breaking news
someshwara temple
-
మసి పొరలుతొలగిస్తే.. మరపురాని చిత్రాలు
ఇది వందల ఏళ్ల క్రితం దేవాలయం పైకప్పు మీద చిత్రించిన పురాణగాథను ప్రతిబింబించే ఓ వర్ణచిత్రం. కానీ, సమీపంలో భారీ దీపాలు, కాగడాలు వెలిగిస్తుండటంతో వాటిమీద మసి పొరలు కమ్మి అద్భుత, అపురూప చిత్రాలు కనుమరుగయ్యాయి. తాజాగా ఆలయంలో అభివృద్ధి పనుల్లో భాగంగా పైకప్పు మసి పొరలు తొలగించటంతో అవి వెలుగుచూశాయి. కెమికల్ ట్రీట్మెంట్ చేయిస్తే అవి స్పష్టంగా కనిపించనున్నాయి. ఇది కొలనుపాక సోమేశ్వరాలయంలో చోటుచేసుకున్న ఘటన. –సాక్షి, హైదరాబాద్రాష్ట్రంలో కాకతీయులు, వారికి పూర్వం నిర్మించిన ఎన్నో దేవాలయాలున్నాయి. వాటిల్లో కూడా ఇలాంటి అద్భుత వర్ణచిత్రాలుంటాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. కొన్నేళ్ల క్రితం సూర్యాపేట జిల్లా పిల్లలమర్రిలోని కాకతీయ త్రికూటాలయంలో శైవ, వైష్ణవ పురాణ గాథల్లోని చిత్రాలు ఇలాగే అనూహ్యంగా వెలుగుచూశాయి. అంతరించిన ఈ ఆలయ చిత్రకళా వైభవాన్ని మళ్లీ ప్రజల ముందుంచాలంటే దేవాలయాల్లో వాటిని గుర్తించాల్సి ఉంది. పిల్లలమర్రి దేవాలయంలో కెమికల్ ట్రీట్మెంట్తో వాటిని కాపాడిన రాష్ట్ర వారసత్వ శాఖ సిద్ధంగా ఉన్నా, అందుకు కావాల్సిన నిధులను ప్రభుత్వం కేటాయించడం లేదు. ఏంటీ చిత్రాలు... : అంతగా అక్షరాస్యత లేని కాలంలో పురాణ గాథలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఆలయాల్లో ఇలా చిత్రాలు గీసి చూపటం కూడా ఓ పద్ధతి. పురాతన దేవాలయాలు కేవలం శిల్పకళా నిలయాలు మాత్రమే కాదు, అవి అద్భుత చిత్రకళా వేదికలు కూడా. నాటి రాజులు, శిల్పులు దేవాలయాల పైకప్పులను, రాతి దూలాలను కాన్వాసుగా మార్చేశారు. వాటిపై పురాణగాథలను, రాచరిక వైభవాలను రంగురంగుల చిత్రాలుగా ప్రాణప్రతిష్ట చేశారు. ఈ చిత్రకళా సంప్రదాయం శాతవాహనుల కాలంలోనే మొదలైంది. కాకతీయుల కాలంలో మరింతగా విస్తరించి, విజయనగర సామ్రాజ్య కాలంలో అద్భుతంగా వరి్ధల్లింది. అనంతపురం జిల్లాలోని లేపాక్షి వీరభద్రస్వామి ఆలయం ఇందుకు సజీవ సాక్ష్యం. ఇక్కడి పైకప్పులపై గీసిన చిత్రాలు ఆసియాలోనే అతిపెద్ద గోడచిత్రాలుగా అంతర్జాతీయ గుర్తింపు పొందాయి. ఈ చిత్రాలు వందల ఏళ్లపాటు మనగలిగేలా నాటి చిత్రకారులు పూర్తిగా సహజసిద్ధ రంగులను మాత్రమే వాడేవారు. చిత్రించేచోట ముందుగా సున్నం, జనపనార, బెల్లం నీరు, కరక్కాయల మిశ్రమం పూసేవారు. ఆ పూత తడిగా ఉన్నప్పుడే రంగులు వేసేవారు. దీనివల్ల రంగు రాతి పొరల్లోకి ఇంకిపోయి శతాబ్దాలైనా చెరిగిపోకుండా ఉంటుంది. ఆసక్తి చూపని సర్కారుఇక మరమ్మతులు, ఆధునీకరణ పేరుతో పురాతన దేవాలయాల గోడలు, పైకప్పులపై సున్నపు పూతలతో చాలా దేవాలయాల్లోని చిత్రాలు కనిపించకుండాపోయాయి. ప్రస్తుతం అత్యాధునిక కెమికల్ వాషింగ్ పద్ధతుల ద్వారా కొన్ని ఆలయాల్లో పైకప్పులపై దశాబ్దాలుగా ఉన్న సున్నపు పొరలను జాగ్రత్తగా తొలగిస్తూ, లోపల దాగున్న అసలైన పురాతన చిత్రాలను వెలుగులోకి తెచ్చే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. కానీ, ప్రభుత్వం ఆ దిశగా ఆసక్తి చూపకపోవటంతో తెలంగాణలో ఆ ప్రక్రియ జరగటం లేదు. వర్ణచిత్రాలున్నాయి...ఇప్పటికీ చాలా దేవాలయాల్లో అతి పురాతన వర్ణచిత్రాలున్నాయని తాజాగా కొలనుపాక దేవాలయం చాటిచెప్తోంది. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా మసి పొరలు తొలగించగా అస్పష్టంగా చిత్రాలు కనిపించాయి. వీటిని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు సిరిపురం నరేందర్ తొలుత గుర్తించగా, తాజాగా ఆ బృంద సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, ముల్లక్కల రవికుమార్, కుండె గణేశ్, మేఘరాజు ఈ చిత్రాలను పరిశీలించి విశ్లేషించారు. పురాణగాథ చిత్రాల్లో విశ్వబ్రహ్మను, ‘శరభ’, సంగరోలు’లాంటి తెలుగు లిపి పదాలు కనిపించాయని వారు చెప్పారు. ఇవి కాకతీయ కాలం తదనంతర చిత్రాలై ఉండొచ్చన్నారు. -
చంద్రుడు ప్రతిష్టించిన సోమేశ్వరులు..
కార్తిక మాసం ఈశ్వరునికి ఎంతో ప్రీతి పాత్రమైనది. భక్తిశ్రద్ధలతో కొలిస్తే ఈశ్వరానుగ్రహం తప్పక దొరుకుతుందని పండితుల ఉవాచ. ఈశ్వరానుగ్రహం పొందేందుకు నలుదిక్కులా అష్టసోమేశ్వరాలయాల్లో ఆ స్వామి కొలువుదీరిన అరుదైన ఆలయాలున్నాయి. దేవతలతో ప్రతిష్టించినట్టు విశేష ప్రాచుర్యం పొందిన ఆ ఆలయాల్లో ఈశ్వరుడు కొలువయ్యాడు. అష్టసోమేశ్వరాలయాలను దర్శించుకుంటే భగవత్ సంకల్పం నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు. కార్తిక మాసంలో అష్ట సోమేశ్వరాలయ దర్శనానికి ఎంతో ప్రాముఖ్యముంది. రామచంద్రపురం, మండపేట పరిసర ప్రాంతాల్లోని అష్ట సోమేశ్వరాలయాలకు ప్రత్యేకత ఉంది. ద్రాక్షారామలోని మాణిక్యాంబ సమేత భీమేశ్వరాలయం దక్షిణ కాశీగా విరాజిల్లుతోంది. సూర్యునితో స్వయం ప్రతిష్ఠగా ప్రసిద్ధికెక్కిన ద్రాక్షారామ భీమేశ్వరుడు అష్ట సోమేశ్వరాలయాల నడుమ కొలువుదీరి పూజలందుకుంటున్నారు. అనుకోని అవాంతరం కారణంగా కాలహరణమై ముహూర్త సమయం మించిపోతుండడంతో భీమేశ్వరుడు స్వయంభు లింగంగా ద్రాక్షారామలో అవతరించారు. భీమలింగాన్ని సూర్యభగవానుడు ప్రతిష్టించి భీమేశ్వరునికి ప్రథమార్చన చేసినట్టు పురాణ ప్రతీతి. ఇంద్రాది దేవతలు పూజించగా, సప్త గోదావరి పవిత్ర జలాలతో స్వామివారిని సప్త రుషులు అభిషేకించారు. సూర్య ప్రతిష్ఠత తాపాన్ని, ఉగ్రతను నియంత్రించేందుకు ఆగమ సంప్రదాయం ప్రకారం నలు దిక్కులే కాకుండా, విదిక్కుల్లోనూ సోమేశ్వరాలయాలు వెలిశాయి. చంద్రునితో స్వయం ప్రతిష్టితాలుగా ద్రాక్షారామ భీమేశ్వరాలయం అష్ట దిక్కుల్లోనూ సోమేశ్వరాలయాలు ప్రతిష్ఠించబడినట్టు పురాణగాథలు చెబుతున్నాయి. ద్రాక్షారామ భీమేశ్వరునికి ఒక్కొక్క యోజన దూరంలో అష్టసోమేశ్వరాలయాలు నెలకొని ఉండటం విశేషం. కార్తిక మాసంలో ద్రాక్షారామ భీమేశ్వరుని దర్శనంతో పాటు, అష్ట సోమేశ్వరాలయాల్లోని సోమేశ్వరులను దర్శించుకోవడాన్ని భక్తులు పవిత్రంగా భావిస్తారు. సూర్య ప్రతిష్ఠ గావించిన భీమేశ్వరుని దర్శనం అనంతరం.. చంద్ర ప్రతిష్ఠితాలుగా పేరొందిన అష్ట సోమేశ్వరాలయాల్లోని స్వామివారి దర్శనంతో భక్తులకు సకల పాప పరిహారంతో పాటు, ఎంతో పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం.తూర్పున కోలంక ద్రాక్షారామ భీమేశ్వరాలయానికి తూర్పున కాజులూరు మండలం కోలంక గ్రామంలో పార్వతీ సమేత ఉమా సోమేశ్వరస్వామివారు నెలకొని ఉన్నారు. కార్తిక మాసంలో ఈ స్వామిని దర్శించుకుని పూజలు చేస్తే కోర్కెలు తీరుతాయని ప్రసిద్ధి. కోలంకకు చేరుకోవాలంటే ద్రాక్షారామ నుంచి యానాం వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కాలి. ఆటో సదుపాయమూ ఉంది. పడమర వెంటూరు ద్రాక్షారామకు పడమర దిక్కులో రాయవరం మండలం వెంటూరులో పార్వతీ సమేత ఉమాసోమేశ్వరస్వామి పూజలందుకుంటున్నారు. వెంటూరు చేరుకోవాలంటే రామచంద్రపురం–వాకతిప్ప ఆర్టీసీ బస్సులో వెళ్లవచ్చు. రామచంద్రపురం నుంచి నేరుగా ఆటోల సౌకర్యం ఉంది.దక్షిణాన కోటిపల్లి అష్ట సోమేశ్వరాలయాల్లో గౌతమీ నదీ తీరాన కె.గంగవరం మండలం కోటిపల్లి శ్రీఛాయా సోమేశ్వరాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. చంద్రుడు స్వయం ప్రతిష్ఠగా వెలసిన సోమే శ్వరుడిని పవిత్ర గోదావరి పుణ్య స్నానమాచరించి దర్శించుకుంటే పాప పరిహారం లభిస్తుందని భక్తుల నమ్మకం. ద్రాక్షారామ నుంచి నేరుగా ఆర్టీసీ బస్సు సౌకర్యముంది.ఈశాన్యంలో పెనుమళ్ల ద్రాక్షారామకు ఈశాన్యంలోని కాజులూరు మండలం పెనుమళ్ల గ్రామంలో పార్వతీ సమేత సోమేశ్వరస్వామి కొలువయ్యారు. కార్తిక మాసంలో స్వామివారి ఆలయం వద్ద భక్తులు దర్శనం చేసుకుని తరిస్తుంటారు. ద్రాక్షారామతో పాటు, గొల్లపాలెం నుంచి ఆటోల్లో పెనుమళ్ల చేరుకోవచ్చు.ఉత్తరాన వెల్ల ద్రాక్షారామ భీమేశ్వరస్వామి వారికి ఉత్తరాన రామచంద్రపురం మండలంలోని వెల్లలో బాలాత్రిపుర సుందరీ సమేత సోమేశ్వరస్వామి ఆలయం భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారం. రామచంద్రపురం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని వెల్ల చేరుకోవడానికి ఆటో సదుపాయం ఉంది. నైరుతిన కోరుమిల్లి ద్రాక్షారామకు నైరుతిలో కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లిలో కొలువైన రాజరాజేశ్వరి సమేత సోమేశ్వరాలయం అష్ట సోమేశ్వరాలయాల్లో ఒకటి. ద్రాక్షారామ, రామచంద్రపురం, మండపేట నుంచి నేరుగా ఆర్టీసీ బస్సులతో పాటు, ఆటోల సదుపాయముంది. వాయవ్యం సోమేశ్వరంలో.. ద్రాక్షారామ ఆలయానికి వాయవ్యంలో రాయవరం మండలం సోమేశ్వరంలోని బాలాత్రిపుర సుందరీ సమేత సోమేశ్వరస్వామి ఆలయం అష్ట సోమేశ్వరాలయా ల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. రామచంద్రపురం నుంచి ఆర్టీసీ బస్సులో మాచవరంలో దిగి, సోమేశ్వరం చేరుకోవాలి. ఆటో సదుపాయమూ ఉంది. ఆగ్నేయం దంగేరు ద్రాక్షారామకు ఆగ్నేయంగా కె.గంగవరం మండలం దంగేరులో కొలువైన ఉమాసోమేశ్వరాలయం అతి ప్రాచీన ఆలయంగా ప్రసిద్ధి. కార్తిక మాసంలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటే ఎంతో మేలని చెబుతుంటారు. ద్రాక్షారామ–మసకపల్లి ఆర్టీసీ బస్సుతో పాటు, ఆటోల సౌకర్యం ఉంది.(చదవండి: సకలైశ్వర్య ప్రదం శ్రీముఖలింగ లింగేశ్వర దర్శనం) -
బోనమెత్తిన ఎమ్మెల్యే
సాక్షి, చిన్నశంకరంపేట(మెదక్): చిన్నశంకరంపేటలో కొలువైన శ్రీ సోమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి బోనమెత్తారు. బుధవారం రాత్రి శ్రీసోమేశ్వర స్వామికి పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన బోనాన్ని ఎత్తుకుని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారి సమర్పించారు. -
సోమేశ్వరుడి కోవెలలో దశాబ్ది ఉత్సవాలు
బెల్లంపల్లిరూరల్ : భక్తుల కొంగు బంగారంగా నిలుస్తున్న మండలంలోని చంద్రవెల్లి సోమేశ్వరుడి ఆలయం దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమైంది. 200 ఏళ్ల విశిష్ట చరిత్ర ఉన్న ఈ ఆలయం పునఃనిర్మాణం పూర్తి చేసుకున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుంది. ఎంతో ప్రాధాన్యత, ఘనమైన చరిత్ర గల శ్రీ అన్నపూర్ణ సహిత సోమేశ్వరాలయంపై ప్రత్యేక కథనం.. రెండు వందల ఏళ్ల కిందట పెద్దపల్లి జిల్లాకు చెందిన కొమ్మెర వంశస్థులు బతుకు దెరువు వెతుక్కుంటూ వలస బాట పట్టారు. మహారాష్ట్రలోని నాగ్పూర్ సంస్థానాధీశుని వద్దకు వెళ్లి చదువులో నిష్ణాతులైన కొమ్మెర వంశీయులు తమ ప్రతిభను ప్రదర్శించగా, సంస్థానాధీశుడు మెచ్చుకుని తమ ఆధీనంలో ఉన్న చంద్రవెల్లి గ్రామాన్ని అగ్రహారముగా రాసి ఇచ్చాడు. ఈ నేపథ్యంలో గ్రామానికి కొమ్మెర వంశస్థులు వచ్చి స్థిరపడినట్లు ప్రతీతి. మహా శివభక్తులైన ఆ వంశీయులు నిరంతర లింగారాధన, శైవ నామస్మరణతో పూజలు చేసి ఆరాధించారు. అనంతరం గ్రామంలో ఆలయాన్ని నిర్మించడానికి సంకల్పించారు. గ్రామస్తుల సహకారంతో, మట్టి ఇటుకలు, పెంకులతో ఓ చిన్న గుడిని నిర్మించి పూజలుగా వించారు. ఉత్సవ విగ్రహాల కోసం మధ్యప్రదేశ్లోని జబల్పూర్ నుంచి శివ పంచాయతనము, విఘ్నేశ్వరుడు, శివుడు, ఆంజనేయుడు, నాగేం ద్రుడు, నందీశ్వరుడు, దత్తాత్రేయుడి విగ్రహాలు తెచ్చి ప్రతిష్ఠించారు. ఆనాటి నుంచి ఈ దేవాలయం శ్రీ అన్నపూర్ణ సహిత సోమేశ్వర ఆలయంగా ప్రఖ్యాతిగాంచింది. పునఃనిర్మాణం.. వందల ఏళ్ల క్రితం నిర్మించిన దేవాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో 1987లో దేవాలయ కమిటీ, భక్తులు ఏకతాటిపైకి వచ్చి పునఃనిర్మాణానికి పూనుకున్నారు. 2008 ఫిబ్రవరి 11 వసంత పంచమి నాడు వేద మంత్రోచ్ఛరణాల మధ్య కొత్తగా నిర్మించిన ఆలయాన్ని పునః ప్రారంభించారు. ఈనెల 22న వసంత పంచమి పురస్కరించుని ఆలయ దశమ వార్షికోత్సవాన్ని వైభవంగా జరపడానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. కరువు ఎరుగని గ్రామం.. గ్రామంలో వెలిసిన సోమేశ్వరుడు ఎంతో మహిమ గల దేవుడిగా భక్తుల విశ్వాసం. గ్రామం ఏర్పడిన నుంచి ఇప్పటివరకు ఎన్నడూ కరువు, కాటకాలు సంభవించలేదు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పటికీ గర్భగుడిలో శివలింగం మునిగేలా గ్రామస్తులు జలాభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో సోమేశ్వరుడు కరుణించి పుష్కలంగా వర్షాలు కురిపిస్తుంటాడని గ్రామస్తులు చెబుతున్నారు. 200 ఏళ్ల నుంచి పంటలు సంవృద్ధిగా పండి కరువుకు ఆస్కారం లేకుండా సోమేశ్వరుడు కాపాడుతున్నాడని విశ్వసిస్తారు. ప్రత్యేక పూజలు.. సోమేశ్వర దేవాలయంలో ప్రతి యేటా ప్రత్యేక పూజలు జరుగుతాయి. తొలి ఏకాదశి, శ్రావణ, కార్తీక మాసాల్లో ఈ ఆలయంలో మహన్యాస, రుద్రాభిషే కం, బిల్వార్చన నిర్వహిస్తారు. వినాయక చవితి, దుర్గాదేవి వేడుకలను, గోపూజ, గ్రామ సంకీర్తన, సామూహిక సత్యనారా యణ వత్రాలు, సహఫంక్తి భోజనాలు కులమతాలకతీతంగా సామూహికంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. -
సోమేశ్వర ఆలయంలో బ్రిటన్ ప్రధాని
బెంగళూరు : బ్రిటన్ ప్రధానమంత్రి థెరిస్సా మే మంగళవారం బెంగళూరులో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆమె భారతీయ సంప్రదాయబద్ధంగా చీరను ధరించిన లసూరు సోమేశ్వరాలయాన్ని సందర్శించిన, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం థెరిస్సా మే బెంగళూరులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. యలహంక సమీపంలోని స్టోనహళ్లి ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన థెరిస్సా మే స్కూల్ విద్యార్థులతో సరదాగా గడిపారు, భారత్, బ్రిటన్ జెండాలు ఎగరవేస్తూ... విద్యార్థులుతో కలిసి కేరింతలు కొట్టారు. అలాగే కర్నాటక సీఎం సిద్దరామయ్యతో థెరిస్సా మే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. -
సోమేశ్వరుని సన్నిధిలో ‘పూరీ’ కుటుంబం
భీమవరం అర్బన్: కార్తీక మాసం సందర్భంగా సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ సతీమణి లావణ్య, కుమారుడు ఆకాష్, కుమార్తె పవిత్ర మంగళవారం భీమవరం గునుపూడిలోని పంచారామక్షేత్రామైన సోమేశ్వరాలయాన్ని సందర్శించారు. సోమేశ్వరుడ్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకుల నుంచి వేద ఆశీర్వచనాలు పొందారు. అనంతరం లావణ్య విలేకరులతో మాట్లాడుతూ పంచారామాల దర్శనంలో భాగంగా ఇక్కడకు వచ్చామని చెప్పారు. సోమేశ్వరుడ్ని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. బాలనటుడు ఆకాష్ మాట్లాడుతూ తనకు నటనంటే ఎంతో ఇష్టమని, ఇప్పటివరకు ఏడు సినిమాల్లో నటించానని చెప్పాడు. ముందుగా వీరు పాలకొల్లులోని క్షీరారామలింగేశ్వరుడ్ని దర్శించారు.


