చంద్రుడు ప్రతిష్టించిన సోమేశ్వరులు.. | Karthika Masam: Significance of Draksharamam and Ashta Someshwara Temples | Sakshi
Sakshi News home page

చంద్రుడు ప్రతిష్టించిన సోమేశ్వరులు..! ఎనిమిది దిక్కులలో కొలువై..

Oct 27 2025 2:16 PM | Updated on Oct 27 2025 3:47 PM

Karthikamasam: Ashta Someshwara temples in Andhra Pradesh

కార్తిక మాసం ఈశ్వరునికి ఎంతో ప్రీతి పాత్రమైనది. భక్తిశ్రద్ధలతో కొలిస్తే ఈశ్వరానుగ్రహం తప్పక దొరుకుతుందని పండితుల ఉవాచ. ఈశ్వరానుగ్రహం పొందేందుకు నలుదిక్కులా అష్టసోమేశ్వరాలయాల్లో ఆ స్వామి కొలువుదీరిన అరుదైన ఆలయాలున్నాయి. దేవతలతో ప్రతిష్టించినట్టు విశేష ప్రాచుర్యం పొందిన ఆ ఆలయాల్లో ఈశ్వరుడు కొలువయ్యాడు. అష్టసోమేశ్వరాలయాలను దర్శించుకుంటే భగవత్‌ సంకల్పం నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు. కార్తిక మాసంలో అష్ట సోమేశ్వరాలయ దర్శనానికి ఎంతో ప్రాముఖ్యముంది. 

రామచంద్రపురం, మండపేట పరిసర ప్రాంతాల్లోని అష్ట సోమేశ్వరాలయాలకు ప్రత్యేకత ఉంది. ద్రాక్షారామలోని మాణిక్యాంబ సమేత భీమేశ్వరాలయం దక్షిణ కాశీగా విరాజిల్లుతోంది. సూర్యునితో స్వయం ప్రతిష్ఠగా ప్రసిద్ధికెక్కిన ద్రాక్షారామ భీమేశ్వరుడు అష్ట సోమేశ్వరాలయాల నడుమ కొలువుదీరి పూజలందుకుంటున్నారు. అనుకోని అవాంతరం కారణంగా కాలహరణమై ముహూర్త సమయం మించిపోతుండడంతో భీమేశ్వరుడు స్వయంభు లింగంగా ద్రాక్షారామలో అవతరించారు. 

భీమలింగాన్ని సూర్యభగవానుడు ప్రతిష్టించి భీమేశ్వరునికి ప్రథమార్చన చేసినట్టు పురాణ ప్రతీతి. ఇంద్రాది దేవతలు పూజించగా, సప్త గోదావరి పవిత్ర జలాలతో స్వామివారిని సప్త రుషులు అభిషేకించారు. సూర్య ప్రతిష్ఠత తాపాన్ని, ఉగ్రతను నియంత్రించేందుకు ఆగమ సంప్రదాయం ప్రకారం నలు దిక్కులే కాకుండా, విదిక్కుల్లోనూ సోమేశ్వరాలయాలు వెలిశాయి. చంద్రునితో స్వయం ప్రతిష్టితాలుగా ద్రాక్షారామ భీమేశ్వరాలయం అష్ట దిక్కుల్లోనూ సోమేశ్వరాలయాలు ప్రతిష్ఠించబడినట్టు పురాణగాథలు చెబుతున్నాయి. ద్రాక్షారామ భీమేశ్వరునికి ఒక్కొక్క యోజన దూరంలో అష్టసోమేశ్వరాలయాలు నెలకొని ఉండటం విశేషం. 

కార్తిక మాసంలో ద్రాక్షారామ భీమేశ్వరుని దర్శనంతో పాటు, అష్ట సోమేశ్వరాలయాల్లోని సోమేశ్వరులను దర్శించుకోవడాన్ని భక్తులు పవిత్రంగా భావిస్తారు. సూర్య ప్రతిష్ఠ గావించిన భీమేశ్వరుని దర్శనం అనంతరం.. చంద్ర ప్రతిష్ఠితాలుగా పేరొందిన అష్ట సోమేశ్వరాలయాల్లోని స్వామివారి దర్శనంతో భక్తులకు సకల పాప పరిహారంతో పాటు, ఎంతో పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం.

తూర్పున కోలంక 
ద్రాక్షారామ భీమేశ్వరాలయానికి తూర్పున కాజులూరు మండలం కోలంక గ్రామంలో పార్వతీ సమేత ఉమా సోమేశ్వరస్వామివారు నెలకొని ఉన్నారు. కార్తిక మాసంలో ఈ స్వామిని దర్శించుకుని పూజలు చేస్తే కోర్కెలు తీరుతాయని ప్రసిద్ధి. కోలంకకు చేరుకోవాలంటే ద్రాక్షారామ నుంచి యానాం వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కాలి. ఆటో సదుపాయమూ ఉంది. 

పడమర వెంటూరు 
ద్రాక్షారామకు పడమర దిక్కులో రాయవరం మండలం వెంటూరులో పార్వతీ సమేత ఉమాసోమేశ్వరస్వామి పూజలందుకుంటున్నారు. వెంటూరు చేరుకోవాలంటే రామచంద్రపురం–వాకతిప్ప ఆర్టీసీ బస్సులో వెళ్లవచ్చు. రామచంద్రపురం నుంచి నేరుగా ఆటోల సౌకర్యం ఉంది.

దక్షిణాన కోటిపల్లి 
అష్ట సోమేశ్వరాలయాల్లో గౌతమీ నదీ తీరాన కె.గంగవరం మండలం కోటిపల్లి శ్రీఛాయా సోమేశ్వరాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. చంద్రుడు స్వయం ప్రతిష్ఠగా వెలసిన సోమే శ్వరుడిని పవిత్ర గోదావరి పుణ్య స్నానమాచరించి దర్శించుకుంటే పాప పరిహారం లభిస్తుందని భక్తుల నమ్మకం. ద్రాక్షారామ నుంచి నేరుగా ఆర్టీసీ బస్సు సౌకర్యముంది.

ఈశాన్యంలో పెనుమళ్ల 
ద్రాక్షారామకు ఈశాన్యంలోని కాజులూరు మండలం పెనుమళ్ల గ్రామంలో పార్వతీ సమేత సోమేశ్వరస్వామి కొలువయ్యారు. కార్తిక మాసంలో స్వామివారి ఆలయం వద్ద భక్తులు దర్శనం చేసుకుని తరిస్తుంటారు. ద్రాక్షారామతో పాటు, గొల్లపాలెం నుంచి ఆటోల్లో పెనుమళ్ల చేరుకోవచ్చు.

ఉత్తరాన వెల్ల 
ద్రాక్షారామ భీమేశ్వరస్వామి వారికి ఉత్తరాన రామచంద్రపురం మండలంలోని వెల్లలో బాలాత్రిపుర సుందరీ సమేత సోమేశ్వరస్వామి ఆలయం భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారం. రామచంద్రపురం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని వెల్ల చేరుకోవడానికి ఆటో సదుపాయం ఉంది.  

నైరుతిన కోరుమిల్లి 
ద్రాక్షారామకు నైరుతిలో కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లిలో కొలువైన రాజరాజేశ్వరి సమేత సోమేశ్వరాలయం అష్ట సోమేశ్వరాలయాల్లో ఒకటి. ద్రాక్షారామ, రామచంద్రపురం, మండపేట నుంచి నేరుగా ఆర్టీసీ బస్సులతో పాటు, ఆటోల సదుపాయముంది. 
 

వాయవ్యం సోమేశ్వరంలో.. 
ద్రాక్షారామ ఆలయానికి వాయవ్యంలో రాయవరం మండలం సోమేశ్వరంలోని బాలాత్రిపుర సుందరీ సమేత సోమేశ్వరస్వామి ఆలయం అష్ట సోమేశ్వరాలయా ల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. రామచంద్రపురం నుంచి ఆర్టీసీ బస్సులో మాచవరంలో దిగి, సోమేశ్వరం చేరుకోవాలి. ఆటో సదుపాయమూ ఉంది.  
 

ఆగ్నేయం దంగేరు 
ద్రాక్షారామకు ఆగ్నేయంగా కె.గంగవరం మండలం దంగేరులో కొలువైన ఉమాసోమేశ్వరాలయం అతి ప్రాచీన ఆలయంగా ప్రసిద్ధి. కార్తిక మాసంలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటే ఎంతో మేలని చెబుతుంటారు. ద్రాక్షారామ–మసకపల్లి ఆర్టీసీ బస్సుతో పాటు, ఆటోల సౌకర్యం ఉంది.

(చదవండి: సకలైశ్వర్య ప్రదం శ్రీముఖలింగ లింగేశ్వర దర్శనం)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement