కలిగిన రాముడు దీనినొక అవకాశంగా చేసుకున్నాడు.
ధర్మాన్ని కాపాడటం తన కర్తవ్యంగా భావించాడు. పితృవాక్య పరి΄ాలకుడిగా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అరణ్యంలోనూ రాముని జీవనం సజావుగా సాగలేదు. సీతాపహరణం తీవ్ర అవరోధంగా పరిణమించింది. అయితే ఈ అవరోధమే కోదండరామునికి కొత్త సహచరులను పరిచయం చేసింది. వానర, సుగ్రీవ, హనుమ వంటి వీరులతో మైత్రి ఏర్పరిచింది. రావణసంహారం గావించాడు. అసుర చెరనుండి అయోనిజ ని విడిపించాడు. పురుషోత్తమ రాముడయ్యాడు.
సుందరకాండను పరిశీలిస్తే సీతమ్మ జాడకై వెళ్లిన పవనసుతునికి లంకలో అవమానం ఎదురైంది. అసురులు తన తోకకు నిప్పంటించారు. ఈ అవరోధాన్ని ఆంజనేయుడు అవకాశంగా మార్చుకున్నాడు. శత్రుశక్తిని ఆయుధంగా మలిచాడు. మండుతున్న తోకతో మొత్తం లంకానగరాన్ని దహనం చేసాడు.
అటు మహాభారతంలో ద్యూతక్రీడలో కౌరవులపై ఓటమి చెందిన పాండవులు అరణ్యవాసం, ఆపై అజ్ఞాతవాసం అనుభవించాల్సి వచ్చింది. ఈ అవరోధనా కాలాన్ని, పాండవులు అవకాశంగా మరల్చుకున్నారు. వారు నేర్చుకున్న విద్యలనూ, అభ్యసించిన శాస్త్రాలనూ, ఆయుధవిద్యలో ప్రావీణ్యం సంపాదించుకునే దిశలో వినియోగించుకున్నారు. తమ వీరత్వాన్ని చాటారు.
భాగవతంలో ప్రహ్లాదుడు ఎదుర్కొన్న అవరోధం అసాధారణం. తండ్రి హిరణ్యకశిపుడే శత్రువుగా మారాడు. నిప్పులో వేయించడం, ఏనుగులతో తొక్కించడం, కొండపైనుండి తోయించడం వంటివి అవరోధాలు. కానీ ప్రహ్లాదుడు ఈ అవరోధాలన్నింటినీ తన భక్తిని మరింత దృఢం చేసుకునే అవకాశంగా మార్చుకున్నాడు. ఎన్ని కష్టాలెదురైనా అతని మనస్సు ఆ పరమాత్మ స్మరణ నుండి తొలగలేదు. అంతిమంగా ఆ పీడనమే నృసింహ అవతార రూపంలో భగవంతుని సాక్షాత్కారానికి దారితీసింది. ఇక్కడ అవరోధం ప్రహ్లాదునికి మోక్ష సాధన మార్గమైంది.
ధ్రువుడు చిన్న వయసులోనే సవతి తల్లి చేతిలో తీవ్ర అవమానాన్ని చవి చూశాడు. ఈ చేదు అనుభవం అతనికి అవరోధం. ఈ అవరోధమే అతణ్ణి మహా భక్తునిగా మార్చింది. నారద మహర్షి మార్గ దర్శకత్వంలో ధ్రువుడు కఠిన తపస్సు చేశాడు. చివరికి మహా విష్ణువు ప్రత్యక్షమై ధ్రువుని అచంచల భక్తిని సదా జ్వలించే ధ్రువ నక్షత్రంగా స్థాపించాడు. అవమానం అనే అవరోధం విశ్వనక్షత్రమనే అవకాశం గా మారింది.
పురాణాలన్నీ బోధించేది ఒక్కటే. జీవితంలో ఎదురయ్యే ప్రతీ అవరోధమూ మన ఆత్మశక్తిని, భగవంతునిపై విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి దొరికిన అవకాశం. కష్టాలు, సవాళ్లు అనేవి మనల్ని దిగజార్చడానికి కాక మన అంతరంగం లో నిగూఢమై ఉన్న దైవత్వాన్ని వెలికితీయడానికి, మనల్ని ఉన్నత ఆధ్యాత్మికస్థితికి చేర్చడానికి తోడ్పడతాయి.
కాబట్టి అవరోధాలను చూసి భయపడకుండా దానిని ఒక ఆశీర్వాదంగా భావించి ధైర్యంతో, విశ్వాసంతో ముందడుగు వేయడమే నిజమైన ఆధ్యాత్మిక మార్గం. ఆధ్యాత్మిక వికాసం ఉన్నచోట ఆటంకం కూడా అవకాశంగా కొత్తరూపు ఏర్పడుతుంది. అదే విజయానికి పునాది అవుతుంది.ఓటమి విజయానికి గెలుపు అనుకుంటే అవరోధమేమే అవకాశానికి తలుపు అవుతుంది.ఆధ్యాత్మిక సాధనతోనే ఇది సాధ్యమవుతుంది.
– కె.వి.లక్ష్మణరావు
(చదవండి: చంద్రుడు ప్రతిష్టించిన సోమేశ్వరులు..! ఎనిమిది దిక్కులలో కొలువై.)


