breaking news
human birth
-
మంచి మాట: సమదృష్టి అంటే..?
మానవ జన్మను ఎత్తిన ప్రతి వాడూ సమదృష్టిని అలవరచుకోవాలని మన సనాతన ధర్మం చెబుతోంది. దీనినే సమదర్శనం అని కూడా అంటూ ఉంటాం. సమాజంలో ఎవ్వరికీ ఇబ్బంది కల్గించకుండా, ఎవ్వరినీ హీనంగా చూడకుండా అందరం ఒక్కటేనని, అందరిలోనూ ఆ భగవంతుడు అంతర్యామిగా ఉంటాడనే నిజాన్ని తెలుసుకోగలిగితే మనం సమదృష్టిని అలవరచుకోగలం. అయితే స్వార్ధం మనిషిని సమదృష్టిలో ఉంచకుండా చేస్తోంది. సాధారణంగా స్వసుఖం, స్వాతిశయం అనేవి మనిషిలో స్వార్ధాన్ని ప్రోది చేస్తూ ఉంటాయి. తానొక్కడే సుఖంగా ఉండాలనుకోవడం స్వసుఖం. అలాగే తానొక్కడే అందరికన్నా ఆధిక్యంలో ఉండాలనుకోవడం స్వాతిశయం. నిజానికి స్వార్ధంతో వచ్చే ఈ రెండు గుణాల వల్లనే మనిషి ఎన్నో అనర్ధాలకు, అక్రమాలకు పాల్పడుతుంటాడు. మంచీ, చెడు విచక్షణ మరచి అకృత్యాలు చేసుకుంటూ పోతాడు. సాధారణంగా సుఖంగా ఉండాలనుకోవడం, ఉన్నతస్థితికి చేరుకోవాలనుకోవడం తప్పేమి కాదు. కానీ తన సుఖం కోసం, తన ఉన్నతికోసం స్వార్ధంతో ఇతరులకు ఇబ్బంది కల్గించడం అధర్మమవుతుంది. తనకు అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు తాను ఇతరులకు ఇబ్బందులు కల్గించినట్లుగానే, తన పరిస్థితులు అనుకూలంగా లేనపుడు ఇతరులు కూడా తనకు ఇబ్బందులు కల్గించే అవకాశం ఉందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఆ భావన కల్గినపుడు సహజంగానే మనం ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండగలం. అదేవిధంగా సంకుచిత స్వభావం కూడా సమదృష్టి లేకుండా చేస్తుంది. సంకుచిత భావనల వలన ఇతడు మనవాడు, అతడు పరాయి వాడు అనే భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. అలాంటి భేదాభిప్రాయాలు ఎన్నో అనర్ధాలకు కారణభూతమౌతాయి. కనుక సంకుచిత భావం లేకుండా ఉదారంగా ఉండగలిగే మానసిక పరిపక్వతను ప్రతి మనిషీ అలవరచుకోవాలి. తనకు అన్నీ ఉన్నా ఎదుటివారికి లేకపోతే ఎద్దేవా చేయడం కానీ, ఎగతాళి చేయడం కానీ కూడదు. ఈరోజున ఏమీ లేకపోవచ్చు. కానీ రేప్పొద్దున వారిని భగవంతుడు కరుణించవచ్చు. వారి కుబేరులు కావచ్చు. లేదా సంపూర్ణ ఆరోగ్యవంతులు కావచ్చు. ఇలా ఏదైనా జరగవచ్చు. జరగడం అనేది మనచేతుల్లో ఏదీలేదు. కనుక ఎవరినీ ఎందుకూ నొప్పించకూడదు. మనుషుల్లో స్వభావరీత్యా ఒక మనిషికీ, మరో మనిషికి మధ్య తేడాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటాయి. ప్రధాన కారణం మనిషి తనను తాను అర్థం చేసుకోలేకపోవడమే. ఆలోచనల్లో సరళీకృతం లేకపోవడం, ఆలోచనల్లో తానే అధికుడినని భావించడం, అన్నీ తనకే తెలుసనుకోవడం, ఎదుటివారి మాట తానెందుకు వినాలనుకోవడం లాంటి వన్నీ మనిషి స్వభావాన్ని మార్చివేస్తాయి. అనుకొన్నది జరగకపోతే వెంటనే కోపం వస్తుంది. ఆ కోపం మనిషి స్వభావాన్ని మార్చివేస్తుంది. దానితో అనుకొన్నది కాక మరొకటి ఎదురవుతుంది. అందుకే చుట్టూ సమస్యలు చుట్టుముట్టినా, ఎందరు కావాలని కష్టనష్టాలు కలిగిస్తున్నా, పనిగట్టుకొని హేళన చేస్తున్నా, పుట్టెడు దుఃఖం ఉబికి వస్తున్నా బాధపడడం మానేసి వాటికి దూరంగా వెళ్లిపోయి తమ పని తాము చేసుకోవడం ఉత్తమం. ఎదుటివారు ఏం చేసినా సరే తాను మాత్రం ఎవరికీ అపకారం చేయకుండా ఉండడమే సమదృష్టి. ఒకరికి మేలు చేయగలిగే స్థితిలో, ఒకరికి స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా జీవితాన్ని మలుచుకోగలిగిన నాడే సమదృష్టి ప్రస్ఫుటమవుతుంది. అందుకే మన స్వార్థాన్ని అదుపులో పెట్టడానికి, మన మాటలను, చేతలను క్రమబద్ధీకరించడానికి, మన వలన తోటివారికి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు మన సనాతన ధర్మం ఎన్నో నియమాలను ఏర్పరచింది. మహాభారతంలోని అరణ్యపర్వంలో యక్షుడు మానవ ధర్మాల్లోకెల్లా ఉత్తమమైన ధర్మం ఏదని ధర్మరాజును ప్రశ్నిస్తాడు. దానికి ధర్మరాజు సమాధానం చెబుతూ, ఇతరులు ఏం చేస్తే మనకు కష్టం కలుగుతుందో, దానిని మనం చేయకుండా ఉండడమే ఉత్తమ ధర్మమని చెబుతాడు. సమస్త ప్రాణుల యందు సమ భావం కలిగినవారు, ఇష్టాయిష్టాలకు, సుఖ–దుఃఖాలకు, సంతోష–బాధలకు అతీతంగా ఉండేవారు నిరంతరం జనన మరణ సంసారాన్ని దాటుతారని, వారే భగవంతుని రూపాలని సాక్షాత్తు శ్రీ కృష్ణ భగవానుడు చెప్పాడు. మనల్ని మనం ఈ శరీరమే అనుకున్నంతవరకు, సమదృష్టిని సాధించడం దుర్లభం అవుతుంది. శారీరక ఆహ్లాదం, కోరికలు, ద్వేషాలు నిత్యం అనుభవంలోకి వచ్చినంత కాలం సమదృష్టిని ప్రదర్శించడం దుస్సాధ్యం. ఎవరైతే మనస్సును ఆధ్యాత్మిక దృక్పథంలో స్థితమై ఉంచుకుంటారో, శారీరక సుఖ–దుఃఖాలపై మమకారాసక్తులకు అతీతులై, సమత్వ బుద్ధి స్థితిని చేరుకుంటారో, స్వార్థాన్ని, క్రోధాన్ని, ఐహిక సుఖాలను, ఆర్భాటాలను త్యజించి తమ మనస్సును భగవంతుని యందే లగ్నం చేస్తారో అలాంటి వారు ఈశ్వరునితో సమానంగా మన వేదాలు చెబుతున్నాయి. ఎవరైనా మనకు ఇబ్బంది కలిగించినా, మనపట్ల అమర్యాదగా ప్రవర్తించినా, మనతో పరుషంగా మాట్లాడినా, మనలను కించపరిచినా సహజంగానే మనకు బాధ కలుగుతుంది. అందుకే అలాంటి పనులను మనం ఇతరుల పట్ల చేయకుండా ఉండాలి. అదే సమదృష్టి. –దాసరి దుర్గాప్రసాద్ -
ఎవరా నక్క? ఏమా కథ?
‘‘మానవ జన్మలో వుండగా నక్క జీవితంపై నాకు అపోహలుండేవి. అవన్నీ అపోహలే. నక్కకి నక్క జీవితంలో దొరికే సౌఖ్యం నక్కగా నాకు దొరుకుతోంది. నన్నిలా బతకనీ’’ అంటూ డ్రైనేజీ బొరియలోకి వెళ్లిపోయాడు గురువు. ఇంతకీ కథ అంతరార్థం తెలియలేదండీ అంటే పెద్దాయన ‘‘నాకూ అంతే’’ అంటూ నవ్వాడు. నదుల అనుసంధానం జరిగి పోయింది. మనదిక కరువు రహిత రాష్ట్రం- అని రాష్ట్ర మం త్రులు మోకాల్లోతు నీళ్లలో నిల బడి డిక్లేర్ చేశారు. గోదావరీ మాతకు పూర్ణకుంభంతో స్వా గతం పలికారు. ప్రకృతిలో దొ రికే పసుపుపచ్చ పూలను బకె ట్ల కొద్దీ గోదావరి జలాలకు సంతోషంగా సమర్పించారు. రాష్ట్ర ప్రజకు ఏమి జరు గుతోందో అర్థం కావడం లేదు. ‘‘అయితే మాకు నీళ్లొదుల్తారా’’ అంటున్నారు కృష్ణా డెల్టా రైతులు. ఏమిటి మళ్లీ యిటువైపు మళ్లారని అడిగితే- ఔనండీ, ఎప్పుడూ కేపిటల్ కబుర్లే వినిపిస్తుంటే బోరుకొడు తోంది. అందుకని పది పన్నెండు టాపిక్స్ తీసుకుని వాటి మీద దృశ్యాలు తయారు చేస్తున్నాం అంటూ వివ రించాడు ప్రభుత్వంతో ప్రమేయం వున్న ఛోటా నాయ కుడు. దానికో సిలబస్ తయారు చేసుకున్నాం. ఆ ప్రకా రం ముందుకు వెళ్తున్నామని చెప్పాడు. పది రోజులు గమనించాక ఆయన చెప్పింది నమ్మాలనిపించింది. తెలుగు రాష్ట్రాలలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువై నాయి. వేర్వేరు కారణాల వల్ల ధైర్యం కోల్పోయి ఆత్మహ త్యలకు పాల్పడుతున్నారని అధికార వర్గాలు నివేదికలు సమర్పిస్తున్నాయి. కారణం ఏదైనా జరుగుతున్నది చాలా దారుణం. ముందుగా వాటి నివారణకు అందరూ నడుం కట్టాలి. చదువుకున్న యువత గ్రామాలకు వెళ్లి నాలుగు మంచి మాటలు వారికి చెప్పాలి. అంతకు మిం చిన దేశ సేవ మరొకటి ఉండదు. విజువల్ మీడియాకి నేడు బాగా వ్యాప్తి వుంది. దృశ్య మాధ్యమాలలో మాన సిక వైద్యం అందించాలి. దురదృష్టవశాత్తు మన రాజ కీయవేత్తలు, అధికారగణం సామాన్య ప్రజలో విశ్వా సాన్ని కోల్పోయారు. అధికారుల చేతిలో అధికారం లేక పోవడం, నేతలకు చిత్తశుద్ధి లేకపోవడం ఇందుకు కారణం. ‘‘దేశ సేవని ప్రవృత్తిగా కాక వృత్తిగా స్వీకరించడం మొదలయ్యాక దేశానికి అరిష్టం చుట్టుకుందండీ’’ అం టూ ఓ కథ చెప్పాడు పెద్దాయన - వెనకటికి ఒక గురుశిష్యులున్నారు. గురువు ఒక రోజు శిష్యుణ్ణి చేరపిలిచి ‘‘ఇప్పుడే మనో నేత్రంతో చూశా. వచ్చే జన్మలో నేనొక నక్కగా జన్మించబోతున్నా. కారణాలు అడగద్దు. పూర్వజన్మ అవశేష ఫలితం’’ అని చెప్పాడు. నువ్వొక సాయం చేయాలి శిష్యా. నేను నక్క గా పుట్టగానే నన్ను నిర్దాక్షిణ్యంగా చంపెయ్. ఎందు కంటే ఇంత బతుకూ బతికి నక్కజిత్తులతో జీవించుట దుర్లభమని వాపోయాడు. శిష్యుడు అంతా విని అయితే నక్క రూపంలో వున్న మిమ్మల్ని గుర్తించడం ఎలా గురూ అని అడిగాడు. ‘‘ఏం లేదు శిష్యా. ఇప్పుడు నా మూతి మీదున్న పెద్ద పుట్టుమచ్చ అప్పుడు కూడా ఉంటుంది. అదే నా కొండ గుర్తు’’ అన్నాడు. శిష్యుడికి కర్తవ్యం బోధ పడింది. కొన్నాళ్లకు గురువు కాలం చేశాడు. నమ్మక పాత్రమైన శిష్యుడు నక్క గురువు కోసం కొండల్లో కోనల్లో అడవుల్లో అన్వేషించడం మొదలుపెట్టాడు. ఒక శుభోదయాన నగరంలోనే గురువు తారసపడ్డాడు. చూడగానే శిష్యుడికి కర్తవ్యం గుర్తుకు వచ్చింది. నక్కను తరిమి తరిమి చంపడానికి సిద్ధపడ్డాడు. నక్క ‘శిష్యా చం పకు, చంపకు’ అని అరిచింది. శిష్యుడు ప్రశ్నార్థకంగా చూశాడు. ‘‘మానవ జన్మలో వుండగా నక్క జీవితంపై నాకు అపోహలుండేవి. అవన్నీ అపోహలే. నక్కకి నక్క జీవితంలో దొరికే సౌఖ్యం నక్కగా నాకు దొరుకుతోంది. నన్నిలా బతకనీ’’ అంటూ డ్రైనేజీ బొరియలోకి వెళ్లిపో యాడు గురువు. ఇంతకీ కథ అంతరార్థం తెలియలేదండీ అంటే పెద్దాయన ‘‘నాకూ అంతే’’ అంటూ నవ్వాడు. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) - శ్రీరమణ