కొంత మందికి ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. వేలు.. లక్షల కోట్లు పోగేసి అపర కుబేరులుగా ఎదిగిపోతుంటారు. కానీ సంపాదించింది కాస్త వదులుకోవాలంటే మాత్రం అస్సలు వదులుకోలేరు. సంపదను కాపాడుకోవడం కోసం దేశాలు సైతం మారుస్తూ ఉంటారు.
ప్రపంచవ్యాప్తంగా ధనికుల ఆస్తులు పెరుగుతూనే ఉండటం, భారీ ఆర్థిక అసమానత పెరుగుతున్న నేపథ్యంలో పలు దేశాలు "వెల్త్ ట్యాక్స్" లేదా "నెట్‌వర్త్ ట్యాక్స్" విధించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఒక వ్యక్తి వద్ద ఉన్న సంపదపై (ఆస్తి, షేర్లు, డిపాజిట్లు, ఖరీదైన ఆభరణాలు మొదలైనవి) నేరుగా పన్ను విధించే ఈ విధానం కొన్ని దేశాల్లో ఇంకా అమల్లో ఉండగా, మరికొన్ని దేశాలు దానిని రద్దు చేశాయి.
ఏమిటీ వెల్త్ ట్యాక్స్?
కొందరి వద్ద సంపద భారీగా పెరిగిపోయి తీవ్ర ఆర్థిక అసమానతలు తలెత్తినప్పుడు ఆ అంతరాన్ని తగ్గించడానికి, పేదల సంక్షేమాన్ని పెంచడానికి అత్యంత ధనికుల సంపదపై విధించేదే వెల్త్ ట్యాక్స్ లేదా నెట్‌వర్త్ ట్యాక్స్. ఒక నిర్ణీత మొత్తం సంపద దాటిన అతి సంపన్నుల నుంచి నిర్ణీత శాతం పన్ను వసూలు చేస్తారు. ఇది ఆయా దేశాలు తమ ఆర్థిక, సామాజిక పరిస్థితులను బట్టి నిర్ణయిస్తాయి.
వివిధ దేశాల్లో వెల్త్ ట్యాక్స్ పరిస్థితి
స్విట్జర్లాండ్: ప్రపంచంలోకెల్లా వెల్త్ ట్యాక్స్ అత్యధికంగా వసూలు చేసేది స్విట్జర్లాండ్. ఈ పన్ను రేట్లు (0.1% నుంచి 1% వరకు) క్యాంటన్ (స్థానిక పరిపాలన విభాగాలు) ఆధారంగా మారతాయి. అలాగే ప్రపంచంలోని అత్యంత పారదర్శక వెల్త్ ట్యాక్సింగ్ సిస్టమ్ కూడా ఇదే.
నార్వే: ఈ దేశంలో వ్యక్తిగత నెట్‌వర్త్‌పై సుమారు 0.85% వరకు వెల్త్ ట్యాక్స్ విధిస్తారు. ప్రపంచంలో అత్యధిక వెల్త్ ట్యాక్స్ ఉన్న దేశాల్లో ఇది రెండవ స్థానంలో ఉంది.
స్పెయిన్: ఇక్కడ వ్యక్తిగత సంపద 7 లక్షల యూరోలు దాటితే వెల్త్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ట్యాక్స్ రేటు ప్రాంతాలవారీగా 0.2%–3.5% వరకు ఉంటుంది. ఈ కారణంగా ధనికులు దేశం వీడి వెళ్తుండటంతో ఈ ట్యాక్స్‌పై దేశంలో పెద్ద చర్చ జరుగుతోంది.
ఫ్రాన్స్: ఈ దేశంలో ముందునుండి 1.5% వరకూ వెల్త్ ట్యాక్స్ ఉండేది. కానీ ధనికులు దేశం విడిచిపోతున్నారు అనే కారణంతో ప్రభుత్వం దాన్ని రద్దు చేసి ఇప్పుడు కేవలం రియల్ ఎస్టేట్ వెల్త్ ట్యాక్స్ మాత్రమే విధిస్తోంది.
నెదర్లాండ్స్: ఇది సాంప్రదాయ వెల్త్ ట్యాక్స్ కాకపోయినా, ఆటోమేటిక్‌గా ఆస్తులపై “ఫిక్స్‌డ్ రిటర్న్ ట్యాక్స్” విధిస్తుంది. అంటే దాదాపు వెల్త్ ట్యాక్స్ లాంటిదే అనుకోవాలి.
భారత్: భారత్‌లో కూడా 2015 వరకు వెల్త్ ట్యాక్స్ ఉండేది. అప్పుడు 1% రేటుతో అమలులో ఉండేది. తరువాత ప్రభుత్వం దాన్ని రద్దు చేసి, అధిక ఆదాయం ఉన్నవారిపై సర్‌చార్జ్ విధించే విధానాన్ని తీసుకొచ్చింది.
ఎన్‌ఆర్‌ఐలపై ప్రభావం
ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా అక్కడి అత్యంత ధనవంతుల్లో భారతీయులూ కనిపిస్తుంటారు. విదేశాల్లో వ్యాపారాలతో విజయం సాధించి బాగా సంపాదించి అక్కడి అత్యంత సంపన్నులుగా ఎదిగినవారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ఉక్కు వ్యాపారి లక్ష్మీ ఎన్ మిట్టల్ కూడా ఒకరు.
మూడు దశాబ్దాలు బ్రిటన్‌లో ఉంటూ.. అత్యంత ధనవంతులైన బిలియనీర్ల జాబితాలో ఒకరుగా నిలిచిన ఆయన ఆ దేశానికి వీడ్కోలు పలికినట్లుగా వార్తలు వచ్చాయి. 30ఏళ్లు యూకేలో ఉన్న ఈయన ఇప్పుడు ఆ దేశాన్ని వీడటానికి కారణం అక్కడ సూపర్ రిచ్ అంటే అపర కుబేరులపై భారీ ట్యాక్స్ విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండటమేనని తెలుస్తోంది.
ఎన్‌ఆర్‌ఐలపై వెల్త్ ట్యాక్స్ ప్రభావం అనేది వారు ఏ దేశంలో నివసిస్తున్నారో, అక్కడి ట్యాక్స్ చట్టాలు ఎలా ఉన్నాయో అనేదాని ఆధారంగా ఉంటుంది. ఆ దేశంలో వారు ట్యాక్స్ రెసిడెంట్ కింద వస్తున్నారా? ఆస్తులు ఏ దేశంలో ఉన్నాయి? ఆ దేశంలో ద్వంద్వ పన్ను నివారణ ఒప్పందం (DTAA) ఉందా? వంటివి చూడాలి.


