ఆధ్యాత్మికం
మానవజన్మ అనేక జన్మల కర్మఫల సంపద. ప్రతి జీవి తన కర్మానుసారమే ఈలోకంలో జన్మిస్తుంది. ఎదుగుతుంది. అనుభవిస్తుంది. మన కర్మల ప్రకారమే మన స్థితి, మన గతి నిర్ణయించబడతాయి. కర్మఫలానికి, ఆత్మకు అవినాభావ సంబంధం ఉంది. మనం చేసే ప్రతి ఆలోచన, మాట, చర్య విశ్వంలో ఒక ప్రకంపన సృష్టిస్తుంది. ఆ ప్రకంపన తిరిగి మనకే వస్తుంది. ఇది కర్మసూత్రం గాఢమైన సత్యం. కర్మానికి మూడు స్థితులు ఉంటాయి.
అనేక జన్మలలో మనం చేసిన మొత్తం కర్మల నిల్వ సంచితకర్మ. ఈ జన్మలో ఫలించబోయే కర్మభాగం ప్రారబ్ధకర్మ. ప్రస్తుతం మనం చేస్తున్న కర్మలు, భవిష్యత్తులో ఫలితాలుగా వచ్చేవి ఆగామికర్మ. ఈ మూడు కలయికలతో మన జీవితం నడుస్తుంది. మనకు ఎదురయ్యే సుఖం, దుఃఖం, విజయాలు, అపజయాలు ఇవన్నీ ఈ కర్మఫలాల ప్రతిఫలాలు. గతంలో చేసిన కర్మ ఈ రోజున ఫలిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి.
మహాభారతంలో ధృతరాష్ట్రుడు సత్పురుషుల సలహాలు ఉన్నా అంధత్వం వదలలేకపోయాడు. ఆ దృష్టిహీనత కేవలం భౌతికం కాదు మానసికం. గత జన్మ కర్మఫలమే అతడిని అహంకారంలోకి నెట్టింది. చివరకు తన వంశ నాశనం చూసి అనుభవించాడు. ఇదే కర్మఫలానికి దృఢమైన ఉదాహరణ. కర్మను ఎవరూ తప్పించుకోలేరు. కానీ, దాన్ని ఆత్మజ్ఞానం, సహనం, భక్తి ద్వారా అధిగమించవచ్చు. శ్రీ కృష్ణుడు గీతలో ‘నీకు కర్మ చేయడానికి మాత్రమే అధికారముంది.
ఫలితాన్ని నియంత్రించే శక్తి నీచేతిలో ఉండదు. కాబట్టి కర్మను నిష్కామ భావంతో చెయ్యాలి.’ అని చెప్పాడు. అదే నిష్కామ కర్మ. రామాయణంలో శ్రీరాముడు అనేక క్లేశాలను ఎదుర్కొన్నాడు. కానీ, ఎప్పుడూ ధర్మమార్గాన్ని వదలలేదు. ఆయన తన కర్మను కర్తవ్యభావంతో ఆచరించాడు. ధర్మానికి కట్టుబడి ఉండటంవల్లె చివరకు విజయాన్ని పొందాడు.
కష్టాలు మన శత్రువులు కాదు. అవి మన ఆత్మను పరీక్షించే ఉపాధ్యాయులు. మనిషి ఎదుర్కొనే ప్రతి దుఃఖం శిక్ష కాదు. అది శిక్షణ. కర్మఫలం మన ఆత్మను మలచే సాధనం. అగ్నిజ్వాలల్లో పసిడి కరిగి మెరుస్తున్నట్లుగా, కష్టాల్లో ఆత్మ పవిత్రమవుతుంది. కర్మఫలం నుండి విముక్తి పొందాలంటే మనఃసాక్షిగా జీవించాలి. మనం కర్తలమని అనుకునే అహంకారాన్ని వదిలి ‘నేను కేవలం సాధనం మాత్రమే’ అనే భావంతో ఉండాలి. శ్రీ కృష్ణుడు అర్జునుడికి చెప్పిన సమతాభావన అంటే సుఖదుఃఖాలను సమంగా స్వీకరించడం. ఆ స్థితిలో చేసిన కర్మ మనను బంధించదు.
బలిచక్రవర్తి తన సంపదను, అధికారాన్ని విష్ణువుకు సమర్పించి కర్మబంధాలనుంచి విముక్తి పొందాడు. హరిశ్చంద్రుడు సత్యంకోసం సర్వం త్యజించి ఆత్మశుద్ధిని పొందాడు. పాండవులు కష్టాలను భరించి, ధర్మాన్ని విడువకపోవడంతో, సహనమే వారి విజయానికి మూలం అయ్యింది. మన జీవితంలో జరిగే ప్రతీ సంఘటన వెనుక ఒక కారణం ఉంటుంది. అదే మన కర్మ. మనం ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడే దాన్ని భయంగా కాదు, అవకాశంగా చూస్తాం. కర్మను ధర్మంతో చెయ్యాలి. ఫలితాన్ని సమంగా స్వీకరించాలి. కర్మఫలం మనల్ని పరీక్షిస్తుంది. ఆధ్యాత్మికతే దానికి సమాధానం చెబుతుంది.
కర్మఫలం భయంకరమైనదే కావొచ్చు. కానీ, భక్తి, భగవన్నామస్మరణ కర్మ బంధాలను కూడా తెంచి విముక్తి కలిగిస్తుందనడానికి భాగవత పురాణంలో కనిపించే అజామిళుడి కథే ఉదాహరణ.
– విరించి


