
ప్రముఖ కంపెనీలు తమ వెబ్‌సైట్లు, డేటాబేస్ పరిరక్షణ కోసం ప్రత్యేక విభాగాలకు ఏర్పాటు చేసుకుంటాయి. వీటిలో నిపుణులను నియమించుకుని రూ.లక్షల్లో వేతనాలు చెల్లిస్తుంటాయి. ఆయా వెబ్‌సైట్లలో ఉన్న లోపాలను, హ్యాకింగ్‌కు ఆస్కారాలను ఎప్పటికప్పుడు గుర్తించి, సరిదిద్దేందుకు ఈ సైబర్ సెక్యూరిటీ టీమ్స్ పని చేస్తుంటాయి. అలాంటిది ఏకంగా విదేశాంగ శాఖ అధీనంలోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం వెబ్‌సైట్‌ను ఒక డిప్లొమా హోల్డర్ హ్యాక్ చేసి, సవాలు విసిరారు.
సికింద్రాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం 2010లో అత్యవసరంగా పాస్‌పోర్టులు పొందాలనుకునే వారి కోసం తత్కాల్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. దీని కింద దరఖాస్తుదార్లు కేవలం ఆన్‌లైన్‌లోనే స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉండేది. పెద్ద సంఖ్యలో స్లాట్స్ ఇస్తుండటంతో పనిభారం పెరిగిన పాస్‌పోర్ట్ కార్యాలయం ఆ ఏడాది ఫిబ్రవరిలో వాటి సంఖ్యను 350కి పరిమితం చేయడంతో తత్కాల్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని భావించిన చాలామందికి నిరాశే ఎదురయ్యేది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి కొందరు దళారులు ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేటకు చెందిన లతాధర్‌రావు ద్వారా హ్యాకింగ్ కథ నడిపారు.
కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పీజీ డిప్లొమా పూర్తి చేసిన గోరంట్ల లతాధర్‌రావు అప్పట్లో నరసరావుపేటలో లలితా ఫ్యాన్సీ అండ్ కూల్ డ్రింక్స్ దుకాణం నిర్వహించేవాడు. ఇతడు టీపీ వర్క్ కూడా చేస్తుండటంతో ఆ పనిలో భాగంగా అక్కడి గాంధీచౌక్‌లో ఆకాశ్ ట్రావెల్స్ నిర్వహించే షేక్ సుభానీతో పరిచయం ఏర్పడింది. లతాధర్‌కు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండటంతో తన వద్దకు వచ్చే పాస్‌పోర్ట్ అప్లికేషన్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడానికి సుభానీ ఇతని సాయం తీసుకునేవాడు. ప్రతిఫలంగా ఒక్కో అప్లికేషన్‌కు రూ.100 చొప్పున చెల్లించేవాడు. అప్పట్లో పాస్‌పోర్ట్ కార్యాలయం వెబ్‌సైట్ నిర్వహణ బాధ్యతలను న్యూ ఢిల్లీ కేంద్రంగా పని చేసే నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ చేపట్టేది.
తత్కాల్ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి అవసరమైన ఆన్‌లైన్ స్లాట్స్‌ను 2010 ఫిబ్రవరి నుంచి తగ్గించారు. దీంతో ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవాలని భావించిన వారు దళారులను ఆశ్రయించడం ప్రారంభించారు. త్వరగా ఆన్‌లైన్ స్లాట్ ఇప్పిస్తే భారీ మొత్తాలను చెల్లించడానికి ముందుకు వచ్చేవారు. దీంతో పాస్‌పోర్ట్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి స్లాట్స్ బ్లాక్ చేయాలన్న ఆలోచన లతాధర్, సుభానీలకు వచ్చింది. తన కంప్యూటర్ పరిజ్ఞానంతో లతాధర్ ఈ పని చేశాడు. వెబ్‌సైట్‌లోకి హ్యాకింగ్ ద్వారా ఎంటర్ అయిన లతాధర్ దాని నుంచి నేరుగా ఎన్‌ఐసీ సర్వర్‌కు కనెక్ట్ అయ్యేవాడు. రోజూ స్లాట్స్ విడుదల చేసే సమయంలో ఇతరుల లాగాన్‌లో మార్పులు చేసేవాడు.
తమను ఆశ్రయించిన వారి అప్లికేషన్స్ అప్‌లోడ్ చేశాకనే మిగిలిన స్లాట్స్‌ను ఫ్రీ చేసేవాడు. నరసరావుపేటకు చెందిన సుభానీ, లతాధర్‌ల ద్వారా ఆన్‌లైన్ స్లాట్స్ వేగంగా దొరుకుతుండటం, పాస్‌పోర్ట్ అపాయింట్‌మెంట్స్ వస్తుండటంతో హైదరాబాద్‌కు చెందిన పాస్‌పోర్ట్ ఏజెంట్లు మహ్మద్ జహంగీర్, భూమా శ్రీహరి, గిడ్డా చిన్నా, సయ్యద్ వలీయుద్దీన్, కె.పెంచల్‌రెడ్డి, ఖలీమ్, శ్రీనివాస్‌లు వీరికి సబ్–ఏజెంట్స్‌గా మారిపోయారు. తత్కాల్ పాస్‌పోర్ట్స్ కోసం తమను ఆశ్రయించే వారి దరఖాస్తులను ఈ–మెయిల్ ద్వారా వారిద్దరికీ పంపడం ప్రారంభించారు. ఈ వ్యవహారాన్నే వ్యాపారంగా చేసుకున్న ‘లతాధర్ అండ్ కో’ దరఖాస్తుదారుల నుంచి భారీగా వసూలు చేసింది. సాధారణంగా తత్కాల్ దరఖాస్తుకు అప్పట్లో రూ.2 వేలు చెల్లిస్తే సరిపోయేది. అయితే ఈ ముఠా సభ్యులు మాత్రం అదనంగా రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేసేవారు.
ఈ మొత్తంలో రూ.1000 నుంచి రూ.2000 వరకు సుభానీకి ఇచ్చే వారు. అతను ముఠా సూత్రధారి అయిన లతాధర్‌కు రూ.500 నుంచి రూ.1000 వరకు కమిషన్ అందించే వాడు. ఈ రకంగా లతాధర్ గ్యాంగ్ కేవలం రెండు నెల్లలో మూడువేల తత్కాల్ పాస్‌పోర్ట్ దరఖాస్తులు అప్‌లోడ్ చేశారు. అప్పట్లో సికింద్రాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయం చుట్టూ దాదాపు 20 మంది ఏజెంట్లు ఉండేవారు. ఆన్‌లైన్ బుకింగ్ స్లాట్స్ సంఖ్య తగ్గించినప్పటి నుంచి వీరిలో కేవలం జహంగీర్, శ్రీహరి, చిన్నా, వలీయుద్దీన్, పెంచల్‌రెడ్డిలకు మాత్రమే స్లాట్స్ దొరుకుతున్నాయని టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. వరుసగా ఇలాగే జరుగుతుండటంతో విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
వీరిపై నిఘా పెంచిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు జహంగీర్‌కు చెందిన కంప్యూటర్‌ను సైబర్ నైపుణ్యం కలిగిన పోలీసులతో తనిఖీ చేయించారు. ఈ కంప్యూటర్‌ను ఇంటర్‌నెట్ ప్రొటోకాల్ (ఐపీ) అడ్రస్‌లు గుర్తించేందుకు వీలు లేకుండా ప్రాక్సీ ఐపీలతో వాడుతున్నట్లు గుర్తించారు. మరోపక్క అనేక పాస్‌పోర్ట్ ఆన్‌లైన్ దరఖాస్తులు ఫార్వర్డ్ చేయకుండా ఫిల్ చేసి సిద్ధంగా ఉంచడాన్ని కూడా గుర్తించారు. దీంతో జహంగీర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.పాస్‌పోర్ట్ దరఖాస్తులను ఈ–మెయిల్ ద్వారా నరసరావుపేటకు చెందిన సుభానీకి పంపుతున్నట్లు జహంగీర్ చెప్పడంతో అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం సుభానీని విచారించగా, లతాధర్‌రావు సహాయంతో చేస్తున్న పనిని బయటపెట్టాడు.
లతాధర్‌రావును అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు విచారించగా ఆన్‌లైన్ స్లాట్స్ కేటాయింపునకు ఉపయోగపడే పాస్‌పోర్ట్ వెబ్‌సైట్‌కు చెందిన సోర్స్ కోడ్‌ను హ్యాక్ చేయడం ద్వారా స్లాట్స్ బ్లాక్ చేసి, వాటిని తమ ఏజెంట్ల ద్వారా ఫిల్ చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు లతాధర్‌రావు, సుభానీ, జహంగీర్‌లతో సహా ఏడుగురు నిందితులకు 2010 జూన్ 4న అరెస్టు చేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఉలిక్కిపడిన పాస్‌పోర్ట్ కార్యాలయం అధికారులు వెబ్‌సైట్‌లో లోపాలు లేకుండా సరిచేసి పకడ్బందీగా తయారు చేశారు.
·